మీడియాపై బురద చల్లటం మంచిదేనా?

575

మీడియాపై బురద మంచిదేనా?
అలిపిరిలో మందుతో పట్టుబడ్డ నకిలీ మీడియా ఫొటోగ్రాఫర్
దానికి వైసీపీ సోషల్ మీడియా ‘మహా’ రచ్చ
పచ్చ మీడియా పేరుతో పిచ్చి చేష్టలు
జగన్,రోజా, పోలీసులతో నిందితుడి ఫొటోలు
మరి మద్యం ఎవరికి కోసం తీసుకువెళుతున్నట్లు?
మీడియాను భ్రష్ఠుపట్టిస్తున్న పేటీఎం దినసరి కూలీలు
దారి తప్పుతున్న మీడియా యాజమాన్యాలు
నగుబాటుపాలవుతున్న జర్నలిస్టులు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభంగా భావించే మీడియా ఇప్పుడు రోజువారీ కూలీ తీసుకునే పేటీఎం బృందాల చిల్లర చేష్టల వల్ల ముద్దాయిగా నిలబడుతోంది. ప్రెస్ పేరుతో చిల్లర వ్యక్తులు , రకరకాల వ్యామోహాలతో మీడియా రంగంలో దిగిన వ్యాపారుల స్వార్ధానికి.. నిఖార్సయిన జర్నలిస్టులు కూడా నగుబాటుపాలవుతున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టుల పేరుతో జరుగుతున్న దారిదోపిడీ వ్యవహారం, చివరకు మొత్తం మీడియాపైనే మరకలుపడే ప్రమాదానికి చేరింది. రాజకీయ పార్టీలు మీడియా దుకాణాలు తెరవడంతో, ఆ పార్టీకి అనుబంధంగా నడుస్తున్న సోషల్ మీడియాలు, రకరకాల ముద్రలేసి ఇతర మీడియా సంస్థలపై చేస్తున్న పిచ్చిచేష్టలతో మీడియా మధ్య అనారోగ్యకర యుద్ధం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మీడియాకు పట్టిన దుస్థితి ఇది. ఇందుకు ఏ ఒక్కరూ, ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు.

తిరుమల వ్యవహారంతో పరాకాష్ఠ

తిరుమలకు వెళ్లే దారిలో ఉన్న అలిపిరి వద్ద, ఒక ఫొటోగ్రాఫర్ వెళుతున్న కారులో భారీ స్థాయిలో మాంసం, మద్యం బాటిళ్లు దొరికాయన్నది వార్త. సదరు ఫొటోగ్రాఫర్ ఒక టీవీ చానెల్‌కి చెందిన వ్యక్తి అని విజిలెన్స్ అధికారులు వెల్లడించారన్నది మరో వార్త. ఇదీ అలిపిరి వద్ద జరిగిన అసలు సంఘటన. సరే నిందితులెవరైనా పట్టుకోవాల్సిందే. తప్పుచేస్తే శిక్షించాల్సిందే. మీడియా,జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాలు, హక్కులేమీ ఉండవు. మీడియా వ్యక్తులు, పోలీసులు దేనికీ అతీతులు కారు. గతంలో కూడా పోలీసులు, జర్నలిస్టులు విచ్చలవిడిగా ప్రవర్తించినప్పుడు నిర్మొహమాటంగా అరెస్టు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు పత్రికా యజమానులే జైళ్లలో శిక్షలు అనుభవించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. దానిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

రాజకీయ రంగులతో రచ్చ..

కానీ, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసి, దానికి పార్టీ రంగులు పులిమి, ఒక రాజకీయ పార్టీకి అంటకట్టే వెకిలితనంతో పైశాచికానందం పొందడమే దుర్మార్గం. దీనిని నైతిక విలువలు ఉన్న ఎవరైనా ఖండించాల్సిందే. అకారణంగా ఒక సంస్థ, లేదా పార్టీపై బురద చల్లి వ్యక్తిత్వహననానికి పాల్పడితే దానిని వ్యతిరేకించాల్సిందే. బాధితుడి స్థానంలో వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, లేక మరో మహాన్యూస్ ఉన్నా వారికి బాసటగా నిలవాల్సిందే. బాసటగా నిలిచే వారిపై పిచ్చముద్రలకు భయపడకూడదు. కానీ, ఒక పార్టీ పనుపున పనిచేస్తూ, వారు నడుపుతున్న సోషల్‌మీడియాలో కేవలం.. ట్రోలింగ్‌కు ఇంత చొప్పున పనిచేసే పేటీఎం దినసరి కూలీలు చేస్తున్న ఈ అనాగరిక, దుశ్చర్య వల్ల మొత్తం మీడియా రంగానికే మచ్చ వస్తోంది. ఈ విషయాన్ని, స్వయంగా అదే మీడియా సంస్థలు నడుపుతున్న రాజకీయపార్టీలు గుర్తించకపోవడమే విచారకరం.

సోషల్‌మీడియా రచ్చ..

మళ్లీ.. అలిపిరి వద్ద దొరికిన మద్యం బాటిళ్ల దగ్గరకు వద్దాం. మద్యం బాటిళ్లు తీసుకువెళుతూ పట్టుబడ్డ, ఎన్.వెంకటముని అనే వీడియో గ్రాఫర్ కొద్దికాలం క్రితం.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సందర్భంలో, ఆ సంస్ధ అతనిని తొలగించింది. ఆ తర్వాత పలు గుర్తింపుకార్డులతో కొండపైన తన వృత్తి నిర్వహిస్తున్నాడు. అయితే, మద్యం బాటిళ్లను విజిలెన్స్ అధికారులు పట్టుకున్న తర్వాత.. ఒక రాజకీయపార్టీకి చెందిన సొషల్‌మీడియా దానిపై చేస్తున్న రచ్చ రోత పుట్టిస్తోంది.

పేటీఎం బృందాల పైత్యం…

ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారం ప్రకారం.. అతగాడు మహాన్యూస్‌లో పనిచేస్తున్నాడని, తిరుమల కొండపై పచ్చ మీడియానే ఈవిధంగా మందుబాటిళ్లు పెట్టించి.. తర్వాత దానిని జగన్ ప్రభుత్వంపై నెట్టి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రను వెంకన్న అడుకున్నాడన్నది ఆ ప్రచార సారాంశం. పైగా.. బీజేపీ ఎంపికి చెందిన సుజనాచౌదరికి చెందిన మహాన్యూస్‌కు చెందిన టీవీ యాంకర్‌తో ఇలాంటివి చేయించడం ద్వారా, తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా, కొండపై నాటుసారా కాస్తున్నారని, క్రైస్తవమని, అదీ ఇదని స్క్రిప్టు అల్లుకుని పచ్చ చానెళ్లలో ఊదరకొట్టాలని ప్లాన్ చేసి.. బ్రేకింగులు వేయాలన్నది పచ్చ మీడియా కుట్రగా, ఆ పార్టీ సొషల్‌మీడియాలో ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వం గురించి అంతగా బాధ పడుతూ పోస్టింగులు పెట్టినందున, అది ఏ పార్టీ నడిపే సోషల్‌మీడియానో మెడ మీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. బురదవేసి కడుక్కోమనే బీహార్ ఎన్నికల మేధావి స్కూల్‌లో చదువుకున్న వారి నుంచి, ఇంతకంటే ఎక్కువ ఆశించడం కూడా అత్యాశనే!

నిందితుడు పనిచేసేది ఎందులో?

ఇక పట్టుబడ్డ వెంకటముని విషయానికొద్దాం. సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు, అతగాడు అసలు మహాన్యూస్ ఉద్యోగి కాదట. కనీసం స్ట్రింగరు కూడా కాదు. ఆ సంస్ధ జారీ చేసిన ఐడి కార్డు గానీ, ప్రభుత్వం ఇచ్చిన అక్రెడిటేషన్ కూడా అతగాడు మహాన్యూస్ ప్రతినిధి ఎక్కడా చెప్పడం లేదు. అసలు ముని అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేయడం లేదని, తమను అప్రతిష్ఠపాలు చేస్తున్న అతగాడిపై చర్యలు తీసుకోవాలని.. మహాన్యూస్ జిల్లా ప్రతినిధి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. పైగా నిందితుడు ముని వద్ద, నాలుగైదు గుర్తింపుకార్డులు కూడా ఉన్నాయట. అందులో మహాన్యూస్ ఒకటని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మహాన్యూస్‌ను దోషిగా నిలబె ట్టి, దానికి పచ్చమీడియా అనే పిచ్చిచేష్టలతో బరితెగించడమే విడ్డూరం.

మరి.. జగన్,రోజాతో దిగిన ఫొటోల సంగతేమిటి?

         

పోనీ, మహాన్యూస్ పేరుతో పనిచేస్తున్న వ్యక్తి.. కొండపైకి మందుబాటిళ్లు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడనే అనుకుందాం. మరి సదరు ముని అనే వీడియోగ్రాఫర్.. ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే రోజాతోపాటు, అక్కడి పోలీసు అధికారులతో కలసి ఫొటోలు కూడా తీయించుకున్నాడు కదా? మరి వాళ్లతో కూడా సదరు నిందితుడికి సంబంధం ఉన్నట్లు భావించాలా? అదే నిజమైతే కొండపైకి తీసుకువెళ్లే మందుబాటిళ్లు ఎవరి కోసం తీసుకున్నట్లు భావించాలి? మరి వారితో దిగిన ఫొటోలు కూడా, పేటీఎం దినసరి కార్మికులు తమ ప్రచార కథనాల్లో పెట్టాలి కదా అన్న ప్రశ్నలకు జవాబులేవీ?

మరెందుకీ మరకలు?

నిజానికి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి నుంచి.. ఆర్ధిక నిపుణుడు, విశ్లేషకుడిన పరకాల ప్రభాకర్ నిర్వహణలోకి మహాన్యూస్ చానెల్ వెళ్లిన తర్వాత.. ఆ చానెల్ ఎలాంటి ముద్రలు లేకుండా నడుస్తోంది. అందుకే గతంలో ఉన్న తెలుగుదేశం అనుకూల ముద్ర ఇప్పుడు కనిపించడంలేదు. పైగా ఆ చానెల్ సాక్షి-టీవీ9 వంటి ఇతర చానెళ్లకు వ్యాపరపరంగా పోటీ కూడా కాదు. జగన్ సర్కారుపై ఏమైనా కావాలని బురద చల్లుతోందా అంటే అదే లేదు. పోనీ టీడీపీకి భజన చేస్తుందా అదీ లేదు. పోటీలో నిలదొక్కుకోవాలంటే నిజాలు చూపాలన్న లక్ష్యంతో, ఎవరికీ ఆరోవేలు కాకుండా చానెల్ నడుపుతున్నట్లు ఇప్పటివ రకూ స్పష్టమవుతోంది. మరి ఈ విషప్రచారం, వెకిలి చేష్టలు ఎందుకన్నది ఆ ‘జగన్నాధుడి’కే ఎరుక?

యాజమాన్యాల స్వార్థమే..

ఇలాంటి ఘటనలకు కొందరు మీడియా సంస్థల యజమానుల స్వార్ధం కూడా ఒక కారణం. గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో పనిచేసే స్ట్రింగర్లకు, రెండు మూడు ప్రధాన పత్రికలు-చానెళ్లు మినహా మిగిలినవేమీ కొన్నేళ్ల నుంచీ గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు. పైగా వారే నెలకు ఇంత అని ఎదురు ఇస్తున్న వైచిత్రి. అనేక పత్రికలు జిల్లా స్టాఫర్లకూ జీతాలివ్వడం లేదు. పట్టణ/మండల/జిల్లాలకు ఫ్రాంచేజీలు తీసుకున్న వాళ్లు.. రేషన్‌డీలర్లు, వైన్‌షాపులు, రియల్‌ఎస్టేల్ వ్యాపారులు, బంగారం షాపులు, ఆసుపత్రులు, మైనింగ్ యాజమాన్యాలను బె దిరించి, కొంత డబ్బు యాజమాన్యాలకు, మరికొంత తమ జీవనాధారం కోసం ఖర్చుపెడుతున్న వాస్తవ దృశ్యం కనిపిస్తోంది.

గబ్బు పట్టిస్తున్న గ్రామీణ విలేకరుల వ్యవస్థ

గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో పనిచేసే చాలామంది స్ట్రింగర్లు.. వేరే గత్యంతరం లేక, మరో ఉద్యోగం చేసుకోలేక ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితి నెలకొంది. అసలు జర్నలిజం గురించి అక్షరం ముక్క తెలియకపోయినా, దీనిలో ఉన్న క్రేజ్‌ను చూసి మీడియా రంగంలోకి వస్తున్న గ్రామీణ విలేకరుల వల్ల మీడియా రంగం, జర్నలిస్టుల గౌరవం పూర్తిగా భ్రష్టుపట్టిపోతోంది.
అందుకే.. స్థానిక రాజకీయ నేతలు-పోలీసులతో పెంచుకున్న సంబంధాలతో అడ్డదారితొక్కుతున్న ఇలాంటి వారికి, నేరుగా ఏ పత్రిక కూడా సంపాదకుడి సంతకంతో గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. ఏపీలో ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇలాంటి సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది.