దేవాదాయ శాఖను బ్రష్టు పట్టిస్తున్న ఆ అధికారిని తప్పించాలి

512

హిందూ ధార్మిక పరిరక్షణ సమితి డిమాండ్
కాకినాడ:
కేవలం నెల రోజుల పాటు ఆలయాలు మూతపడితేనే ఆదాయం లేక వాటిని నిర్వహించలేని స్థితికి దేవాదాయశాఖ వచ్చింది. భక్తుల పై ఆధారపడుతున్న ఈ శాఖలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేలా ఉందని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ ద్రోణంరాజు రవికుమార్ ఆరోపించారు.లాక్ డౌన్ అనంతరం ఆలయాలు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ఓ అధికారి తన ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. భక్తుల నుంచి ఆన్లైన్ సేవలు పేరిట గోత్రనామాలతో పూజలు, ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేస్తామని సొమ్ములు రాబట్టాలని ఆ అధికారి ఉత్తర్వులలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో ఆలయాల్లో భక్తులను అంతరాలయ దర్శనానికి అనుమతించవద్దని, సట్టారి,(శఠగోపం), తీర్థం ఇవ్వవద్దని ఆదేశించడం హిందూ ఆధ్యాత్మికత ను నాశనం చేసినట్లేనని రవికుమార్ ఆరోపించారు. కరోన తో సహజీవనం చేయాల్సి ఉంటుందని దాని గురిoచి భయపడాల్సిన పని లేదని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సి ఎం జగన్ ప్రకటించారు.కానీ దేవాదాయ శాఖ మాత్రం కరోన పై భక్తుల్లో భయం ఏర్పడేలా ఇలాంటి ఆదేసాలు జారీ చేసిందని రవికుమార్ ఆరోపించారు.కనీసం ఈ ఉత్తర్వులు జారీ చేసేముందు అయినా దేవాదాయ శాఖ విశాఖ శారదా పీఠాధిపతులు జగద్గురువు స్వరూపానందేంద్ర సలహా తీసుకుని వున్నా ఆయన ఇలా చేయవద్దని చెప్పి ఉండేవారని రవికుమార్ పేర్కొన్నారు. భక్తులు ఆలయంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత స్వామివారి పాదాలు గా భావించే శఠగోపాన్ని నెత్తిన పెట్టించుకుని సంతృప్తి చెంది, మూల విరాట్టుకు అభిషేకం చేసిన ద్రవ్యాలతో ఇచ్చే తీర్థాన్ని స్వీకరించిన తరువాత మాత్రమే పూర్తి సంతృప్తి చెందుతారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు అధికారి జారీచేసిన ఉత్తర్వులు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉత్తర్వులు తయారు చేసే ముందు హిందూ ధార్మిక సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు సలహాలు కూడా తీసుకోలేదని ఆరోపించారు. ఆలయంలో శఠగోపం, తీర్థం ఇవ్వనప్పుడు దేవాలయానికి ఇతర ప్రార్ధనా మందిరాలకు తేడా ఏముంటుంది అని విమర్శించారు. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఆలయాలు తెరిచిన తర్వాత భౌతిక దూరాన్ని పాటిస్తూ కచ్చితంగా తీర్థం, శఠగోపం ఇచ్చి తీరాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందూ ధార్మిక దేవాదాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తింటుందని ఆరోపించారు .వెంటనే ఈ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న అధికారులు పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ద్రోణంరాజురవికుమార్