విషాద..వివాద..విపత్తుల..విచార.. విశాఖ!

345

విశాఖకు కలసిరాని వాస్తు?
‘వృక్షమిత్ర’ నుంచి విషవాయువు వరకూ
మునిసిపాలిటీల స్థాయికి చేరిన మహానగరం
చెరుగుతున్న క్లీన్‌సిటీ ముద్ర
కాలుష్యం కోరలో సిటిజనం
భూ దందాలతో జనం బెంబేలు
విశాఖలో అడ్డపంచెల హల్‌చల్
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఈ నగరానికి ఏమయింది? ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి, చెత్తా చెదారం. ఎక్కడ చూసినా భూకబ్జా ఆరోపణలు. లీకవుతున్న విషవాయువు. తుపాన్లు సృష్టించే వైపరీత్యాలు. ఒకప్పుడు వృక్షమిత్ర అవార్డు అందుకున్న నగరానికి చెత్తలో చివరి అవార్డు. ఈ నగరానికే ఎందుకీ శాపం? ఈ నగరం చేసిన పాపమేమిటి? ఈ మహానగరానికి వాస్తు కలసిరావడం లేదా? ఇదీ.. రాజధాని కోసం ముస్తాబవుతున్న..  విషాద, వివాద..విచార..విపత్తుల విశాఖ అసలు సిసలు స్వరూపం.

పాపం.. విశాఖ!

విశాఖకు వాస్తు సరిగ్గా లేదా? లేక వాస్తుకు వ్యతిరేకంగా విశాఖలో వ్యవహారాలు నడుస్తున్నాయా? అదీ కాకపోతే దుష్టగ్రహాలు  ఆవహించాయా? ఇవేమీ కాకపోతే, దైవాశీస్సులు మహానగరానికి మహాదూరంగా ఉన్నాయా? లేకపోతే.. ప్రశాంతత, ఆహ్లాదం, పర్యాటకానికి నిలువెత్తు చిరునామాగా ఉన్న విశాఖ నగరం.. ఇలా ఆర్తనాదాలు, కాలుష్యపు కేకలు, తుపాను హోరు సృష్టించిన అరుపులతో ఎందుకు ప్రతిధ్వనిస్తుంది? ఇప్పుడు సగటు విశాఖ జీవి వాపోతున్న వైనమిది. ఇది కూడా చదవండి.. ‘విశాఖకు.. ‘విశాఖస్వామి’ వారి ఆశీస్సులు లేవా?’

విశాఖలో అడ్డపంచెల విజృంభణ..

పీస్‌ఫుల్ సిటీగా పేరున్న విశాఖ, ఇప్పుడు పీస్‌లెస్ సిటీగా మారింది. బీచ్ అందాలు, పర్యాటకుల హడావిడి, పరిశ్రమ సైరన్లు, సానుకూల మనస్తత్వంతో ఆలోచించే పౌరులకు నెలవైన విశాఖ నగరం.. ఇప్పుడు కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భూములు వారి పేరు మీదే ఉంటాయి. కానీ అవి వారి అధీనంలో ఉండవు. వెళ్లి వాటిని చూసుకునే వరకూ అనుమానమే. బలవంతుల దౌర్జన్యాల ముందు, బలహీనుల స్వరాలు పీలగా మారుతున్నాయి. ఇప్పుడు విశాఖ చుట్టూ ఎక్కడ చూసినా సీమ అడ్డపంచెలే దర్శనమిస్తున్నాయి. విశాఖ నగరంలో తెల్ల పంచెలు తిష్టవేసి, ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

ప్రముఖుల భూములే కబ్జా..

స్వయంగా ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన ‘ఆరోగ్యసేతు యాప్’ సృష్టికర్తకు చెందిన భూమినే కబ్జా చేసిన వైనంతో.. ఇక తమ గతేమిటని విశాఖవాసులు బిత్తరపోయారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సొంత భూమినే ఆక్రమించుకునే ప్రయత్నం చేశారంటే, ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. విశాఖలో డాక్టర్ ఆదినారాయణరావుకు మంచి వైద్యుడిగా పేరుంది. ఎన్నికల సమయంలో ఏ పార్టీ అయినా సరే, ఆయనను తమ పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఒత్తిడి చేస్తుంటాయి. అలాంటి డాక్టర్ సొంత భూమి కబ్జా అయిపోయింది. నాటి మంత్రి దగ్గరకు వెళ్లి తన గోడు చెప్పుకుంటే, సదరు మంత్రి గారు చూసాన్తన్నారు.
విచిత్రంగా, మంత్రిగారిని కలసిన మరుసటిరోజున.. డాక్టర్ భూమితోపాటు, ఆ పక్కనే ఉన్న భూమితో కలిపి కొత్తగా ఫెన్సింగ్ వేసి కనబడింది. ఇలా.. ప్రభుత్వం-పార్టీలు మారినా కబ్జా సంస్కృతి మాత్రం మారలేదు.  విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో తమ భూములను 22ఏ నుంచి తప్పించమంటూ, దాదాపు 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక తమ భూములు కాపాడమని పెట్టుకున్న దరఖాస్తులకు లెక్కనే లేదు.

ఎల్జీ ఘటనతో ‘మహా’ మచ్చ..

తాజాగా విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో.. లీకయిన విష వాయువు 12 మందిని మింగేయగా, వందలమంది ఆసుపత్రుల పాలయ్యారు. దీనిపై ప్రధాని,  ఉప రాష్ట్రపతి వంటి దేశ ప్రముఖులంతా దిగ్భ్రమచెందారు. ఈ ఘటన విశాఖ ప్రతిష్ఠకు మచ్చ తీసుకురాగా, కొన్నేళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దె బ్బతింది. ఇప్పటివరకూ ఈ ఘటను కారణమయిన కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేయలేదు. పైగా నిరసన ప్రకటించిన బాధితులపై మాత్రం కేసులు పెట్టడం విస్మయపరిచింది. కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఖరీదైన భూములను స్వాధీనం చేసుకునేందుకు, పైస్థాయిలో కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామికంగా విశాఖలో..  1996లో హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో జరిగిన పేలుళ్ల తర్వాత, తాజాగా లీకయిన గ్యాస్ ఘటనే అతి పెద్దది.

హుద్ హుద్ ముందు.. తర్వాత!

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వచ్చిన హుద్‌హుద్ తుపానుతో, విశాఖ చిగురుటాకుల్లా వణికిపోయింది. ప్రకృతి సృష్టించిన ఆ ప్రళయం విశాఖ రూపురేఖలను సమూలంగా మార్చేసింది. ప్రకృతి వైపరీత్యాలతో సహవాసం చేస్తున్న విశాఖ సిటిజనులు, ఆ ఘటనతో బే జారెత్తారు. కానీ, ఆ ఘటన తర్వాత విశాఖ స్వరూపం మొత్తం మారింది. నాటి సర్కారు దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నగరాన్ని పునర్మిర్మాణం చేసింది. మళ్లీ దాని తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం..  దానిని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత జరిగిన అతిపెద్ద ఘటన, ఎల్జీపాలిమర్స్ గ్యాస్ లీకేజీనే. దీనితో విశాఖ ప్రమాదపుటంచున ఉందన్న విషయం స్పష్టమయింది. ఈ క్రమంలో..  ఏపీ సీఎం జగన్ ఈనెలాఖరున, విశాఖలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటుచేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

విశాఖ చరిత్ర ఘనమే..

విశాఖ చరిత్ర ఘనమైనదే. డివి సుబ్బారావు, కెప్టెన్ ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి మేయర్లుగా పనిచేసిన కాలంలో, విశాఖకు సుందరనగరంగా పేరుంది. విశాఖ నగరాన్ని చూసిన దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు.. అక్కడ గ్రీనరీని మరింత అభివృద్ధి చేస్తే, నగరం సుందరనందనం అవుతుందని భావించారు. దానితో నాటి కమిషనర్ పి.కె. మహంతిని ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి, ఆ ప్రణాళిక వివరించారు. తర్వాత విశాఖ గ్రీనరీకి కేరాఫ్ అడ్రసయింది. ఫలితంగా విశాఖ క మిషనర్ మహహంతి జాతీయ స్థాయిలో వృక్షమిత్ర అవార్డు సాధించారు. దానికి విశాఖ పౌరుల్లో ఉన్న చైతన్యం కూడా కారణం. హుద్‌హుద్ తుపాన్ తర్వాత.. రోడ్డుపై చెత్త వేస్తే ఫైన్ వేసే విధాన ం పౌరుల్లో బాగా చైతన్యం తీసుకువచ్చింది.

స్టార్ రేటింగ్‌లో చివరి వరసలో మహానగరం..

కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా.. కేంద్రం 2019-2020 సంవత్సరానికి గాను ఇచ్చిన స్టార్ రేటింగ్‌లో, విశాఖ చివరి స్థానంలో నిలవడం విశాఖ క్లీన్‌సిటీ పేరును, బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసినట్టయింది. కేంద్రం ప్రకటించిన 5 స్టార్లలో ఏపీకి చోటు లభించకపోవడం ఒక వార్తయితే, అందులో క్లీన్‌సిటీగా పేరున్న విశాఖకు స్టార్-1 కేటగిరీలో స్ధానం ద క్కడం అందరినీ విస్మయపరిచింది. అంటే పలమనేరు, చీరాల, సతె్తనపల్లి మున్సిపాలిటీలతో సమానంగా.. విశాఖను కూడా స్టార్-1లో చేర్చారంటే, విశాఖ ఇమేజ్ ఏ స్థాయిలో పడిపోయిందో, అక్కడ పారిశుధ్ధ్యం ఎంత అధ్వానంగా ఉందో  అర్ధం చేసుకోవచ్చు.

మున్సిపాలిటీ స్థాయికి దిగజారిన మహానగరం…

తాజాగా కేంద్రం ఇచ్చిన రేటింగ్‌తో, 25-30 వార్డులు ఉండే మునిసిపాలిటీలకు.. 24 లక్షల జనాభా, 4 వేల రూపాయల బడ్జెట్, 98 డివిజన్లు, కేంద్రసంస్థల ఆదాయం, పెద్ద పెద్ద పరిశ్రమలు, నౌకాదళకేంద్రం ఉన్న విశాఖకు పెద్ద తేడా లేకుండా పోయింది. ఇదే విశాఖకు 2016లో ఫైవ్‌స్టార్ రేటింగ్ రాగా, ఇప్పుడు మాత్రం స్టార్-1కు పడిపోయి, మహానగరం కూడా సాధారణ మునిసిపాలిటీల సరసన చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి విశాఖ నగరంలో ఎక్కడంటే చెత్త, పందులు తిరగడాన్ని మీడియా చాలాకాలం నుంచీ ప్రముఖంగా చూపిస్తోంది. కానీ అధికారులు స్పందించినట్లు లేదు.  వీవీఐపీల సేవలు, సమీక్షల పేరిట కాలహననం తప్ప పారిశుద్ధ్యంపై దృష్టి సారించకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయంటున్నారు.

చంద్రబాబు నుంచి ఇప్పటిదాకా అదే పబ్లిసిటీ హడావిడి..

కార్పొరేషన్ అధికారులు ఎంతసేపటికీ.. జాయింట్ కలెక్టర్ బంగ్లా పరిసర ప్రాంతాలు, వీవీఐపిలు తిరిగే ప్రధాన రహదారులపైనే దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలాగైతే వేసిన రోడ్డుపైనే రోడ్లు వేయడం, డివైడర్లు, వాటికి రంగులు, పక్కన  ఆర్టిఫిషియల్ గ్రీనరీ, పెయింట్లు వేసి హడావిడి చేసేవారో.. ఇప్పుడూ అంతే ఉంది. ఇప్పుడు సీఎంకు ఆప్తుడైన అధికారి చేసిన హడావిడినే మిగిలిన అధికారులు ఫాలో అవుతున్నారు. అధికారుల పబ్లిసిటీ తప్ప చేసిందేమీ ఉండదు. నిజానికి విశాఖలో కొన్నేళ్ల నుంచి పారిశుద్ధ్యం సరిగా లేదు. వచ్చిన అధికారులు ఏదో హడవిడి చేసి, రేటింగుల కోసం మాయచేస్తుంటారు. అన్నింటికంటే ప్రమాదమైనది విశాఖ కాలుష్యం. ఇళ్లు, బడులు, అన్నీ కాలుష్యమయ్యాయి. ఒక్క పోర్ట్ ఏరియా తప్ప అంతా కాలుష్యమే. దీనిపై సృష్టి సారించకపోతే భవిష్యత్తు ఇంకా ప్రమాదంలో పడుతుంద’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు

అన్నీ ఉన్నా..

విశాఖలో చెత్త సేకరణకు అన్ని వనరులున్నప్పటికీ, సమన్వయం కారణంతో నగరానికి చివరి రేటింగ్ రావడం చర్చనీయాంశమయింది. ప్రధానంగా విజయవాడ, తిరుపతి మాదిరిగా విశాఖలో గార్బేజ్ యంత్రాలు లేకపోవడం కూడా ఈ స్థితికి ఒక కారణమంటున్నారు. కాపులుప్పాడ డంపింగ్‌యార్డ్, సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్సులకు సంబంధించిన వ్యర్ధాలను అక్కడి వరకూ తీసుకువెళ్లకుండా, మధ్యలో కుమ్మరిస్తున్నారు. దానిని అడ్డుకునే యంత్రాగం లేకుండాపోయింది. గాజువాక  కొండవాగు, ఇందిరాప్రయదర్శిని స్టేడియం, కల్లుపాకలు, అల్లిపురం, రెల్లివీధి, మల్కాపురం కొండవాలు ప్రాంతాల్లో పర్యవేక్షణ లేక చెత్తచెదారం నిండిపోయింది. ఇప్పటికీ 40 శాతం ఇళ్లనుంచి చెత్త సేకరించలేపోతున్నారు. 800 పర్మినెంట్, 5130 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులకు.. కార్పొరేషన్  ప్రతిఏటా 150 కోట్లు ఖర్చు పెడుతున్నా, ఆ మేరకు ఫలితాలు రాకపోవడానికి అధికారుల మధ్య సమన్వయలోపమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.