డామిట్.. దళిత కథ అడ్డం తిరిగింది!

371

హర్షకుమార్ నుంచి డాక్టర్ సుధాకర్ వరకూ..
జగన్ వీరాభిమాని మహాసేన రాజేష్ కూడా రివర్సే
ముప్పుసుకురానున్న ఆ మూడు ఘటనలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ శాశ్వత ఓటు బ్యాంకయిన దళితులలో కదలిక వస్తోందా? కాంగ్రెస్ దశాబ్దాలపాటు ఇందిరమ్మ కార్డు వాడినా, చంద్రబాబునాయుడు దళితులకు ఎన్ని పథకాలు ప్రకటించినా, ఎంతమందికి ప్రభుత్వ పదవులిచ్చినా, మొక్కవోని దీక్షతో వైసీపీకే జైకొట్టిన దళితులు.. ఇప్పుడు అదే పార్టీ-ప్రభుత్వానికి దూరమయ్యే ప్రమాదం వచ్చిందా? గత కొద్దికాలంలో వరసగా జరిగిన మూడు సంఘటనల తీరుపై దళితుల మూడ్ మారుతోందా?..  దళితాగ్రహం చూస్తే ఇలాంటి అనుమానాలే రాక తప్పదు.

కాంగ్రెస్‌పార్టీ దళిత అనుకూల వైఖరి, ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగా తీసుకున్న నిర్ణయాలన్నీ.. వైసీపీ అధినేత జగన్‌కు వారసత్వంగా వచ్చాయి. ఫలితంగా గత రెండు ఎన్నికల్లోనూ దళిత వర్గాలు వైసీపీకే జై కొట్టాయి. అందుకే ఆ పార్టీకి దళితులు స్ధిరమైన ఓటు బ్యాంకుగా మారారు. ప్రధానంగా.. మాల వర్గం జగన్‌కు జైకొడుతూనే ఉంది. గత ఎన్నికల్లో చివరకు మాదిగ వర్గం కూడా, జగన్‌కు ఓ చాన్సు ఇచ్చిచూద్దామన్న ధోరణి ప్రదర్శించింది.

జగన్ వల్లనే జైలు పాలయ్యానన్న హర్షకుమార్

అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. దళితుల్లో లబ్థప్రతిష్ఠులైన పలువురు ప్రముఖులకు జరిగిన అవమానాలు, వారిని వైసీపీ నుంచి దూరమయ్యేందుకు కారణమవుతున్నాయి.  అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్‌కు దళితనేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. తెలుగుదేశం హయాంలోనూ ఆయన దళితుల కోసం పోరాడిన నేతగా అందరికీ తెలుసు. పైగా రాజశేఖర్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న దళిత నాయకుడు. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలను హర్షకుమార్ తప్పుపట్టారు.
ప్రధానంగా డజన్లమందిని పొట్టనపెట్టుకున్న బోటు ప్రమాదంపై హర్ష.. జగన్ సర్కారు నిర్లక్ష్యం, బోటు యజమానిగా ఉన్న ఉత్తరాంధ్ర మంత్రి అవినీతిని దునుమాడారు. ఆ సందర్భంలో జగన్ గతాన్ని తవ్వితీశారు.

ఫలితంగా.. హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రిలో ఓ భవనం కూల్చివేత సందర్భంగా జిల్లా కోర్టు సిబ్బందిపై వ్యాఖ్యలు చేసి, విధులు అడ్డుకున్నారన్న కారణం కాకుండా.. అంబేద్కర్ విగ్రహం విషయంలో ఆయనను అరెస్టు చేసి, 48 రోజుల పాటు జైలుకు పంపించటం సంచలనం సృష్టించింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలే చేయించారని, తమ పార్టీలో చేరనందుకు బెదిరింపు చర్యగా, హర్షను అరెస్టు చేశారని ఆయన కుమారుడు శ్రీరాజు ఆరోపించారు. బాబు ప్రభుత్వం పెట్టిన కేసులును, వైసీపీ పావులుగా ఉపయోగించుకుందని విమర్శించారు.

జగన్‌పై హర్షకుమార్ విమర్శల దాడి..

జైలునుంచి బయటకు వచ్చిన హర్షకుమార్.. తాను జైలుకు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులు వివరిస్తూ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.  జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ను సంబంధం ఉందని, అందుకే ఆయన సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని చేసిన ఆరోపణ సంచలనం సృష్టించింది. కేసుల పేరుతో భయపెట్టి జైలుకు పంపిస్తున్నారని, అయినా తాను భయపడేది లేదని జగన్‌ను హెచ్చరించారు. గతంలో చంద్రబాబు తనపై కేసులు పెట్టినా ఎప్పుడూ దారుణంగా, ఇంత అమానవీయంగా  వ్యవహరించలేదన్నారు. ఈవిధంగా దళిత సమస్యల పరిష్కారం కోసం పోరాడే హర్షను అరెస్టు చేసి జైలుకు పంపించడం, ఆ తర్వాత బయటకు వచ్చిన ఆయన.. ఇదంతా జగన్ చేయిస్తున్నారని ఆరోపించడంతో, జగన్ సర్కారుపై  దళితులకు సహజంగానే ఆగ్రహం కలిగించింది.

మహాసేన రాజేష్‌నూ జైలుకు పంపిన  జగన్..

ఇక వైసీపీ అధికారంలోకి రావాలని, జగన్ సీఎం కావాలని ఎన్నికల ముందు అహోరాత్రులు పనిచేసిన.. దళిత నాయకుడైన మహాసేన అధ్యక్షుడు, రాజేష్‌ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించడాన్ని దళితులు జీర్ణించుకోలేకపోయారు. దళిత వర్గాలు, ముఖ్యంగా చదువుకున్న దళితుల్లో బాగా ఫాలోయింగ్ ఉన్న మహాసేన రాజేష్‌ను, కక్షసాధింపుతో జైలుకు పంపించారన్న వార్త దళిత వర్గాలను విస్మయపరిచింది. కాకినాడలో క్రైస్తవ ఆస్తులను వైసీపీ నేతలు ఆక్రమించిన సందర్భంలో, దానిని ఆయన వ్యతిరేకించారు. దళితులకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకోవడంపై రాజేష్ ఏకంగా తిరగబడ్డారు.

ప్రశ్నించినందుకు రాజేష్‌పై 9 కేసులు..

ఈవిధంగా  వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న క్రైస్తవ-ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, స్థానిక సంస్ధల ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని హెచ్చరించారు. అయితే అలా హెచ్చరించిన మరుసటి రోజునే, రాజేష్‌పై 9 కేసులు పెట్టడం దళితుల్లో ఆగ్రహం కలిగించింది. బెయిల్ వచ్చినప్పటికీ, మరొక కేసులో పీటీ వారెంట్ తెచ్చి, అరెస్టు చేసి జైల్లోనే ఉంచడాన్ని దళితులు జీర్ణించుకోలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయనను తాను ఎన్ని తిట్టినా తనను జైలుకు పంపించలేదని, కానీ తాము ఎవరికోసమైతే పనిచేశామో, అదే జగన్ జైలుపాలుచేయడంపై రాజేష్ మీడియా వద్ద వాపోయారు.  ఈ విధంగా బాబు హయాంలోనూ జరగ ని వేధింపులు, తమ దళిత నేతపై జరగడాన్ని దళితవర్గాలు సహించలేకపోయాయి.

డాక్టర్ సుధాకర్‌ను  పిచ్చివాడిని చేసిన సర్కారు..

లాక్‌డౌన్ కాలంలో.. ప్రభుత్వ వైద్యులకు 95-మాస్కులు, గ్లౌజులు ఇవ్వడంలేదని విమర్శించినందుకు దళితుడైన ప్రభుత్వ డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేయడం దళితుల ఆగ్రహానికి  దారితీసింది. ఈ ఘటన మర్చిపోకముందే.. తాజాగా ఆయన చేయి వెనక్కి కట్టి, అర్ధనగ్నంగానే రోడ్డుపై పడుకోబెట్టి, పోలీసులు లాఠీలతో కొట్టిన వీడియోలు బయటకు రావడంతో, దళితులు పిడికిలి బిగిస్తున్నారు. పైగా ఆయనకు పిచ్చి ఉందని, పిచ్చాసుపత్రిలో చేర్పించడం పుండుమీద కారం చల్లినట్టయింది.  సుధాకర్‌పై జరిగిన దాడికి నిరసనగా, దళితసంఘాలు విశాఖలోని అంబేద్కర్ విగ్రహం ధర్నా నిర్వహించారు. సుధాకర్‌ను పోలీసుస్టేషన్‌లో దారుణంగా కొట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు ఆగ్రహం వ్యక్తం చేసి, డిజిపి, ఎస్పీని పిలిపిస్తామని స్పష్టం చేశారు. మాన వ హక్కుల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్‌తోపాటు బీజేపీ, వామపక్షాలు, జనసేన నేతలు ఈ ఘటనను ఖండించాయి. ఫలితంగా దళిత డాక్టర్‌ను కొట్టిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు విశాఖ కమిషనర్ ప్రకటించాల్సి వచ్చింది. ఈ విమర్శల తీవ్రతను తగ్గించేందుకు, వైసీపీ నాయకత్వం దళిత నేతలను తెరపైకి తెచ్చి, నానా పాట్లు పడాల్సి వస్తోంది.
సుధాకర్ ఘటనను తెలుగుదేశం పార్టీతో లింకు పెట్టి, కేసు తీవ్రతను తగ్గించాలని చూస్తున్న, జగన్ ప్రభుత్వ అమానుష చర్యలను ప్రతి ఒక్క దళితుడూ ఖండించాలని, టీడీపీ పొటిల్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు. ఒక దళితుడిని అర్ధనగ్నంగా రోడ్డుపై పడుకోబెట్టిన జగన్ ప్రభుత్వం, ప్రశ్నించే తత్వం ఉన్న దళితులకు ఏం సంకేతం ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాగా దళితుడైన డాక్టర్ సుధాకర్‌పై పోలీసు దాడిని నిరసిస్తూ.. జూన్ 7న విశాఖ బీచ్ రోడ్‌లోని ైవె ఎస్సార్ విగ్రహం వద్దకు,  ‘చలో విశాఖ’ ఆందోళనకు హర్షకుమార్, శ్రీనివాసరావు,  మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. ఈ వ్యవహారం జగన్ సర్కారుకు.. దళితులను దూరం చేసే ప్రమాదకర పరిస్థితికి బీజం వేసింది.