సమరమా.. శరణమా?

612

కేంద్ర ప్యాకేజీపై జగన్ దారెటు?
కేసీఆర్‌కు భిన్న స్వరమా? అనుకూల గ ళమా?
ఎఫ్‌ఆర్‌బీఎం, విద్యుత్ సంస్కరణలు, ప్యాకేజీపై జగన్ వైఖరేమిటో?
జగన్ వైఖరితోనే ఈసీఈఏ ఏర్పాటు?
ఇప్పటిదాకా స్పందించని సీఎం జగన్
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఇటీవల నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం దేశప్రజలకు ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై వివిధ రాజకీయ పార్టీలు తలోరకంగా స్పందించాయి. ప్రధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్యాకేజీపై ఒంటికాలితో లేచారు. అదొక పనికి మాలిన ప్యాకేజీ అని దునుమాడారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ షరతులపై అగ్గిరాముడయ్యారు. ఆ దిక్కుమాలిన ప్యాకేజీలతోపాటు, కేంద్రం ఇచ్చే 2500 కోట్లు అవసరం లేదని నిర్మొహమాటంగా తిరస్కరించారు. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణలపై కేసీఆర్ మండిపడ్డారు.  మరి.. ఆయన రాజకీయ శిష్యుడైన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఇప్పటిదాకా ఆ ప్యాకేజీపై స్పందించలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ షరతులతోపాటు, విద్యుత్ సంస్కరణలను ఆయన  స్వాగతిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా అని కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో, సహజంగానే ప్యాకేజీపై ఏపీ సర్కారు స్పందన ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

కేంద్రప్యాకేజీపై భిన్నస్వరాలు..

కరోనా నేపథ్యంలో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకునేందుకు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దానిని కాంగ్రెస్, వామపక్షాలు, వివిధ ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయి. అదొక దగా ప్యాకేజీగా అభివర్ణించాయి. వాటిపై బీజేపీ జాతీయ నేతలు ఎదురుదాడి చేశారు. వీటిని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు, తమకు కమిషన్లు రావన్న ఆందోళనతోనే ఆక్షేపిస్తున్నారని ప్రత్యారోపణలు చేశారు.

కేంద్రంపై కేసీఆర్ సమరనాదం..

ప్రధానంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రప్యాకేజీ, విద్యుత్ సంస్కరణలు, ఎఫ్‌ఆర్‌బీఎం రుణ షరతులను తార్పూరపట్టారు.  అసలు దీనిని ప్యాకేజీ అంటారా అని నిలదీశారు. శిశుపాలుడి పాపాలతో కేంద్ర నిర్ణయాన్ని పోల్చారు.  ‘ఎఫ్‌ఆర్‌బీఎం రుణం రెండు శాతం పెంచడం వల్ల, తెలంగాణకు 20వేల కోట్ల రూపాయల అదనపు రుణం మాత్రమే వస్తుంది. దాని షరతులు చూస్తే నవ్వుతారు. ఆ బాకీ చెల్లించుకోవలసింది ప్రభుత్వమే. అవి తెచ్చుకోవాలంటే కేంద్రం పెట్టిన దరిద్రపు షరతులన్నింటినీ ఒప్పుకోవాలి. ప్రజలమెడపై కత్తి పెట్టి విద్యుత్ సంస్కరణలు తెస్తే, 2500 కోట్లు ఇస్తారంట. ఇది సమాఖ్య వ్యవస్థలో అనుసరించే పద్ధతి కాదు. మార్కెట్ కమిటీల్లో సంస్కరణలు తెస్తే ఇంకో 2500 కోట్లు ఇస్తారంట. మునిసిపాలిటీల్లో పన్నులు పెంచితే 2500 కోట్లు ఇస్తారంట. దీనిని ప్యాకేజీ అంటారా? అన్ని అధికారాలు కేంద్రమే తీసుకుంటే, ఇక రాష్ట్రం ఎందుక’ని కేసీఆర్  కేంద్రంపై సమర శంఖం పూరించారు. ఆయన ఆరోపణలు, వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపి  బండి సంజయ్‌కుమార్ ఎదురుదాడి చేశారు. ఇదికూడా చదవండి.. రుణం.. రణం.. జల జగడం!

కేంద్ర నిర్ణయంపై జగన్ మౌనరాగం..

అయితే, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈ విషయంలో ఇప్పటివరకూ ఎక్కడా స్పందించకపోవడం చర్చనీయాంశమయింది. అయితే, ఆయన దానిపై మంత్రి కన్నబాబు అధ్యక్షతన ఒక కమిటీ వేసి, సమీక్షకు ఆదేశించారు. ఈ విషయంలో జగన్.. తన రాజకీయగురువైన కేసీఆర్ దారిలోనే.. కేంద్రంపై తిరగబడతారా? లేక అంగీకరించి సర్దుకుపోతారా అన్న అంశంపై ఆసక్తినెలకొంది. కేసీఆర్ ఆందోళన ప్రకారమయితే, కేంద్ర ప్యాకేజీ రాష్ట్రానికి నష్టం. దానివల్ల కొత్తగా వచ్చేదేమీ లేదు. అలాగే విద్యుత్ సంస్కరణల వల్ల వినియోగదారుడిపై భారం పడుతుందన్నది ఆయన ఆందోళన. అన్ని అధికారాలు కేంద్రమే తీసుకుంటే, ఇక రాష్ట్రాలు ఎందుకన్న కేసీఆర్ అభిప్రాయంతో, ఆయన శిష్యుడు జగన్ ఏకీభవిస్తారా? వ్యతిరేకిస్తారా? అన్నది చూడాలి.

వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర సీఎంలు..

విద్యుత్ సంస్కరణలను దాదాపు బీజేపీయేతర ముఖ్యమంత్రులంతా వ్యతిరేకిస్తున్నారు. కానీ, కార్యదర్శుల సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో,  సంస్కరణలను రాష్ట్రాల కార్యదర్శులు అంగీకరించారన్న నిజాన్ని.. బీజేపీ నేతలు బయటపెట్టడం ఆసక్తికరంగా మారింది. తెలగాంగాణ బీజేపీ నేతలు సైతం కేసీఆర్‌ను ఇదే అంశంపై నిలదీశారు. కేంద్రం నిర్వహించిన సమావేశంలో అంగీకరించి, ఇప్పుడు వ్యతిరేకించడం ఏం న్యాయమని ప్రశ్నించారు.

విద్యుత్ సంస్కరణలు సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?..

విద్యుత్ సంస్కరణలను చాలారాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్ధిక భారం పడటంతోపాటు, రాష్ట్రాల హక్కులను వదులుకోవలసి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ముసాయిదా బిల్లుపై,  వచ్చే నెల 5వ తేదీలోగా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఏపీలో ఇదీ లెక్క..

ఏపీలో 17.72 లక్షలు, తెలంగాణలో 25 లక్షల వ్యవసాయ విద్యుత్  కనెక్షన్లు ఉన్నాయి. ఈ సంస్కరణలు ఆమోదిస్తే తమపై పడే ఆర్ధిక భారం ఎక్కువే అని, తెలంగాణ సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం గ్యాస్ విషయంలో వినియోగదారుడు ముందు డబ్బు పూర్తిగా చెల్లించాలి. తర్వాత బ్యాంకు ద్వారా రాయితీ సొమ్ము నగదు బదిలీ అవుతుంది. ఇప్పుడు కేంద్రం రూపొందించిన ముసాయిదా కూడా ఇలాగే ఉంది. ఆ ప్రకారంగా వినియోగదారుడు మొత్తం కరెంటు బిల్లును కట్టాల్సి వస్తుంది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు రాయితీని, తమకు వీలున్నప్పుడు చెల్లిస్తూ వస్తోంది. ఇకపై వినియోగదారుడు బిల్లు కట్టిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు తానిచ్చే రాయితీని నేరుగా వినియోగదారుడి ఖాతాలో జమచేయవలసి ఉంటుంది. ఇది రాష్ట్రాలపై పెను భారం పడుతోందని తెలంగాణసర్కారు ఇప్పటికే వాదిస్తోంది.

కొత్త మీటర్లకు కాసులున్నాయా?..

ఇకపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పూర్తి స్థాయి విద్యుత్ చార్జీలను ప్రకటించాల్సి ఉంటుంది. పైగా రాష్ట్రంలో ఎన్ని లక్షల వ్యవసాయ బోరు కనెక్షన్లకు మీటర్లు బిగించాల్సి ఉంటుంది. ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో 17.72 లక్షల వ్యవసాయ బోరు కనెక్షన్లు ఉండగా, వాటిని కొత్త నిబంధనల ప్రకారం, 266 కోట్లతో కొత్త మీటర్లు బిగించాల్సి ఉంటుంది. అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న సర్కారుకు అది సాధ్యమవుతుందా అన్నదే ప్రశ్న.

ఇకపై పీపీఏలన్నీ కేంద్రం అజమాయిషీలోనే..

ప్రధానంగా ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో ఉన్న ఈఆర్‌సీకే ఉన్నాయి. విద్యుత్ కొనుగోలులో తమకు నచ్చిన కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు, పీపీఏల అమలు, అమ్మకాలపై నిర్ణయాధికారాలన్నీ దానికే ఉన్నాయి. ఈ  పద్ధతికి కొత్త విధానం చరమగీతం పలకనుంది. ఫలితంగా ఇకపై అవన్నీ.. జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసే ‘విద్యుత్ కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మండలి’ (ఈసీఈఏ)చేతిలోకి వెళ్లిపోతాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పీపీఏలను సమీక్షించడం, పాతబకాయిలను చెల్లించకపోవడం వంటి విధానాలను, ఏపీలో జగన్  సర్కారు పాటిస్తున్న ఫలితంగానే.. ఈ పద్ధతి ప్రవేశపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.  ఆ అంశంపై విదేశీ కంపెనీలతోపాటు, పెద్ద సంస్థలన్నీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. జగన్ సర్కారు విధానంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి కూడా, పార్లమెంటులోనే అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది. బీజేపీ రాష్ట్ర శాఖ కూడా పీపీఏలను సమీక్షిస్తామన్న జగన్ నిర్ణయాన్ని తూర్పారపట్టింది. ఇకపై  రాష్ట్ర ప్రభుత్వాల వేధింపులు లేకుండా, కొత్త విధానంలో పెట్టుబడిదారులకు కేంద్రం ఇకపై అభయమివ్వనుంది.

మరి కేంద్రంపై  రణమా.. రాజీనా?..

ఈ నేపథ్యంలో జగన్.. కేంద్రం తీసుకురానున్న కొత్త విద్యుత్ సంస్కరణలను స్వాగతిస్తారా? లేక తన రాజకీయ గురువైన కేసీఆర్‌తో కలసి కేంద్రంపై సమరం సాగిస్తారా? ఎఫ్‌ఆర్‌బీఎం రుణ షరతుపై ఆగ్రహించిన కేసీఆర్, తమకు కేంద్రం ఇచ్చే 2500 కోట్ల రూపాయలు అవసరం లేదని తిరస్కరించినట్లే.. జగన్ కూడా ఆ ప్యాకేజీల పెట్టిన షరతులను వ్యతిరేకించి, తన పోరాటవైఖరిని స్పష్టం చేస్తారా? లేక కేంద్రంతో తనకున్న అనేకానేక మొహమాటాలకు భయపడి సర్దుకుపోతారా? అన్నది ఉత్కంఠగా మారింది.