వెంకన్న భూములు సరే…బంగారమూ తెగనమ్మేస్తారా స్వామీ?

619

మరి బంగారం కూడా నిరర్ధకమే కదా? 
విస్తరణకు గొల్లమండపం కూడా  కూల్చేస్తారా? 
‘తెలుగుదేశం’ తప్పిదాల బాటలోనే వైసీపీ అడుగులు
వక్ఫ్, చర్చి ఆస్తులూ అమ్మే ధైర్యం ఉందా?
వీధిపోరాటాలకు సిద్ధమన్న కమల దళపతి కన్నా 
తెలంగాణ బీజేపీ దళపతి బండి సంజయ్ సంఘీభావం
అమ్మకాలపై అడకత్తెరలో టీడీపీ
అమ్మకాలకు ఆద్యులు  టీడీపీ-బీజేపీ సభ్యులేనన్న మల్లాది విష్ణు
టీటీడీ భూముల అమ్మకాలపై కొత్త రచ్చ
            (మార్తి సుబ్రహ్మణ్యం)

అసలే వివాదాలతో కొట్టుమిట్టాడుతున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు అవి చాలవన్నట్లు.. కొందరు నేతలు మరిన్ని తలనొప్పులు సృష్టించడానికి  తమ వంతు కృషి చేస్తు, సీఎంను చిక్కుల్లో నెడుతున్నారు. ఆ రకంగా ఎవరికి వారు జగన్ సర్కారుకు సమస్యలు సృష్టించడానికి తలా ఒక చేయి వేస్తున్నారు. రాష్ట్రంలో తెరపైకొచ్చిన కీలక ఘటనలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న సర్కారు మెడకు, తాజాగా తెరపైకొచ్చిన టీటీడీ భూముల అమ్మకాల వ్యవహారం గుదిబండగా మారనుంది. ఈ వ్యవహారం చివరకు హిందూమతస్తులలో ఆగ్ర హం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జగన్ హిందూ వ్యతిరేకి అన్న ప్రచారం జరుగుతుండగా, టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం దానికి ఆజ్యం పోసేలా కనిపిస్తోంది.

దేశం హయాంలోనే దారులు చూపారన్న సుబ్బారెడ్డి..

ఎందుకూ పనికిరాని భూములను అమ్మివేయడం ద్వారా, వచ్చే 23 కోట్ల 92 లక్షల రూపాయలను.. బాగా కష్టాల్లో ఉండి, దీప, ధూప, నైవేద్యాలకూ డబ్బులేకుండా, అర్చకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్ధితిలో ఉన్న టీటీడీ నిధికి జమ చేయాలని బోర్డు నిర్ణయించింది. మొత్తం 50 ఆస్తులను అమ్మాలన్నది టీటీడీ బోర్డు లక్ష్యం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములన్నీ ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని, వాటి వల్ల ఉపయోగం లేకపోగా, అన్యాక్రాంతమవుతున్నందున… నిరర్ధక ఆస్తి అయిన ఆ భూములను తెగనమ్మాలని నిర్ణయించింది.
అయితే.. ఈ తెగనమ్మడమనే విధానం ఇప్పటిది కాదని, 1974 నుంచీ జరుగుతుందేనని చైర్మన్ సుబ్బారెడ్డి  ఉవాచ. తెలుగుదేశం హయాంలో చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా ఉన్న కాలంలో.. పాలకమండలి 84వ నెంబర్ తీర్మానం ద్వారా, 28-07-2017న టీటీడీకి ఉపయోగపడని ఆస్తులను గుర్తించి, బహిరంగవేలం ద్వారా వాటిని అమ్మడానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఒక సబ్ కమిటీని నియమించింది. భానుప్రకాష్‌రెడ్డి, జె.శేఖర్, సండ్రవీరయ్య, ఎల్లా సుచిరిత, డిపి అనంత సభ్యులుగా ఉన్న ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే, తమ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని రెడ్డిగారు దొడ్డమనసుతో సెలవిచ్చారు.

అమ్మకాలపై వైసీపీ నేతల ఎదురుదాడి

అంటే ఈ వ్యవహారంలో తాము కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏమీలేదని, అంతా టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయమే అమలుచేస్తున్నామన్నది, రెడ్డిగారి కవిహృదయంగా అర్ధం అవుతోంది. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే దారిలో ఎదురుదాడి చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వమే వెంకన్న భూముల అమ్మకానికి అనుమతించిందని, అప్పుడు కమిటీలో బీజేపీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. నాడు అమ్మకాలకు అనుమతించి, నేడు రాద్ధాంతం చేయడమేమిటని విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎదరుదాడి ప్రారంభించారు. టీటీడీపై కావాలని ప్రతిపక్షాలు బురదచల్లుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.

టీటీడీ నిర్ణయంతో చిక్కుల్లో టీడీపీ..

గత ప్రభుత్వ నిర్ణయం మేరకే భూముల అమ్మకాల ప్రక్రియ కొనసాగుతోందన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటన,  ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని చిక్కుల్లో పడవేసింది. చంద్రబాబు హయాంలోనే, చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా ఉన్నప్పుడు భూముల అమ్మకాలపై సబ్‌కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ కూడా భూములను అమ్మాలని ప్రతిపాదించింది. ఆ కమిటీలో ఇప్పుడు సభ్యుడిగా శేఖర్‌రెడ్డి అప్పుడూ సభ్యుడిగా ఉండటం మరో విశేషం.  ఇప్పుడు కొత్త బోర్డు అదే ఆయుధాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై సంధిస్తోంది. దానితో టీడీపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఈ అంశంలో వైసీపీపై ఏరకంగా ఎదురుదాడి చేయాలని తలపట్టుకుంది. ఒక రకంగా ఈ వ్యవహారం టీడీపీకి ప్రాణసంకటంగా పరిణమించింది. ఇప్పటికే దీనిపై, విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు టీడీపీపై విరుచుకుపడుతున్నారు.

టీడీపీ తప్పు చేస్తే వైసీపీ అనుసరిస్తుందా?

తాజాగా తెరపైకొచ్చిన టీటీడీ భూముల వివాదానికి నాటి టీడీపీ సర్కారే కారణమని.. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేస్తున్న వాదనపై విస్మయం వ్యక్తమవుతోంది. నాడు టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నందుకే, 23 స్థానాలకు పరిమితమయింది. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా, నాడు బాబు చేసిన తప్పులనే ఆమోదించి, అమలుచేస్తామని చెబుతోందా? అన్నది ప్రశ్న. అదే నిజమయితే, నాటి టీడీపీ సర్కారుకు-ఇప్పటి వైసీపీ సర్కారుకు తేడా ఏమిటి? మరి అలాంటప్పుడు అదే చదలవాడ కృష్ణమూర్తినే కొనసాగించకుండా.. సుబ్బారెడ్లు, ధర్మారెడ్లు ఎందుకన్న భక్తుల ప్రశ్నలకు జవాబు ఇచ్చే ఉందా?

నిరర్ధక బంగారాన్నీ తెగనమ్మేస్తారా మరి?

ఉన్న భూములను పరిరక్షించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా, పనికిరావన్న కారణంతో వాటిని అమ్మడమే ఏకైక మార్గమయితే.. శ్రీవారికి ఉన్న టన్నుల కొద్దీ బంగారాన్నీ కూడా అమ్మేస్తారా అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఎందుకంటే భక్తులు చిన్న చిన్న బంగారు ఉంగరాల నుంచి వడ్డాణాలు, కిరీటాల వరకూ శ్రీవారి హుండీలో వేస్తుంటారు. అలా పోగైన బంగారాన్ని బిస్కెట్లు, డాలర్లుగా మార్చి బ్యాంకులో భద్రపరుస్తారు. మరి చైర్మన్ రెడ్డి గారి సూత్రం ప్రకారం.. వాడకం లేని ఆ బంగారం కూడా నిరర్ధకమే కాబట్టి, వాటిని కూడా తెగనమ్ముతారా అన్నది భక్తుల సందేహం. అయినా.. బ్యాంకు అప్పులని మాత్రమే నిరర్థకంగా భావించడం తెలుసు.  భూములు కూడా నిరర్ధకమన్న పదం రెడ్డి గారి పుణ్యాన ఇప్పుడే వింటున్నాం.

మరి.. బాబు పథకాలనే కొనసాగించాలి కదా?

సరే.. గత చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయాలనే తాము అమలుచేస్తున్నామని, వైసీపీలో కీలక నేత కూడా అయిన సుబ్బారెడ్డి చెప్పడం నిజమే అనుకుందాం. మరి ఆ ప్రకారంగా.. అన్ని అంశాలలోనూ వైసీపీ ప్రభుత్వం, గత చంద్రబాబు సర్కారు నిర్ణయాలను కొనసాగిస్తుందని చె ప్పే ధైర్యం ఉందా? అన్నది ప్రశ్న. మరి రెడ్డిగారి సూత్రీకరణ ప్రకారం.. చంద్రబాబు సర్కారు అమలుచేసిన అన్నక్యాంటీన్లు, రైతురుణాల మాఫీ, చంద్రన్న కానుక,  చంద్రన్న బీమా, వైన్‌షాపులు, పవిత్రసంగమం వద్ద హారతితోపాటు.. అప్పటి సీఎస్, డీజీపీ, ఇంటలిజన్స్ దళపతి, జిల్లా ఎస్పీలు, సీఐలను కూడా కొనసాగించాలి కదా? అప్పటిమాదిరిగానే ఆర్టీసీ, విద్యుత్ చార్జీల ధరలు  కూడా పెంచకుండా యధావిధిగా అమలు చేయాలి కదా? అలాకాకుండా, ఒక్క  టీటీడీ భూముల అమ్మకాల విషయంలో మాత్రమే బాబు విధానం కొనసాగిస్తూ, మిగిలిన పాలనా విధానాలు మాత్రం మార్చడం ఎందుకన్న ప్రశ్న మెడమీద తల ఉన్న ఎవరికైనా వస్తుంది కదా?

గొల్లమండపాన్నీ కూల్చేస్తారా.. రెడ్డి గారూ?

గత బోర్డు నిర్ణయాలనే అమలుచేస్తున్నామన్న తర్కాన్ని తెరపైకి తీసుకువచ్చిన బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డిపై, భక్తులు అదే తర్కాన్ని సంధిస్తున్నారు. గతంలో వేయికాళ్లమండపం మాదిరిగానే, మాడవీధుల విస్తరణలో భాగంగా గొల్ల మండపాన్ని కూల్చివేయాలని, చాలాసార్లు బోర్డులో చర్చ జరిగిందని గుర్తు చేస్తున్నారు. అయితే దానిపై యాదవులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. మరి చంద్రబాబు సర్కారు.. వేయికాళ్ల మండపం కూల్చేసింది కాబట్టి, మరి జగన్ ప్రభుత్వం కూడా గొల్ల మండపాన్ని కూల్చేయాలి కదా? అన్ని విధానాలు పాత ప్రభుత్వానివే పాటిస్తున్నప్పుడు, గొల్లమండపాన్ని తొలగించాలన్న బోర్డు చర్చల ప్రకారం కూల్చేయాలి కదా? అదెందుకు మినహాయించారు? యాదవులు ఆగ్రహిస్తారని మౌనంగా ఉన్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

చర్చి, మసీదు భూములను అమ్మరేం?

టీడీపీ భూములను అమ్మాలన్న టీటీడీ బోర్డు నిర్ణయం వెలుగుచూసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వక్ఫ్, మసీదు భూములు, ఆస్తులను కూడా అమ్మాలన్న డిమాండ్, చర్చ తెరపైకొచ్చింది. రాష్ట్రంలో చాలాచోట్ల వందలకోట్ల విలువైన వక్ఫ్ భూములున్నాయని, అలాగే కొన్ని పట్టణాల్లో చర్చి ఆస్తులు కూడా ఉన్నందున.. వాటిని కూడా ప్రభుత్వం అమ్మకుండా, ఎందుకు మినహాయిస్తోందన్న ప్రశ్నలు బీజేపీతోపాటు, హిందూ సంస్ధల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దేవాలయాలకు నయాపైసా ఇవ్వకపోయినా ఆదాయాన్ని తీసుకుంటోందని, చర్చి-మసీదుల నుంచి ప్రభుత్వానికి నయాపైసా రాకపోయినా.. ప్రభుత్వ సొమ్ముతో ఆయా మతపెద్దలకు గౌరవ వేతనాలివ్వడం ద్వారా, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని బీజేవైఎం రాష్ట్ర అద్యక్షుడు  రమేష్‌నాయుడు, ఒంగోలు బీజేపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు  విరుచుకుపడ్డారు.

కదం తొక్కనున్న కమలదళం

టీటీడీ నిర్ణయంపై బీజేపీ సమరానికి సిద్ధమవుతోంది. సింహాచలం, టీడీపీ భూముల కబ్జాలపై ఆందోళన వ్యక్తం చేసింది.  ఆ మేరకు మంగళవారం ధర్నాకు పిలుపునిచ్చింది. తమిళనాడులో భూములు అమ్మాలన్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తూర్పారపట్టారు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేస్తున్నామన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. గతంలో ప్రజావ్యతిరేక, హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించింది కాబట్టే టీడీపీని ప్రజలు ఓడించి, ఒక్క అవకాశం ఇవ్వమన్న జగన్‌ను అందలమెక్కించారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ కూడా ఒక్కసారికే ఇచ్చిన అవకాశాన్ని ఇలా దుర్వినియోగం చేస్తే, ఈ ప్రభుత్వం కూడా టీడీపీ మాదిరిగా పతనమవుతుందని హెచ్చరించారు. ‘టీడీపీ చేసిన తప్పునే వైసీపీ చేస్తే అప్పుడు ఇద్దరూ ఒకటే కదా? ఏం తేడా ఉంది?  ఫిబ్రవరి 29న బోర్డు తీర్మానం చేస్తే, ప్రొసీడింగ్స్ ఇచ్చేవరకూ ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? సింహాచలం భూములు కూడా చాలాచోట్ల కబ్జా అయ్యాయి. ప్రభుత్వ తీరు చూస్తే ఇక రాష్ట్రంలో దేవుడి ఆస్తులకు రక్షణ ఉండదేమోననిపిస్తోంది. వైసీపీ తీరుకు నిరసనగా మంగళవారం ధర్నా చేస్తున్నా’ని కన్నా వెల్లడించారు.

తెలంగాణ బీజేపీ బాసట..

కాగా భూముల అమ్మకాల నిర్ణయంపై ఆందోళనకు దిగనున్న ఏపీ బీజేపీకి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బాసటగా నిలిచారు. ఆంధ్రాను క్రైస్తవ రాజ్యం, తెలంగాణను ముస్లిం రాజ్యంగా మార్చేందుకు ఇద్దరు సీఎంలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని సంజయ్ హెచ్చరించారు. ఆస్తుల అమ్మకాలతో వచ్చిన డబ్బుతో పాస్టర్లకు జీతాలివ్వాలనుకుంటున్నారా? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటే రాజకీయ భస్మం కాక తప్పదని ఆయన హెచ్చరించారు.

భక్తుల దానంపై టీడీపీ పెత్తనమా?

భక్తులిచ్చిన భూములను అమ్ముతామన్న టీటీడీ నిర్ణయంపై విమర్శల వర్షం మొదలయింది. అసలు వాటిపై బోర్డు పెత్తనమేంటని భక్తులు, నాయకులు విరుచుకుపడుతున్నారు. ‘శ్రీవారికి భక్తులిచ్చిన భూములు అమ్మే అధికారం బోర్డుకు లేదు. ఇది ప్రభుత్వానికి సంబంధం లేదని సుబ్బారెడ్డి చెప్పడమంటే జగన్‌ను హిందువుల ఆగ్రహం నుంచి రక్షించడమే అవుతుంది. ప్రభుత్వం నియమించిన వారే బోర్డులో ఉన్న విషయం మర్చిపోతే ఎలా? నిర్వహించడం చేతకాక అమ్ముకోవడం దివాళాకోరుతనం. టీడీపీ హయాంలో జరిగినదాన్ని అమలుచేస్తామనడం వెర్రితనం. అలా అయితే టీడీపీ అమలుచేసిన అనేక పథకాలను వైసీపీ ఎందుకు రద్దు చేసింది? టీడీపీ తప్పు చేసింది కాబట్టే, ఓడిపోయింది. ఇప్పుడు మీరూ ఆ పార్టీ దారిలోనే నడిచి ఓడిపోవాలనుకుంటున్నారా ఏమిటి? బాబు ప్రభుత్వం చేసిన తప్పులను మీరు ఆమోదిస్తున్నారా? ఇదే మాదిరిగా క్రైస్తవ,ముస్లిం ఆస్తులను కూడా అమ్మే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? టీడీపీ ప్రతిష్ఠను దెబ్బతీసే నిర్ణయాలను బీజేపీ అడ్డుకుని తీరుతుంది. కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దీనిపై పోరాటానికి సిద్ధం ఉన్నామ’ని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర నేత ఓ.వి.రమణ హెచ్చరించారు.

చేతనయితే ఆస్తులు పెంచండి: యామినీ శర్మ

‘భక్తులు శ్రీవారిపై విశ్వాసంతో మొక్కుల కింద ఇచ్చి భూములను అమ్మే అధికారం టీటీడీకి ఎవరిచ్చారు? అది ఎవడబ్బసొమ్ము? అత్తసొమ్ము అల్లుడు దానం చేయడమంటే ఇదే. టీటీడీ భూములు అన్యాక్రాంతమవుతుంటే బోర్డులోని న్యాయవాదులేం చేస్తున్నారు? మిగిలిన మతాల ఆస్తులు అమ్మే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? చేతనైతే ఆస్తులు పెంచండి. అంతేకానీ అమ్ముకుంటే పోతే మీ పతనం తప్పదు. వెంకన్నతో పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదు. ఈ అన్యాయంపై పీఠాథిపతులు ఎందుకు నోరు మెదపడం లేదు? ఇప్పుడు తమిళనాడులో భూములు అమ్ముతున్నారు. రేపు ఏపీ-తెలంగాణ భూములూ అమ్మేస్తారా? స్థలాలు కాపాడటం చేతకాని వాళ్లు బోర్డులో కొనసాగడం వృధా. అయినా భూములు అమ్మితేనే మనుగడ సాగించే పరిస్థితిలో ఉందా? భూముల అమ్మకాల ప్రక్రియ నిలిపివేయాల’ని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, బీజేపీ నేత యామినీశర్మ డిమాండ్ చేశారు.

కోర్టుకెక్కుతాం: నరహరిశెట్టి

తమిళనాడులో టీటీడీ భూములు అమ్మాలన్న నిర్ణయాన్ని విరమించుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని, కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహారావు హెచ్చరించారు. టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన, విజయవాడలో నిరసనదీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఆలయాలను వ్యాపారదృష్టితో చూడటం హేయమన్నారు. భూములను కాపాడటం చేతకాకపోతే, బోర్డు సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.