కాళేశ్వరం కష్టాల్లో జగన్!

563

ప్రాణసంకటంగా మారిన ‘ప్రారంభోత్సవం’
నష్టమని తెలిసి ఎందుకు వెళ్లారంటున్న ఆంధ్రా జనం
కొబ్బరికాయ కొట్టి ఇప్పుడెందుకు ఫిర్యాదంటున్న  తెలంగాణ
తెలంగాణ ప్రాజెక్టులపై జగన్ సర్కార్ ఫిర్యాదు చేయడంపై విపక్ష నేతల ఫైర్
మాతో మంచిగా ఉంటూ తెలంగాణను ముంచుతారా?
మరి జగన్‌ను ఎలా నమ్మారని కేసీఆర్‌పై విపక్షాల విమర్శల దాడి
రేవంత్, రామచందర్‌రావు, కోమటిరెడ్డి ఫైర్
జలజగడంలో పాత వీడియోలు హల్‌చల్
                (మార్తి సుబ్రహ్మణ్యం)

ఎప్పుడైనా వ్యూహాలు ఒక్కసారే  పనిచేస్తాయి. అవి జనాలకు తెలియనంతవరకూ హిట్టవుతాయి. అవేమిటో, వాటి వెనుక కథేమిటో తెలిసిన తర్వాత ఎవరి పప్పులూ ఉడకవు. మేధావి, చక్రం తిప్పే వ్యూహకర్త, ఎదురులేని నేత అనే బిరుదులు, భుజకీర్తులన్నీ కాలం కలసివచ్చినంత వరకే. కాలం సహకరించకపోతే తాడే పామయి కరుస్తుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహామహులంతా కాలం కలసిరాక, వ్యూహాలు బెడిసికొట్టి, చక్రాలు తిరగక ఇప్పుడు ఇళ్లకే పరిమతమయ్యారు.  ఒకప్పుడు కేసీఆర్‌పై కర్నూలు వేదికగా జలయుద్ధం చేసిన జగన్.. ఆ తర్వాత అదే కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి, కొబ్బరికాయ కొట్టివచ్చారు. అప్పుడది వారిద్దరి మధ్య అపూర్వస్నేహానికి, రెండు రాష్ట్రాల మధ్య చిగురించిన బంధానికి చిహ్నమని వేనోళ్లాపొగిడిన ఆ నోళ్లే.. ఇప్పుడు నీటి పంచాయితీ వచ్చేసరికి తెగుడుతున్నాయి. ఆనాటి ఆనందసంబరాలు అద్దిన దృశ్యాలతోపాటు, అంతకుముందు కేసీఆర్‌ను నోరారా తిట్టిపోసిన జగన్ మాటల తూటాలు.. ఇదే సందర్భంలో వీడియోల రూపంలో, సోషల్ మీడియా వేదికగా తెరపైకి వస్తున్నాయి. ఫలితంగా.. అవి ఆంధ్రా-తెలంగాణలో పాలకులకు వ్యతిరేకంగా  విపక్షాలకు కొత్త అస్త్రాలిచ్చినట్టయింది.

జగన్ సర్కారు తీరుపై తెలంగాణలో ఆగ్రహం..

పోతిరెడ్డిపాడు అంశంపై అగ్గిరాజుకున్న వేళ.. కాళేశ్వరం కథ తెరపైకి రావడం, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఇరకాటంగా పరిణమించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గోదావరి బోర్డు చైర్మన్‌కు ఏపీ సర్కారు ఫిర్యాదు చేయడంపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పాలకులతో స్నేహంగా ఉంటూ నీళ్లను తరలించుకుపోవడ ంతోపాటు, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర చేస్తున్నారని జగన్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

జగన్‌కు కలసి రాని తెలంగాణ విమర్శలు..

సహజంగా ఇది ఆంధ్రాలో జగన్‌కు రాజకీయంగా  ప్లస్‌పాయింట్ కావాల్సి ఉంది. కానీ, విచిత్రంగా ఏపీలో ఆ మేరకు సానుకూలత  కనిపించకపోగా.. మరి అంత నష్టం అని తెలిసి కూడా, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లారు? అప్పుడు అది అక్రమ ప్రాజెక్టు అన్న స్పృహ జగన్‌కు తెలియదా?.. అన్న ప్రశ్నలు తెరపైకి రావడంతో, జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి రెంటికీచెడ్డ రేవడిలా మారినట్టయింది. ఇదే అంశంపై అటు తెలంగాణ విపక్షాలు సైతం.. నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చి కొబ్బరికాయ కొట్టిన జగన్, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే ఇంకా జగన్‌తో కేసీఆర్ ఎలా స్నేహం చేస్తున్నారని నిలదీస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా జగన్ ప్రభుత్వ చర్యల వల్ల, ఇటు తెలంగాణలో కేసీఆర్ కూడా విపక్షాల విమర్శలకు లక్ష్యం కావలసి వస్తోంది.

ఆ ప్రాజెక్టులు ఆపాల్సిందేనన్న జగన్ ప్రభుత్వం..

గోదావరి నదిపై శ్రీరాంసాగర్ దిగువున తెలంగాణ సర్కారు నిర్మిస్తోన్న.. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల పథకాలు అక్రమమని, వాటిని తక్షణం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ సర్కారు తాజాగా గోదావరి బోర్డు చైర్మన్‌కు లేఖ రాసింది. ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేకుండా, ట్రైబ్యునల్ ద్వారా కేటాయింపులు లేకుండానే.. తెలంగాణ ప్రభుత్వం, ఈ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం విభజన చట్టానికి విరుద్ధమని వాదించింది. కాళేశ్వరం ఎత్తిపోతల సామర్థ్యం 225 టీఎంసీల నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతల  సామర్థ్యాన్ని 70 నుంచి 100, తుపాకులగూడెం 100  టీఎంసీల సామర్థ్యానికి.. మొత్తంగా 450.31 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతోందని ఆ లేఖలో ఫిర్యాదు చేసింది. పైగా.. దీనిపై తాము గతంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేశామని, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే.. సాంకేతిక సలహా కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రాజెక్టులన్నీ అక్రమమేనన్న జగన్ సర్కారు..

పైగా రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని, తమ హక్కును మాత్రమే తాము వాడుకుంటున్నామని స్వయంగా ఏపీ సీఎం జగన్ కూడా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్ లేకుండానే పాలమూరు-రంగారెడ్డి, డిండి,భక్త రామదాసు, తుమ్మిళ్లతోపాటు.. గోదావరి బేసిన్‌లోని కాళేశ్వరం, దేవాదుల-3, సీతారామ, తుపాకులగూడెం, రాజుపేట, చనాఖా, పింపార్డ్, రామప్ప-పాకాల చెరువు మళ్లింపు ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ సర్కారు ఫిర్యాదు చేయడంపై తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కృష్ణా బేసిన్‌పై, సుమారు 150.53 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ప్రాజెక్టులన్నీ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధమని, కేంద్రం- సీడబ్ల్యుసీకి ఏపీ సర్కారు ఫిర్యాదు చేసింది.

సఖ్యతగా ఉంటూనే కుట్రలా..?

కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల నీటి సామర్థ్యం పెంచడం వల్ల, పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేసింది. బోర్డుకు సమాచారం ఇవ్వకుండా, సాంకేతిక సలహామండలి సమ్మతి లేకుండా, కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఉండే అపెక్స్ కౌన్సిల్ అంగీకారం లేకుండానే.. తెలంగాణ సర్కారు కృష్ణా-గోదావరి నదులపై అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని, ఏపీ సర్కారు ఘాటుగా లేఖ రాసింది. దీనిపై తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ రాష్ట్రంతో సఖ్యతగా ఉన్నట్లు నటిస్తూనే, తమ నీటిని తరలించుపోతున్న జగన్ సర్కారు తీరుపై తెలంగాణ  సంస్థలు మండిపడుతున్నాయి.

ఫిర్యాదు తర్వాతనే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రత్యారోపణలు

తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టు నిర్మాణాలు అక్రమమని తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన తర్వాతనే.. ఆంధ్ర సర్కారు ప్రతిచర్యగా, తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. టెండరు ప్రక్రియను నిలిపివేయాలని, కేంద్రానికి, బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాతనే ఏపీ సర్కారు.. తెలంగాణలో కృష్ణా-గోదావరిపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులపై, ప్రతిగా ఫిర్యాదుచేయడం ప్రస్తావనార్హం.

మరి నష్టమయితే.. కాళేశ్వరానికి జగన్ ఎందుకు వెళ్లారు?

ఈ సందర్భంగా జగన్  కాళేశ్వరం పర్యటనకు సంబంధించిన  అనేక ఆసక్తికరమైన పోస్టులు, నాటి వీడియోలు సోషల్‌మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. కేసీఆర్ స్వయంగా జగన్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించటం, అక్కడికి వెళ్లిన జగన్ కొబ్బరికాయకొట్టిన ఫొటోలు, వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల.. పోలవరం ప్రాజెక్టుకు విఘాతం ఏర్పడుతుందని,  ఇప్పుడు ఫిర్యాదు చేసిన జగన్ సర్కారుకు… మరి ఆరోజు జగన్ కాళేశ్వరానికి వెళ్లినప్పుడు గుర్తుకు రాలేదా అన్న చర్చ  ఏపీ ప్రజల్లో మొదలయింది.


కేసీఆర్‌కు భయపడి వెళ్లారా?:  ఓవి రమణ

‘ అప్పుడు కాళేశ్వరం వల్ల ఏపీకి నష్టమన్న విషయం తెలిసే జగన్ కాళేశ్వరానికి వెళ్లారా? లేక కేసీఆర్‌కు భయపడి అక్కడికి వెళ్లారా? తనను గెలిపించేందుకు ఆర్ధికంగా సహకరించారన్న కృతజ్ఞతతో వెళ్లారా? అప్పుడు అక్కడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి, ఇప్పుడు ఫిర్యాదు చేస్తే ఫలితం ఏమిటి? అప్పుడే దానిని ప్రతిఘటిస్తే సమస్య ఇంతవరకూ వచ్చేది కాదుకదా. పైగా కేసీఆర్ మనకు సాయం చేస్తుంటే అడ్డం పడుతున్నారని జగన్ అసెంబ్లీలో ఎందుకు ఎదురుదాడి చేశారు? కేసీఆర్ ఏపీకి సాయం చేయడమంటే ఇలాగేనా?  రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో జగన్ ఆడుతున్న డ్రామాలు రివర్సయితే ప్రజలు ఆయనను క్షమించరు. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నదే బీజేపీ విధానమ’ని, బీజేపీ రాష్ట్ర నేత ఓ.వి.రమణ స్పష్టం చేశారు. కనీసం ఇప్పుడయినా, కాళేశ్వరం వెళ్లినందుకు జగన్ విచారం వ్యక్తం చే యాలని ఆయన డిమాండ్ చేశారు.

కేసీఆర్‌పై కమలం కన్నెర్ర..

అటు తెలంగాణలో కూడా ఈ అంశం అగ్గిరాజేస్తోంది. కాంగ్రెస్-బీజేపీకి చెందిన సోషల్‌మీడియా బృందాలు, ఆనాటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సానికి సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ చేస్తున్నాయి. తెలంగాణకు ధోకా చేస్తున్న జగన్‌తో ఇంకా అంటకాగడం, మేం క లిసే ఉంటామనడంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయిన సీఎం జగన్.. ఇప్పుడు అదే ప్రాజెక్టుతోపాటు, కృష్ణా-గోదావ రిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులను ఆపాలని ఫిర్యాదు చేసినా.. కేసీఆర్ సర్కారు ఏవిధంగా జగన్‌తో దోస్తానా చేస్తుందో అర్ధం కావడం లేదని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ప్రశ్నించారు. తమ స్నేహం చూస్తే కన్నుకుడుతోందని వ్యాఖ్యానించడం, ప్రతిపక్షాలను అవమానించడంలో ఉన్న శ్రద్ధ తన మిత్రుడైన జగన్ ఇచ్చిన జీఓను అడ్డుకోవడంలో చూపించి ఉంటే..  ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరగకుండా ఉండేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఇంత నష్టం చేసి, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్ర పన్నుతున్న జగన్‌ను ఇంకా తన దోస్తుగానే ప్రకటించడం బట్టి.. ఆయనకు దక్షిణ తెలంగాణపై ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతోందని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు.

కదం తొక్కనున్న కాంగ్రెస్..

కాగా పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా జూన్2న, నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ‘జగన్-కేసీఆర్ దోస్తానా తెలంగాణ వ్యవసాయానికి గొడ్డలిపెట్టు. జగన్ పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత కూడా కేసీఆర్ స్పందించలేదు. కేసీఆర్-జగన్ అలయ్‌బలయ్ తీసుకున్నప్పుడు పోతిరెడ్డిపాడుపై చర్చించలేదా? లేక కుమ్మక్కయ్యారా? కాళేశ్వరం కంటే రెండింతల నీటిని ఏపీ తీసుకువెళుతోంది.  లాక్‌డౌన్ సమయంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టులకు టెండర్లు పిలవలేదు. కాళేశ్వరం, దుమ్ముగూడెం ప్రాజెక్టుల్లో 8 శాతం కమిషన్లు దండుకుంటున్నార’ని ఉత్తమ్  ఆరోపించారు.

కేసీఆస్‌తో జగన్ బంతి భోజనం తర్వాతే జీవో ఇచ్చారన్న రేవంత్

కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, ఎంపి రేవంత్‌రెడ్డి మరో అడుగుముందుకేసి.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ‘సెప్టెంబర్ 13, 2005న పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేలకు పెంచుతూ ఇచ్చిన జీఓపై, కేసీఆర్ అప్పడు మాట్లాడలేదు. ఆగస్టు 20, 2006న కేసీఆర్-నరేంద్ర క్యాబినెట్ నుంచి బయటకువచ్చారు. అప్పుడు కూడా వాళ్లు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడలేదు. కేసీఆర్‌తో బంతిభోజనం తర్వాతే జగన్ జీఓ ఇచ్చాడు. 885 అడుగులు పైనుంచి తీసుకువెళితే అది వరదజలం అవుతుంది. 790 అడుగులు లెవల్‌లో తరలిస్తే వరదజలాలు ఎలా అవుతాయి? లిఫ్టు ప్రాజెక్టుల పేరుతో కమిషన్ల కోసమే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని’ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.  అసలు ఏపీ సీఎం జగన్‌ను ప్రగతిభవన్‌లోకి  రానిచ్చిన కే సీఆర్‌కు బుద్ధి ఉందా అని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైరయ్యారు. ఏపీ ఇచ్చిన జీఓపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.