జగన్‌కు కష్టాలు.. ‘కోటి’!

165

విశాఖ నష్టపరిహారంతో షురూ
ఎల్జీపాలిమర్స్ మృతులకు కోటి నష్టపరిహారం
అన్ని ప్రమాదాలకూ ఇప్పుడు అదే డిమాండ్
ప్రకాశం రైతులు, పోలీసుల నోట ‘కోటి’ పలుకులు
కోటి డిమాండ్‌తో కన్నా, వ ర్ల మెలిక
తలపట్టుకుంటున్న పారిశ్రామికవేత్తలు
ఇవ్వకపోతే సర్కారుపై వివక్ష ముద్ర
(మార్తి సుబ్రహ్మణ్యం)

పిడుగుకూ బియ్యానికీ ఒకటే మంత్రం పనికిరాదు. రాజకీయాల్లో వ్యూహాలు బ్రహ్మాండంగా పనికివస్తాయి. అవి ప్రత్యర్ధులను ఆత్మరక్షణలోకి నెడుతుంటాయి. అదే అలవాటు- దూకుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత పనికిరాదు. అవి కొన్ని సందర్భాల్లో బెడిసికొడుతుంటాయి. తలనొప్పి సృష్టిస్తాయి. ఫలానా ఘటనలో అంత ఇచ్చి, ఈ ఘటనలో మాత్రం ఇంతే ఇచ్చారేమిటన్న ప్రశ్నలకు, జవాబు చెప్పలేని పరిస్థితి కల్పిస్తాయి. చావులో కూడా ఈ తే డాలేమిటన్న లాజిక్కుకు, సమాధానం ఇవ్వలేని ఇరకాట పరిస్థితిలో పడేస్తాయి. అప్పుడు పాలకులకు కష్టాలు తప్పవు. పాలనలో అనుభవం అవసరం. అది లేకపోతే కనీసం పరిశీలన అవసరం. ఆ రెండూ లేకపోతే పాలకులు కష్టాల్లో పడక తప్పదు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సరిగ్గా అలాంటి ‘కోటి’ కష్టాల్లో పడ్డారు. ఎలాగో మీరే చూడండి.

విశాఖ పరిహారంతో పెరిగిన జగన్ ఇమేజ్

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకయిన ఫలితంగా, పరిసరాల్లో నివసించే  12 మంది మృతి చెందారు. వందలమంది ఆసుపత్రుల పాలయ్యారు. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. ఆలోగా టీడీపీ,బీజేపీ,కాంగ్రెస్, వామపక్షాలు 50, 25 లక్షల రూపాయల  నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కానీ జగన్ పెద్ద మనసు చేసుకుని, ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతిపక్షాల నోళ్లు మూయించారు. నిజంగా దేశ చరిత్రలో అదే పెద్ద పరిహారం. అందుకే జగనన్న సహసాన్ని అందరూ పార్టీలకు అతీతంగా అభినందించారు.

సరే.. జగనన్నే చెప్పినట్లు, తర్వాత కంపెనీవాళ్లతో ఏం మాట్లాడుకుంటారన్నది వేరే సంగతి. ముందయితే కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించడం, వారికి ఇవ్వడం వాయువేగంతో జరిగిపోయింది. ఈ ఘటన జగన్‌ను మంచి పేరు తెచ్చిందనేని నిర్వివాదం. సర్కారుపై యుద్ధం చేస్తున్న బీజేపీ కూడా, కోటి ఇచ్చిన సీఎంను అభినందించింది. టీడీపీ మాత్రం కోటి రూపాయలు ఏం సరిపోతాయని సన్నాయి నొక్కులు నొక్కింది.

ప్రకాశం రైతులు, పోలీసులకు ఏదీ కోటి?

మరి ఇన్ని అభినందనలు అందుకున్న జగనన్నకు.. కష్టాలు ఎలా వచ్చాయన్నదే కదా అందరి అనుమానం? ఆ కష్టాలు ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నుంచి ఆరంభమయ్యాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వద్ద మే 14న ట్రాక్టర్ ఢీకొని, 12 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దానికి స్పందించిన ప్రభుత్వం 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. దీనిపై బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ లేవనెత్తిన డిమాండ్, జగనన్న సర్కారును ఇరుకునపెట్టింది.

మెచ్చుకుంటూనే పరిహారంపై మెత్తగా ఇరికించిన కన్నా

విశాఖ ఘటనలో యాజమాన్యం స్పందించకముందే, కోటిరూపాయల నష్టపరిహారం ప్రకటించి ఔదార్యం ప్రకటించిన జగన్.. రోజువారీ వేతనంపై జీవించే 12 మంది రైతు కుటుంబాలకూ, కోటి రూపాయలివ్వాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పైగా విశాఖ మృతుల కుటుంబాలకు ఇచ్చినట్లే, వివక్ష చూపకుండా ప్రకాశం రైతు కుటుంబాలకూ అంతే ఇవ్వాలని మెలిక పెట్టడంతో.. జగనన్న సర్కారు నైతిక సంకటంలో పడినట్లయింది. కన్నా అసలు విశాఖ ఘటనలో కోటి ఇచ్చిన జగనన్నను పొగిడారో, ప్రకాశం ఘటనలో అంతే మొత్తం ఇవ్వనందుకు తెగిడారో అర్ధం కాక సర్కారు జుట్టుపీక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ కన్నా మాత్రం ఈ విషయంలో లౌక్యం ప్రదర్శించారనే చెప్పాలి. కన్నా ప్రకటన తర్వాత.. రైతుల్లో కూడా, విశాఖ మృతులకు కోటి ఇచ్చిన ప్రభుత్వం, తమ విషయంలో మాత్రం నిర్లక్ష్యం, వివక్ష చూపిందన్న భావన ప్రారంభమయింది.

చావుల్లో కూడా వివక్ష ఎందుకు?

‘రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు అన్న విషయం, ప్రకాశం రైతు కుటుంబాలకు  ఇచ్చిన నష్టపరిహారం చూస్తేనే అర్ధమవుతుంది. విశాఖ ఘటనలో మృతి చెందిన వారు, ప్రకాశం ఘటనలో మృతి చెందిన వారూ మనుషులే. అంతా సామాన్యులే. మరి ప్రాణాలు పోయినప్పుడు ఈ వివక్ష ఎందుకు? నష్టపరిహారంలో ఈ తేడాలెందుకు? జగన్ దృష్టిలో విశాఖ పాలిమర్స్‌లో మృతి చెందిన వారి ప్రాణాలే ఖరీదైనవి. ప్రకాశంలో మృతి చెందిన రైతుల ప్రాణాలు మాత్రం పట్టించుకోదగ్గవి కాదన్న సంకేతం, ప్రభుత్వమే ఇవ్వడం మంచిది కాదు. మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా డిమాండ్ చేసినట్లు, ప్రకాశం రైతులకూ విశాఖ మాదిరిగానే కోటి రూపాయల పరిహారం చెల్లించాల’ని బీజేపీ రాష్ట్ర నేత, టీటీడీ మాజీ సభ్యుడయిన ఓ.వి.రమణ డిమాండ్ చేశారు.

పోలీసులకేదీ కోటి?

ఇక టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా  ఏమీ తక్కువ తినలేదు. ఆయన చాతుర్యం  ప్రదర్శించి సర్కారును ఆత్మరక్షణలోకి నెట్టారు. పైగా రామయ్య డిమాండ్ పోలీసుల హృదయాలను తాకినట్టయింది. కరోనా సమయంలో విధినిర్వహణ చేస్తూ, మృతి చెందిన పోలీసులకు 50 లక్షల నష్టపరిహారం ఇస్తామని  డీజీపీ ప్రకటించారు. దానిని వర్ల రామయ్య.. విశాఖ ఘటనతో ముడిపెట్టి, సర్కారును మొహమాటంలోకి నెట్టారు.

‘‘కరోనా సమయంలో సేవలందించిన పోలీసులు మృతి చెందితే, 50 లక్షల రూపాయలే నష్టపరిహారం ఇవ్వడం సరికాదు. గ్యాస్ ప్రమాదంలో పోయిన వారికి కోటి ఇస్తూ, ప్రాణాలను పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్న పోలీసులకు మాత్రం, 50 లక్షలే ఇవ్వడం అన్యాయం. పోలీసులకూ కోటి రూపాయలివ్వాల్సిందే’’నని డిమాండ్ చేసి, పోలీసుల మనసు గెలుచుకున్నారు. దీనితో అటు పోలీసులలో కూడా అలాంటి భావనే మొదలయింది. ఇది ఒకరకంగా ప్రభుత్వానికి ప్రాణసంకటమే.

పెరుగుతున్న కోటి డిమాండ్ సంస్కృతి

ఈ విధంగా విశాఖ ఘటనలో ప్రకటించిన కోటి రూపాయల పరిహారం, పాలకులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. విశాఖ ఘటన తర్వాత.. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా, వాటికి సైతం కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ చేసే సంస్కృతి తెరపైకి రావడంతో, ఏం చేయాలో తెలియని ఆందోళన పరిస్థితిలో జగనన్న సర్కారు కనిపిస్తోంది.  అటు ఒక స్ధాయిలో ఉన్న పారిశ్రామికవేత్తల నుంచి, చిన్న తరహా పరిశ్రమలు నడిపే పారిశ్రామికవేత్తలకూ, జగన్ ప్రకటించిన కోటి సాయం కష్టాల్లో నెట్టింది.

అలాగయితే పరిశ్రమలు మూసుకోవలసిందే

బ్యాంకు రుణాలు, సబ్సిడీలతో నడిచే పరిశ్రమలు, కొందరు వ్యక్తులు భాగస్వాములుగా పెట్టుకున్న చిన్న-మధ్య తరహా పరిశ్రమల్లో పెద్దగా లాభాలు రావు. అలాంటి పరిశ్రమలలో భవిష్యత్తులో ఏదైనా ప్రమాద ఘటన జరిగితే.. అప్పుడు కార్మికులు, కార్మిక సంఘాలు కూడా, విశాఖ మాదిరిగానే కోటి రూపాయల నష్టపరిహారం అడిగితే తామేం కావాలి? అంత డబ్బు ఎక్కడినుంచి తీసుకురావాలని చిన్న-మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. అలాగయితే ఇక పరిశ్రమలు మూసుకోవలసిందేనంటున్నారు.  విశాఖ ఘటన నష్టపరిహారంలో జగన్.. ఒక పరిపాలకుడిగా కాకుండా, రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం వల్ల, భవిష్యత్తులో పరిశ్రమల ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.