ఏపీలో జగన్‌ను..  హీరోను చేసే ఎత్తుగడ?

157

సమస్యలు  పక్కదారిమళ్లించే వ్యూహమేనా?
విశాఖ గ్యాస్ లీక్, మద్యం, విద్యుత్‌చార్జీల పెంపును మర్చిపోయేందుకేనా?
కేసీఆర్-జగన్ మ్యాచ్‌ఫిక్సింగ్‌పై విరుచుకుపడుతున్న విపక్షాలు
ఏపీ-తెలంగాణ విపక్షాల ఆరోపణల వెనుక ఆంతర్యం అదేనా?
జగన్ జలదీక్ష ఆరోపణల వీడియోలు వైరల్
ఆంధ్రా-తెలంగాణ జలవివాదంలో రాజకీయకోణం
(మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయంగా సమస్యల సుడిగుండంలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని బయటపడవేయడంతోపాటు, ఆయనను అక్కడి ప్రజల్లో ీహ రోను చేసే ఎత్తుగడలో భాగంగానే పోతిరెడ్డిపాడు ఉత్తర్వుకు ఊపిరిపోసుకుందా? విశాఖ గ్యాస్ లీక్ అనంతర పరిణామాలతోపాటు, మరో రెండు అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారిమళ్లించేందుకు, ‘పోతిరెడ్డిపాడు డైవర్షన్ స్కీము’కు తెరలేచిందా? ఏపీ కోసం, తెలంగాణతో ధైర్యంగా యుద్ధం చేస్తున్న మొనగాడుగా.. జగన్మోహన్‌రెడ్డి చూపించే, రాజకీయ జలయుద్ధానికి కొత్త అంకం ప్రారంభమయిందా?  అందులో భాగంగానే ఈ మాటల మంటలు మండుతున్నాయా?.. నువ్వు కొట్టినట్లు నటించు, నేను ఏడ్చినట్లు నటిస్తానన్న రాజకీయ నాటకం రక్తి కడుతోందా?.. ఆంధ్ర-తెలంగాణలోని విపక్ష నేతల ఆరోపణలు, మీడియాలో జరుగుతున్న చర్చలు.. ఇలాంటి అనుమానాలకు ఆస్కారమిస్తున్నాయి. ఇదే సమయంలో నాడు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా.. జగన్ కర్నూలులో నిర్వహించిన జలదీక్షలో తెలంగాణకు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా జగన్ చేసిన ఆరోపణలు, దానిపై కేసీఆర్-కేటీఆర్,హరీష్ ఎదురుదాడికి సంబంధించిన వీడియోలు, కాంగ్రెస్-బీజేపీ సోషల్ మీడియా బృందాలు వైరల్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో  విపక్షాల కలి‘విడి’ సమరం

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీళ్లు ఏపీకి తీసుకువెళ్లేలా ఏపీ సీఎం జగన్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వు ఆంధ్రా-తెలంగాణలో వివాదం సృష్టిస్తోంది. ఈ నిర్ణయం ఏపీలో కంటే, తెలంగాణలోనే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని విపక్షాలన్నీ పార్టీలకు అతీతంగా, ఈ అంశంపై విడివిడిగా ఒక్కగళంతో కేసీఆర్ సర్కారుపై యుద్ధం ప్రకటించాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపి రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, నాగం జనార్దన్‌రెడ్డి; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్,  ఎంపి అర్వింద్,  రామచందర్‌రావు, డికె అరుణ, సంకి నేని, చింతల రామచంద్రారెడ్డి; టీజేఎస్ నేత కోదండరామ్, తెలంగాణ నేతలయిన జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణిరుద్రమ తదితరులంతా.. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.

కేసీఆర్‌కు తెలిసే జరిగిందంటున్న రేవంత్‌రెడ్డి

ప్రధానంగా.. కేసీఆర్‌కు తెలిసే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారాన్ని, కిందిస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.  వారిద్దరి చీకటి ఒప్పందాలు, రాజకీయ-వ్యాపార లావాదేవీలలో భాగంగానే, ఈ జీఓ జారీ అయిందని ఒకటే గళంతో ఆరోపిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా గత మూడురోజుల నుంచి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఇదే విషయాన్ని, పదేపదే ప్రస్తావిస్తుండటంతో, తెలంగాణలో అదే దిశగా చర్చలకు తెరలేచినట్టయింది. గతంలో అడ్డుకుంటామన్న కేసీఆర్, ఇప్పుడు నీటిని తరలించేందుకు సహకరిస్తున్నారని రేవంత్-షబ్బీర్ తాజాగా ఆరోపించారు.

ప్రగతిభవన్‌లోనే ప్రాణం పోశారన్న రేవంత్

‘‘కేసీఆర్ అనుమతితోనే జగన్ 203 జీఓ తెచ్చారు. అసలు ఆ జీఓ ప్రగతిభవన్‌లోనే తయారయితే, దానిని ఏపీలో విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్నాటకం ఆడుతున్నారు.  అందుకే కే టీఆర్-హరీష్ మాట్లాడటం లేదు. మేం ఆందోళన చేసిన తర్వాతనే కేసీఆర్ స్పందించారు. కమిషన్లకు కుక్కర్తిపడ్డ కేసీఆర్, ఏపీకి అదనంగా నీటిని దోచుకుపోతున్నా జగన్ ఒత్తిడికి లొంగి పట్టించుకోవడం లేద’’ని రేవంత్ పదేపదే కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. ఆంధ్రాలో జగన్‌ను సమస్యల నుంచి బయటపడేందుకు కేసీఆర్ ఈవిధంగా సహకరిస్తున్నట్లుందని అనుమానం వ్యక్తం చేశారు.

ఇద్దరిదీ మ్యాచ్‌ ఫిక్సింగేనన్న భట్టి,నాగం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో అడుగు ముందుకేసి,  కేసీఆర్-జగన్ మ్యాచ్ ఫిక్సింగ్‌తోనే ఈ జీఓ ఊపిరిపోసుకుందని ఆరోపించారు. ‘కేసీఆర్-జగన్ రోజూ మాట్లాడుకుంటున్నారంటున్నారు. కేసీఆర్‌కు తెలియకుండానే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ జగన్ జీఓఇచ్చారా? అపెక్స్ కమిటీలో చర్చింకుండానే జీఓ విడుదలయిందా? కేసీఆస్‌కు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? ఆయన కుటుంబం, పార్టీ ముఖ్యమా? అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ‘కేసీఆర్-జగన్ ప్రాజెక్టు విషయంలో మాట్లాడుకునే చేస్తున్నారా’ అన్న అనుమానాలు వస్తున్నాయన్న’ ఆరోపణలు  చర్చనీయాంశమయింది.

కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి అయితే కేసీఆర్‌పై తీవ్రస్ధాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆ సందర్భంగా ఆయన.. జగన్‌కు తమ సహకారం ఉంటుందని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా ప్రదర్శించారు. ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అటు.. లాక్‌డౌన్ తర్వాత చలో పోతిరెడ్డిపాడు నిర్వహిస్తామని తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి వెల్లడించారు.

కమలం సమరం..

తెలంగాణ బీజేపీ  నేతలు కూడా కేసీఆర్-జగన్ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరుగుతోందని, ఏపీలో జగన్‌ను సమస్యల నుంచి బయటపడేసేందుకే ఈ జీఓకు ప్రాథం పోసుకుందన్న కోణంలోనే ఆరోపణలు గుప్పిస్తుండటం ప్రస్తావనార్హం. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో, జీఓకు నిరసనగా దీక్ష నిర్వహించారు. ‘కేసీఆర్-జగన్, రాజకీయంగా-ఆర్ధికంగా రహస్య ఒప్పందం, అవగాహనతో వెళ్లి, తెలంగాణ పొట్టకొడుతున్నారు. ఒకరికి మేలు చేసేలా మరొకరు వ్యవహరిస్తున్నారు. అందులో భాగమే ఈ జీఓ.  కేసీఆర్ ఉద్యమకారుడిగా ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు ఇంకోలా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్రాలో జగన్‌కు రాజకీయంగా ఉపయోగపడేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడేమో సమస్యలను నుంచి పక్కదారిమళ్లించేందుకే జీఓ తెచ్చి, జగన్ తన మిత్రుడైన కేసీఆర్‌కు సహాయపడుతున్నారు. ఈవిధంగా ఇద్దరూ రాజకీయంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. దీన్ని అడ్డుకుంటాం. ఇద్దరూ రోజూ మాట్లాడుకుంటారని చెబుతున్నారు. సీమను సస్యశ్యామలం చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారు. అంటే  తెలంగాణ పొట్టకొట్టడమా? సీమ సస్యశ్యామలమయితే మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ హక్కులను తాకట్టుపెడితే సహించేది లేద’ని సంజయ్ హెచ్చరించారు.

ఆ వీడియోలే సాక్షి..

గతంలో కేసీఆర్-జగన్ ఏం మాట్లాడారో, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ ఏం మాట్లాడారో, జగన్‌ను విమర్శిస్తూ కేటీఆర్, హరీష్ ఏం మాట్లాడారో సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలే చెబుతున్నాయని గుర్తు చేశారు. జగన్ కూడా అసెంబ్లీలో కేసీఆర్ మాగ్నానిమిటి చూపిస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరో బీజేపీ నేత డికె అరుణ కూడా, కేసీఆర్-జగన్ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్‌కు ఇదే నిదర్శనమని ఆరోపించారు.జలదీక్షలో తెలంగాణ ప్రాజెక్టులపై జగన్ ఫైర్..


ఈ సందర్భంగా జగన్ విపక్షనేతగా ఉన్నప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిర్వహించిన జలదీక్షకు సంబంధించిన  వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఆ సందర్భంగా ఆయన కేసీఆర్‌ను హిట్లర్‌తో పోల్చడంతోపాటు, ఆ నీళ్లు ఎవడబ్బ సొమ్మని కన్నెర్ర చేశారు. బాబు-కేసీఆర్ కుమ్మక్కయ్యారని, కేసుల కోసమే బాబు మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాజెక్టులతో సీమ ఎండిపోతోందని విరుచుకుపడ్డారు.

ఇండియా-పాక్ వైరంతో పోల్చిన జగన్

‘తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టులతో సీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణాడెల్టాకు నష్టం. కేసీఆస్ తీరుతో బ్రహ్మంగారు చెప్పినట్లు  నీటియుద్ధాలే. రెండు రాష్ట్రాలు ఇండియా-పాకిస్తాన్‌లా మారవచ్చు. ఆయన హిట్లర్‌లా మాట్లాడటం మానుకోవాలి. తెలంగాణ ప్రాజెక్టులతో, మా రాష్ట్రం ఎడారిగా మారుతుంటే చూస్తూ ఊరుకోవాలా’ అని తెలంగాణపై నిప్పులు చెరిగిన వీడియోలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన అదే జగన్, ఆ ప్రాజెక్టు కార్యక్రమానికి కేసీఆర్‌తో కలసి ఎలా హాజరయ్యారన్న ప్రశ్నలు.. దీక్ష సమయంలో కేటీఆర్-హరీష్ కలసి, జగన్‌పై చేసిన మాటల దాడి వీడియోలు  సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

జగన్‌ను కాపాడేందుకేనంటున్న ఏపీ జనం..

అయితే.. ఏపీలో విమర్శలు, చర్చలు మాత్రం.. వివిధ సమస్యల్లో ఇరుకున్న జగన్‌ను బయటపడేసి, ఈ అంశంతో హీరోను చేసే వ్యూహం అమలవుతోందన్న ఆసక్తికర వాదనకు తెరలేచింది. విశాఖ ఎల్జీపాలిమర్స్‌లో గ్యాస్ లీకయి 12 మంది మృతి చెందగా, వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. వారికి నష్టపరిహారంలో జరుగుతున్న ఆలస్యం, బాధితుల గోడుపై విపక్షాలు యాగీ చేస్తున్నాయి. ఎల్జీని కాపాడేందుకే జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇక అధిక విద్యుత్ బిల్లులపై సామాన్యుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైనం, జగన్ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించింది. దానిపై వివరణ ఇచ్చుకోలేక మంత్రులు సతమతమవుతున్నారు.  మద్యం షాపులకు అనుమతిపై మహిళల ఆగ్రహాశానికి, మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇవి సరిపోవన్నట్లు, మడ అడవులో జరుగుతున్న అరాచకాలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి. హైకోర్టులో ఎదురవుతున్న ఎదురుదెబ్బలు సరేసరి.

ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జగన్‌ను రక్షించేందుకు, తెలంగాణ కేంద్రంగా వ్యూహరచన జరిగిందన్న భావన ఏపిలోని వివిధ వర్గాల్లో బలపడుతోంది. జగన్ జలదీక్ష సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించి, కేసీఆర్‌ను హిట్లర్ అని ధ్వజమెత్తిన జగన్, అదే కేసీఆర్‌తో కలసి ఉంటున్నారంటే.. తెర వెనుక ఏం జరుగుతోందో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

1 COMMENT

  1. […] కానీ.. జలజగడంపై ఇప్పటివరకూ అధికారుల స్థాయిలో, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్న రెండు రాష్ట్రాలు.. కీలకమైన అపెక్స్ కౌన్సిల్‌కు మినిట్, భేటీ కావలసిన తేదీని మాత్రం ఖరారు చేయకపోవడం బట్టి… ఆంధ్రా-తెలంగాణ మధ్య జరుగుతున్న జలజగడం అంతా బంతిపూలయుద్ధంగానే స్పష్టమయిపోయింది. నిజంగా తమ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తాడోపేడో తేల్చుకోవాలనుకుంటే, అపెక్స్ కౌన్సిల్ ముందుకెళ్లి తీరాలి. మరి రెండు రాష్ట్రాల పాలకులలోనూ, అలాంటి సీరియస్‌నెస్ కనిపించడం లేదంటే.. ఈ పంచాయతీలు, ఆరోపణలు, పరస్పర ఫిర్యాదులన్నీ.. ఎవరికీ దెబ్బలు తగలకుండా జరుగుతున్న‘బంతిపూల యుద్ధం’గానే  అర్ధం చేసుకోవలసి ఉంటుంది. సమావేశం జరిగి నెలరోజులయి, జలవివాద వివరాలను నీటి యాజమాన్య బోర్డులు కేంద్రజలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించినా.. ఇప్పటివరకూ ఇద్దరు ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ తేదీలను అందించడం లేదంటే.. కౌన్సిల్ ఎదుట హాజరయ్యే ఉద్దేశం లేదన్న అనుమానాలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.ఇది కూడా చదవండి: ఏపీలో జగన్‌ను..  హీరోను చేసే ఎత్తుగడ?  […]