ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ శివప్రసాదరెడ్డి ఉవాచ
విజిలెన్స్ అధికారులు రెడ్‌జోన్‌లో తిరగవచ్చట
థర్డ్‌పార్టీ లేకుండానే మీటర్ సీల్
వైరల్ అవుతున్న ఆడియో రికార్డు
(మార్తి సుబ్రహ్మణ్యం)

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంటే పులుకడిగిన ముత్యాలన్నది జనాభిప్రాయం. వారు అన్ని నిబంధనలు పాటిస్తారన్నది చాలామంది నమ్మకం. అయితే.. వారేమీ సుద్దపూసలు కాదని, సామాన్యుల మాదిరిగానే విద్యుత్ చోరీ చేస్తుంటారని.. సాక్షాత్తూ ఆ శాఖ ఉన్నతాధికారే సెలవిచ్చిన వైచిత్రి ఇది. ఇదేదో నోటిమాటకు అన్నది కాదు. స్వయంగా ఆయన పలుకులు ఆడియో రికార్డుగా మారి, వైరల్ అవుతున్న నిజం. అదేమిటో తెలుసుకుందాం.. పదండి!

విజయవాడ సమీపంలోని గన్నవరం జాతీయ రహదారి వద్ద ఓ క్లినిక్ ఉంది. దానిని నాడు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. క్లినిక్ నడుపుతున్న డాక్టర్ వయో వృద్ధుడు. మంగళవారం ఉదయం క్లినిక్ తీసిన డాక్టర్ తన పనిలో తానుండగా, ఏపీఎస్పీడీసీఎల్ అధీనంలో ఉండే విద్యుత్ చోరీ నిరోధక విభాగానికి(డిపిఇ) చెందిన అధికారులు అక్కడికి వచ్చారు. మీ క్లినిక్‌పై ఫిర్యాదు అందినందున, మీటర్ తనిఖీ చేయాలని  డిపిఇ వింగ్ అసిస్టెంట్ ఇంజనీర్,  డాక్టర్‌కు చెప్పారు.

అదే సమయంలో  వైద్యం కోసం అక్కడికి వచ్చిన శాంతికిరణ్ అనే వ్యక్తి.. మీటర్ సీల్ తీసే క్రమంలో పాటించాల్సిన నియమ నిబంధనలు ఏఈకి  వివరించారు. ఆ నిబంధన ప్రకారం.. విద్యుత్ మీటర్ సీల్ తీసినప్పుడు, దానిని తనిఖీ చేసినప్పుడు  వినియోగదారుడితోపాటు, థర్డ్‌పార్టీ తప్పనిసరిగా ఉండాలి. వారి సమక్షంలో మాత్రమే సీల్ తీయవలసి ఉంది. ఇదే విషయాన్ని కిరణ్ ఏఈకి స్పష్టం చేశారు. దానితో ఖంగుతున్న సదరు అధికారి, స్థానిక పోలీసుస్టేషన్‌కు ఫోన్ చేశారు. కానీ స్థానిక పోలీసుస్టేషన్ నుంచి ఎవరూ రాలేదు.

తర్వాత ఈ విషయాన్ని శాంతికిరణ్, ఎస్‌ఈ (డిపిఇ) శివప్రసాదర్‌రెడ్డికి ఫోన్‌లో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశాడు. అయితే తాను మీటింగ్‌లో ఉన్నానని, ఆయన తిరుగు సమాధానం పెట్టారు. తర్వాత నేరుగా ఫోన్‌లో మాట్లాడిన శివప్రసాదరెడ్డిని.. రెడ్‌జోన్‌లో ఉన్న ప్రాంతంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా ఎలా తిరుగుతారని, దాని వల్ల ఎవరికైనా వైరస్ అంటితే అందుకు  బాధ్యులెవరని శాంతికిరణ్ ప్రశ్నించారు. పైగా తనిఖీకి వచ్చిన ఏఈపై గతంలో, వ్యవసాయ కనెక్షన్‌కు డబ్బులు అడిగారని రాజశేఖర్ అనే రైతు.. ఎస్పీడీసీఎల్ ఎండీకి ఫిర్యాదు చేశారని, ఏసీబీ కేసులో కూడా ఆ అధికారి ఉన్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

అందుకు స్పందించిన శివప్రసాదరెడ్డి.. తనకు తెలిసినంత వరకూ కోవిడ్ రూల్స్ ప్రజలకే తప్ప, తమ విజిలెన్స్ సిబ్బందికి  ఉండవని చెప్పారు. ఆయన అక్కడితో ఆగితే బాగుండేది. కానీ, విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదులొచ్చినందువల్లే, అక్కడికి వచ్చి ఉంటారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వచ్చిన అధికారి మంచివాడని కితాబునిచ్చారు. ఆ క్రమంలో ‘మీకు తెలుసు. ఈ కరెంట్ దొంగతనాలకు క్యాడరంటూ ఏమీ లేదు. ఎమ్మెల్యేలు చేస్తారు. ఎంపీలు చేస్తారు. మంత్రులు చేస్తారు. ఇప్పుడు వెళ్లినాయన ఎవరో నాకు తెలియద’ని వివరణ ఇచ్చారు.

ఆ ప్రకారంగా.. సదరు శివప్రసాదరెడ్డి అనే విజిలెన్స్ అధికారి చెప్పినదాని బట్టి, విద్యుత్ చౌర్యానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అతీతులు కాదని స్పష్టమయిపోయింది. స్వయంగా విద్యుత్ చోరీని కనిపెట్టి, నిరోధించే విభాగ అధికారే ఈ రహస్యం బట్టబయలు చేయడంవల్ల.. మరి ఆయన మాట నమ్మక తప్పదేమో? సదరు అధికారి ఇచ్చిన సర్టిఫికెట్‌పై ప్రజాప్రతినిధులు ఏమంటారో చూడాలి!

ఇదే విషయాన్ని శాంతికిరణ్..  ఏపీఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరక్టర్ పద్మా జనార్దన్‌రెడ్డికి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. రెడ్‌జోన్‌లో ప్రాంతంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు.. సామాజిక దూరం పాటించకుండా, కనీసం మాస్కులు కూడా ధరించకుండా రావడం ఒక తప్పయితే, థర్డ్ పార్టీ లేకుండా మీటర్ సీల్ తీసే ప్రయత్నం చేయడం రెండవ తప్పని స్పష్టం చేశారు. రెడ్ జోన్‌లో విజిలెన్స్ అధికారులు తిరగవచ్చన్న శివప్రసాదరెడ్డి వ్యాఖ్యలను, ఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. దానికి స్పందించిన ఎండీ జనార్దన్‌రెడ్డి.. తాను దీనిపై విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై.. ముఖ్యమంత్రి, విద్యుత్, ఆరోగ్యశాఖ మంత్రులకు ఫిర్యాదు చేసినట్లు శాంతికిర ణ్ ‘సూర్య’కు వెల్లడించారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner