ప్రపంచం మెచ్చిన మానవతావాది మోదీ

395

సకలజనులకు ప్యాకేజీ బీజేపీకే సాధ్యం
నిర్మలాసీతారామన్ ఉద్దీపనతో అన్ని వర్గాలకు న్యాయం
బీజేపీ మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు
వరంగల్: అమెరికా వంటి అగ్రరాజ్యమే కరోనా సృష్టించిన అల్లకల్లోలాన్ని కూడా వ్యాపార కోణంలో చూస్తే, ప్రధాని మోడీ మాత్రం మానవతావాదంలో ఆలోచించి దేశంలోని అన్నివర్గాలకూ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారని మాజీ ఎంపీ, తెలంగాణ బీజేపీ అగ్రనేత గరికపాటి మోహ న్‌రావు వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా, అన్ని వర్గాలకూ న్యాయం చేసే ప్యాకేజీ ప్రకటించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. దేశప్రజలు కూడా మోదీని అనుసరించి, ఆయన బాటలో నడుస్తుండటం శుభసూచకమన్నారు.

లాక్‌డౌన్  నేపథ్యంలో,  పనులు లేక ఇబ్బందులు పడుతున్న వర్గాలను ఆదుకోవాలని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా ఇచ్చిన పిలుపు మేరకు.. ములుగు జిల్లాలో గరికపాటి ఆధ్వర్యాన వెయ్యి మంది మునిసిపల్ కార్మికులు, పేద బీజేపీ కార్యకర్తలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మాజీ ఎంపి చాడ సురేష్‌రెడ్డి హాజరయిన  ఈ కార్యకమ్రానికి ముఖ్య అతిధిగా వచ్చిన  గరికపాటి మోహన్‌రావు, దేశంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితిని వివరించారు.

లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భయపడితే, మోదీ మాత్రం ఆర్థిక వ్యవస్థ కంటే మనుషులే ముఖ్యమన్న కోణంలో, లాక్ డౌన్ ప్రకటించారని గుర్తు చేశారు. మోదీ తీసుకున్న నిర్ణయంవల్లే ప్రపంచంలో అన్ని దేశాల కంటే, మన దేశంలోనే తక్కువ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. వివిధ వర్గాల కోసం, ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ, ప్రపంచంలోనే అత్యుత్తమమైనదన్నారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న సిద్ధాంతంతో, అటు ప్రభుత్వ పరంగా కేంద్రం ఇటు పార్టీ పరంగా బీజేపీ పేదలకు చేయూతనిస్తోందని చె ప్పారు.

ప్రధాని నిధికి ప్రతి పార్టీ కార్యకర్త వందరూపాయలివ్వాలన్న పిలుపునకు స్పందించిన కార్యకర్తలు, 2 వేల కోట్ల రూపాయలు సమకూర్చారన్నారు.  ఇంత క్లిష్ట్ట పరిస్థితిలోనూ పార్టీ కార్యకర్తలు, జాతిజీవం కోసం పనిచేయడం గర్వకారణమన్నారు. కార్యకర్తలు సమకూర్చిన 2 వేల విరాళాల్లో, వెయ్యి కోట్లరూపాయలు కేవలం వలస జీవులకే ఖర్చుపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. వలస కార్మికుల తరలింపులో కేంద్రమే 85 శాతం భరిస్తోందని చెప్పారు. మోదీ-అమిత్‌షా-నద్దా స్ఫూర్తితో ప్రతి ఒక్క బీజేపీ నేత పేదలను ఆదుకోవాలని పిపునిచ్చారు.

మాజీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ నేత  చాడ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, కరోనాలో కూడా టీఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే సంక్షేమపథకాలు అమలుచేస్తున్న రాష్ట్రప్రభుత్వం, నయాపైసా నిధులివ్వడం లేదని నిందలు వేయడం దారుణమన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను ఎండబెట్టేలా, ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించాలన్నారు. ఈ విషయంలో కేసీఆర్-జగన్ రహస్య అజెండాతో పనిచేస్తున్నందుకే కే సీఆర్ ఏపీ సీఎంను పల్లెత్తు మాట అనడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందించిందని గుర్తు చేశారు. పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి విద్యాసాగర్‌రెడ్డి,  హైదరాబాద్ జిల్లా బీజేపీ నేత మేకల సారంగపాణి, ఈగ మల్లేష్, దుష్యంత్‌రెడ్డి, బిర్ల శ్రీనివాస్, పుల్లారావు యాదవ్, పుల్లరి అశోక్, కార్పొరేటర్ బొట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.