అమరన్నను తొలగించాలా? రామయ్యా.. అత్యాశ పనికిరాదయ్యా?

680

దేవులపల్లి అమర్‌ను తొలగించాలన్న వర్ల రామయ్య
గతంలో పీసీఐ నుంచి తొలగించాలని  ఏపీఎంఫ్ ఫిర్యాదు
సాహుపై వేటుతో.. అమర్‌ను పోల్చిన వర్ల
రామయ్య డిమాండ్‌పై, మీడియాలో చర్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన జర్నలిజంలో కాకలుతీరిన కలం యోధుడు. చంద్రబాబు రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయితే.. ఆయన జర్నలిజంలో ఫార్టీఫోర్ ఇయర్స్ ఇండస్ట్రీ. జర్నలిస్టు ఉద్యమ పితామహుడు. సీఎంలతో సన్నిహితంగా ఉండే జర్నలిస్టు పెద్దన్న. ఆయన చుట్టూ చేరిన వారి దృష్టిలో, ఆయన ఏపక్షం వహించని నిఖార్సయిన జర్నలిస్టు. కొందరి మాదిరిగా ఉద్యోగాలు, పదవుల కోసం పాలకుల చూరుపట్టుకుని వేళ్లాడే రకం కాదన్నది ఆయన అనుయాయుల నమ్మిక. ఆయన ఎంత వద్దని చెప్పినా, ఎలాంటి లాబీయింగ్ చేయకపోయినా,  ప్రభుత్వ పెద్దలే వెంటపడి మరీ పదవులు తీసుకోమని బతిమిలాడించుకునే ఉన్నత వ్యక్తిత్వం ఆయనది. తనకు నచ్చని నిర్ణయం తీసుకున్న పాలకుల వద్దకు వెళ్లి, రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వైఎస్ వద్దకు వెళ్లిన విలువలున్న జర్నలిస్టు. అంతలావు జర్నలిస్టును పట్టుకుని, వర్లరామయ్య అనే నాయకుడు ఆయనను సలహాదారు పదవి తొలగించాలని డిమాండ్ చేస్తారా? ఎంత ధైర్యం? సలహాదారు అవతారమెత్తిన సదరు జర్నలిస్టు నాయకుడంటే, ఈ రామయ్య అసలు  ఏమనుకుంటున్నారు? ఆయనేమైనా నీలం సంజీవరెడ్డి, లాల్‌బహుదూర్‌శాస్త్రి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి లాంటి సతె్తకాలపు మనిషనుకుంటున్నారా?ఆధునిక-అభ్యుదయ-వామపక్ష భావాలు కలబోసిన నేత.

మనిషికి ఆశ మంచిదే. అత్యాశ పనికిరాదు. పాపం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండు  చూస్తే అదే అనిపిస్తుంది. పోలవరం  సలహాదారు సాహును, జగనన్న సర్కారు ఆ పదవి నుంచి తొలగించింది. అలాగయితే, ముందు విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో జాతీయ మీడియా ప్రశ్నలకు.. జవాబు చెప్పకుండా పారిపోయిన ఏపీ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ను కూడా  తొలగించాలని, రామయ్య డిమాండ్ చేయడం చర్చనీయాంశమయింది. అంటే.. తాను డిమాండ్ చేయగానే అమర్‌ను జగనన్న తొలగిస్తారని, లేకపోతే ఆయనంతట ఆయనే ఉన్నత విలువలు-నైతిక విలువలు పాటిస్తూ, మనస్తాపంతో రాజీనామా చేస్తారన్నది రామయ్య పిచ్చి భ్రమ కావచ్చు.

అవును. అసలు అమరన్నను ఎందుకు తొలగించాలంట? ఆయన ఏం తప్పు చేశారని తీసేయాలి? జాతీయ టీవీ చానెల్‌లో యాంకరమ్మ అడిగిన ప్రశ్నలకు, జవాబు చెప్పలేక నీళ్లునమిలారే అనుకోండి. తాను హైదరాబాద్‌లో ఉండి, వైజాగ్ ఘటనపై ఎలా స్పందిస్తానని నోరు జారారో అనుకోండి. అంతమాత్రానికే ఆయనను తొలగించేయాలా? ఆ లెక్కన చూస్తే, అసలు ఎంతమంది మంత్రుల్లో పనిమంతులున్నారు? జగనన్న కూడా అమరన్న పనిమంతుడే అనుకుని, సలహాదారు పదవి ఇచ్చి ఉండవచ్చు. విశాఖ ఘటనలో నిజాలేమిటో జాతీయ మీడియాకు వివరించి, జగనన్నైపై వారు సంధిస్తున్న విమర్శనాస్త్రాల నుంచి సీఎంను తప్పించడంలో అమరన్న విఫలమయి ఉండవచ్చు.  అంతమాత్రానికే వేటు వేయాలా? నిజంగా అలా చేస్తే, క్యాబినెట్‌లో ఉండదగ్గ మంత్రులెంతమందో తలచుకుంటేనే గుండెపగలదూ?

నిజానికి.. ఏపీ సర్కారు ఇచ్చే జీతభత్యాలు తీసుకుంటూ..  పాపం హైదరాబాద్‌లో కొలువు దీరిన  ఏపీ మీడియా సలహాదారు అమర్  తన పనేదో తాను చేసుకుంటున్నారు. ఆ చర్చలో,  తాను హైదరాబాద్‌లో ఉండి విశాఖ ఘటనపై ఏం చెప్పమంటారని చెప్పే నిజాయితీపరులెంతమంది ఉంటారు?  పూర్వాశ్రమంలో ఓ జాతీయ జర్నలిస్టు సంఘ నేతగా పనిచేసిన ఆయనను పట్టుకుని..  ఓ  యాంకరమ్మ చిన్నంతరం, పెద్దంతరం లేకుండా నిలదీసి, నీళ్లు తాగించడం అన్యాయమే కదా? అలా అడ్డగోలుగా ప్రశిస్తే అమరన్నకు కోపం రాదు మరి? జాతీయ మీడియా అయినంతమాత్రాన, వాళ్లకు కొమ్ములేమైనా ఉన్నాయా? అసలు వైజాగ్‌లో జరిగిన ఘటనకూ, హైదరాబాద్‌లో మాత్రమే ఉండే అమరన్నకూ ఏంటి సంబంధం? అది అక్కడి సీఎం, మంత్రులు, అధికారులకు సంబంధించిన వ్యవహారం. ఆ వ్యవహారంలో అర్ధరూపాయి కూడా సంబంధం లేని అమర్‌ను పట్టుకుని, మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని కోట్లమంది చూస్తుండగా నిగ్గదీయడానికి, ఆ యాంకరమ్మది గుండెనా? చెరువా?

అసలు అమర్‌ను నియమించుకున్నదే జాతీయ మీడియా వ్యవహారాల్లో సర్కారును కాచుకుంటారని! జాతీయ మీడియాలో జగనన్నకు మంచి పబ్లిసిటీ తీసుకువస్తున్న ఆయన.. హైదరాబాద్‌లో ఒక్కరే కష్టపడిపోతున్నారని ఇటీవలే ఇద్దరు సహాయకులను కూడా 40 వేలు పోసి నియమించారు. ఇదికూడా చదవండి: సీఎస్ జీతం రెండున్నర..అమర్ జీతం మూడున్నర లక్షలట! ఆయన జాతీయ జర్నలిస్టు సంఘంలో పెద్దన్నపాత్ర పోషిస్తున్నారు కాబట్టి.. ఆయన నియామకంతో తన సర్కారుపై జాతీయ మీడియాలో, విమర్శలు రావన్న అంచనాతోనే జగన్ ఆయనకు ఆ పదవి ఇచ్చారు. అయితే.. అదేం ఖర్మమో గానీ, అమర్ ఆ కుర్చీలో కూర్చున్నతర్వాత, జాతీయ మీడియాలో జగనన్నకు అన్నీ వ్యతిరేక కథనాలే వస్తున్నాయి. ప్రజావేదిక కూల్చివేత, బాబును బయటకు రానీయకుండా పోలీసులు, ఆయన నివాసంలోనే నిర్బంధించిన ఘటన నుంచి.. మొన్నటి విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో చావుల వరకూ జాతీయ మీడియా జగన్ సర్కారును దూదేకినట్లు ఏకిపారేస్తోంది. విమర్శల మోత మోగిస్తోంది. ఇది కూడా చదవండి: మీడియా గొంతు నొక్కి ఏం సాధిస్తారు?

అమర్ అంత పెద్ద జర్నలిస్టు జగన్‌కు పెట్టనిగోడగా నిలుచున్నప్పటికీ, ఆ విధంగా జాతీయ మీడియా రెచ్చిపోవడం జగనన్న అభిమానులకే కాదు, జగనన్నను ప్రేమించే జర్నలిస్టులకూ నచ్చడం లేదు. అన్ని లక్షలు పోసి, పరాయి రాష్ట్ర వ్యక్తిని తీసుకువచ్చి సలహాదారు పదవి ఇచ్చినా, వచ్చిన లాభమేమిటన్నది వారి ఆవేదన. అమర్‌ను సలహాదారుగా నియమించినంత మాత్రాన, తెలుగు మీడియా మాదిరిగా జాతీయ మీడియా కూడా భజన చేస్తుందనుకోవడమే జగన్ కోటరీ చేసిన తప్పు. దేవులపల్లి వారు చెప్పినంతమాత్రాన, సొంత మీడియాలో మాదిరిగా జాతీయ మీడియా కూడా.. ఏపీలో జరిగే ఘటనల కళ్లు కప్పుతుందనుకోవడం భ్రమ. అసలు జర్నలిస్టులను నియంత్రించేందుకు ఏపీ సర్కారు గతంలో  తీసుకువచ్చిన నల్ల జీఓనే అడ్డుకోలేని అమరన్న.. ఇక జాతీయ మీడియాలో జగన్ సర్కారుపై వ్యతిరేక కథనాలు రాకుండా ఎలా అడ్డుకుంటారన్నది ప్రశ్న. ఇది కూడా చదవండి: ఎక్కడ..? జర్నలిస్టు విప్లవ వీరులెక్కడ?

ఈ పోటీ యుగంలో ఒకరికి దన్నుగా నిలిచి, తన అస్తిత్వం కోల్పోయేందుకు ఏ జాతీయ మీడియా మాత్రం సిద్ధపడుతుంది? అందులో కోతికి కొబ్బరిచిప్ప దొరికిన మాదిరిగా.. జాతీయ మీడియాకు ఏదైనా సమస్య దొరకాలే గానీ, ఇల్లుపీకి పందిరేసి ఇత్తడి చేయదూ?! జగనన్న ఈ చిన్న లాజిక్ మిస్ అవడం వల్లనే, అమరన్న సలహాదారు అవతారమెత్తారు. అదీ సంగతి! ఇది కూడా చదవండి: గిరీశానికే గురువులు!

అన్నట్లు.. దేవులపల్లి వారు సర్కారీ సలహాదారు అవతారమెత్తిన తర్వాత కూడా, పూర్వాశ్రమంలో ఉన్న ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేయలేదని.. ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబురెడ్డి అనే జర్నలిస్టు, మొన్నీ మధ్యనే నానా యాగీ చేసిన వైనం జర్నలిస్టు లోకాన్ని ఆకర్షించింది. దీనిపై ఆయన పీసీఐ చైర్మన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. గతంలో సాక్షి చానెల్‌లో పనిచేస్తూ, సాక్షి దినపత్రిక కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నట్లు పీసీఐని తప్పుదోవపట్టించి, వర్కింగ్ జర్నలిస్టు కోటాలో అమర్, పీసీఐ సభ్యునిగా నామినేట్ అయ్యారని ఫిర్యాదు చేశారు. తర్వాత ఏపీ ప్రభుత్వ సలహాదారుగా, క్యాబినెట్ హోదా పదవి సంపాదించిన అమరన్న, పీసీఐలో సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని స్పష్టం చేశారు.

ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అమర్ ప్రకటించినప్పటికీ, ఇంకా అదే పదవిలో కొనసాగుతున్నందున ఆయనను తొలగించి, అమర్  స్థానంలో మరొకరిని నియమించాలని మేడే రోజున ఢిల్లీ బాబురెడ్డి అనే జర్నలిస్టు చేసిన ఫిర్యాదు, అమరన్న విశ్వసనీయతను దెబ్బతీసినట్టయింది.  ఢిల్లీబాబురెడ్డి ఫిర్యాదుతో..రాజీనామా చేశానన్న అమర్ మాటలు ఉత్తిదేనని, ఆయన మేడే నాటికి ఇంకా ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇదికూడా చదవండి: జై తెలంగాణ.. జైజై జగన్!

అయినా.. సమర్ధుడికి ద్విపాత్రాభియమయినా, త్రిపాభ్రినయమయినా అది అలంకారమేనన్న విషయం తెలుసుకోలేని అల్పుల గురించి, అమర్ వంటి మహోన్నతులు పట్టించుకోకపోవడమే మంచిది.  ఇదికూడా చదవండి: అమరన్న శీలాన్నే శంకిస్తారా? హమ్మా?!

1 COMMENT

  1. […] దేవులపల్లి అమర్.. ఒక ప్పటి చేయితిరిగిన జర్నలిస్టు. పైగా జర్నలిస్టు సంఘ జాతీయ నాయకుడు కూడా. ఆంధ్రప్రభ, సాక్షి చానెల్‌లో సుదీర్ఘకాలం పనిచేశారు. అనేక జర్నలిస్టు ఉద్యమాలను ముందుండి నడిపించిన మహానేత. జనాలకు ఆయన గురించి అంతవరకే తెలుసు!  కానీ, ఆయనలో దాగున్న విద్యుత్‌రంగ నిపుణుడిని గుర్తించింది మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రమే. విద్యుత్‌రంగం గురించి సంపూర్ణ అవగాహన, దాని పుట్టుపూర్వోత్తరాలను పుక్కిట పట్టిన అమర్‌లోని విద్యుత్‌రంగ అనుభవశాలిని గుర్తించడం.. ఇప్పటివరకూ ఉమ్మడి, విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రులకు సాధ్యం కాలేదు. ఆ ఘనత జగనన్న ఒక్కరికే దక్కింది!  అందుకే మట్టిలోని మాణిక్యాన్ని వెలికితీసినట్లు.. అమరన్నలోని విద్యుత్‌రంగ వైభవాన్ని జెన్‌కోకు వినియోగించుకోవాలన్న మహత్తర ఆలోచనతో, ఆయనకు ఆ సంస్థ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇప్పటివరకూ జెన్‌కో పుట్టిన తర్వాత బయట వ్యక్తులెవరికీ సలహాదారు పదవి ఇచ్చిన దాఖలాలు ‘జనరేటర్లు’ వేసినా కనిపించవు. ఏదేమైనా.. ప్రపంచానికి తెలియని విద్యుత్‌రంగ నిపుణుడిని  పరిచయం చేసిన జగనన్నకు, తెలుగు ప్రజలు రుణపడి తీరాల్సిందే. అమరన్న విద్యుత్‌రంగ నిపుణుడని తెలిస్తే.. బహుశా సొంత రాష్ట్రమైన తెలంగాణ సర్కారు ఆయనను వదులుకునేది కాదేమో?! ఏదేమైనా, అలాంటి అవకాశం ఇప్పుడు ఆంధ్రాకు దక్కడం ప్రజల అదృష్టం.ఇది కూడా చదవండి.. అమరన్నను తొలగించాలా? రామయ్యా.. అత్యాశ … […]