సహానీకి పొడిగింపు సాధ్యమేనా?

292

గుజరాత్, మహారాష్ట్ర సీఎస్‌లకు పొడిగింపు ఇచ్చిన కేంద్రం
శ్రీలక్ష్మి, స్టీఫెన్ రవీంద్ర డెప్యుటేషన్‌కు నిరాకరణ
శ్రీనివాసరాజుకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్
మరి సహానీకి అనుమతిస్తారా?
సీఎస్ రేసులో సమీర్‌శర్మ, సతీష్‌చంద్ర, ఆదిత్యనాధ్‌దాస్, నీరబ్
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ పదవీకాలాన్ని మరో ఆరునెలల పాటు పొడిగించాలని.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అభ్యర్ధనను కేంద్రం ఆమోదించే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో రెండు రాష్ట్రాల సీఎస్‌లకు పదవీకాలం పొడిగించిన కేంద్రం, ఏపీ విషయంలో ఎలాంటి వైఖరి అనుసరిస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.

జగన్ నేతృత్వంలోని వైసీపీ-కేంద్రంలోని బీజేపీ మధ్య జాతీయ స్థాయిలో, కొన్ని అంశాలలో సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. దానికోసం వైసీపీ-ఏపీకి చెందిన బీజేపీకి చెందిన కొందరు నాయకులు కృషి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. కొందరు బీజేపీ ప్రముఖులయితే, జగన్ సర్కారు ఇబ్బందుల్లో పడినప్పుడల్లా రాష్ట్రంలో ప్రత్యక్షమయి, సొంత పార్టీనే ఇరుకునపెట్టి, జగనన్నను ఆదుకుంటున్న వైనం కూడా బహిరంగమే. ఈ తరహా బీజేపీ నేతలు.. ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ-విజయసాయిరెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధంలో,  మాయమయిపోయారు. సొంత పార్టీ అధ్యక్షుడి తరఫున గళం విప్పిన దాఖలాలు లేవు. రాష్ట్ర నేతలంతా ఒక్కతాటిపైకొచ్చి విజయసాయిరెడ్డిపై ఎదురుదాడి చేస్తే, రాష్ట్రానికి చెందిన వారని చెప్పుకునే కొందరు సీనియర్లు మాత్రం,  కలుగులోనే దాక్కున్న వైనం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమయింది. బహుశా, వైసీపీని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేకనో, ఇతరత్రా ఉన్న మొహమాటాలు, తెరచాటు స్నేహాలే దానికి కారణమన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.

కీలకమైన బిల్లుల విషయంలో కేంద్రానికి వైసీపీ స్నేహహస్తం అందిస్తూనే ఉంది. బీజేపీకి సన్నిహితుడైన ముఖేష్ అంబానీ మిత్రుడు నత్వానీకి.. వైసీపీ నుంచి రాజ్యసభ సీటు కూడా ఇవ్వడం ద్వారా, బీజేపీ నాయకత్వాన్ని వైసీపీ మెప్పించింది. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ నాయకత్వం జగన్ విషయంలో, అంశాల వారీగానే స్నేహహస్తం అందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే..  తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి డెప్యుటేషన్‌పై తీసుకువచ్చేందుకు జగన్ సర్కారు కొన్ని నెలల నుంచీ చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం అడ్డుకుంటోంది.  అమిత్‌షాపై కేసు పెట్టిన ఓ ఐపిఎస్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చి, ఆయనకు కీలకబాధ్యత అప్పగించడమే దానికి కారణమన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. అప్పటి నుంచీ ఏపీకి సంబంధించిన అంశాలపై, డీఓపీటీ నుంచి ప్రతికూల నిర్ణయాలు ప్రారంభమయ్యాయని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నిజంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అపూర్వ బంధం ఉంటే, వారిద్దరినీ ఏపీకి అనుమతించాల్సి ఉంది. పైగా, శ్రీలక్ష్మి కోసం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రమైన లాబీయింగ్ చేశారు. జగన్ ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఆమె ఆయన చుట్టూ తిరిగే దృశ్యాలు మీడియాలో విమర్శలకు గురయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితురాలైన శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకువచ్చేందుకు, ఆరకంగా వైసీపీ చేసిన ప్రయత్నాలు నీరుగారిపోయాయి. అయితే, విచిత్రంగా టీటీడీ జేఈఓగా చేసిన శ్రీనివాసరాజుకు మాత్రం, కేంద్రం తెలంగాణ డెప్యుటేషన్ ఇవ్వడం ఆశ్చర్యకరం. అందుకు ఆయన వ్యక్తిగతంగా చేసుకున్న లాబీయింగ్, గతంలో టీటీడీ జేఈఓగా ఉన్న సమయంలో పెంచుకున్న పరిచయాలే, దానికి కారణమన్న వ్యాఖ్యలు ఐఏఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

దానితో తాజాగా, ప్రస్తుత సీఎస్ నీలం సహానీ పదవీకాలం పొడిగింపుపై సహజంగా అనుమానాలు మొదలయ్యాయి. ఆమె పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. కేంద్ర సర్వీసులో ఉన్న ఆమెను, జగన్ ఏరికోరి రాష్ట్రానికి తెచ్చుకున్నారు. రెండు ముఖ్యమైన అంశాలపై ఆమె అయిష్టంగానయినా సంతకాలు చేశారన్న ప్రచారం జరిగింది. ఇప్పటి పరిస్థితిలో తిరిగి ఆమె ఉంటేనే మంచిదన్న భావనతో, సహానీకి ఆరునెలలు పొడిగింపు ఇవ్వాలని జగన్ కేంద్రానికి లేఖ రాశారు.  దానిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికి ఇద్దరు అధికారుల డిప్యుటేషన్ విషయంలో ప్రతికూలంగా ఉన్న కేంద్రం, సీఎస్ పదవీకాలం పొడిగింపు అంశంపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ సీఎస్‌లకు పదవీకాల పొడిగింపునకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ప్రస్తావనార్హం.

ఈ విషయంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా తీసుకునే నిర్ణయంపైనే, ఆమె పదవీ కాలం పొడిగింపు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ సహానీ పదవీకాలం పొడిగింపుపై కేంద్రం సానుకూలత వ్యక్తం చేస్తే, జగన్‌తో బీజేపీ సంబంధాలు సజావుగానే ఉన్నాయని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. అదే ప్రతికూల నిర్ణయం వెలువడితే, కేంద్రంతో జగన్ సంబంధాలు సరిగా లేకపోవడంతోపాటు.. అధికారులకు సంబంధించి, జగన్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నీ బెడిసికొడుతున్నాయన్న విషయం నిర్ధరణ అవుతుంది. చూడాలి. ఏం జరుగుతుందో?

కాగా సీఎస్ రేసులో కొందరు సీనియర్ ఐఎఎస్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న సమీర్‌శర్మ, సతీష్‌చంద్ర, ఆదిత్యానాధ్ దాస్, నీరబ్‌కుమార్ ఉన్నారు. వీరిలో సమీర్‌శర్మకు మంచి అధికారిగా పేరుంది. ఇక ఆదిత్యనాధ్‌దాస్ జగన్ కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే కిందికోర్టులో ఆయనకు విముక్తి లభించింది. ఈ కోణంలో చూస్తే, ఆయన జగన్‌కు నమ్మకమైన అధికారిగానే భావించవచ్చని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇక గతంలో చంద్రబాబు పేషీలో పనిచేసిన సతీష్‌చంద్ర పేరు, చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. పాలకుల మనసెరిగి పనిచేయడం, ఎన్ని విమర్శలొచ్చినా వారి బాధ్యతలను పంచుకోవడంలో, ఆయనకు ఎవరూ సాటిరారన్న పేరుంది.

అయితే.. గతంలో జగన్, విజయసాయిరెడ్డి సహా చాలామంది వైసీపీ నేతలు.. సతీష్‌చంద్రపై నేరుగానే ఆరోపణలు చేశారు. ఆయనతోపాటు, నాటి నిఘా దళపతి ఏబీ వెంకటేశ్వరరావు కలసి,  వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. దానితో ఆ ఇద్దరికీ చాలా నెలలు పోస్టింగు ఇవ్వని జగన్ సర్కారు.. విచిత్రంగా వారిలో సతీష్‌చంద్రకు మాత్రం కీలకమైన  శాఖను అప్పచెప్పి, అదే ఆరోపణలకు గురైన ఏబీకి మాత్రం పోస్టింగు ఇవ్వకపోగా, సస్పెండ్ చేయడం ఆశ్చర్యపరిచింది. సీఎంఓలో పనిచేసే ఓ ఉత్తర భారతదేశానికి చెందిన అధికారి.. ఈ విషయంలో జగన్‌తో రాయబారం నిర్వహించి, సతీష్‌చంద్రకు పోస్టింగ్ ఇప్పించారన్న ప్రచారం అధికారవర్గాల్లో జరిగింది.

కాగా ఇప్పటి సమాచారం ప్రకారం.. సహానీకి మూడు నెలలు పొడిగింపు ఇవ్వవచ్చని తెలుస్తోంది. అది కుదరకపోతే, సీఎస్ పోస్టు కోసం  ఆదిత్యనాధ్-సతీష్ మధ్య పోటీ ఉంటుంది. వారిలో జగన్ ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాలి.  అయితే, తనతోపాటు జైలుకు వెళ్లిన మోపిదేవి రమణకు మంత్రి పదవి, విజయసాయిరెడ్డికి రాజ్యసభ ఇచ్చి న్యాయం చేసినందున.. ఆ కోణంలో చూస్తే, తన కోసం నిందలు మోసిన ఆదిత్యనాధ్ దాస్ వైపే,  జగన్ మొగ్గు చూపవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.