ఒక ప్రాజెక్టుతో.. అన్ని పిట్టలను కొట్టిన జగన్

331

జలజగడంతో విపక్షాన్ని ఇరికించిన వైసీపీ దళపతి
పోతిరెడ్డిపాడుపై పెదవి విప్పని తెలుగుదేశం
ఇంకా వేచిచూసే వ్యూహంలోనే చంద్రబాబు
సర్కారుకు బాసటగా నిలవాల్సి వచ్చిన బీజేపీ
జనసేనాని పవన్ కల్యాణ్ మౌనరాగం
            (మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక్క దెబ్బకు రెండు  పిట్టలంటారు. కానీ, ఆంధ్రా రాజకీయాల్లో ఒక్క ప్రాజెక్టు జీవోతో వైసీపీ దళపతి, సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్ని పార్టీల పిట్టలను ఒకేసారి గురి కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ భుజంపై తుపాకి పెట్టి, సొంత రాష్ట్రంలో ప్రతిపక్షాలను కొట్టిన  జగన్ రాజకీయం ముందు.. ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబు బిత్తరపోగా, విపక్షాలన్నీ జగన్‌ను సమర్ధించడం అనివార్యమయింది. పెద్దగా రాజకీయానుభవం లేని జగనన్న వ్యూహంలో,  సీనియర్లు సైతం చిక్కుకోవలసి వచ్చింది.

టీడీపీ..  మహా సందిగ్థం..

సొంత రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టును వ్యతిరేకిస్తే, ఆ ప్రాంతంలోని తమ పార్టీ వారి నుంచి వ్యతిరేక వస్తుంది. అంత కుమించి.. సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం పోరాడుతుంటే, సమర్థించకపోగా వ్యతిరేకిస్తూ, పక్క రాష్ట్ర సీఎంకు లాభం కలిగిస్తున్నారన్న అపవాదు మూటకట్టుకోవలసి ఉంటుంది. పోనీ వ్యతిరేకించకుండా మౌనంగా ఉందామంటే, ఆ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న మరో ప్రాంతం వారికి కోపం వస్తుంది. మరేం చేయాలి? ముందుకు వెళ్లటమా? వెనక్కి జరగడమా? కొంతకాలం వేచిచూడటమా? .. ఇదీ పోతిరెడ్డిపాడుపై జగన్ సర్కారు ఇచ్చిన జీవోపై.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం సందిగ్ధం.

కమలదళాల మద్దతులో జగన్ సక్సెస్

జగన్ సర్కారుపై యుద్ధం చేస్తున్న కమలదళం కూడా, సర్కారు చర్యను సమర్థించాల్సి వచ్చింది. సీమకు చెందిన బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి, పార్టీ నిర్ణయం కంటే ముందుగానే గళమెత్తి,  సీమవాసిగా.. జగనన్న నిర్ణయాన్ని స్వాగతించారు. పైగా అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని సమర్ధించాలని డిమాండ్ చేశారు.  ఫలితంగా, పార్టీ విధాన నిర్ణయం పేరుతో.. ఇష్టంగానో, అయిష్టంగానో.. రాష్ట్ర పార్టీ కూడా జగనన్నకు బాసటగా నిలవాల్సిన అనివార్య పరిస్థితి. ఆరకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు కూడా,  కూడగట్టడంలో జగన్ సఫలీకృతులయ్యారు. ఏం చేసైనా సరే.. రాయలసీమకు న్యాయం చేయాలని బీజేపీ అధికారికంగానే డిమాండ్ చేసింది కాబట్టి, ఈ అంశంపై జగనన్న ఏం చేసినా కమలదళం అడ్డుచెప్పదన్నట్లే లెక్క.

 

మీనమేషాల లెక్కలలో పవన్

ఇక.. ప్రెస్‌నోట్లపైనే మనుగడ సాగిస్తున్న, జనసేనాని పవన్‌కల్యాణ్ సంగతి ఏమిటన్నది ఇంకా తేలలేదు. ఎలాగూ మిత్రపక్షమైన బీజేపీ సై అంది కాబట్టి, పవనబ్బాయ్ కూడా అవుననక తప్పదు. ఇక ఆంధ్రాలో  గుడ్డికన్ను తెరచినా ఒకటే మూసినా ఒకటే అన్నట్లు..  కాంగ్రెస్ కలసివచ్చినా, కన్నెర చేసినా వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. ఇక కమ్యూనిస్టుల హడావిడే తప్ప, వారి అరుపుల వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. ఇక ప్రజల్లో ఎప్పుడో చైతన్యం ఎప్పుడో చచ్చుబడిపోయింది. అందులోనూ మందుషాపులు తెరిచారు. మరోవైపు కరోనా సాయం అందుకునే పనిలో ఉన్నారు కాబట్టి, జగనన్న ఏం నిర్ణయం తీసుకున్నా జనం కూడా, పట్టించుకునే పరిస్థితిలో లేరు. పోతిరెడ్డిపాడుపై ఉత్తర్వుల నేపథ్యంలో, ఆంధ్రాలో నెలకొన్న వాస్తవ పరిస్థితి ఇదీ!

జగన్ జీవోతో గుంటూరు-ప్రకాశం జిల్లాలకు జలగండం

జగన్ సర్కారు ఇచ్చిన జీఓ వల్ల గుంటూరు, ప్రకాశం  జిల్లాల రైతాంగం దెబ్బతింటుంది. గతంలో వైఎస్ తీసుకున్న ఇలాంటి నిర్ణయంపై దివంగత కోడెల శివప్రసాదరావు, రైతాంగంతో కలసి సాగర్ వద్ద మహా ధర్నా కూడా నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో, సాగర్ ఆయకట్టులో సాగు సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే ప్రకాశంలో 4.43 లక్షల ఎకరాలు, గుంటూరు జిల్లా 6.60 లక్షల ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయం, సహజంగానే  రైతులను ఆందోళనలో పడేసింది. ఈ రెండు జిల్లాలకు చెందిన తెలుగుదేశం శాసనసభ్యులు తక్కువమందే ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నందున ఉద్యమించాల్సిన పరిస్థితి ఉంది.

పల్నాడు-సీమ మధ్య నలుగుతున్న నారా

కానీ, ఇప్పుడు టీడీపీ ఒక ప్రాంత వాసులుగా దానిపై ఉద్యమిస్తే.. అటు రాయలసీమకు చెందిన అదే టీడీపీ నేతలు, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్లీ గతంలో ఆంధ్రా-తెలంగాణ మాదిరిగా పార్టీ రెండుగా చీలిపోవలసి వస్తుంది. నిజంగా అదే జరిగితే, అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి, మరింత ఇరుకునపడుతుంది. ఒకే అంశంపై రెండు ప్రాంతాల్లో భిన్నమైన వైఖరి తీసుకుంటే, అది అధికార పార్టీకి ఆయుధంగా మారుతుంది. ఇప్పటికే, వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి వంటి నేతలు చంద్రబాబునాయుడు వైఖరి ఏమిటని ప్రశ్నిస్తూ, ఆయనను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బహుశా టీడీపీ నాయకత్వం, మౌనవ్రతం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.

జగన్ వ్యూహానికి జయహో..

కాగా.. ఇటీవలి కాలంలో కరోనా, విశాఖ పాలిమర్స్, మద్యంషాపులు, కరెంటు చార్జీల పెంపు అంశంపై దూకుడుగా వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సైతం.. సీఎం జగన్, తన ఉత్తర్వు ద్వారా ఆత్మరక్షణలోకి నెట్టేయడంలో విజయం సాధించినట్లు బాబు మౌనం స్పష్టం చేస్తోంది. సర్కారు జీవోను వ్యతిరేకిస్తే, తెలంగాణ ప్రభుత్వాన్ని సమర్ధించారన్న విమర్శను మూటకట్టుకోవలసి ఉంటుంది. పైగా, రాయలసీమలో పుట్టిన బాబు.. సీమకే ద్రోహం చేస్తున్నారన్న నిందలు మోయవలసి ఉంటుంది.  పోనీ, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తే.. అంతో ఇంతో బలంగా ఉన్న గుంటూరు-ప్రకాశం జిల్లాను దూరం చేసుకోవలసి ఉంటుంది. అందుకే.. ఈ అంశంలో ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటించాలని, తెలుగుదేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అటు తెలంగాణలో ఈ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నందున, అక్కడి పరిస్థితిని కూడా అంచనా వేయాలని భావిస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ జగన్ ఉచ్చులో పడకూడదన్నది టీడీపీ భావనగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజనపై ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ ఉచ్చులో పడి నష్టపోయినందున, ఈసారి పోతిరెడ్డిపాడు అంశంలో మాత్రం, వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నది టీడీపీ నాయకత్వ నిర్ణయం.  ఏది ఏమైనా.. తన నిర్ణయంతో చంద్రబాబును మాట్లాడలేని ఇరకాట పరిస్థితికి నెట్టి.. తనను వ్యతిరేకిస్తున్న బీజేపీ మద్దతు కూడగట్టుకోవడంతో, జగన్ వ్యూహం ఫలించినట్టయింది