జగన్ సర్కారుకు కోర్టు ఝలక్!

622

సుప్రీంకోర్టులోనూ చుక్కెదురే
హైకోర్టులో ఒకేరోజు మూడు వ్యతిరేక తీర్పులు
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత
ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశం
రంగులు, వలస కూలీలపై సర్కారు వ్యతిరేక తీర్పులు
మరి.. మొండిగా వెళతారా? మార్పు కోరుకుంటారా?
జగన్ సర్కారుకు కొనసాగుతున్న అవమాన  పర్వం
(మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రభుత్వాలు గతి తప్పినప్పుడు.. పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే,  కోర్టులు జోక్యం చేసుకోవడం సహజం. కానీ ఏపీలో మాత్రం సర్కారు ప్రతిసారీ గతి తప్పుతుంటే, ప్రతిసారీ జోక్యం చేసుకుంటున్న వైచిత్రి కనిస్తోంది. ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకోలేకపోతే పౌరులు-బాధితులకు దిక్కుండదు.  రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, పౌరులు  ఈమాత్రమయినా అనుభవిస్తున్నారంటే.. దానికి కారణం న్యాయస్థానాలే. అవి కూడా లేకపోతే బాధితుల ఆవేదన, అరుపులు అరణ్యరోదనే అయ్యేది.

గతి తప్పుతున్న సర్కారుకు కోర్టుల కళ్లెం..

కానీ, ఏపీలో ప్రభుత్వం ప్రతిసారీ గతి తప్పుతుండటం, కోర్టు తీర్పులను కూడా సవాల్ చేసే స్థితికి చేరడం, చివరకు కోర్టుల విశ్వసనీయతపై బురద చల్లించే అడ్డదారి ప్రయత్నాలు జరుగుతుండంతో.. ప్రతిసారీ కోర్టులు జోక్యం చేసుకుని అక్షింతలు వే సి, సర్కారు నిర్ణయాలకు కళ్లెం వేస్తున్న అనివార్య పరిస్థితి  ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చూస్తున్నాం. ఇప్పటివరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వరస వెంట వరస కోర్టుల్లో ఎదురుదెబ్బలు తిన్న పాలకులు ఎవరూ లేరు. చివరకు ఆరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, ప్రజాభిమానం సంపాదించుకుని మహానేతగా అందరి గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జమానాలోనూ, ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదు. సహజంగా.. ఇలాంటి అవమానకర పరిస్థితిలో, సీనియర్ రాజకీయ నాయకులెవరైనా ముఖ్యమంత్రుల స్థానంలో ఉంటే, నైతిక బాధ్యత వహిస్తూ, తీర్పులపై మనస్తాపంతో వెంటనే రాజీనామా చేసి ఉండేవారు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్‌రెడ్డి! ఇదికూడా చదవండి.. కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా?

ఎదురుదెబ్బల ‘ఏడాది’..

మరికొద్దిరోజుల్లో ఏడాది పాలన పూర్తి చేసుకుని, విజయోత్సవాలు చేసుకోనున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు.. ఏపీ హైకోర్టు ఒకేరోజు మూడు అంశాలపై ఇచ్చిన వ్యతిరేక తీర్పులు బహుమానంగా భావించాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే దాదాపు 60 సందర్భాల్లో జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులిచ్చింది. కొన్ని కీలకమైన కేసుల్లో జగన్ సర్కారు, హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకెళ్లినా.. అక్కడ కూడా హైకోర్టు తీర్పునే ఖరారు చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై అక్షింతలు వేసిన సందర్భాలున్నాయి. ఇదికూడా చదవండి.. ఏమిటీ నిర్ణయాలు? ఎందుకీ తొందర?

రంగుల జీఓ రద్దు నుంచి…

ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయితీలకు వైసీపీ రంగులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తొలగించాలని ఆదేశించింది. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ‘దేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయరంగు వేస్తే ఊరుకుంటారా?’ అని అక్షింతలు వేసింది. మళ్లీ ఇదే  అంశంపై కోర్టు తాజాగా.. ప్రభుత్వం ఇచ్చిన 623 జీఓను కోర్టు రద్దుచేసింది. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీది కాదన్న ప్రభుత్వ వివరణపై సంతృప్తి చెందలేదు.  సుప్రీంకోర్టు-హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను, ప్రభుత్వం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని స్పష్టం చేయడం.. జగన్మోహన్‌రెడ్డి సర్కారు దూకుడుకు కళ్లెం వేసినట్టయింది. తెలుగు మీడియంపై హైకోర్టు జగన్ సర్కారు దూకుడుకు ముకుతాడు వేసినా, మరో మార్గంలో జగన్ సర్కారు తన పంతం నెరవేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. న్యాయవ్యవస్థను సవాల్ చేసేలా ఉన్నాయన్న విమర్శలకు గురవుతోంది.ఇదికూడా చదవండి.. 11నెలలు..55 అక్షింతలు! 

నిమ్మగడ్ట నుంచి.. వలస కూలీల వరకూ అన్నీ ఎదురుదెబ్బలే..

ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులను ఆదుకనేందుకు చర్యలు తీసుకోవాలని, ఆమేరకు జాతీయ రహదారులపై మంచినీరు, ఆహారం వైద్యసదుపాయాలు కల్పించి, ఆ వివరాలు తమకు ముందుగా తెలపాలని జగన్ సర్కారును ఆదేశించింది. వలస కార్మికుల పేర్లు నమోదు చేసుకున్న 48 గంటల్లోగా, వారికి బస్సులు ఏర్పాటుచేసి పంపించాలని ఆదేశించింది. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తే వారు అక్కడ ఉండకుండా, ఎందుకు నడుచుకుంటూ వెళతారని ఎదురు ప్రశ్నించింది.

‘సుప్రీం’లోనూ సర్కారుకు ఎదురుదెబ్బలే..

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది.దానిని సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగా,సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధించింది.. తాజాగా పోతిరెడ్డిపాడుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బ్రేకులు వేసింది. దాని సామర్థ్యం పెంచుతూ జగన్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వుపై స్టే విధించింది. మద్యం అమ్మకాలపై వేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా.. మద్యం షాపులపై లేని నియంత్రణ, కిరాణాషాపులకు ఎందుకని ప్రశ్నించింది.  ఇది కూడా చదవండి.. అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దెబ్బ!

సుధాకర్ వ్యవహారం సీబీఐకి..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్‌పై జరిగిన దాడిని సుమోటోగా తీసుకున్న హైకోర్టు, వాస్తవాలేమిటో తెలుసుకోవాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. దానితోపాటు డాక్టర్‌ను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఆ వ్యవహారంపై అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై, కేసు నమోదు చేసి విచారించాలని సీబీఐని ఆదేశించడం జగన్ సర్కారుకు అప్రతిష్ఠ తెచ్చింది. ఒక సంఘటనకు సంబంధించి కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడమంటే ప్రభుత్వానికి అప్రతిష్ఠగానే భావించాల్సి ఉంటుంది. పైగా.. డాక్టర్ సుధాకర్ శరీరంపై గాయాలున్న విషయాన్ని మేజిస్ట్రేట్ నివేదికల్లో ఉంటే, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఆ ఊసే లేదని వ్యాఖ్యానించడం బట్టి.. కోర్టు ప్రభుత్వ నివేదికను నమ్మలేదన్నది స్పష్టమయింది.

ఏబీ సస్పెన్షన్‌పై ఎదురుదెబ్బ!

తాజాగా నిఘా మాజీ దళపతి, డిజిపి స్థాయి అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై సర్కారు విధించిన సస్పెన్షన్‌ను కొట్టివేయడం సంచలనం సృష్టించింది.  ఆయనకు తిరిగి పోస్టింగు, వేతనం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ తప్పులతడక, తొందరపాటు, కక్షసాధింపు అన్న సంకేతాలిచ్చాయి. సమర్ధుడు, సంస్కరణవాది, నిజాయితీపరుడిగా పేరున్న ఏబీ వెంకటేశ్వరరావుకు.. జగన్ సీఎం అయిన తర్వాత ఎలాంటి పోస్టింగు ఇవ్వకపోగా, ఆయన కుమారుడి కంపెనీ నుంచి కొనుగోలు చేసిన భద్రతాపరికరాలలో అక్రమాలు జరిగాయంటూ విచారణ కమిటీని వేసింది. కానీ ఏడాది కాలంలో దానిని నిరూపించలేకపోయింది. ఇది కూడా చదవండి.. దేశ ద్రోహమా?.. దొండకాయనా?

ఆ రెండు ఆరోపణలతోనే సస్పెన్షనా..?

అయితే, దానిపై ఆయన క్యాట్‌కు వెళ్లగా, అక్కడ ఏబీకి సానుకూల తీర్పు రాలేదు. దానితో హైకోర్టును ఆశ్ర యించగా, తాజాగా  హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును కొట్టివేయడంతోపాటు, ఆయనపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి, తిరిగి ఆయనకు పోస్టింగ్, వేతనం చెల్లించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సస్పెండయిన ఐపిఎస్‌లకు సంబంధించినంత వరకూ,  ఒక  అధికారికి మళ్లీ పోస్టింగు ఇవ్వడం ఇదే ప్రధమం. పోలీసు బాసుల మధ్య వర్గవిబేధాలు, అధిపత్యపోరు, అంతర్గత రాజకీయాలు ఎన్ని ఉన్నప్పటికీ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఇప్పటివరకూ, ఒక్క ఆరోపణ లేదు. చంద్రబాబుకు నమ్మకమైన మనిషి, టీడీపీ ముద్ర అనే రెండు ఆరోపణలు తప్ప, ఆయనను సస్పెండ్ చేసేంత కారణాలు లేవన్నది ఆ శాఖలో వినిపించే వ్యాఖ్యలు. అయినా.. ఆయనను జగన్ సర్కారు సస్పెండ్ చేయడంపై, పోలీసు వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమయింది. ఇది కూడా చదవండి.. సస్పెండ్ ఏల?.. సొమ్ములివ్వడమేల?

ఏబీకి ఏ పోస్టింగ్ ఇస్తారో?…

వరంగల్‌లో ఇప్పటి డిజిపి గౌతంసవాంగ్ ఎస్పీ-ఏబీ ఓఎస్డీగా కలసి పనిచేశారు. ఏపీఎస్పీలో కూడా ఇద్దరూ ఐజి-డిఐజీగా కలసి పనిచేశారు. కానీ తర్వాత వారిద్దరి ఏ కారణం వల్లనో వారి మధ్య దూరం పెరిగింది. ప్రస్తుతం శాఖలో వారిద్దరూ ఉత్తర-దక్షిణ ధృవాలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు, ఏబీకి పోస్టింగు ఇవ్వాల్సిన సర్కారు.. ఆయనకు ఏ స్థాయి పోస్టింగ్ ఇస్తుంది? ఈ విషయంలో డీజీపీ వైఖరి ఎలా ఉండబోతుందన్న  ఉత్కంఠ నెలకొంది. సహజంగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందన్న ఆగ్రహంతో ప్రభుత్వం లూప్‌లైన్ పోస్టింగ్ ఇస్తుంటుంది. రైల్వే, ఫైర్ సర్వీస్, నేషనల్ హైవేస్ వంటి పోస్టింగులలో ఒకటి ఇవ్వడం ద్వారా, ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. డీజీపీతో సత్సంబంధాలు లేనందున, ఏబీకి లూప్‌లైన్ పోస్టింగే ఇవ్వవచ్చని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వరస వ్యతిరేక తీర్పుల వల్ల పాలకులలో మార్పు వస్తే, ఆయనకు మంచి పోస్టింగు దక్కవచ్చు.  కానీ ఈ ప్రభుత్వంలో దానిని ఊహించడం అత్యాశే అవుతుందంటున్నారు.

సుప్రీంకు వెళ్లే సాహసం చేస్తారా?

కాగా ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ, తిరిగి ఆయన పోస్టింగ్ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను జగన్ సర్కారు అమలు చేస్తుందా? లేక ప్రతిష్ఠకు వెళ్లి మునుపటిలా సుప్రీంకోర్టుకు వెళుతుందా అన్న చర్చ పోలీసు శాఖలో జరుగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ గ్రైబ్యునల్ వంటి జాతీయస్థాయి విచారణ సంస్థలలో, జగన్ సర్కారుకు వరస వెంట వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే సుప్రీం కోర్డు కూడా ఖరారు చేస్తోంది. ఈ నేపథ్యంలో, జగన్ సర్కారు.. మళ్లీ అనవసర ప్రతిష్ఠకు పోయి, మరోసారి చేదు అనుభవం కొనితెచ్చుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. హైకోర్టు ఎలాగూ తీర్పు ఇచ్చింది కాబట్టి.. ఏబీకి ఎలాంటి ప్రాధాన్యం లేని పోస్టింగ్ ఇవ్వడం ద్వారా, ఉన్న పరువు కాపాడుకోవడమే తెలివైన పని అని మరికొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రవీణ్.. మిగిలిన అధికారుల పోస్టింగుల మాటేమిటి?

కాగా, జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. పోస్టింగులు లేకుండా వెయిటింగ్‌లో ఉంచిన, మిగిలిన పోలీసు అధికారుల విషయంలోనయినా జగన్ సర్కారు కళ్లు తెరుస్తుందా? అన్న చర్చకు తెరలేచింది. ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న కోయ ప్రవీణ్‌ను తప్పించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. కమ్మ వర్గానికి చెందిన అధికారి అన్న ముద్రనే దానికి కారణం. నిజానికి ప్రవీణ్‌కు తెలుగుదేశంతో పెద్ద సంబంధం, అంత అనుబంధం కూడా లేదు. ఆయన ప్రకాశం ఎస్పీగా ఉన్నప్పుడు వైసీపీ నేతలతో కూడా సత్సంబంధాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూడా టీడీపీ నేతలకు, ఆయన చేసిన సాయం కూడా లేదు. కానీ, కమ్మ ముద్రనే ఆయన కొంపముంచింది. ఇంకా ర్యాంకర్లు, డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులు చాలామందిని.. టీడీపీ అనుకూలురన్న ముద్ర వేసి వారికి పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు. కమ్మ వర్గానికి చెందిన పలువురు అధికారులకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వలేదన్న విమర్శ ఉంది. తాజా హైకోర్టు తీర్పు తర్వాతయినా, జగన్ ప్రభుత్వంలో మార్పు వచ్చి,  వారికి పోస్టింగులు దక్కుతాయోమో చూడాలి.

4 COMMENTS

  1. […] ఏపీ సీఎం జగన్ సర్కారు ఇటీవలి కాలంలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను కొట్టివేస్తూ, హైకోర్టు ఒకేరోజు మూడు తీర్పులు వెలువరించింది. దానిపై సగటు ప్రజలలో కోర్టులపై మరింత గౌరవం పెరిగింది. ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తే కొరడా ఝళిపించి.. బాధితులను, న్యాయాన్ని కాపాడేందుకు కోర్టులు ఉన్నాయన్న భరోసా నింపింది. ఒకవేళ కోర్టులు లేకపోతే తమకు దిక్కెవరని, ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టేదెలా అన్న ఆలోచనకు ఈ నిర్ణయం ప్రాణం పోసింది. ఇది కూడా చదవండి.. జగన్ సర్కారుకు కోర్టు ఝలక్! […]

  2. […] ఇక ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగా జరిగిన నిర్ణయమన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఆయనపై నాడు వైసీపీ నేతలు వ్యక్తిగతంగా ఆరోపించి, ఫిర్యాదు కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిపాటు, ఆయనకు పోస్టింగు, వేతనం ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. మరి  ప్రభుత్వం.. ఆ ఏడాది కాలంలో ఆయనపై మోపిన అభియోగాలను, ఎందుకు నిరూపించలేకపోయిందన్న ప్రశ్న, సహజంగా సామాన్యుడికే వస్తుంది? ఎవరికైనా వస్తుంది. చట్టాలు తెలిసిన న్యాయాధికారులకు మాత్రం ఎందుకు రాదు? ఇదికూడా చదవండి.. జగన్ సర్కారుకు కోర్టు ఝలక్! […]

  3. I’ve been surfing online greater than three hours these days, but I never discovered any attention-grabbing article like yours. It is lovely value sufficient for me. In my view, if all website owners and bloggers made good content as you did, the net can be much more helpful than ever before.