కరోనా వైరస్ నియంత్రణకు ఓ ప్రత్యేక సంస్థ కావాలి!

615

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఏర్పాటైన ‘ఎయిడ్స్ కంట్రోల్ , అవేర్నెస్ సెంటర్’ ల తరహాలో …’కరోనా వైరస్ మానేజ్మెంట్ సెంటర్’ లు ఏర్పాటు చేయాల్సిన అవసరం కనపడుతోంది. ఎయిడ్స్ లాగానే, ఈ కరోనా వైరస్ కూడా మనిషితో సహజీవనం చేయడానికే వచ్చిందని ఆంధ్ర ముఖ్యమంత్రి దగ్గరనుంచి…అమెరికా ప్రెసిడెంటు వరకు అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే ముక్క చెప్పింది. రేపు డిసెంబర్ లో ఇంకో రౌండ్ తిరగేస్తుందని కూడా ఆరోగ్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇంకో మాటలో చెప్పాలంటే…ఇదో ఎయిడ్స్ లాటి మహమ్మారి.
ఎవరికి వస్తుందో తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియదు….వచ్చాక;అది ఒక్కటే పోతుందో…మనిషిని కూడా తీసుకు పోతుందో తెలియదు.
ఇది కొత్తగా వచ్చిన భూతం కనుక…ప్రభుత్వాల స్పందన కూడా అంతే కొత్తగా….హడావిడిగా ఉంది.ఇది తప్ప ఇక వేరే పని ఏమీ లేదన్నట్టుగా…రజనీకాంత్ సినిమా రిలీజ్ నాడు థియేటర్ ల దగ్గర ఉండేంత కోలాహలంగా ఉంది. గత రెండున్నర, మూడు నెలలుగా– కరానా వైరస్ పారాయణం తప్ప -ప్రభుత్వాలకు మరో ధ్యాస లేకుండా పోయింది.
ఈ కరోనా వైరస్ రిలీజ్ అయ్యి, వంద రోజులు కావస్తోంది. దీనితో…ప్రభుత్వాల హడావుడి కూడా తగ్గుతోంది. ఈ సమయం లో …దీని బారినుంచి ఎలా కాపాడుకోవాలో తెలిసి వచ్చింది. ఆ విషయమై…జనాల్లో బ్రహ్మాన్దమైన చైతన్యం కలిగించేలా…కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతమైన కృషి చేశాయి. మూతులకు మాస్కులు, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ అంటువ్యాధికి దూరంగా వుండవచ్చుననే విషయంలో జనానికి స్పష్టత వచ్చింది.
తమను తాము ఈ వైరస్ నుంచి కాపాడుకునే చిట్కా….’సోషల్ డిస్టెన్స్’అనే పదం…ఇంగ్లీష్ తెలియని వాళ్లకు కూడా కంఠతా వచ్చేసింది. మనిషికి మనిషికి రెండు గజాల దూరం ఉంటే….ఈ వైరస్- మన మంత్రివర్యులు కొడాలి నాని గారి భాషలో చెప్పాలి అంటే-‘ ఎవరి బొచ్చు పీకలేదు’అని అందరికీ అర్ధమైంది.
ఎయిడ్స్ వల్ల ఎదురయ్యే అనర్ధాల నుంచి తప్పించుకుంటూ ‘బతుకు’తున్నట్టే…కరోనా వైరస్ నుంచి కూడా మనిషి తప్పించుకుంటూ బతుకుతాడు. దానికోసమని…ప్రభుత్వాలు ఆరాటపడాల్సిన పనిలేదు. లాక్ డౌన్ లతో పనిలేదు. తమకు గల లక్షా తొంభయ్ విధులను వదిలేసి…కరోనా…కరోనా అంటూ కలెక్టర్లు కూడా నిద్రలో కూడా కలవరింతలు పెట్టాల్సిన పని లేదు. రోడ్ల మీదకు ఎవరొస్తారా…ఎవర్ని బాదుదామా అని పోలీసులు ఓ అదేపనిగా వర్రీ అవ్వాల్సిన పనిలేదు.
కరోనా వైరస్ నియంత్రణకు(నిర్మూలనకు కాదు..) భౌతిక దూరం పాటించడం ఒక్కటే తరుణోపాయం అనే విషయాన్ని అత్యంత విస్తృతంగా…గ్రామ స్థాయి నుంచి విశాఖపట్నం(అంటే..రాజధాని అని)స్థాయి వరకు అత్యంత బలంగా అవగాహన ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టాలి. ఇందుకోసం ఒక ప్రత్యేక శాఖను సృష్టించాలి. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి . దానికి ఓ మంత్రి, సచివాలయం లో ఓ విభాగం..జిల్లా స్ధాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఓ అధికార విభాగం ఏర్పాటు కావాలి. వాలంటీర్ల వ్యవస్థ;గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ ఇప్పటికే ఉనికి లోకి వచ్చినందున….ఏ ఇంట్లో కి కరోనా వైరస్ చొరబడిందో తెలుసుకోవడం ప్రభుత్వానికి చిటికెలో పని. ఈ కరోనా వైరస్ శాఖ -ఆ బాధితులను కరోనా ఆస్పత్రికి తరలించడం…మందులు ఇప్పించడం వంటి పనులు చూస్తుంది. మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం తన పని తాను మామూలుగా చేసుకుంటుంది. సాధారణ జన జీవనం తిరిగి ప్రారంభమవుతుంది.ఎవరు ‘చేస్తున్న పనులు…’వారు చేసుకుంటూ పోవచ్చు.
ఎయిడ్స్ పేషెంట్స్ వ్యవహారం లో ‘ప్రభుత్వ ఎయిడ్స్’ కంట్రోల్ సంస్థలు వాటిపని అవి చేసుకుంటూ పోతున్నట్టు గానే, రాష్ట్ర స్థాయి కరోనా వైరస్ నియంత్రణ సంస్థ కూడా…రాష్ట్రం లోని కరోనా వైరస్ బాధితుల వైద్యం కోసం కృషి చేస్తుంది.
ఆదిశేషుడు ఈ భూభారం మొత్తం మోస్తున్నట్టు…రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఒక్కరే…మొత్తం కరోనా వైరస్ భారంతో పాటు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ భారాన్ని మోస్తున్నారు. వైద్య,ఆరోగ్య శాఖ అంటే…కరోనా శాఖగా మారిపోయింది.మిగిలిన సవా లక్ష వ్యాధుల ప్రస్తావనే కనపడడం లేదు. వినపడడం లేదు.
తూర్పు గోదావరి కలెక్టర్ గా ఆయనను చూసిన కళ్ళతో… ఇప్పుడు చూస్తుంటే…’అందమైన నల్లని తలకట్టుతో…ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ కనపడే ఆ జవహర్ రెడ్డేనా….ఇప్పుడు మనం చూస్తున్నదీ..’అనిపిస్తుంది. బహుశా…పని భారం ఆ చిరునవ్వును ఆయన నుంచి దూరం చేసిందేమో!
ఈ కరోనా వైరస్….సోకిన వారే కాదు. అది వచ్చి, తగ్గిపోయినవారూ ఉన్నారు. ఉదాహరణకు…ఆంధ్రాలో సుమారు 2000 మందికి పైబడి కరోనా వైరస్ తాకితే…తగ్గిన వారు 1200 మంది వరకు ఉన్నారు. అంటే…ఇది తగ్గడానికి అవకాశం ఉన్న అంటు వ్యాధే తప్ప;తగ్గడానికి అవకాశం లేని ఎయిడ్స్ వంటిది కాదు.
అందువల్ల, భౌతిక దూరం పాటిస్తూనే…సమాజం తన పని తాను చేసుకుపోవాల్సిన దిశగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. దీనికోసం…మొత్తం పరిపాలనా యంత్రాంగం నుంచి దీనిని వేరు చేసి;దీనికి ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీని బడ్జెట్ కేటాయింపు దీనికి ఉండాలి. ఒక సీనియర్ అధికారి ని దీనికి బాధ్యులను చేసి, ప్రజలను మోటివేట్ చేసే కృషి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైతే, వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఒక కార్పొరేషన్ నే ఏర్పాటు చేయాలి.
అప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం ఇతర పాలనా అంశాలపై దృష్టి పెట్టవచ్చు.
కరోనా నేపథ్యంలో జనజీవన విధానం ఎలా ఉండాలనే విషయమై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శక విధి విధానాలను నిర్వచించి….అవి ఉల్లంఘనలకు గురికాకుండా చూసేపని ఈ కార్పొరేషన్ కు అప్పగించవచ్చు.
సమాజం నిర్బంధంలో ఎక్కువకాలం మనజాలదు.
ఇక భవిష్యత్ అంతా వైరస్ ల కాలమే .మనం పర్యావరణాన్ని లెక్క చేయం కనుక;పర్యావరణం కూడా మనల్ని లెక్క చేయదు. వైరస్ లను మా మన మీదకు వదులుతుంది.లాజిక్కే కదా! ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క వైరస్ విరుచుకుపడవచ్చు. లేదా…రెండు,మూడు వైరస్ లు కూడబలుక్కుని ఒక్కసారి దండ యాత్రకు బయలుదేరవచ్చు. అందువల్ల, ప్రభుత్వ యంత్రాంగాలు…దీర్ఘకాలిక పరిష్కార మార్గాల దిశగా ఆలోచించాలి.ఆలోచించడం కాదు.కార్యాచరణకు పూనుకోవాలి.
అందుకు సర్వ సమర్ధుడు….జవాహరెడ్డి అనడంలో సందేహం లేదు.

-భోగాది వెంకట రాయుడు