‘జలజగడం’ వార్తలకు ‘అధికారమీడియా’లో జాగా లేదా?

243

సంపాదకీయాలు, వ్యాసాలకు ఆ రెండు పత్రికలు దూరం
కథనాలతో విరచుకుపడని వైసీపీ-తెరాస అధికార మీడియా
కలహంపై కలం ఝళిపించని సాక్షి, నమస్తే తెలంగాణ
జలసమరంపై ఒక్క ఆంధ్రజ్యోతి లోనే వ్యాసం
పోతిరెడ్డిపాడు పంచాయతీలో ఇదో వైచిత్రి
(మార్తి సుబ్రహ్మణ్యం)

కలసి మెలసి ఉంటున్న రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలం తర్వాత తలెత్తిన జలవివాదం ముదురుపాకాన పడుతోంది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని విపక్షాలు ఎవరి రాష్ట్రాలకు అనుకూలంగా వారు గళం విప్పుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు, వారి వారి రాష్ట్రాల్లో సొంత మీడియా సంస్ధలున్నాయి. మరి అలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు.. తమ రాష్ట్రాల ఘనత, పోరాటం, అన్యాయాలపై విస్తృత కథనాలు, వ్యాసాలు, సంపాదకీయాలు, పాత పోరాట గాథలు ప్రతి పేజీల్లోనూ  వెల్లువెత్తాలి. మరో రాష్ట్రం తీరుపై కలం ఝళిపించి, అన్యాయంపై అక్షర సమరం చేయాలి. అలనాటి పోరాటకాలంలో చేసిన ఘనకార్యాలను.. వారి మీడియాలో వెల్లడించి, దాని వివరాలు, తమ హక్కులు, అడ్డుకుంటున్న పక్క రాష్ట్రం చేసే వాదన లోపాలను తమ సొంత మీడియాలో ఎండగట్టాలి.
కానీ.. విచిత్రం.. ఆ పని ఏపీ పాలక పార్టీకి చె ందిన మీడియా చేయలేదు. ఏపీ చేసిన పని అన్యాయం, ఏకపక్షమని స్వయంగా తెలంగాణ పాలకులే ఆవేదన వ్యక్తం చేశారు. అయినా  తెలంగాణ పాలక పక్షానికి చెందిన మీడియాలో.. ఏపీ పాలకుల దుర్నీతిని ఎండగడుతూ ఎక్కడా ఒక్క వ్యతిరేక వ్యాసం గానీ, సంపాదకీయం కానీ భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడమే హాశ్చర్యం.ఇది కూడా చదవండి: ఆంధ్రా-తెలంగాణ మధ్య ‘పానీ’పట్టు యుద్ధం?

పోతిరెడ్డిపాడు కథ మళ్లీ మొదటికి..

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు హెడ్‌రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కుల ప్రవాహానికి పెంచడంతోపాటు, రాయలసీమ ప్రాజెక్టుల పేరిట కొత్తగా, రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకునేందుకు మరో లిఫ్టు ప్రాజెక్టు కట్టాలని, ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ నెల 5న ఉత్తర్వు జారీ చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఏకపక్షమని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు, ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నెర్ర చేశారు. దీనిపై కోర్టును ఆశ్రమయిస్తామని హెచ్చరించారు.

తెలంగాణలో పోతిరెడ్డి‘పాడుపని’పై  విపక్షాల ఆగ్రహం

ఏపీ సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇటు.. తెలంగాణ విపక్షం కూడా పిడికిలి బిగిస్తోంది. కేసీఆర్-జగన్ అవగాహనతోనే ఈ నిర్ణయానికి పురుడు పోసుకుందని, కేసీఆర్‌కు తెలియకుండా జగన్ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని, గత రెండు రోజుల నుంచి నానా రచ్చ చేస్తున్నాయి. దక్షిణ తెలంగాణను ఎడారిని చేసేందుకు, జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. దీనికి నిరసనగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిరసన దీక్ష నిర్వహించగా, కోదండరామ్ ఆధ్వర్యంలో అఖిలపక్షం నిర్వహించాయి. జగన్‌తో కేసీఆర్ రాజకీయ, వ్యాపార లావాదేవీల కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని జగన్‌కు తాకట్టు పెడుతున్నారని.. కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి, పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, డికె అరుణ, పెద్దిరెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, రామచందర్‌రావు ఆరోపించారు

ఏపీలో జగన్ సర్కారుకు విపక్షాల బాసట

అటు ఏపీలో..  జగన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. ఏవిధంగానయినా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఒత్తిళ్లకు లొంగకుండా సీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అదే సమయంలో పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉండగా, జగన్ వివాదాస్పద ప్రాజెక్టులపైనే ఎందుకు శ్రద్ధ చూపుతున్నారని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ హక్కులు కాపాడుకునే ప్రతి సమయంలోనూ, తెలంగాణ అడ్డం పడుతోందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రులంతా, తెలంగాణ ప్రాజెక్టులకే పెద్దపీట వేశారని వివరించారు. కాళేశ్వరం ద్వారా 147 టీఎంసీలు తెలంగాణ తరలిస్తోందని, అయినా ఏపీ అభ్యంతరం చెప్పలేదని నెల్లూరు జిల్లా బీజేపీ నేతలు విమర్శించారు. జూరాల నుంచి నీటిని ఇష్టప్రకారం ఎత్తిపోతల పథకం ద్వారా, నీటి దోపిడీకి పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. కేసీఆర్ వలలో జగన్ ఇరుక్కున్నారని ఆరోపించారు.

సాక్షి-నమస్తే.. సేమ్ టు సేమ్!

ఇదీ పోతిరెడ్డిపాడు పంచాయతీకి సంబంధించి, రెండు రాష్ట్రాల్లో ఎగసిపడుతున్న మాటల మంటలు. అంటే ఈ జలవివాదం రెండు రాష్ట్రాల్లో, ఏ స్థాయిలో వివాదమవుతుందో ఎవరికైనా సులభంగా అర్ధమవుతుంది. మరి ఇదే అంశంపై మిగిలిన మీడియా సంస్థలు ఎలా స్పందిస్తున్నాయన్న దానిక ంటే, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన సాక్షి-తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసకు చెందిన నమస్తే తెలంగాణ మీడియా సంస్థలు ఎలా స్పందించాయి? స్పందిస్తున్నాయన్న దానినే సహజంగా ఎవరైనా గమనిస్తుంటారు. మామూలుగా అయితే.. ఇలాంటి వివాదాస్పద అంశాల్లో.. ఎవరి అనుకూల మీడియా వారి అనుకూల కథనాలు, వ్యాసాలు- ఎదుటి రాష్ట్రంపై వ్యతిరేక కథనాలు ఇస్తుంటాయి. అంటే తమ రాష్ట్రానిదే న్యాయమని, ఎదుటి వారి వాదన అన్యాయమని దుమ్మెత్తిపోస్తుంటాయి. కానీ, విచిత్రంగా రెండు రాష్ట్రాల్లో, రెండు పార్టీలకు చెందిన అధికార మీడియా సంస్థలు ఈ వివాదంలో  అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. తామరాకుమీద నీటిబొట్డుమాదిరిగా ఉండటమే అనుమానాలు, ఆరోపణలకు   తావిస్తోంది.

ఆంధ్రాలో ‘సాక్షి’ అలా..

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు ప్రయత్నం ఈనాటిది కాదు. మహానేత రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచీ ఉన్నదే. ఆ సమయంలో వైఎస్ మంత్రివర్గం నుంచి తెరాస మంత్రులు రాజీనామా చేసి బయటకొచ్చారు కూడా. స్వపక్షంలో దివంగత పి.జనార్దన్‌రెడ్డితోపాటు హన్మంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి వంటి అగ్రనేతలతోపాటు, టీడీపీ కోస్తా నేతలు ఎంత వ్యతిరేకించినా మహానేత ఎవరికీ లొంగలేదు. నిజానికి ఈ విషయాన్ని వైఎస్ కుటుంబానికి చెందిన ‘సాక్షి’ సగర్వంగా ఈ సమయంలో ప్రస్తావించి తీరాల్సి ఉంది. అప్పట్లో ఎంతమంది అడ్డుపడినా వైఎస్ ఆంధ్ర ప్రజలు, ముఖ్యంగా సీమ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే కృషి చేశారని, ఇప్పుడు ఆయన తనయుడు జగన్ కూడా, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ఒక సంపాదకీయం కూడా రాసే అద్భుత అవకాశం వచ్చింది.

జగన్‌ను హీరోను చేసే అవకాశం ఉన్నా..

కేసీఆర్‌తో వ్యక్తిగత స్నేహం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆ స్నేహం గొప్పది కాదని.. జగన్ నిరూపించారని తన పత్రికలో ప్రచారం చేసుకునే మరో అవకాశం కూడా వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎదుర్కొంటామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న మరో మాట కూడా,  తన సంపాదకీయంలో రాసే మంచి అవకాశం జగన్ పత్రికకు వచ్చింది. దానితోపాటు.. పోతిరెడ్డిపాడు కథాకమామీషు, అప్పట్లో దానికోసం చేసిన వైఎస్ వీరోచిత పోరాటం, దానివల్ల లబ్థిపొందిన సీమ రైతుల వ్యాఖ్యలను కథకథలుగా వేసుకోవచ్చు.

కేసీఆర్ ‘సాక్షి’గా భయపడుతోందా?

కానీ.. జగన్ మీడియా అలాంటి అవకాశం ఎందుకో కావాలనే జారవిడుచుకోవడం ఆశ్చర్యం అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ దూకుడును జగనన్న ఎదుర్కొంటున్నారన్న ఒక్క సంకేతం కూడా సాక్షి మీడియా ఎందుకో ఇవ్వకుండా జాగ్రత్తపడుతోంది. పైగా జగనన్నను ఈ అంశంలో, ఆంధ్రాలో హీరోను చేసే సమయం-సందర్భం వచ్చినా, ఎందువల్లనో ఆపని చేయకుండా తెగ భయపడుతోంది. ఎంతసేపటికీ విశాఖలో బాధితులు బయటపడ్డారని, మంత్రులు పల్లెనిద్ర చేస్తున్నారని, పరిహారంతో పండుగచేసుకుంటున్నారన్న కథనాలు వండి వార్చేందుకే ప్రయత్నిస్తోంది.

అంటే.. బహుశా, తెలంగాణపై జగన్ దూకుడుగా వెళుతున్నారన్న రాస్తే,  ‘శేఖరన్న’కు ఎక్కడ కోపం వస్తుందన్న భయం కామోసు!  అందుకే గత రెండు రోజుల నుంచి సాక్షి తన సంపాదకీయం పేజీలో.. పోతిరెడ్డిపాడు వివాదానికి సంబంధించి, ఒక్కటంటే ఒక్క వ్యాసం గానీ, సంపాదకీయం గానీ, ఒక్క ప్రత్యేక కథనం గానీ రాయలేదు. సర్లే.. ఎవరి మొహమాటాలు వారివి!

తెలంగాణలో ‘నమస్తే తెలంగాణ’ ఇలా..


సరే.. ఏపీలో సాక్షిని అలా కాసేపు వదిలేసి, తెలంగాణలో తెరాస అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణ’లోకి తొంగిచూద్దాం. టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ నుంచి, రాజకీయ పార్టీగా రూపాంతరం చెందకముందు నాటి రోజుల్లో.. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై ఇల్లుపీకి పందిరేసింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గళెమెత్తింది. దక్షిణ తెలంగాణ ఎడారవుతుందని ధ్వజమెత్తింది. ఈ అంశంపై గళమెత్తిన ఫలితంగా.. అప్పటివరకూ దక్షిణ తెలంగాణలో పెద్దగా బలంగా లేని తెరాసకు, ఆ ప్రాంత దన్ను దొరికింది.

ఉద్యమపార్టీ పత్రికలో ‘పోతిరెడ్డి’ ఉరక, ఉలుకేదీ?

ఇప్పుడు అధికారంలో ఉన్న అదే పార్టీ, తనకంటూ సొంత మీడియా స్థాపించుకుంది. మరి ఈ సమయంలో సహజంగా అయితే.. మళ్లీ తెరపైకొచ్చిన అదే పోతిరెడ్డిపాడు వివాదం రేపిన ఏపీ సర్కారుపై, తన మీడియా ద్వారా విరుచుకుపడి తీరాలి. నాటి తన పోరాటాన్ని మరోసారి తెలంగాణ పాఠకులకు గుర్తు చేయాలి. జగన్ సర్కారు మోసపూరిత వైఖరిని తూర్పారపట్టాలి. మంచిగా ఉంటూ మోసం చేసిన తీరుపై విరుచుకుపడాలి. పేజీకో ప్రత్యేక కథనం రాయాలి. దక్షిణ తెలంగాణ రైతుల ఆక్రందనలు, వారి మాటల్లోనే వినిపించాలి. జగన్ననతో తాడోపేడో తేల్చుకునేందుకు చంద్రన్న సర్కారు సిద్ధమవుతోందన్న సంకేతాలిచ్చే కథనాలు రావాలి.

ఏపీపై ఫిర్యాదు వార్త లోపల పేజీల్లోనా?

కానీ.. విచిత్రంగా, తెరాస అధికార గళమైన ‘నమస్తే తెలంగాణ’లో కూడా.. ఆంధ్రాలో వైసీపీ ‘సాక్షి’ మాదిరిగానే ఒక్క ప్రత్యేక కథనం గానీ, సంపాదకీయం గానీ, నేతల హెచ్చరికలు గానీ వస్తే ఒట్టు. ఆంధ్రాలో సాక్షి- తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రికల్లో..  కేసీఆర్-జగన్ యధావిథి వ్యాఖ్యలు, తర్వాత కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన వైనం మాత్రమే రావడం ఆశ్చర్యం.  నిజానికి ఈ వివాదంపై తెలంగాణ విపక్షాలు విరుచుకుపడుతూ, నిరసన దీక్షలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన తర్వాత రోజు కూడా.. అంటే బుధవారం నాటి ‘నమస్తే తెలంగాణ’లో, ఏపీపై ఫిర్యాదు చేసిన వార్తను మొదటిపేజీలో కాకుండా, మూడవ పేజీలో వేయడం మరో ఆశ్చర్యం. పైగా.. మొదటిపేజీలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యమిచ్చి, అందరినీ ఆశ్చర్యంలో ముంచింది.  ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ప్రొఫెషనల్‌గా వ్యవహరించింది. ఆ పత్రికలో ఏపీపై ఫిర్యాదు చేసిన వార్తకు మొదటిపేజీలో ప్రాధాన్యం ఇచ్చింది. అదే నమస్తే తెలంగాణలో కూడా ఇండికేటర్ కూడా ఇవ్వకపోవడం హాశ్చర్యం.

పతాక శీర్షిక కాకుండా పక్క పేజీల్లో..

అసలు పతాకశీర్షికకెక్కాల్సిన ఇంతపెద్ద వివాదాంశాన్ని మూడవ పేజీలో నెట్టేసి, ప్రభుత్వం చెప్పిన పంటనే వేయాలనే వార్తకు బ్యానర్‌లో చోటివ్వడమే విచిత్రం. పోనీ, ఈ వివాదాంశం తెరపైకొచ్చి, కేసీఆర్ కన్నెర్ర చేసిన మంగళవారం నాడేమైనా.. దానికి సంబంధించిన సంపాదకీయం గానీ, ఎడిటోరియల్ పేజీలోగానీ ఏదైనా వ్యాసం రాసిందా అదీ లేదు. బుధవారం నాడు లాక్‌డౌన్‌కు సంబంధించి ద్విముఖవ్యూహం పేరుతో ఒక సంపాదకీయం, మంగళవారం నాడు గిరాకీ పంటలపై మరో సంపాదకీయంతో సరిపుచ్చుకుంది.  దీన్నిబట్టి.. అటు ఆంధ్రాలో సాక్షి గానీ, ఇటు తెలంగాణలో నమస్తే తెలంగాణ గానీ.. పోతిరెడ్డిపాడు అంశాన్ని పెద్ద వివాదంగా మార్చకుండా,  జాగ్రత్త పడుతున్నట్లు మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. బీజేపీ ఎమ్మెల్యే రామచందర్‌రావు చెప్పినట్లు.. రెండు ప్రభుత్వాలు బంతిపూలతో యుద్ధం చేసుకుంటున్నాయని చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుకు రాక తప్పదు.

ఆంధ్రజ్యోతి రూటే వేరు..

ఈ విషయంలో ఆంధ్రజ్యోతి పంథాను ప్రశంసించక తప్పదు. ఆ పత్రికలో పోతిరెడ్డిపాడు వివాదాంశానికి సంబంధించి, ‘మరో జలపోరాటానికి సంసిద్ధులవుదాం’  అంటూ,  పల్లె రవికుమార్ రాసిన వ్యాసానికి ఎడిటోరియల్ పేజీలో స్థానం కల్పించింది. ఒక్క పల్లె రవికుమార్ వ్యాసం మాత్రమే కాకుండా, పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపి రేవంత్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వంటి నేతల విమర్శలకూ ప్రాధాన్యం ఇచ్చింది.

‘ఈనాడు’లో ఆనాటి కథనాలేవీ?

కానీ, ఎప్పుడూ ఇలాంటి వివాదాంశాలపై సమగ్ర కథనాలందించే ‘ఈనాడు’ మాత్రం, ఈసారి ఎందుకో మౌనం వహించింది. సంపాదకీయం గానీ, దానికి సంబంధించి ఒక్క ప్రత్యేక కథనం గానీ కనిపించలేదు.  వైఎస్ ఉన్నప్పుడు తెరపైకొచ్చిన ఇదే అంశంపై పుంఖానుపుంఖాల కథనాలు రాసి, తెలంగాణ నేతలతోపాటు సాగర్ దిగువ జిల్లా రైతాంగం  విమర్శలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈనాడు.. ఈసారి మాత్రం, కేవలం కేసీఆర్ చెప్పిన విషయాలకే పరిమితమయింది. ఎవరి బాధలు వారివి మరి!

కేసీఆర్-జగన్‌ది బంతిపూల యుద్ధం: రాంచందర్‌రావు

పోతిరెడ్డిపాడు వ్యవహారంలో, కేసీఆర్-జగన్ ఇద్దరూ బంతిపూల యుద్ధం చేసుకుంటూ రెండు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని,  బీజేపీ ఎమ్మెల్సీ, హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌కు ఇచ్చిన అతి చనువు, అతి స్నేహం ఇప్పుడు దక్షిణ తెలంగాణను ఎడారిని చేస్తోందని,  దీక్ష సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రతిపక్షాలు విమర్శించిన తర్వాతనే కేసీఆర్ స్పందించారని, దీన్నిబట్టి వారిద్దరి మధ్య ఉన్న అవగాహనను ప్రజలు అర్ధం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.