మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి!

575

పాలనలో ప్రతీకారధోరణే ఎక్కువ
కోర్టులనూ వదలని వైఖరి
అటకెక్కిన హోదా పోరు
సంక్షేమంతో జనం సంతృప్తి
చెక్కు చెదరని ఓటు బ్యాంకు
రాజన్న పాలనకు భిన్నంగా జగన్న అడుగులు
జగన్ ఏడాది పాలనలో మెరుపులు-మరకలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్ర చరిత్రలో 151 స్థానాలు సాధించిన మొనగాడిగా సాధించిన కీర్తిప్రతిష్ఠలు మంచులా కరిగిపోతున్నాయి. పేదలమనిషిగా తెచ్చుకున్న కొద్దికాలంలోనే సాధించిన పేరు, మతిలేని నిర్ణయాలతో తనంతట తానే చెరిపేసుకుంటున్నారు. ప్రత్యర్థిని రాజకీయంగా మట్టుపెట్టాలన్న వ్యూహం, తనకు జరిగిన అవమానాలను క్షణక్షణం గర్తు చేసుకుని దానికి ప్రతీకారం సాధించాలన్న కసి, తనకు అడ్డం వచ్చే ప్రతి వ్యవస్థ, తనను ఎదిరించిన ప్రతి వ్యక్తికీ బురద అంటించాలన్న కోపం, ప్రజాస్వామ్యంలో తన పత్రిక తప్ప మిగిలిన ఏ మీడియా ఉండకూడదన్న పట్టుదల, తాను పిలిస్తే తప్ప ఎవరూ తనను కలవకూడదనే రాజరికపోకడ.. కలసి వెలసి, ఆయన సాధించిన అపూర్వ మెజారిటీని మంచులా కరగడానికి కారణమవుతున్నాయి. సర్దిచెప్పి, పాలనారధాన్ని సజావుగా నడిపించాల్సిన సలహాదారులు, ఏరి కోరి తెచ్చుకున్న అధికారులు  కూడా.. నాయకుడి మాదిరిగా ఆలోచిస్తుంటే, ఇక మంచిచెడ్డలు చెప్పేవారెవరు? ఇవి చాలవూ.. ఒక నాయకుడు కష్టపడి, జీవితంలో విలువైన క్షణాలను కోల్పోయి, వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి సాధించుకున్న ప్రతిష్ఠ మసకబారడానికి? ఏడాది పాలన పూర్తి చేసుకున్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఇది.

ఇదీ కథ..

సుబ్బారావు పెళ్లిచూపులకు వెళతాడు. ఆడపిల్ల తండ్రి ఆ సంబంధం తెచ్చిన వ్యక్తిని, సుబ్బారావు గుణగణాలు విచారిస్తాడు. అబ్బాయి లక్షణమైనవాడు. రెండు చేతులా సంపాదిస్తాడు. పైగా తండ్రి సంపాదించిన ఆస్తులున్నాయి. ఒక్క అలవాటు లేదు. వ్యసనం లేదు. కాకపోతే… ఒక్కటే లోటు. అదేమిటంటే.. తనకు తెలియదు. ఇంకొకడు చెబితే వినడు. అదొక్కటి తప్ప, మనిషి బంగారమని స్తోత్రం వినిపిస్తాడు. దానితో ఆడపిల్ల తండ్రి.. ఇహ చాలు బయలుదేరండి.. అబ్బాయికి ఆస్తి లేకపోయినా ఫర్వాలేదు. సంపాదించుకోవచ్చు. అలవాట్లున్నా అమ్మాయి సర్దుకుపోతుంది. అవి ఇప్పుడు అందరికీ ఉన్నవే. కానీ తనకు తెలియపోవడం, చెప్పినా వినకపోవడం ఆ రెండు అవలక్షణాలు చాలు.. ఎన్ని మంచి లక్షణాలున్నా మిగిలినవి పనికిరాకుండా పోవడానికి! ఈ సంబంధం మాకొద్దని చెప్పి దణ్ణం పెడతాడు. ఇప్పుడు ఏపీ పాలనలో ఇదే కనిపిస్తోంది.

 

అపూర్వ మెజారిటీతో  అధికారంలోకి…

పదేళ్లపాటు ప్రత్యర్ధులపై అలుపెరుగని పోరాటం చేసి, ఆ క్రమంలో జైలుకు వెళ్లివచ్చినా చెక్కుచెదరని ఆత్మస్థైర్యం, ప్రాణాలు పణంగా పెట్టి చేసిన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర, వాటి ద్వారా పోగుబడిన ప్రజాభిమానంతో, ఏపీకి రెండవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి గద్దెనెక్కి నేటికి సరిగ్గా ఏడాది. పాలనానుభవం లేకపోయినా, ప్రజలు ఆయన పార్టీకి అపూర్వం, అనన్యసామాన్యం, అద్భుతమైన మెజారిటీ కట్టబెట్టారు. ఆ రకంగా ఎన్టీఆర్ రికార్డును కూడా జగన్ చెరిపివేశారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నప్పటికీ, నవరత్నాల హామీలను త్వరత్వరగా పూర్తి చేసేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాల వల్ల, బడుగులు బాగుపడుతున్నారు. అనేక పథకాలకు డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాకే వేస్తున్న వైనం, ఆయనను ఆయా వర్గాలకు చేరువ చేస్తోంది.

పాలనలో మెరుపులెన్నో..

ఎట్టి పరిస్థితుల్లోనూ, ప్రతికూల వాతావరణం ఎదురైనా సరే ఇచ్చిన మాట ప్రకారం, పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న జగన్ పట్టుదల మెచ్చదగ్గదే. దళారీలు లేకుండా లబ్థిదారుడికి నేరుగా  డబ్బు అందినప్పుడు ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. వాలంటీర్ల వ్యవస్థపై ఎన్ని విమర్శలున్నప్పటికీ, పించన్లను నేరుగా లబ్థిదారుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందిస్తున్న తీరును, విమర్శకులు సైతం ప్రశంసించి తీరాల్సిందే.  నిధుల సమస్య ఉన్నా, తానిచ్చిన మాట నెరవేర్చాలన్న పట్టుదల పాలకుడిలో ఉండటం గొప్పతనమే. దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు, ఒక్క ఏడాదిలో కల్పించడం అందరికీ సాధ్యం కాదు. అందుకు స్పందించే మనసు ఉండాలి. ఉదారగుణం ఉండాలి. జగన్‌లో కనిపిస్తుంది అదే! తాను చనిపోయినా, తన ఫొటో ప్రతి పేదవాడి ఇంట్లో ఉండాలన్నదే తన లక్ష్యమని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు. ఆ మేరకు వేస్తున్న అడుగులు తన విధానాలేమిటన్నది స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా జగన్  ఓటు బ్యాంకు చెక్కచెదరలేదన్న విషయం అర్ధమవుతోంది.

పాలనలో  మరకలన్ని..!

జగన్మోహన్‌రెడ్డి ఏడాది పాలనలో మెరుపులతో మరకలే ఎక్కువగా కనిపిస్తాయి. పేదవాడికి ఐదు రూపాయలతో కడుపునింపే, అన్న క్యాంటీన్లను రద్దు చేయడం విమర్శలకు దారితీసింది. పేరు మార్చి ఆ పథకం కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ, మూర్ఖంగా దానిని అటకెక్కించడం జగన్‌కు చెడ్డపేరు తెచ్చింది. ఇసుకను కొంతకాలం రద్దు చేయడంతో, దానిపై ఆధారపడి జీవించే అట్టడుగు వర్గాలు ఆకలితో అలమటించాయి. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్న కోరిక మంచిదే అయినా, అంతకుముందు ప్రభుత్వం అదే పేదలకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకుని, తిరిగి పేదలకు ఇవ్వాలన్న విచిత్ర నిర్ణయం విస్మయ పరిచింది. వైఎస్ పాలనకు భిన్నంగా జగన్ పాలన ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

ఇచ్చిన మాటకు భిన్నంగా..

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. కానీ జగన్ మాత్రం ఆ రెండూ చేశారు. విపక్ష నేతగా 200 యూనిట్ల వరకూ, ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పిన అదే జగన్.. సీఎంగా అవతారమెత్తి విద్యుత్ రేట్లు పెంచడం విమర్శలకు దారితీసింది. తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని ప్రకటించారు. కానీ, వైన్‌షాపులు రద్దు చేసి, ప్రభుత్వంతో టీచర్లను పెట్టి ప్రభుత్వషాపుల వద్ద మద్యం అమ్మకాలు సాగించారు.  తమతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల బ్రాండు మాత్రమే అమ్మడం వల,్ల అందులో నెలకు 500 కోట్లు ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణ ఎదుర్కొన్నారు. దీనికి చెప్పిన లాజిక్.. ఆయన ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసింది. ప్రజలతో మందు మాన్పించేందుకే ధరలు పెంచామని జగన్ సర్కారు ప్రకటించింది. మరి ఆ ప్రకారమయితే.. కరెంటు ఎక్కువ  వాడుతున్నందుకు కరెంటు చార్జీలు, బస్సు ప్రయాణాలు ఎక్కువ చేస్తున్నందుకు బస్సు చార్జీలు పెంచుతున్నారా అన్న ప్రశ్నలు తెరపైకొచ్చాయి.

 

హోదా పోరు.. అవుట్ సోర్సింగ్ మాటేదీ?

జగన్ విపక్ష నేతగా ఇచ్చిన రెండు ప్రధాన హామీలను, ఆయన సీఎం అయిన తర్వాత తుంగలోతొక్కారు. అందులో ప్రధానమైన ప్రత్యేక హోదా ఒకటి. తనకు 22 మంది ఎంపీలు ఇస్తే, కేంద్రం మెడలు వంచి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పారు. కానీ అధికారం వచ్చిన తర్వాత దాని కోసం పోరాటాలు చేసిన దాఖలాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. ఇప్పుడు కేంద్రమే రాష్ట్రం మెడలు వంచే పరిస్థితి కనిపిస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు అదే అంశంపై రాజీనామా చేసిన వైసీపీ.. ఇప్పుడు అదే డిమాండ్‌పై నోరెత్తకపోవడం విమర్శలకు గురవుతోంది. టీడీపీ హయాంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన సందర్భంలో.. తాను అధికారం లోకి వస్తే, వారిని పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కానీ తాజాగా ఆర్టీసీలో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించగా, చాలాకాలం నుంచీ ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయకపోగా, దానికో కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. ఇది జగన్ మడమ తిప్పారన్న విమర్శలకు కారణమయింది.

హిందూ వ్యతిరేక ముద్ర..

ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్ముతో.. చర్చి ఫాదర్లు, మసీదు ముల్లాలకు గౌరవ వేతనం ఇవ్వడంపై హిందువులలో వ్యతిరేకత వ్యక్తమయింది. జగన్ సీఎం అయిన తర్వాత, క్రైస్తవులు జోరుగా మతమార్పిళ్లు చేస్తున్నారని పీఠాథిపతులు ఆగ్రహంతో ఉన్నారు. తూర్పుగోదావరి పిఠాపురంలో దేవతావిగ్రహాలు కూల్చివేయడంపై పీఠాథిపతులు కన్నెర చేశారు.  ఈ విషయంలో జగన్ గురువు, విశాఖ పీఠాథిపతి శారదానంద స్వామి మౌనంగా ఉండటంపై.. ఆయనపై సాటి పీఠాథిపతులు మండిపడ్డారు. అది ఆధ్మాతిక పీఠం కాదని, వైసీపీ ఆఫీసని విరుచుకుపడ్డారు. పవిత్రసంగమంలో హారతిని రద్దు చేయడం, దేవాలయ భూములు అమ్మడం, ఘాట్ల వద్ద పిండాలకు రేట్లు పెట్టడం వంటి చర్యలతో.. జగన్ హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్న ముద్ర స్థిరపడింది.

అమరావతితో అనవసర ప్రయోగం..

ఇక ప్రతిష్టాత్మక అమరావతి రాజధానిని, విశాఖకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు జగన్ సర్కారుకు మచ్చ తెచ్చాయి. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో కట్టిన భవనాలు మధ్యలో నిలిపివేసిన తీరు, విశాఖకు రాజధానిని తరలించే ప్రయత్నాలపై రైతుల ప్రతిఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయింది. నిజానికి అమరావతి రాజధానిగా అక్కడ ఉన్నప్పటికీ జగన్‌కు వచ్చిన లాభంగానీ, నష్టంగానీ లేదు. కానీ అక్కడ  చంద్రబాబు కనిపిస్తుండమే జగన్‌కు ఇబ్బందికలిగిస్తోంది.  అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని, విపక్షంలో ఉన్నప్పుడు నానా యాగీ చేసిన జగన్.. తాను అధికారంలోకి వచ్చి ఏడాదికాలయినా, ఒక్క ఆధారం కూడా చేజిక్కించుకోలేకపోయారు. అంతకుముందు లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకాలు కూడా వేసిన జగన్.. తాను సీఎం అయిన ఏడాది వరకూ, ఒక్క సాక్షం పట్టుకోలేకపోయారు. పైగా ఏమైనా అక్రమాలుంటే విచారించమని ఒక కమిటీని వేయడం విశేషం.  ఫలితంగా.. ఆయన కేవలం చంద్రబాబు సర్కారుపై బురద చల్లడారనికే, ఆనాడు ఆరోపణలు చేశారన్న భావన ఏర్పడింది.

విద్యుత్ ఒప్పందాలను తిరగతోడిన ఫలితంగా, ఇప్పుడు కేంద్రం.. వాటి అజమాయిషీని సంస్కరణ పేరుతో తన చేతుల్లోకి తీసుకోబోతోంది. ఈ అంశంలో దూకుడు వద్దని కేంద్రం  చెప్పినా, వినని జగన్‌పై కేంద్రం కన్నెర చేసింది. తాజాగా విశాఖలో డాక్టర్‌పై దాడి చేసిన వైనం అంతర్జాతీయ మీడియాకెక్కింది.

ఎల్వీపై వేటు నుంచి.. ఏబీ సస్పెన్షన్ వరకూ..

ఇక బాబు జమానాలో స్వేచ్ఛగా పనిచేసిన అధికారులు, ఇప్పుడు బిక్కుబిక్కుమంటు బతకాల్సిన పరిస్థితి నెలకొంది. సమర్ధుడు, నిజాయితీపరుడిగా పేరున్న ఎల్వీ సుబ్రమణ్యం అనే సీనియర్ అధికారిని సీఎస్‌గా తప్పించడం.. తనమాదిరిగానే మొండివాడిగా పేరున్న మరొక అధికారిని, తన పేషీలో పెట్టుకోవడం విమర్శల పాయింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినందుకు, నాటి గవర్నర్ నరసింహన్ సిఫార్సుతో ఎన్నికల కమిషనర్‌గా వచ్చిన నిమ్మగడ్డ రమేష్‌ను తొలగించారు. పైగా ఆయనపై కమ్మముద్ర వేసి, దానిని టీడీపీ అనుబంధాన్ని ఆపాదించడం సీఎం స్ధాయిని త గ్గించింది. నిఘాదళపతిగా చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగు ఇవ్వకపోగా, ఆయనను సస్పెండ్ చేయడం, పలువురు అధికారులు ఇష్టం వచ్చినట్లు పోస్టింగులు లేకుండా చేయడం వంటి నిర్ణయాలు పిల్లచేష్టగా  మిగిల్చాయి. నిజానికి సీఎంగా ఎవరు వచ్చినా తనకు కావలసిన అధికారులను తెచ్చుకోవడంతోపాటు, ఉన్న వారితో పనిచేయించుకుంటారు. చంద్రబాబు-వైఎస్ అదే పనిచేశారు. కానీ జగన్ మాత్రం, తనకు నచ్చని అధికారులను ఆగర్భ శత్రువులుగా చూస్తుండటమే విస్మయం కలిగిస్తోంది.

కోర్టులలో ఎదురుదెబ్బలు..

జగన్ సీఎంగా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను హైకోర్టు తప్పుపడుతోంది. సీఎంకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి డీజీపీ వరకూ భయపడవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయన పార్టీ నాయకులు ఆయనంటే బేజారెత్తవచ్చు. కానీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న కోర్టులెందుకు తనకు భయపడతాయన్న ఆలోచన జగన్‌లో ఇప్పటికీ కనిపించలేదు. అందుకే ఇప్పటిదాకా సుమారు 60 సార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు, వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. చివరకు డీజీపీ రెండుసార్లు కోర్టుకు హాజరుకాగా, త్వరలో సీఎస్ కూడా ధిక్కారం కింద కోర్టు మెట్టు ఎక్కనున్నారు. రాష్ట్రం అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉంటే ఒక్కోరికి 3,4 లక్షలతో డజన్ల మందికి సలహాదారు పదవులివ్వడం విమర్శలకు తావిచ్చింది.

కోర్టులపైనా ఎదురుదాడి..?

కాగా వివిధ సందర్భాల్లో జగన్ సర్కారుకు వ్యతిరేక తీర్పులు ఇస్తున్న హైకోర్టు, న్యాయమూర్తులపై పార్టీ అభిమానులు, సోషల్‌మీడియాలో బురద చల్లడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఒకేరోజు మూడు తీర్పులిచ్చిన రోజున.. హైకోర్టు, తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా, సోషల్‌మీడియాలో పుంఖానుపుంఖాలుగా పోస్టింగులు, వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం బట్టి… తనకు సరిపడని వ్యవస్థలు ఏదైనా ఎదురుదాడి చేయడానికే సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒక రాజకీయ పార్టీకి న్యాయమూర్తులు కొమ్ముకాస్తున్నారన్నట్లు పెడుతున్న పోస్టింగులను, అటు పోలీసులు కూడా పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది.

అప్పుడలా.. ఇప్పుడిలా..

విపక్షంలో ఉండగా సోషల్ మీడియాను అడ్డగోలుగా వాడుకుని, దాని ద్వారా నాటి టీడీపీ సర్కారు, మంత్రులు, ఎమ్మెల్యేలపై టన్నుల కొద్దీ బురద పూసిన వైసీపీ.. ఇప్పుడు పాలకపక్ష అవతారంలో మాత్రం, సోషల్‌మీడియా ద్వారా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వారిని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తోంది. విపక్ష నేతగా జగన్ తమ కార్యకర్తలు పోస్టులు పెడుతుంటే టీడీపీ ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమని వ్యాక్యానించారు. విజయసాయిరెడ్డి కూడా సోషల్‌మీడియాలో నిజాలు చెప్పే హక్కు ఉందని వాదించారు. తర్వాత ఇప్పుడు దానికి విరుద్ధంగా, వైసీపీ సర్కారుపై పోస్టులు పెట్టిన వారిని, కథనాలు రాసిన వారికి సీఐడి నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి.. విపక్షంలో వైసీపీ ఉన్నప్పుడు చేసినవ్నీ, స్వార్ధ రాజకీయాలేనన్న విషయం ఇప్పుడు ప్రజలకు స్పష్టమయింది.

మీడియాను అణచివేసే యత్నం..

జగన్ సీఎం అయిన తర్వాత తనకు గిట్టని పత్రికలకు ప్రకటనలు నిలిపివేసి, తన సొంత మీడియా సంస్థ కడుపునింపేందుకు చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు గురవుతున్నాయి. తనను విమర్శించే మీడియాను ఆర్ధికంగా దెబ్బకొట్టడం ద్వారా, వాటిని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన స్పష్టంగానే కనిపిస్తోంది. లాక్‌డౌన్ కాలంలో మంత్రులు, తన పత్రికకు మాత్రమే ఇచ్చిన ప్రకటనలు వివాదం సృష్టించాయి. జగన్ సీఎం అయిన తర్వాత చిన్న-మధ్య పత్రికల మనగడ కష్టమయిపోయింది. ఆరకంగా దాదాపు 95 శాతం పత్రికలు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

మీడియా ప్రశ్నలకు దూరం..

గతంలో వైఎస్ సహా ఏ సీఎం అయినా విస్తృతంగా మీడియా సమావేశాలు నిర్వహించేవారు. కానీ జగన్ మాత్రం వాటికి దూరంగా ఉండటంతో, ఆయన మీడియాకు భయపడుతున్నారన్న భావన ఏర్పడింది. దానితో ఎంచుకున్న మీడియాను మాత్రమే అనుమతించి, ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా  వెళ్లిపోతున్న విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఇక సీఎంఓలో  పత్రికాసంబంధాలు నెరిపే అధికారుల పేర్లు కూడా చాలామంది జర్నలిస్టులకు తెలియదంటే, వారి సంబంధాలు ఎలా ఉన్నాయో అర్ధమవుతోంది.

జాతీయ మీడియాలో విమర్శల వాన..

విపక్షంలో ఉండగా జగన్ పార్టీని భుజానకెత్తుకున్న జాతీయ మీడియా సంస్ధలు, ఇప్పుడు జగన్ పాలనను తూర్పారపడుతున్నాయి. అమరావతి రాజధాని సహా అనేక నిర్ణయాలను విమర్శిస్తున్నాయి. నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆయన విడుదల కోసం వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రి వద్దకు వెళ్లి లాబీ చేయడాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా చూపింది. అయితే జాతీయ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా రాయించుకునేందుకు, జగన్ నియమించుకున్న వారు అందులో విఫలమవుతున్నారు. పేరుకు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను మీడియా సలహాదారులుగా పెట్టుకున్నా, వారి వల్ల ప్రభుత్వ ధనం వృధా అవడం తప్ప, జగన్‌కు నయాపైసా లాభం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.