మోదీకి.. జగన్ ఝలక్!

184

రైతు భరోసా ప్రకటనలో ప్రధాని ఫొటో మాయం
గతంలో మోదీ ఫొటోతో ప్రకటన
తాజా ప్రభుత్వ ప్రకటనలో రాజన్న ఒక్కడే
మంత్రుల ఫొటోలూ గాయబ్
సర్కారు ధిక్కారంపై కమలదళాల కన్నెర
జగనన్నతో పెట్టుకుంటే అంతేనా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఏపీ సీఎం జగనన్నకు మొహం మొత్తిందా? ఆయన తన పనులేమీ చేయడం లేదని జగనన్న ఆగ్రహంతో ఉన్నారా? అందుకే ప్రధానికే ఝలక్ ఇచ్చారా?.. ఏపీ సర్కారు ఇచ్చిన ప్రకటన చూస్తే, అలాంటి అనుమానాలే తెరపైకొస్తున్నాయి. జగన్ సర్కారు తీరుపై బీజేపీ అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించింది.

‘వైఎస్‌ఆర్ రైతుభరోసా-పీఎం కిసాన్’ ప్రభుత్వ ప్రకటనలో ఈసారి ప్రధాని నరేంద్రమోదీ ఫొటో కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. గతంలో ఇదే పథకానికి సంబంధించి.. అంటే అక్టోబర్ 15, 2019న ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో ప్రధాని మోదీ ఫొటో ఉంచారు. నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్శిటీ వేదికగా, వైఎస్‌ఆర్ రైతుభరోసా-పీఎం కిసాన్‌ను ప్రారంభించారు. ఇప్పుడు, ఇదే పథకం కింద 6500 కోట్ల రూపాయలలో భాగంగా, 2,800 కోట్లు జమచేసిన సందర్భంగా ప్రభుత్వ ప్రకటన విడుదల చేశారు. కానీ అందులో ఎక్కడా ప్రధాని మోదీ ఫొటో భూతద్దం పెట్టి వెతికినా, లేకపోవడం విమర్శలకు దారితీసింది. దీనిపై బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రపథకాలను జగన్ ప్రభుత్వం తమ పథకాలని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటోందని విరుచుకుపడ్డారు.

‘ఈ పథకానికి కేంద్రం కూడా నిధులిస్తోంది. అయినా ప్రధాని ఫొటో లేకుండా జగన్ ఫొటో మాత్రమే ఎలా వేస్తారు? జగన్ ఎన్నికల ముందు, రైతులకు ఒకేసారి ఏడాదికి 12,500 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామని హామీ ఇచ్చారు. రైతులు కూడా కేంద్రం ఇస్తున్న 6 వేలు కాకుండా, జగన్ 12500 రూపాయలు విడిగా ఇస్తారని నమ్మి ఓట్లేశారు. ఎందుకంటే.. జగన్ ఈ హామీ ఇవ్వకముందే,  కేంద్రం దేశంలోని రైతులకు పంట పెట్టుబడిసాయం కింద, ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున మూడువిడతలుగా ఇస్తామని చెప్పింది. ఆ మేరకు రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తోంది. కానీ జగన్ మాత్రం కేంద్రం ఇస్తున్న 6 వేల రూపాయలను కూడా ఈ పథకంలో కలిపి, 12500 రూపాయలు ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. పైగా ఇదంతా తానే చేస్తున్నానని ప్రచారం చేసుకోవడం దారుణం. ఈ పథకంలో కేంద్రం వాటా 45 శాతంపైనే ఉంది’’ అని కోట సాయి గుర్తు చేశారు.

అయితే తొలుత ఈ పథకానికి సంబంధించిన ప్రకటనపై మోదీ ఫొటో ఉంచిన జగన్ సర్కారు, ఈసారి మాత్రం ఆయన ఫొటో లేకుండానే విడుదల చేయడం చర్చనీయాంశయింది. నిజానికి ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలు, జగన్ ఆమోదం లేకుండా విడుదలయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ప్రభుత్వ ప్రకటన ఏదైనా సరే, దాని  మోడల్ సాక్షి కార్యాలయం నుంచి పంపిస్తారు. తర్వాతనే అందులో మార్పు చేర్పులపై జగన్ అధికారులతో చర్చిస్తారు. ఈ సందర్భంగా సూక్ష్మస్థాయి వరకూ వెళ్లి, ఫొటో సైజు, రైటప్ వంటి అంశాలపై అధికారులకు సూచనలిస్తుంటారు. ఆయన శ్రద్ధపై అధికారులు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఉదాహరణకు.. వైఎస్ తలపాగాతో ఉన్న చిత్రమే తీసుకుంటే.. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలో, వైఎస్ తలపై ఉన్న పాగాలో వైసీపీ రంగులు కనిపిస్తాయి. వైఎస్ జీవించినప్పుడు అసలు వైసీపీ లేదు. మరెలా వైఎస్ తలపాగాపై ఆ రంగు వచ్చిందన్నది చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అది కూడా జగన్ సూచనల మేరకు.. కలర్లు గ్రాఫిక్ చేసి, దానిని ప్రకటనలో చేర్చుతున్నారు.  అదీ వైఎస్ తలపాగా కథ!

సరే.. ఇంతకూ జగనన్నకు, ప్రధానిపై ఆగ్రహం రావడానికి కారణమేమిటన్న దానిపై జరుగుతున్న చర్చ ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపే ప్రతిపాదనలపై మోదీ స్పందించడం లేదని జగనన్న అసంతృప్తితో ఉన్నారట. పైగా  తాము సూచించిన అధికారులకు డెప్యుటేషన్ కూడా ఇవ్వకుండా, తిరస్కరిస్తున్నారన్న ఆగ్రహం జగనన్నలో ఉందంటున్నారు. అందుకే ప్రధాని ఫొటో లేకుండానే ప్రకటన విడుదల చేసి, జగన్ ఆయనకు ఝలక్ ఇచ్చారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇంకో విశేషమేమిటంటే.. ఇదే పథకానికి సంబంధించి,  గత ప్రకటనలో మంత్రి కన్నబాబు ఫొటో ఉంచిన ప్రభుత్వం, ఈసారి ఆయన ఫొటో లేకుండా కేవలం పేరుతోనే సరిపెట్టారు. జగనన్నతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసి కూడా, కేంద్రం ఆయనను లెక్కచేయకపోతే.. ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి!

తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న సమయంలో కూడా.. చంద్రబాబు నాయుడు సర్కారు ప్రభుత్వ ప్రకటనల్లో ఇలాగే వ్యవహరించింది. మోదీ ఫొటో లేకుండానే ప్రకటలిచ్చేది. అప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దానిపై విరుచుకుపడ్డారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులతో నడుస్తున్న పథకాలకు సంబంధించిన ప్రకటనల్లో, ప్రధాని మోదీ ఫొటో ఎందుకు వేయడం లేదని ఆయన అప్పట్లో అగ్గిరాముడయ్యారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మరిప్పుడు ప్రధాని ఫొటో లేకుండానే విడుదలయిన, ప్రభుత్వ ప్రకటనపై ఆయనేమంటారో చూడాలి!