ఐఎంఏ అవునంటే.. ఏపీ వైద్యుల సంఘం కాదనిలే!

524

సర్కారు వైద్యుల సంఘం మాటలకు అర్ధాలు వేరులే
డాక్టర్ సుధాకర్‌పై దాడిని ఖండించిన ఆలిండియా వైద్యుల సంఘం
ఆయన మానసిక స్థితిపై విచారణ జరపాలన్న ఏపీ వైద్యుల సంఘం
మరి విశాఖ ప్రభుత్వ వైద్య సంఘం, దళిత వైద్య సంఘాలేమంటాయో?
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయనో ప్రభుత్వ వైద్యుడు. అందులోనూ సీనియర్ ఎనస్థీషియన్. పైగా దళితుడు. సహజంగా ప్రభుత్వ వైద్యులపై ఎవరైనా బయట వ్యక్తులు దాడి చేస్తే, రాష్ట్రంలో డాక్టర్లు మొత్తం ఏకమై నానా యాగీ చేస్తారు. సమ్మె చేస్తారు.  అసలు జూనియర్ డాక్టర్లను ఎవరనైనా అవమానిస్తేనే, రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ డాక్టర్లంతా ఏకమై ఇల్లు పీకి పందిరేస్తారు. సర్కారు దిగివచ్చేవరకూ సమరం సాగిస్తారు. మరి అలాంటిది ఓ సీనియర్ ప్రభుత్వ డాక్టర్‌ను  రోడ్డుపై పడుకోబెట్టి, లాఠీలతో కొడితే.. ప్రభుత్వ డాక్టర్ల సంఘం గర్జించి, స్వరం పెంచకపోగా.. ఆ స్వరం సర్కారుకు అనుకూలంగా మార్చడమే వైద్యులను ఆశ్చర్యపరిచింది. కానీ, అదే అఖిల భారత డాక్టర్ల సంఘం  మాత్రం సదరు దళిత డాక్టర్‌పై జరిగిన దాడిని ఖండించింది. ఆ డాక్టరు గారి ప్రవర్తనను ఖండిస్తూనే, ఆయనపై జరిగిన అనాగరిక దాడిని నిరసిస్తూ సీఎంకు లేఖ రాసింది. మరి డాక్టర్లు ఎవరి మాటలు నమ్మాలి? ఇదీ ఏపీలో ఓ వైచిత్రి!
గళం విప్పినందుకు పిచ్చివాడిని చేశారు..
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ‘మత్తు వైద్యుడి’గా పేరున్న డాక్టర్ సుధాకర్.. కరోనా సమయంలో ప్రభుత్వం, వైద్యులకు ఎన్-95 మాస్కులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయి, ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చింది. దానితో అధికారులు ఆయనను వెంటనే సస్పెండ్ చేశారు. సుధాకర్ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లిన తర్వాతనే ఈ ఆరోపణ చేశారని వైసీపీ ఆరోపించింది. తర్వాత ఆయనను వైసీపీ నేతలు కొట్టి, ఆయనతో ఏదో రాయించుకున్నారంటూ.. దానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగుచూసింది. తర్వాత ఆయనను పిచ్చివాడంటూ ప్రచారం ప్రారంభించారు.
డాక్టర్‌ను కట్టేసి కొట్టారు…
తాజాగా ఆయన తాగి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారన్న ఫిర్యాదుపై వచ్చిన పోలీసులు, డాక్టర్ సుధాకర్ చేతులు వెనక్కి కట్టి, అర్ధనగ్నంగానే ఉన్న ఆయనను లాఠీలతో కొట్టి, పిచ్చాసుపత్రికి పంపించడంపై దళిత వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అందుకు నిరసనగా అంబేద్కర్ విగ్ర హాల వద్ద ధర్నా నిర్వహించటం చర్చనీయాంశమయింది. అయితే స్థానికులే డాక్టర్‌ను కట్టేశారని పోలీసు కమిషనర్ చెబుతున్నారు. ఈ చర్యను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ నేత నారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ తదితరులు ఖండించారు. ఆ సందర్భంలో డాక్టర్ సుధాకర్.. తనను పోలీసులు ఏవిధంగా అవమానించారో వివరించిన వీడియో, ఆయనను కొడుతున్న ఫొటోలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఇదీ దళితుడైన డాక్టర్ సుధాకర్‌కు సంబంధించిన వ్యవహారం.
సుధాకర్ మానసిక పరిస్థితిపై  వైద్యుల సంఘం అనుమానం..
అయితే, దీనిపై వైద్యుల సంఘాలు చెరొక రకంగా స్పందించడం వైద్యులను గందరగోళంలో పడేసింది. ఏపీకి సంబంధించిన ప్రభుత్వ వైద్యుల సంఘం దీనిపై విచిత్రంగా స్పందించింది. డాక్టర్ సుధాకర్ మానసిక పరిస్థితిపై విచారణ జరిపించాలని, ప్రభుత్వ డాక్టర్‌గా ఉండి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, సంఘం అధ్యక్షుడు జయధీర్ అన్నారు. 16 వేల కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థను సమూలంగా మార్చేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకుంటే, ఇలాంటి ఘటన బాధాకరమన్నారు. తన సమస్యను సుధాకర్ తమ సంఘం దృష్టికి తీసుకురాలేదన్నారు. డాక్టర్‌పై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై న్యాయవిచారణ జరిపించాలని కోరారు.  ఈ సందర్భంలో డాక్టర్ జయధీర్.. ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థను మార్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని కొనియాడటం ప్రస్తావనార్హం.
సుధాకర్ దానిపై ఐఎంఏ ఖండన..
అయితే, డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు, దేశంలోని వైద్యులందరినీ మనోవేదనకు గురిచేసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మేరకు సంఘం సీఎం జగన్‌కు లేఖ రాసింది. ఈ ఘటన చూసిన వైద్యులంతా ఆందోళనకు గురవుతున్నారని, అలాగని సుధాకర్ అనుచిత ప్రవర్తన సమర్ధనీయం కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తన నిజనిర్ధారణ నివేదికను సీఎంకు పంపింది. దీనితో ఎవరి మాట నిజమని నమ్మాలో అర్ధం కాక, వైద్యులు అయోమయంలో పడ్డారు.
వైద్య సంఘం స్వరం మారింది..
సహజంగా ఇప్పటివరకూ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ వైద్యులపై దాడులు జరిగిన సందర్భాల్లో, వైద్య సంఘాలు, జూనియర్ డాక్టర్ల సంఘాలు ఆందోళన ప్రకటించేవి. సమస్య పరిష్కారమయ్యే వరకూ సమ్మె చేసేవి. బాధితులయిన ప్రభుత్వ వైద్యులకు బాసటగా నిలిచేవి. కానీ, నర్సీపట్నం ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా.. వారి స్వరం పాలకవర్గానికి అనుకూలంగా ఉండటంపై ఆశ్చర్యం వక్యమవుతోంది. పైగా సంఘటన జరిగిన ఇన్ని రోజులయినా డాక్టర్ల సంఘాలు ఆందోళన మాట వినిపించకపోవడం ఆశ్చర్యం. అయితే, సాటి  ప్రభుత్వ డాక్టర్‌కు మతిస్థిమితం లేదన్నట్లుగా మాట్లాడిన సంఘం అధ్యక్షుడి తీరుపై, డాక్టర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మరి విశాఖ ప్రభుత్వ వైద్యుల సంఘం ఏమంటుందో?
ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు.. నర్సీపట్నం డాక్టర్ సుదాకర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో, విశాఖ జిల్లా ప్రభుత్వ వైద్యుల సంఘం శాఖ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. రాష్ట్ర శాఖకు అనుగుణంగా స్పందిస్తుందా? లేక సొంత గళం వినిపిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. దానితోపాటు.. వైద్యశాఖలోని దళిత, బీసీ సంఘాలు కూడా ఏవిధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని దళిత సంఘాలు, ముఖ్యంగా మాల సంఘాలు సుధాకర్‌పై జరిగిన దాడిని ఖండించాయి. కానీ ప్రభుత్వ దళిత వైద్య సంఘాలు మాత్రం ఇంకా స్పందించాల్సి ఉంది.