లడ్డు అమ్మకాలు.. వెరీ గుడ్!

202

అది కూడా వివాదమేనా?
మంచిదేనన్న బీజేపీ
(మార్తి సుబ్రహ్మణ్యం)

కాదేదీ వివాదానికి అనర్హం.. తిరుమల లడ్డు సైతం! అన్నట్లుంది కొత్తగా తెరపైకి వచ్చిన, తిరుమల లడ్డూ అమ్మకాల వ్యవహారం. తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకోలేని భక్తులకు, లడ్డు అందుబాటులోకి తీసుకురావాలన్న టీటీడీ నిర్ణయంపై వివాదం మొదలయింది. బల్కుగా ఆర్డరు ఇచ్చే వారికి, శ్రీవారి లడ్డూలు సరఫరా చేస్తామని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీటీడీ కల్యాణమండపాలతోపాటు, బెంగళూరు, చెన్నైలోని సమాచారకేంద్రాల్లో వాటిని అందుబాటులో ఉంచుతామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.  దాని వల్ల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంగడి వస్తువయిపోయి,  దాని విలువ తగ్గిపోతుందట. ఇదీ లడ్డు అమ్మకాల లడాయి!

నిజానికి టీటీడీ పవిత్రత ఏదో దెబ్బతిందని, ఆచారం మంటకలిసిపోయిందని ఇప్పుడేమీ తీరికూర్చుని బాధపడాల్సిన పని లేదు. గావు కేకలు పెట్టి గాభరా పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిజానికి అది విజయవంతంగా అపవిత్రమయి చాలా దశాబ్దాలయింది. లిక్కరు కింగులు, ఇసుక కాంట్రాక్టర్లు, జైలుకెళ్లిన వారిని, నూరణాల నాస్తికులను  శ్రీవారి సన్నిధిలో సేవకులుగా నియమించుకున్నప్పుడే టీటీడీ విమర్శల బోనెక్కింది. శ్రీవారి లడ్డూను రాజకీయ, వ్యాపార పైరవీలకు.. రాజ్యాంగ పరమైన పదవుల్లో ఉన్న వారిని కాకాపట్టి, రాజకీయ పరమపద సోపానంలో నిచ్చెనలు ఎక్కేందుకు టీటీడీ ఒక వేదికగా మారి కూడా చాలా కాలమయింది. పాలకమండలిలో  చేరేందుకు, అధికారులు కదలకుండా అక్కడే ఏళ్ల తరబడి కొనసాగేందుకు.. శ్రీవారి దర్శనాన్ని అడ్డంపెట్టుకున్నప్పుడే దాని పవిత్రతను కాకి ఎత్తుకెళ్లిపోయింది.

ఒక అధికారి తొమ్మిదేళ్లు నిర్నిరోధంగా అక్కడే పాతుకుపోయారంటే, ఒకసారి పనిచేసిన అధికారే మళ్లీ ఇంకొక హోదాలో మళ్లీ అక్కడే తిష్టవేశారంటే.. టీటీడీ వేదికగా చేసే లాబీయింగ్ ఎంత పవర్‌ఫుల్లో, మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. చాలాకాలం టీటీడీని ఏలిన ఓ అధికారి విలాసాలు  సింగపూర్, ధాయ్‌లాండ్, శ్రీలంకకూ విస్తరించాయి. సదరు అధికారి బెంగళూరులో ఓ స్టార్ హోటల్‌కెళితే, ఆ ఫ్లోరంతా ఆయనకే ఇస్తారట. సింగపూర్ ప్రధాని నుంచి, మన దేశ మంత్రుల వరకూ ఆయన తలలోనాలిక వంటివారు. తీర్పులిచ్చే పెద్దతలలు ఆయనకు గాడ్‌ఫాదర్లయినప్పుడు, ఉత్సవ విగ్రహమైన  గాడ్ ఎంత? అందుకే.. మాజీ ప్రధానులు, ఆయన తనయుడైన పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా లెక్కచేయకుండా, వారిని సాధారణ క్యూ లైన్లలో పంపించిన ఘటికులు.. పాలకుల కుటుంబాలకు నమ్మినబంటుగా ఉన్నారు. అలాంటి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ విద్యలో ఆరితేరబట్టే, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఆయన మాత్రం విజయవంతంగా అన్నేళ్లు, టీటీడీలో తిష్టవేయగలిగారు. రాజు తలచుకుంటే పదవులకు కొదవా?

‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు.. బోర్డులో పనిచేసిన నేతలూ తక్కువేమీ తినలేదు. గతంలో బోర్డు పెద్దగా పనిచేసిన ఓ రాజకీయమ్మన్యుడు.. తన ఢిల్లీ పర్యటనలో వందలకొద్దీ లడ్లను ఎంపీలు, మంత్రులు, అధికారులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచేవారు. ప్రచారమంటే చెవి కోసుకునే సదరు నాయకుడి జమానాలో సినిమా నటులు, ఉత్తరాది పారిశ్రామికవేత్తలు కొండ మీదకు షటిల్ సర్వీసులు చేసేవారు. టీటీడీలో సభ్యత్వమంటే బడా బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయనాయకులతో పరిచయాలకు వేదిక అన్న భావన ఏర్పడి చాలా దశాబ్దాలయింది. ఇక జర్నలిస్టులనే వారికి కొండపైన షాపులు, టికెట్ల కోటాలిచ్చి,  పైన మందుబాటిళ్లు తీసుకువెళ్లినప్పుడే టీటీడీకి విమర్శల మకిలి అంటుకుంది. ఇక దర్శనాలు, రూముల కోసం పడిగాపుల కాసే వారి నుంచి కాసులు తీసుకుని, అవి ఇప్పించే పైరవీకారులు కొండమీద గజానికి పదిమంది.

ఇంతమంది.. ఇన్ని రకాలుగా  శ్రీవారి పేరును, ఆయన ప్రతిష్ఠను చేతనయింత మేరకు ఉద్ధరిస్తున్నపుడు, ఆయన ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచితే తప్పేమిటన్నది ప్రశ్న. శ్రీవారి సేవలో తరించేందుకు నానాపాట్లు పడే భక్తులు, తిరుపతివరకూ రాలేని పేద జనులు.. స్వామి వారి ప్రసాదంతో తరిస్తే అభ్యంతరాలు, దానిపై వివాదం, చచ్చు పుచ్చు చర్చలెందుకో అర్ధం కాదు. గతంలో ఎవరో ఒక అధికారి పరాయి ప్రాంతాల్లో కళ్యాణమండపాల్లో లడ్డూ అమ్మకాలు నిషేధించారు కాబట్టి, ఇప్పుడూ దానినే కొనసాగించాలనడం అవివేకం.

మరి అలాగైతే ఒకప్పుడు టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్యకు, ఇప్పటి సంఖ్యకూ తేడా లేదూ? ఒకప్పుడు దేవుడిపై భయభక్తులు, పాపభీతి ఎక్కువగా ఉన్న వారే బోర్డు సభ్యులుగా ఉండేవారు. తర్వాత జైళ్లకు వెళ్లి వచ్చిన వారు, సారా కాంట్రాక్టర్లు, ఇంకా అనేకమంది సకలకళావల్లభులు బోర్డు సభ్యులు కాలేదూ? లాక్‌డౌన్ సమయంలో దేవరకు ఆన్‌లైన్ పూజలతో, భక్తులకు ఇన్‌స్టాంట్ ముక్తి కలిగించేలా పూజలను కూడా కంప్యూటీకరణ చేశారు. అంటే పురోహితులు లేని అమెరికా, లండన్ లాంటి దేశాలలో, మనవాళ్లు కొత్త ఇంట్లో చేరే సమయంలో గృహప్రవేశం క్యాసెట్టు వేసుకుని విన్నట్లన్న మాట!

మరి అదే స్వామి వారి లడ్డును వాడవాడలా అమ్మించడం ద్వారా, తిరుమలకు వచ్చే ఖర్చులు తప్పించినందుకు.. భక్తుల పక్షాన కొండపైకొలువు దీరిన చైర్మన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు చెప్పకుండా, ఈ విమర్శలేమిటన్నది ప్రశ్న. పైగా హిందూమతంపై పూర్తి పేటెంట్ హక్కులు పొంది,  దేవదేవుడిపై సర్వహక్కులున్న కాషాయదళ నేతలు కూడా, లడ్డూ అమ్మకాలను స్వాగతించిన తర్వాత, ఇక ఆ విధనాన్ని వ్యతిరేకిస్తే కళ్లు పోవూ…?! హేమిటో.. వీళ్లంతా హెప్పుడు మారతారో హేమిటో?

1 COMMENT