ఆపన్నులను ఆదుకోండి!

0
2

– నోముల ప్రకాష్ పిలుపు
హైదరాబాద్: కరోనా కష్టాల్లో ఉన్న పేదలను ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో ఆదుకోవాలని సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ నేత నోముల ప్రకాష్ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ కాలంలో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకుంటున్న దాతలను ప్రోత్సహించి, అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజం నుంచి ఎంతో పొందిన వారు, మళ్లీ దానిని తిరిగి ఇవ్వడమే గొప్పతనమని వ్యాఖ్యానించారు.
సికింద్రాబాద్ బ్రాహ్మణబస్తీ ప్రభుత్వ పాఠశాల వద్ద, విశ్రాంత రైల్వే అధికారి కనగాల పూర్ణచంద్రరావు-మణికుమారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, స్థానిక పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన నోముల మాట్లాడుతూ, కరోనా కాలంలో పోలీసులు-మునిసిపల్ కార్మికులు, తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి చేస్తున్న సేవలను సమాజం గుర్తించాలని కోరారు. ప్రధానంగా పోలీసులు ప్రాణాలు లెక్కచేయకుండా కరోనా యుద్ధరంగంలో సైనికుల మాదిరిగా, ముందువరసలో నిలబడ్డారని కొనియాడారు. చిలకలగూడ పోలీసు సిబ్బంది రాత్రింబవళ్లు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని, సమాజం కూడా పోలీసులకు సహకరించాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, ఆసుపత్రిలో డ్యూటీలు చేస్తున్న పోలీసులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఏసీపీ రమణ, చిలకలగూడ ఇన్స్‌పెక్టర్ గంగిరెడ్డి, ఎస్‌ఐల సేవలను కొనియాడారు.  మునిసిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన పూర్ణచంద్రరావు దంపతులు, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ఆయన కుమారుడిని అభినందించారు.

ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, కరోనా యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు-పోలీసులు-పారిశుద్ధ్య సిబ్బందికి, సమాజం ఇస్తున్న నైతిక మద్దతు మర్చిపోలేనిదన్నారు. ప్రధానంగా వైద్యులు ప్రాణాలొడ్డి కరోనా రోగులకు సేవలందిస్తున్నారన్నారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించి, భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనాపై స్వయంనియంత్రణ పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న పేదవారిని ఆదుకుంటున్న వారిని, సమాజం గుర్తుంచుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన పూర్ణచంద్రరావు దంపతులను అభినందించారు.

గాంధీ ప్రభుత్వ సీనియర్ వైద్యుడు ప్రొఫెసర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛంద సంస్ధలు, వ్యక్తులు తోడ్పాటునందించడం ముదావహమన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించి, స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం, మాస్కులు ధరించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో శాంతి, ప్రశాంత్, టి.సాయిలక్ష్మి-శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోముల ప్రకాష్, డాక్టర్ సూర్యప్రకాష్‌రావు, డాక్టర్ కృష్ణమూర్తిని పూర్ణచంద్రరావు దంపతులు సత్కరించి జ్ఞాపిక అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here