ఏబీ సొంత గడ్డపై సంబరాలు

262
కోర్టు ఆదేశంతో గ్రామస్తుల ఆనందం
ఏపీ నిఘా మాజీ దళపతి, సీనియర్ ఐపిఎస్ అధికారి ఆలూరు బాల వెంకటేశ్వరరావుపై, జగన్మోహన్‌రెడ్డి సర్కారు విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. దీనితో  సహచరులు, మిత్రులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. న్యాయం గెలిచిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కూడా చదవండి.. జగన్ సర్కారుకు కోర్టు ఝలక్!
దాన్నలా ఉంచితే.. ఏబీ వెంకటేశ్వరరావు స్వగ్రామమైన నూజివీడు మండలంలోని ముక్కొల్లుపాడులో ఆయనతో స్కూల్‌లో చదువుకున్న మిత్రులు, గ్రామస్తులు.. హైకోర్టులో ఆయన సాధించిన విజయాన్ని  అభినందిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. చాలాకాలం క్రితమే ఏబీ నూజివీడును దత్తత తీసుకున్నారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్, నిఘా దళపతిగా వివిధ శాఖల అధికారులతో తనకున్న పరిచయాలు, సంబంధాలను ఉపయోగించుకుని, గ్రామంలో రోడ్లు, విద్యుత్ స్తంభాలు, మంచినీటి సౌకర్యం కల్పించారు. ఆయన ఏ హోదాలో ఉన్నా నూజివీడు ప్రజలు, స్వగ్రామానికి చెందిన వారు ఆయన వద్దకు వచ్చి తమ సమస్యలు వెళ్లబోసుకుంటారు.
సాధారణ మధ్యతరగతి, ఉపాధ్యాయుల కుటుంబంలో పుట్టిన ఏబీ కష్టపడి ఉన్నత విద్య అభ్యసించారు. తల్లితండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో క్రమశిక్షణ బాగా అబ్బింది. బాలస్వామి మాస్టారుగా పేరున్న తండ్రి వీరభద్రం.. ఆ గ్రామంలో చాలామందికి విద్యాబుద్ధులు నేర్పించారు. పోలీసు శాఖలో చేరి, ఉన్నత స్థానానికి ఎదిగిన ఏబీ.. తన గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికీ కృషి చేస్తున్నారు. దేశంలో తొలి విలేజ్ మ్యూజియం ఏర్పాటుకు ఆయన తన గ్రామంలోనే బీజం వేశారు. ముంబయి త్రిబుల్ ఐటి సహకారంతో శాతవాహనుల కాలం ముందు..  2,6వ శతాబ్దాల నాటి పురావస్తు విగ్రహాలతోపాటు గ్రామ చరిత్రను నిక్షిప్తం చేస్తూ  ఏర్పాటుచేసిన ‘విలేజ్ మ్యూజియం’ ఏర్పాటు వెనుక ఆయన కృషి ఉంది. దాని కోసం నిపుణులను తీసుకువచ్చారు.
విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు విజయవాడ కృష్ణలంకలో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని, ఇప్పటికీ దాని మంచి చెడ్డలు చూస్తున్నారు. ఇప్పుడు విజయవాడ ప్రజలతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి పనులు, వ్యాపారాల కోసం వచ్చే వారి కోసం.. తెల్లవారువరకూ ఆకలి తీర్చే నైట్ ఫుడ్‌కోర్టులు ప్రారంభించింది ఏబీనే.
జగన్మోహన్‌రెడ్డి సర్కారు ఆయనకు ఎలాంటి పోస్టింగు ఇవ్వకపోగా, కుమారుడి కంపెనీకి సంబంధించిన లావాదేవీలలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగంపై సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ఆయన దేశద్రోహానికి పాల్పడ్డారన్న కోణంలో కొన్ని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఇది కూడా చదవండి.. ‘దేశద్రోహమా..? దొండకాయనా’? ఆ సమయంలో  ఆయన మిత్రులు మనోస్ధైర్యం ఇచ్చారు.  సహజంగా సొంత శాఖతోపాటు, బయట కూడా లెక్కకుమించిన మిత్రులున్న ఏబీ వెంకటేశ్వరరావు మంచి రచయిత, తెలుగు భాష, సాహిత్యంపై పట్టు ఉందన్న  విషయం చాలామందికి తెలియదు.