పార్టీ-ప్రభుత్వంలో..వీరికే పాస్‌మార్కులు

702

శాఖలపై కొందరు మంత్రులకే పట్టు
ముందువరసలో పెద్దిరెడ్డి, బొత్స, కన్నబాబు, మేకపాటి
వెనుకబడ్డ సీమ మంత్రులు
మహిళా మంత్రుల వైఫల్యం
సర్వం విజయసాయి, సజ్జలనే
పేషీ బరువు ధనుంజయరెడ్డిపైనే
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ కాలంలో పార్టీ-ప్రభుత్వపరంగా సాధించిన విజయాలను పక్కకుపెడితే, ఏడాదిలో పార్టీ-ప్రభుత్వం కోసం పనిచేసిన అధికారులు,మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చన్న చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో ముందు మహిళా మంత్రుల విషయానికొస్తే, క్యాబినెట్‌లో ఒక్క మహిళ  కూడా పెద్దగా ప్రతిభ చూపిన దాఖలాలు లేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా, మిగిలిన ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న  మంత్రులంతా నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది మంత్రుల పేర్లు, వారి శాఖలేమిటన్నది మెజారిటీ ప్రజలకు తెలియదంటే.. వారి పనితీరు ఏమిటన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదంటున్నారు. ఇక సీఎం పేషీ భారమంతా ధనుంజయరెడ్డి మోస్తుండగా, డజన్ల మంది సలహాదారులున్నప్పటికీ, వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే చురుకుగా పనిచేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సీఎంఓలో ధనుంజయరెడ్డి బిజీ బిజీ..


సీఎం వద్ద అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, అధిక పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. జగన్ తాను గెలిచిన వెంటనే ముందు తనకు నమ్మకస్తుడైన ధనుంజయరెడ్డినే తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జగన్‌ను కలిసేందుకు వీలులేకపోవడంతో.. వారంతా ధనుంజయరెడ్డి వద్దకే వస్తున్నారు. గతంలో ధనుంజయరెడ్డికి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అదనపు కమిషనర్, వ్యవసాయశాఖ కమిషనర్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దానితో నాయకుల మనస్తత్వం గురించి బాగా తెలిసిన ధనుంజయరెడ్డి, ఇప్పుడు అధికార పార్టీ నాయకులు, మంత్రులకు తలలోనాలుకలా మారారు. స్వతహాగా వివాదరహితుడు, సాత్వికుడయిన ఆయనను సీఎం జగన్ సైతం ప్రతి సమీక్షలో భాగస్వామ్యం చేయటంతో, ధనుంజయరెడ్డి ప్రాధాన్యం పెరిగింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సతీష్‌చంద్రకు ఎంత కీలక బాధ్యత అప్పగించారో, ఇప్పుడు ధనుంజయరెడ్డికి సీఎం జగన్ ఆ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రపై సీఎం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో విశాఖ సహా, అక్కడి వ్యవహారాలను ధనుంజయరెడ్డి పర్యవేక్షిస్తున్నారంటున్నారు.

పెద్దిరెడ్డికే ఎక్కువ మార్కులు..


మంత్రులలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, తొలిసారి మంత్రిగా చేసే అవకాశం వచ్చినప్పటికీ.. బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతంరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు అటు పార్టీ-ఇటు ప్రభుత్వపరంగా చురుకుగా పనిచేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీరు శాఖాపరంగా కూడా ముందువరసలో ఉన్నారంటున్నారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న అనుభవం దృష్ట్యా, అందరికంటే ముందువరసలో కనిపిస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా సాత్వికుడు కావడంతో నేతలు కూడా ఆయన వద్ద సేచ్ఛగా ఉండగలుగుతున్నారు. పార్టీ-ప్రభుత్వ కార్యక్రమాల్లో  పెద్దిరెడ్డి వేగంగా వ్యవహరిస్తున్నారు. ఇక బొత్స తొలినాళ్లలో అమరావతి అంశంలో అత్యంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ తర్వాత దూకుడు తగ్గించి, ఉత్తరాంధ్రకు పరిమతమయ్యారు.  సీనియర్ అయినందున, ఇప్పుడు శాఖపై పట్టు సాధించాల్సిన అవసరం లేకుండా పోయింది.

పాపం..  బుగ్గన

సర్కారు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నందున, విపక్షాల నుంచి దానికి సంబంధించి వచ్చే విమర్శలను ఆర్ధిక మంత్రి బుగ్గన సమర్ధవంతంగానే తిప్పికొడుతున్నారు. అయితే, ఆయన శాఖకు సంబంధించి ఏ నిధులు, ఎవరికి విడుదల చేయాలన్న విషయాన్ని నేరుగా సీఎం జగన్ చూస్తున్నారు. జగన్‌కు తెలియకుండా ఏ కాంట్రాక్టరుకూ ఐదుపైసలు విడుదల చేసే పరిస్థితి లేదు. దానితో బుగ్గనకు ఆ బాదరబందీ లేకుండా పోయింది. తొలిరోజుల్లో బిల్లుల విడుదలపై బుగ్గనపై ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, తర్వాత ఆ అంశం ఆయన చేతుల్లో లేదని తెలియడంతో నేతలు కూడా ఆయనను అడగటం మానేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే  నిధులు విడుదల విషయంలో ఆయన నిస్సహాయుడు.

ఇద్దరు మంత్రుల దూకుడు..

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇద్దరూ అటు పార్టీ-ఇటు శాఖాపరమైన వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కరోనా కాలంలో కన్నబాబు విపక్షాలపై చేసిన ఎదురుదాడి సందర్భంలో ఇచ్చిన వివరణ అందరికీ నచ్చింది. ఇక  ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఐటికి సంబంధించిన వ్యవహారాలపై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సీఎం జగన్‌కు పరిశ్రమల విషయంలో అపార అనుభవం ఉన్నందున, ఆ శాఖలో మేకపాటి చేసేదిలేదు. ఈ విషయంలో మేకపాటిదీ దాదాపు బుగ్గన పరిస్థితే.

పేరుకే మంత్రులు.. పెత్తనమంతా సీఎంఓదే!

కీలక శాఖలన్నీ సీఎం పర్యవేక్షిస్తుండటంతో, సీనియర్లయినా మంత్రులకు పెద్దగా పనిలేకపోవడం, సీఎంఓనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండటంతో మంత్రులు తన జిల్లాలకు, నియోజకవర్గాలకు పరిమితం కావలసి వస్తోంది. అందులో కూడా మంత్రులను ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించడంతో, మెజారిటీ మంత్రులు నియోజకవర్గాలకే పరిమితం కావలసివస్తోంది. చాలామంది మంత్రులను ఆ శాఖలకు చెందిన కార్యదర్శులు, కమిషనర్లు ఖాతరు చేయడం లేదన్న మాట కూడా వినిపిస్తోంది.

మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్‌యాదవ్ పనితీరు, వారి ప్రకటనలతో ప్రభుత్వ పరువుపోతోందన్న భావన నెలకొంది. అసభ్యకరంగా  వీరు వాడుతున్న పరుషపదజాలం,  మంత్రులకే మచ్చతెచ్చేలా ఉందన్న అభిప్రాయం ఏర్పడింది. విపక్షాలపై విమర్శించే సందర్భంలో వీరిద్దరూ వాడుతున్న భాష ప్రజల్లో ఏహ్యభావానికి గురవుతోంది.

బెడిసికొడుతున్న కులం లెక్కలు..

మరోవైపు పార్టీ నాయకత్వమే వీరిని ఆరకంగా మాట్లాడిస్తూ, వారి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తోందన్న భావన కూడా పార్టీ వర్గాల్లో లేకపోలేదు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారితో కాకుండా, వీరిద్దరితో మాట్లాడించి బలిపశువులను చేయడం  ఏమిటన్న చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీని కొడాలి నానితో, బీజేపీని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుతో, విపక్షాలకు చెందిన కాపునేతలపై కన్నబాబుతో తిట్టిస్తున్నారు. దీనివల్ల.. జనం దృష్టిలో, రెడ్డి సామాజికవర్గ నాయకులంతా మంచివారన్న అభిప్రాయం కలిగించేలా చేయడం మంచిదికాదంటున్నారు.

ఫలితంగా కమ్మ వర్గంలో కొడాలి నానిపై, వైశ్య-బ్రాహ్మణవర్గాల్లో వెల్లంపల్లి, విష్ణుపై విమర్శలకు అవకాశం ఇస్తున్నార్న భావన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. ఉదాహరణకు మంత్రి కన్నబాబుతో పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణతోపాటు, టీడీపీకి చెందిన కాపు నేతలపై విమర్శలు చేయించడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు.  నిజానికి ఇలాంటి వ్యూహాలతోనే టీడీపీ దెబ్బతిందని గుర్తు చేస్తున్నారు. రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అనేకమంది ఉండగా, వారిని కాకుండా బీసీ, ఎస్సీ, కాపు, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ నేతలను తెరపైకి తీసుకువచ్చి, వారితో విమర్శలు చేయించడం ద్వారా… ఆయా వర్గాల్లో వారిపై వ్యతిరేకత పెంచుతున్నారన్న భావన కనిపిస్తోంది.

ఎమ్మెల్యేలలో పనిమంతులు వీరే..

ఇక ఎమ్మెల్యేలలో అంబటి రాంబాబు, రోజా, మల్లాది విష్ణు,  గుడివాడ గుర్నాధం, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసుమహేష్, వసంత కృష్ణప్రసాద్, పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు  విపక్షాలపై విరుచుకుపడటంలో ముందువరసలో ఉన్నారు. ఈ  ఏడాదిలో అంబటి రాంబాబు, రోజా విపక్షాలపై చేసిన విమర్శలు, ఎదురుదాడి చేసిన తీరు వారిని సింహభాగాన నిలబెట్టింది. పార్టీ నాయకత్వం కూడా వీరినే ఎక్కువగా తెరపైకి తీసుకువచ్చి, ఎదురుదాడి చేయిస్తోంది.

సలహాదారుల్లో సజ్జల ఒక్కరే..

ఇక ప్రభుత్వంలో పేరుకు చాలామంది సలహాదారులున్నప్పటికీ, వారిలో ప్రతిభతోపాటు కష్టపడుతున్న వారి సంఖ్య అత్యల్పం. చాలామంది హైదరాబాద్‌లో కూర్చుని ప్రభుత్వ జీతంతో కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు ఉండీలేనట్లు వ్యవహరిస్తున్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం,  పూర్తి సమయాన్ని ప్రభుత్వం-పార్టీకే వెచ్చిస్తున్నారు. జగన్‌ను కలవలేని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆయననే కలసి సమస్యలు వెళ్లబోసుకుంటున్నారు. పార్టీ-నేతలతోపాటు, అధికారవ్యవస్థపై పూర్తి అవగాహన ఉండటంతో.. ఆయన కూడా వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. నిజానికి, చాలామంది మంత్రుల కంటే, సజ్జల సమర్ధవంతంగా పనిచేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు పార్టీ వ్యవహారాల్లో కూడా నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పూర్వాశ్రమంలో పాత్రికేయుడయిన సజ్జల, సీఎంఓలో  ఉండటం జగన్‌కు కలసివచ్చే అంశమని సీనియర్ నేతలు చెబుతున్నారు.

వైఎస్ నాటి పనిమంతులేరీ..?

ఇక సీఎంఓలో మీడియా వ్యవహారాలు చూసే విభాగం, పెద్దగా పనితనం చూపించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీడియాలో దశాబ్దాలపాటు పనిచేసిన ఓ సీనియర్ జర్నలిస్టు పర్యవేక్షణ ఉన్నప్పటికీ… మీడియా, పార్టీ-ప్రభుత్వానికి దూరంగా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ముందు రెండు పత్రికలు, చివరి రెండేళ్లలో మరొక పత్రిక వైఎస్ సర్కారుకు వ్యతిరేక కథనాలు రాసేవి. వైఎస్ కూడా ‘ఆరెండు పత్రికల’ని విమర్శించేవారు. అయినప్పటికీ ప్రెస్ సెక్రటరీగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ పథకాలపై అవే పత్రికల్లో సానుకూల కథనాలు రాయించడంలో చూపిన ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఫలితంగా.. వైఎస్‌పై వ్యతిరేక కథనాలతోపాటు, ప్రభుత్వ పథకాల వివరాలు కూడా ఆయా పత్రికల్లో  విస్తృతంగా ప్రచురితమయ్యేవి. జర్నలిస్టులను వైఎస్‌తో భేటీలు వేయించేవారు. మీడియాతో అలాంటి విస్తృతమైన పరిచయాలున్న వారు, ఇప్పుడు జగన్ బృందంలో లేకపోవడం పెద్ద లోటేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా సమస్యలపై అవగాహనతోపాటు, వాటిని ఎదుర్కొని తిప్పికొట్టేందుకు, చిత్తశుద్ధి ఉన్న తెలివైన వ్యూహకర్తలు కూడా లేకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. వైఎస్ ఉండగా, ఆయన ఆంతరంగికుడు, ఓఎస్డీగా పనిచేసిన రవిచంద్, సీఎల్పీ కేంద్రంగా ఎదురుదాడి వ్యూహాలు రచించేవారు. వైఎస్ కూడా ఆయనను పూర్తిగా విశ్వసించి, ఆ వ్యవహారాలను పూర్తిగా రవిచంద్‌కే విడిచిపెట్టేవారు. దానితో అద్భుతమైన ఫలితాలు వచ్చేవి. పార్టీ-ప్రభుత్వానికి కావలసినవి మీడియాలో రాయించుకోవడం ఒక కళ. అలాంటి వ్యక్తులెవరూ ఇప్పుడు జగన్ వద్ద లేకపోవడం ఒక మైనస్ అంటున్నారు. అటు తమ కోసం పనిచేసేవారి ప్రతిభను గుర్తించడం, వారి ఆలోచనలను అమలుచేసే వైఎస్ లాంటి వ్యక్తిత్వం, జగన్‌లో లేకపోవడం మరో మైనస్ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ ఎవరి సలహాలు తీసుకోరని, అసలు ఆయన ఎవరినీ కలవరన్న ప్రచారం తెలిసిందే.

సర్వం.. విజయసాయి!

ఇక జగన్‌ను ప్రత్యర్ధుల నుంచి రక్షణగా నిలిచి, ఆయనను కాపుకాస్తున్న విజయసాయిరెడ్డి అంతా తానయి కనిపిస్తున్నాయి. అటు కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు, ఇటు సొంత రాష్ట్రంలో కొందరు బీజేపీ, టీడీపీ  నేతలతో బంధాలు ఏర్పాటుచేసుకోవడం ద్వారా.. విపక్షంలోనూ స్వపక్షాలను తయారుచేస్తున్న వ్యూహం జగన్‌కు కలసివస్తోంది. జగన్ కోసం విజయసాయి పడుతున్న కష్టం వల్ల, వ్యక్తిగతంగా ఆయన విపక్షాలకు లక్ష్యంగా మారుతున్నా.. అంతిమంగా అది జగన్ బలపడేందుకు కారణమవుతోంది. ఇటీవల ఆయనను జగన్‌ను కారు నుంచి దించివేసిన వీడియోలు విస్తృతంగా చర్చనీయాంశమయింది. దానితో ఆయనను జగన్ అవమానించారని కొందరు, విజయసాయి ప్రాధాన్యం తగ్గిందన్న సంకేతాలిచ్చేందుకే ఆ వీడియో లీక్ చేయించారని మరికొందరు చేసిన ప్రచారం, ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఇలా ఒక్కముక్కలో చెప్పాలంటే, విజయసాయిరెడ్డి.. సీఎం జగన్- ఆయన ప్రభుత్వం కోసం, పాపాలభైరవుడి పాత్ర పోషిస్తున్నాడన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.