దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక నగరం ఏర్పాటు కు ఛాన్స్…!?

199

* ప్రభుత్వం చేతిలో 50 వేల ఎకరాలు…
* వివిధ రకాల ప్రపంచ స్థాయి ఎస్ఈజడ్ లకు అవకాశం…
* దేశ, విదేశ కంపెనీలకు ఆహ్వానం పలికే వెసులుబాటు….
* కేవలం మూడేళ్ళలో పారిశ్రామిక విప్లవం….
*రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి శాశ్వత ఉపాధి…..
*దళిత, మైనారిటీ పారిశ్రామిక వేత్తలకూ గొప్ప అవకాశం…..
‘భ్రమరావతి’ స్థానంలో వైయస్సార్ ఇండస్ట్రియల్ సిటీ కి అవకాశం’ !?
(భోగాది వేంకట రాయుడు)

విజయవాడ: అధికారుల ఆలోచనల వల్లనైతేనేమి….చంద్రబాబు సూపర్ మ్యానిపులేటివ్ బుర్రవల్లనైతేనేమి…పండీ పండని ఆ భూముల యజమానుల అత్యాశల వల్లనైతేనేమి….ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఈ రోజున ….ఒకేచోట…ఏక ఖండికగా…దాదాపు యాభై వేల ఎకరాల చదునైన భూమి ఉంది. ఈ దేశం లోని 29 రాష్టప్రభుత్వాలలో…ఏ ఒక్క ప్రభుత్వం చేతిలోనూ నిర్మాణ యోగ్యమైన ఇంత భూమి ఉండి ఉండక పోవచ్చును అంటే…అతిశయోక్తి కాకపోవచ్చును.ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలోనే అంత భూమి ఉంది.
ప్రపంచం లోనే ‘అత్యద్భుతమైన…’అతి’ సుందరమైన…’అత్యాధునికమైన’… ‘అతి’ మనోహరమైన…
ఇలా ఓ పది, పదిహేను ‘అతి’లతో కూడుకున్న మొదటి అయిదు నగరాలలో ఒకటిగా విలసిల్లే… బాహుబలి సినిమా సెట్టింగ్ లాటి నగరాన్ని నిర్మించబోయే మహా భాగ్యం తనకు లభించిందంటూ…చూపించిన గ్రాఫిక్ డిజైన్ చూపించకుండా…తన మ్యానిపులేటివ్ స్కిల్స్ తో జనాన్ని మాయ చేయాలనుకున్న చంద్రబాబు ప్లానులు బెడిసికొట్టాయి. మరీ అంత బిల్డ్-అప్ లను జనం జీర్ణచుకోలేకపోయారు. ప్రతిదీ వరల్డు క్లాసే. ఉపన్యాసాలేమో వరల్డు క్లాసు…చేతలేమో నేల క్లాసు కావడంతో జనానికి చిర్రెత్తుకొచ్చింది. జనం సింపుల్ ఆలోచనల ముందు చంద్రబాబు మ్యానిపులేషన్లు గతం లో వర్క్ ఔట్ అయినట్టు… ‘ఈసారి’ పని చేయలేదు. అందువల్లనే…సుమారు యాభై వేల ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉంది.
నిజానికి…’అమరావతి’అని పేరు పెట్టిన ప్రదేశానికి కేవలం 10,12 కిలోమీటర్ల దూరం లో అసలైన…చరిత్ర ప్రసిద్ధమైన అమరావతి ఉంది.
రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు …తన జమీ కి ముఖ్యపట్టణంగా 1790 లో ఈ అమరావతిని స్థాపించారు. బౌద్ధ సంస్కృతి వెల్లివిరిసిన… గ్రామం ఇది. బ్రిటిష్ వారి దమన నీతికి నిరసనగా రాజా వెంకటాద్రి నాయుడు, తన ముఖ్యపట్టణాన్ని చింతపల్లి నుంచి ఇక్కడికి మార్చుకున్నారు. కట్టడాల నిర్మాణం సందర్భంగా బయటపడిన అమరావతి స్థూపం పేరిట..ఈ గ్రామానికి అమరావతి అని నామకరణం చేశారు. ఇప్పటికీ అక్కడ మహాచైతన్య బుద్ధుని పురాతన విగ్రహం.. అమరేశ్వర దేవాలయం ఉన్నాయి. ఆ గ్రామానికి ఓ పది లక్షలు విదిల్చని చంద్రబాబు…లక్షల కోట్లతో సుందరాతీసుందరమైన ఓ ఆధునికమైన నగరాన్ని నిర్మిస్తానంటూ వీరంగం చేస్తుంటే..తల్లికి కూడు పెట్టని వాడు…పినతల్లికి పట్టుచీర పెడతాడంట అన్న తెలుగు సామెత చాలా మందికి గుర్తుకు వచ్చింది.
ఇప్పుడు, వెలగపూడి లో ఉన్న సచివాలయం…ఇతర భవనాల్లోని ప్రభుత్వ కార్యకలాపాలను విశాఖ కు తరలించాలని ప్రభుత్వం భావించడం లో రహస్యం ఏమీ లేదు. కేవలం సమయ…సందర్భాల కోసమే ఈ తరలింపు అనేది వేచి చూస్తున్నది. అలాగే, ఒక అమరావతి ఉండగా…మరో అమరావతి ఎంత అకస్మాత్తుగా తెరపైకి వచ్చిందో…అంతే అకస్మాత్తుగా అంతర్ధానమవుతున్నది. అంతర్దానం కానిదల్లా చారిత్రిక గ్రామం అమరావతే.చరిత్ర గుర్తు పెట్టుకునేది ఆ అమరావతినే కానీ, జనానికి భ్రమలు కల్పించిన ఈ అమరావతి కాదు.
ఈ భూములలో ఒక అంతర్జాతీయ పారిశ్రామిక నగరం – వైయస్సార్ ఇండస్ట్రియల్ సిటీని ఆవిష్కరించే అపురూప అవకాశం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రూపాయి కూడా ఖర్చు లేకుండా.
ఈ భూమిలో ఓ యాభై వరకు ఎస్ ఈ జడ్ లు నోటిఫై చేసి….అంతర్జాతీయ ఇండస్ట్రియల్ లీడర్స్ ను ఆహ్వానించవచ్చు. అత్యుత్తమ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమయ్యే వ్యయాన్ని….ఆయా పారిశ్రామిక సంస్థల నుంచి వసూలు చేయవచ్చు. పక్కనే ఉన్న కృష్ణా నది నుంచి నీటి లభ్యతను వారికి అందుబాటులోకి తీసుకు రావచ్చు. రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కిస్తీలను ….ఆయా ఎస్ ఈ జడ్ ల నుంచి ఇప్పించవచ్చు. భూమి కేటాయించిన మూడు సంవత్సరాలలోగా ఉత్పత్తి ప్రారంభించాలి అనే షరతుపై భూములు కేటాయిస్తే…శ్రీకాకుళం నుంచి…చిత్తూరు వరకు లక్షలాది మందికి ఇక్కడ ప్రత్యక్షంగా గానీ,పరోక్షంగా గానీ ఉపాధి లభిస్తుంది. రాష్ట్రం లో నిరుద్యోగం అనేది మాయమైపోతుంది. ఏ రాష్ట్రం లోనూ అవకాశం లేని పారిశ్రామిక విప్లవం వైయస్సార్ ఇండస్ట్రియల్ సిటీ లో వెల్లి విరుస్తుంది. ఈ ఎస్ఈజడ్ లలో మూడవ వంతు ను దళిత, బీసీ, మైనారిటీ పారిశ్రామిక వేత్తలకు రిజర్వ్ చేయవచ్చు.
రాజధాని అనేది ఎక్కడుంటే ఏమిటి?…జనానికి అవసరమైన ‘రోటీ…కపడా…ఔర్ మకాన్..’కావాలి. అది కల్పించిన అజరామరమైన కీర్తి ముఖ్యమంత్రి జగన్ కు లభిస్తుంది మరో ముప్ఫయి ఏళ్ళు ఆయనను ఆ పీఠం పై అధిష్టింప చేస్తుంది. మన కళ్ళ ముందు ఓ అపురూప పారిశ్రామిక నందనవనం ఆవిష్కృతమవుతుంది.రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కృష్ణా నది ఒడ్డున వెలసిన ఒరిజినల్ అమరావతి…కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది. ఇందుకైనా సరే…జగన్ అభినందనీయులు.

-భోగాది వెంకట రాయుడు