విశాఖకు… ‘విశాఖ స్వామి’ వారి ఆశీస్సులు లేవా?

550

ఉంటే ఆ వాయువు ఆయువు తీసేదా?
అపాయాన్ని ముందే గ్రహించలేకపోయారా?
విశాఖ వాసుల కోసం తపస్సు చేయలేదా?  
మరి సీఎంల కోసమేనా తపస్సు?
బెంబేలెత్తుతున్న తెలుగు భక్తజనం
28న క్యాంపు ఆఫీసు తరలింపు రాజర్షి ఆలోచనలేనట
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన సాక్షాత్తూ ఆదిశంకరుడి అంశగా భక్తులంతా నమ్ముతారు. ఆయన చెప్పింది జరుగుతుందని భావిస్తారు. కరోనా కూడా ఫలానా తేదీ కల్లా, తగ్గుముఖం పడుతుందని జోస్యం చెప్పిన కాలజ్ఞాని. అంతకంటే ముందు తేదీ నుంచే దుష్టగ్రహాల ప్రభావం తగ్గుతుందని పలికిన, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అంశలో పుట్టిన త్రికాలజ్ఞాని ఆయన. ఒక వ్యక్తిని పాలకుడిగా మార్చేందుకు, తన తపోశక్తిని ధారపోసిన మహర్షి. ఫలానా సమయానికి ప్రమాణం చేయాలని, ఫలానా తేదీలోగా విశాఖకు మకాం మార్చాలని పాలకుడికి హితబోధ చేసిన రాజర్షి.

కీడును కనిపెట్టలేదా..?


మరి అలాంటి రాజర్షి స్వయంగా కొలువుదీరిన నగరంలో..  ఒక వాయువు 12 మంది ఆయువు తీర్చి, వందలమందిని క్షతగాత్రులను చేస్తే.. ఆ విషయం అంతలావు రాజర్షికి ఎలా తెలియకుండా పోయింది? ఆ కీడును స్వామివారు తన అతీంద్రియ శక్తితో, ముందస్తుగా ఎలా కనిపెట్టలేకపోయారు? సొంత నగరంలోనే కొలువుదీరిన స్వామివారు, ఈ ఘాతుకం జరగకుండా ఎందుకు అడ్డుకోలేకపోయారని.. ఆయనను కొలుస్తున్న కోట్లాదిమంది భక్తులు, ఆవేదనాభరిత హృదయంతో కన్నీళ్లపర్యంతమవుతున్నారు.  స్వామి వారి పవరు రాను రాను తగ్గుతుందేమిటని తల్లడిల్లిపోతున్నారు.

ఇది కూడా చదవండి

స్వరూపనందుల వారి శక్తి పోయిందా?

పీఠానికి 9 కిలోమీటర్ల దూరంలోనే..

విశాఖ శారదాపీఠాథిపతి, బ్రహ్మర్షి శ్రీశ్రీశ్రీ స్వరూపానందస్వామి కొలువుదీరిన చినముషిడివాడకు.. 12 మంది ఆయువు తీసిన విశాఖ ఎల్జీపాలిమర్స్ కంపెనీ, కేవలం తొమ్మిది కిలోమీటర్లే దూరం. అంటే శారదా పీఠం కరుణాకటాక్ష కిరణాలు, ఆ పరిసర ప్రాంతాలపై నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయన్నమాట.  ఆ తపోభూమికి ఉన్న శక్తి అంత గొప్పది మరి! అయినప్పటికీ, అక్కడ ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో విడుదలయిన వాయువు వల్ల 12 మంది ఆయువు పోయి, వందలాదిమంది ఆసుపత్రులపాలవడ ం విషాదం,  విచిత్రం!  నిజానికి స్వామివారి దివ్యాశీస్సులు, మొత్తం విశాఖ చుట్టుముట్టూ ప్రసరిస్తున్నప్పుడు, ఇలాంటి విషాదం జరగదు. జరగకూడదు. ఆవిధంగా జరిగిందంటే, స్వామి వారి పవరు సన్నగిల్లుతున్నట్లే లెక్క. అలాంటి డౌటానుమానాలే, ఇప్పుడు భక్తుల మదిలో మొదలవుతున్నాయి.

స్వామివారి ఆత్మ జగనన్నేనట..

ఎందుకంటే స్వామివారు జగనన్నను అంతగా ప్రేమించారు. తెలంగాణ సీఎం కేసీఆర్- తన శిష్య పరమాణువు జగన్మోహన్‌రెడ్డి సంయుక్తంగా తనకు చేసిన సన్మానంలో.. స్వామి వారు జగనన్న మీద, తనకున్న ప్రేమను ఏమాత్రం దాచుకోలేదు. ఆయనేమన్నారంటే.. ‘అగ్ని సాక్షిగా చెబుతున్నా.. నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. ఆయనంటే నాకు పరమ ప్రాణం. ఆయన గురించి ఐదేళ్లు అహ్నరిశలు కష్టపడింది ఈ విశాఖ శారదా పీఠం. విశాఖ శారదాపీఠం జగన్మోహన్‌రె డ్డంటే పూర్తిగా ప్రాణం పెట్టింది. అక్కడ గోడలనడిగినా, చెట్లనడిగినా, పుట్టలనడిగినా, వ్యక్తులనడి గినా జగన్మోహన్‌రెడ్డి గెలవాలని కోరుకున్నట్లు చెబుతుంది’’ అని వందలమంది సాక్షిగా తన అంతరాత్మ ఎవరన్నది నిర్భయంగా ఆవిష్కరించి, అందరిఎదుటా జగనన్నను ముద్దుపెట్టుకున్న తొలి హిందూ పీఠాథిపతి కూడా  శారదానందులవారే. గతంలో కె విపి రామచంద్రరావును మాత్రమే వైఎస్ ఆత్మగా భావించేవారు. తర్వాత స్వరూపానందుల వారికి,  ‘జగనన్న ఆత్మ జగనన్న’ అన్న సంగతి బయట ప్రపంచానికి తెలిసింది. నిజానికి పీఠాథిపతులు, మఠాథిపుతులు దైవాన్ని తమ ఆత్మలుగా, మనషులను అల్పులుగా భావిస్తుంటారు. కానీ స్వరూపానంద మాత్రం..  తన ఆత్మ జగనేనని,  సిగ్గుపడకుండా చెప్పడమే ఆయన గొప్పతనం!

స్వామి వారంటే కరోనాకు లెక్కలేదా?

దేవుడే దిక్కయితే.. ఇక తమరేమీ చేయలేరన్నట్టే కదా స్వామీ?!

తన తపోశక్తితూ జగన్‌ను సీఎంగా చేర్చిన అంత మహాశక్తిశాలి అయిన స్వామివారు, కరోనాని తరిమికొట్టలేకపోవడమే ఆశ్చర్యం.  కరోనా వైరస్ 5వ తేదీలోగా తగ్గిపోతుందని సెలవిచ్చిన స్వామి వారి జోస్యాన్ని, కరోనా బ్రహ్మానందం మాదిరిగా  వెక్కిరించింది. అసలు స్వామి వారు లెక్కనే చేయకుండా, ఇప్పటికి రెండువేల మందిని తాకింది.  కనీసం స్వామి వారు చెప్పారన్న గౌరవం, మొహమాటం కూడా లేకుండా రోజురోజుకూ విస్తరిస్తోంది. అదిగో.. అదే.. స్వామివాక్కులపై భక్తజనంలో శంక ఆరంభం కావడానికి అదే అసలు  కారణం.

పాలకులకు రాజర్షుల వారి దివ్యానుగ్రహం ఉంది. అంటే మొత్తం రాజ్యం మీద మహర్షుల వారి అనుగ్రహం ఉన్నట్లే లెక్క. అంతపెద్ద రాజర్షుల వారి కరుణాకటాక్ష వీక్షణాలు రాజ్యంపై ఉన్నప్పుడు, భక్తులెందుకు బెంగపడతారు? ఆ ధీమానే తమ కొంపముంచిందని ఇప్పుడు భక్తులు వాపోతున్నారు. పూర్వం విశ్వామిత్ర మహర్షి రాజసూయయాగం నిర్వహించే సమయంలో.. రాక్షసులు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు మహర్షుల వారు,  శ్రీరామచంద్రమూర్తి సహాయం కోరారు. దానితో యాగశాలపై రాక్షసుల దాడిని తిప్పికొట్టి, శ్రీరాముడు యాగాన్ని దిగ్విజయం చేస్తారు.

సొంత నగరాన్నే కాపాడక పోతే ఇక రాష్ట్రాన్నేం కాపాడతారు?

అలాగే, రాష్ట్రంపై ఎలాంటి పీడ లేకుండా.. దుష్టగ్రహాల నుంచి కాపాడేందుకే కదా జగనన్న విశాఖ స్వామిని.. విశ్వామిత్ర మహర్షిగా, రాజగురువుగా ఎంచుకుంది? స్వామి వారు ఉన్నారన్న  ధీమాతోనే కదా.. పాలనలో పంచకల్యాణి గుర్రం కన్నా వేగంగా పరుగులు తీస్తున్నారు?.. అయినా విశాఖలో అంత విషాదం జరగడం ఏమిటి? అంటే దుష్టగ్రహాలను అదుపుచేసి, వాటి పీచమణచడంలో స్వామి వారి శక్తులు పనిచేయడం లేదనే కదా అర్ధం? సొంత విశాఖపురినే రక్షించలేని పీఠాథిపతి, ఇక రాష్ట్రాన్ని.. రెండు తెలుగు రాష్ట్రాలను ఏం రక్షిస్తారు? ఆయన శక్తులను నమ్ముకునే బతుకుతున్న తామేం కావాలి? నలుగురికీ చెప్పుకుంటే నామర్దా కదూ?.. ఇవీ.. విశాఖ విషాదం తర్వాత భక్తులు, సామాన్యులు సంధిస్తున్న ప్రశ్నలు!

నిజానికి స్వామివారెప్పుడూ తనకు మహత్యాలు ఉన్నాయని గానీ, శక్తులున్నాయని గానీ, తాను దేవుడనని గానీ ఎప్పుడూ చెప్పుకున్న దాఖలాలు లేవు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. జగన్ సీఎం కాకముందు ఆయన పెద్ద గిరాకీ ఉన్న స్వామి కూడా కాదు. కానీ, జగన్‌ను సీఎం కావడానికి తన తపశ్శక్తినంతా ధారపోసి.. జగన్‌ను సీఎం చేశానని చెప్పుకున్న తర్వాతనే.. భక్తులు, సామాన్యులు ఆయనను మనిషి రూపంలో దైవమని ప్రగాఢంగా విశ్వసించడం ప్రారంభించారు. అంటే.. ‘దైవం మానుష రూపేణ’ మాదిరిగా, విశాఖ స్వరూపుల వారినే దేవుడిగా నమ్మారన్నమాట. అంతటి శక్తిస్వరూపులైన శారదానందుల వారు, తాను  కొలువుదీరిన విశాఖపురవాసులనే కాపాడనప్పుడు.. ఇక ఆయన తెలుగువారినేం కాపాడగలరన్న ప్రజల ప్రశ్నలో న్యాయం ఉంది కదా?

ఆయన  సలహా ప్రకారమే విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్?

అన్నట్లు..  ఈనెల 28న ఉదయం ఏడున్నర గంటలకు, జగనన్న విశాఖ నగరంలో అధికారికంగా కొలువుదీరబోతున్నారట. అంటే.. ఆరోజు నుంచీ విశాఖలో క్యాంపు ఆఫీసు ప్రారంభించనున్నారన్న వార్తలు, సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. అమరావతిని రాజధాని నుంచి, విశాఖకు అధికారికంగా తరలించే ప్రక్రియ హైకోర్టులో పెండింగ్‌లో  ఉంది.  కాబట్టి.. జగనన్న క్యాంపు ఆఫీసును విశాఖలో తెరిస్తే, ఇక అక్కడి నుంచే విశాఖ అనధికార రాజధానిగా ఆరంభమవుతుందన్నమాట. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే పరిపాలనాకేంద్రం కాబట్టి.. జగనన్న విశాఖలో ఉంటే,  ఇక అక్కడి నుంచే పరిపాలన ప్రారంభమవుతుందన్నమాట. గ్రేహౌండ్స్ ఆఫీసును సీఎం క్యాంపు ఆఫీసుగా మార్చబోతున్నట్లు మరో ప్రచారం.  ఈనెల 29లోగా విశాఖలో క్యాంపు ఆఫీసు ఏర్పాటుచేసుకుంటే, అన్నీ శుభాలేనని ఆయన రాజగురువులుంగారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. సీఎం క్యాంపు ఆఫీసు తాడేపల్లి  నుంచి, విశాఖకు తరలిపోతోందట.  నిజం ‘జగన్నా’ధుడికెరుక?