*అయినా మారని అలవాట్లు…
*అవే వీడియో కాన్ఫరెన్సులూ….
*కాకపోతే..కలెక్టర్ల స్థానంలో పార్టీ నేతలు…
*రోజువారీ ప్రెస్ మీట్లూ….
*వాళ్ళకీ వీళ్ళకీ ఉత్తరాలే ‘ఉత్త’రాలు…
*ఆత్మ స్థుతీ…. పరనిందా….
*175 లో 151 తెచ్చుకున్న పార్టీకి పాలించే అవకాశం ఇవ్వరా?
*ఓ నాలుగేళ్ళు ఓపిక పట్టలేరా…!?

విజయవాడ:వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాది పూర్తి అవుతున్నదని అంటున్నారు. నాకు మాత్రం- చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయి ఏడాది పూర్తి అవుతున్నదని అనిపిస్తున్నది. నిజానికి ఇంకో ముప్ఫయి ఏళ్ళు అధికారం లో కొనసాగుతామని ఆయన చాలా సార్లు ప్రకటించారు. కానీ, ఆయన ఒకటి తలిస్తే, ప్రజలు ఇంకోటి తలిచారనే అనుకోవాలి, ఆయనకు వచ్చిన సీట్ల సంఖ్య చూస్తే.
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గల 175 స్థానాలకు గానూ జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలను ప్రజలు కట్టబెట్టారని అంటున్నారు గానీ; నాకు మాత్రం-175 స్థానాలకు గానూ చంద్రబాబు నాయుడుకు ఇరవైమూడే కట్టబెట్టారని అనిపిస్తున్నది.
‘ఏం తప్పు చేశానని నాకు ఇరవై మూడే వచ్చాయి. ‘అంటూ ఆయన చాలా సార్లు ఆవేదనకు లోనయ్యారు. కానీ, ఏమి మంచి పని చేశారో జనానికి అర్ధం కాకపోవడం వల్లనే…ఇరవై మూడే ఇచ్చారనే సింపుల్ లాజిక్కు మాత్రం ఆయనకు అర్ధం అయినట్టు లేదు. ఆత్మావలోకనం చేసుకున్నట్టు కూడా లేదు.
* 2014 ఎన్నికలకు ముందు పాదయాత్రలో వివిధ సామాజిక వర్గాలవారికి… ఇచ్చిన అసంఖ్యాక హామీల అమలు విషయం లో ఆయనకు చిత్తశుద్ధి లేదని ఓటర్లు భావించారు.
* చెప్పే మాటలకు…. చేసే ఆలోచనలకు…చేపట్టే పనులకు ఎక్కడా పొంతన కుదరడం లేదని జనం భావించారు.
* తాను ఒక్కడినే 24 గంటలూ పనిచేస్తున్నాననే అభిప్రాయం కలిగించడానికి….మంత్రులను,పార్టీని కూడా అనామకంగా మార్చివేశారనే భావం జనంలో బాగా పాకిపోయింది.
* జన్మ భూమి కమిటీలు బాగా సాయం బట్టాయి, జనానికి చీదర, చిరాకు కలగడానికి.
*రాజధాని నిర్మాణం అనేది ఓ ప్రహసనంగా…విదేశాల్లో అమాంబాపతు జనం తిరగడానికి ఓ సాకుగా పనికి వచ్చిందనే భావం జనంలో ఏర్పడింది.
* కారణం ఏదైతే ఏమిటి గానీ…పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో చిత్తశుద్దికంటే….షో బిజినెస్ ఎక్కువగా ఉన్నదనే భావం వ్యాపించింది.
* కుమారుడు లోకేష్ ను ఆగమేఘాలపై ఎం ఎల్ సీ ని చేసి, నిముషాలపై మంత్రిని చేయడాన్ని జనం హర్షించలేదు.
* గతంలో గెలిచిన రెండుసార్లూ ఆయన సొంతంగా గెలవలేదు. ఈ సారీ గెలవలేదు. అంటే…సొంతంగా గెలిచేంత రాజకీయ బలం ఆయనకు లేదు. ఆయన బంగారు పళ్ళెమే కానీ, ఆనుకోడానికి ఓ గోడ కావాలి. మొన్న ‘ ఆ గోడ’ కు అవకాశం లేకుండా పోయింది.
* ఎన్నికలు…ఉప ఎన్నికలలో ధన ప్రవాహాన్ని…ప్రభావాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబే అంటారు. ఆయన కూడా మొన్న ఆ ధన ప్రభావం లోనే కొట్టుకు పోయారు, కత్తితో బతికేవాడు…ఆ కత్తికే పోతాడు అన్నట్టుగా….
నలభై ఏళ్ల ఇండస్ట్రీ అయినా…అరవై ఏళ్ల ఇండస్ట్రీ అయినా…మనిషికి కావలసింది ప్రధానంగా ఇంగిత జ్ఞానం. అంటే- కామన్ సెన్సు.ఈ ఇంగిత జ్ఞానం అనేది…మనిషిని బట్టి, చేపట్టిన వృత్తిని బట్టి, మనం ఉన్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. పాలకుడి విషయంలో అయితే…. నిమిషానికి ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏది చెప్పి…ఏది చేసినా చెల్లిపోడానికి -నలభై ఏళ్లనాటి సమాజం కాదు. మ్యానిపులేషన్లు అప్పుడు వర్క్ ఔట్ అయినట్టు …ఇప్పుడు కావు.
సమాజంలో అక్షరాస్యత పెరిగింది. ప్రతివారి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. యూ ట్యూబ్, ఫేస్ బుక్కు, ఇంటర్నెట్టు తెలియని వారు లేరు. అభిప్రాయాలు స్వేచ్ఛగా, మనో వాయు వేగాలతో ఎగురుతున్నాయి. వీటికి తోడు మీడియా, చానెళ్లు…. జనాన్ని ఊపిరి సలపనియ్యడం లేదు.
ఈ’హై బ్రీడ్’వాతావరణం లో…ఏమి మాట్లాడితే…ప్రజల్లోకి ఎలా వెడుతుందో…. ;ఏమి మాట్లాడక పోతే ప్రజల్లోకి ఎలా వెడుతుందో….;ఏ అబద్దాలు చెబితే…. జనం ఏమనుకుంటారో…;రాజకీయం గా ఏ స్టెప్ వేస్తే…జనంలో దాని రియాక్షన్ ఏమిటో అన్న విషయం అంచనా వేసుకోగలిగిన ఇంగిత జ్ఞానం పాలకుడికి ఉండాలి. లేదా, ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు చెప్పేది ఆలకించాలనే కనీస ఇంగిత జ్ఞానం అయినా ఉండాలి.

చంద్రబాబు నాయుడులో ఈ రెండూ కొరవడ్డాయనేది చాలామంది భావన. ‘ఇరవై మూడే….ఎందుకు వచ్చాయ్’ అంటూ గింజుకుంటూ…సోదికి వెళ్లాల్సిన పనిలేదు. సూది కోసం సోదికి వెడితే…పాత రంకులు బయటపడ్డాయనే సామెత ఒకటి ఉందిగా! అది గుర్తుపెట్టుకోవాలి, తెలుగు దేశం వారు.
సరే. అయిందేదో అయిపోయింది.ఆయనను, ఆయన రాజకీయాల తీరును, మాటలను, చేతలను జనం అర్ధమే చేసుకున్నారో… అపార్ధమే చేసుకున్నారో….23 సీట్లతో పక్కన కూర్చోబెట్టారు. జనాభిప్రాయ స్ఫూర్తి ని గమనం లోకి తీసుకుని, ఆయన మౌనం పాటించాలి. జనం ఎవరికి అవకాశం ఇచ్చారో…వాళ్ళను , వాళ్లకు నచ్చిన రీతిలో పాలించనివ్వాలి. అధికారంలో లేనివారు ఇచ్చే సలహాలు…అధికారంలో ఉన్నవారికి అస్సలు రుచించవనే విషయం చంద్రబాబునాయుడు కంటే ఎక్కువగా తెలిసిన వారు ఎవరు ఉన్నారు?!.
అందుకే, అధికారం లో ఉన్నవారికి సలహాలు ఇవ్వడం…హెచ్చరించడం… ‘ఉత్త’రాలు రాయడం…చూపించేవారు ఉన్నారు కదా అని రోజువారీ ప్రెస్ మీట్లు పెట్టడం పై ఆయన ఓ మూడున్నర, నాలుగేళ్లు సెల్ఫ్ మారిటోరియం విధించుకోవాలి.
చంద్రబాబును పక్కన కూర్చోబెట్టడంవల్ల …తమకు మంచి జరిగిందా….చెడు జరిగిందా అనే విషయం తేల్చుకునే జ్ఞానం ఓటర్లకు ఉంది. దానికి అనుగుణంగానే వారు వ్యవహరిస్తారు అనే విషయాన్ని ఆయన గమనించాలి.
రాజకీయమే ఉగ్గుపాలగా కుడీ ఎడంగా 70 ఏళ్ళు బతికిన మనిషికి ..మౌనంగా ఉండడం అంటే కష్టమే. అయితే..కరోనా భయం తో ప్రపంచం మొత్తం మూసుకుని కూర్చోలేదూ! తప్పదని అనుకున్నప్పుడు…ఏదైనా సాధ్యమే.
1.ఆయన అసలు విజయవాడలో అడుగు పెట్టకూడదు
2. రోజువారీ ప్రెస్ మీట్లకు స్వస్తి చెప్పాలి.
3. ప్రభుత్వానికి సలహాలు చెప్పడం మానేయాలి.4. ఎల్లయ్యకు…పుల్లయ్యకు ‘ఉత్త’ రాలు రాయడం మానేయాలి.
తాము ఎన్నుకున్న ప్రభుత్వ చర్యలను విశ్లేచించుకోలేనంత అమాయకులు కాదు, ఓటర్లు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనంలోకి తీసుకోవాలి.
తాము ఎన్నుకున్న ప్రభుత్వ సారధుల వ్యవహార శైలి నచ్చితే…మళ్లీ వారినే అందలం ఎక్కిస్తారు. నచ్చకపోతే…’ఎక్కడ చంద్రబాబు…!?’అంటూ వెదుక్కుంటూ వస్తారు.
ఈ మూడున్నర ఏళ్ల విశ్రాంత సమయంలో…మనవడు దేవాంష్ తో ఆడుకోవచ్చు. మనవడికి రాజకీయం నేర్పుతూ కాలం గడపవచ్చు. నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులుగా చెలామణి అయిన వారితో టెలి కాన్ఫెరెన్సులూ, వీడియో కాన్ఫెరెన్సులూ చేసుకోవచ్చు.కుటుంబంతో విదేశాలకు విహార యాత్ర లకు వెళ్ళవచ్చు. హెరిటేజ్ వ్యాపార విస్తరణ, అభివృద్ధి పనులను పర్యవేక్షించుకోవచ్చు. పుట్టుస్వామి రాసిన, ‘రిజర్వేషన్స్ మేడ్ వెరీ డిఫికల్ట్’అనే ఉద్గ్రంధం చదువుకోవచ్చు. ఇప్పటి ప్రభుత్వ వ్యవహార శైలి నిశితంగా పరిశీలిస్తూ…తాను అధికారం లోకి వస్తే…ఏమి చేయాలో, ఏమి చేయగూడదో నోట్స్ రాసుకోవచ్చు.
ఇలా చాలా చేయవచ్చు
ఐదో వంతు సమయం అయ్యే పోయింది. ఇక నాలుగు వంతుల సమయం మిగిలి ఉంది. సమయం అనేదిమీసాలపై తేనె బొట్టు లాటిది. జర్రున జారిపోతుంది, మనకు తెలియకుండానే.
ఆయన బృందం స్థానం లో వచ్చిన జగన్ బృందం వ్యవహారశైలిపై ఒక అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాలి.అదే, ప్రజలకు ఆయన చేసే మేలు.

-భోగాది వెంకట రాయుడు

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner