ఆంధ్రా-తెలంగాణ మధ్య ‘పానీ’పట్టు యుద్ధం?

కేసీఆర్‌ను శిష్యుడు జగన్ ధిక్కరిస్తున్నారా?
తెలంగాణలో 7 లక్షల ఎకరాలకు ఎసరు
కృష్ణా జలాల తరలింపుపై కేసీఆర్‌ను మోసం చేశారా?
తెలంగాణ విపక్షాలకు జగన్ ఆయుధాలిస్తున్నారా?
కేసీఆర్ చొరవను జగన్ ఖాతరు చేయలేదా?
గురువుకు పంగనామాలు పెట్టారా?
జగన్ జగడంపై కేసీఆర్ వైఖరేమిటి?
విపక్షాల విమర్శలను ఎదుర్కొనేది ఎలా?
(మార్తి సుబ్రహ్మణ్యం)
కేసీఆర్-జగన్. ఇద్దరూ ఇద్దరే. అపూర్వ సహోదరులు. నిన్న మొన్నటి వరకూ, ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాట. తండ్రి తన పార్టీని చీల్చినా , ఆయన కొడుకుతో దోస్తీ చేస్తున్న పెద్ద మనసు కేసీఆర్‌ది. తన తండ్రిపై ఒంటికాలితో లేచిన కేసీఆర్‌తో, దోస్తీ కట్టిన గొప్ప మనసు జగనన్నది. అయితే.. శత్రువు శత్రువు మిత్రుడన్నట్లు.. ఇద్దరికీ చంద్రబాబు నాయుడే ఉమ్మడి శత్రువు. అందుకే గత ఎన్నికల్లో జగన్‌కు తెరవెనుక సాయం చేసి,ఆయనను గెలిపించడంలో కేసీఆర్‌దే కీలకపాత్ర. కేసీఆర్ సాయం లేకపోతే, జగనన్న లోటస్పాండ్కే పరిమితమయ్యేవారన్నది గులాబీదళాల మాట. ఇది జగనే కాదు, జగమెరిన సత్యం.
గురువుకే ఝలక్ ఇచ్చిన శిష్యుడు
అధికారంలోకి వచ్చిన తర్వాత.. నీటిని సమానంగా పంచుకుందామన్న గురువు గారి మాటలకు, తలూపిన శిష్యుడు జగన్… ఇప్పుడు తన దారి తాను చూసుకుని, గురువుకే పంగనామాలు పెట్టారు. మరి కేసీఆర్ ఊరుకుంటారా? శిష్యుడికే అంత తెలివుంటే, గురువుకు ఇంకెంత తెలివుండాలి? ఎక్కడైనా బావ గానీ, వంగతోట కాడ కాదన్నట్లు.. దీనిని ఊరకనే వదలిపెట్టనని గురువుగారు గరమవుతున్నారు. బోర్డు దగ్గరే పంచాయతీ పెడతానంటున్నారు. మరి ఈ విషయంలో కేసీఆర్, విపక్షాల విమర్శలను ఎలా ఎదుర్కొంటారు? జగన్ ప్రయత్నాలను ఎలా అడ్డుకుంటారు? జగన్ వల్ల విపక్షాల చేతికి చిక్కిన కేసీఆర్ ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారు? అసలు ఇద్దరి మధ్య జరగబోయే, ‘పానీ’పట్టుయుద్ధం, ఏ పరిణామాలకు దారితీయనుంది? ఇదీ.. ఆంధ్రా-తెలంగాణ పాలకుల మధ్య తలెత్తిన మిత్రబేధం!
నాడు తండ్రి.. నేడు తనయుడు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను మూడు టీఎంసీలను లిఫ్ట్ చేస్తూ.. కొత్త ఎత్తిపోతల పథకంపై ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం, ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చు రగిలించనుంది. గతంలో వైఎస్ హయాంలో, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ రిజర్వాయర్ స్ధాయిని పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై.. నాడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేత పి.జనార్దన్‌రెడ్డి, కేసీఆర్, వి.హన్మంతరావు వ్యతిరేకించి, ఉద్యమాలు నిర్వహించారు. సొంత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పిజెఆర్ వ్యతిరేకించినా, వైఎస్ ఖాతరు చేయకుండా, తన రాయలసీమ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. ఇప్పుడు మళ్లీ విచిత్రంగా.. వైఎస్ తనయుడే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అలాంటి మరో వివాస్పద నిర్ణయం తీసుకోవడంతో, తెలంగాణ విపక్షాలు విరుచుకుపడుతుండటం ప్రస్తావనార్హం. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో 7 లక్షల ఎకరాలు నష్టపోతాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జగన్ తీరుపై కేసీఆర్ కన్నెర్ర..
ఏపీ సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్, వాపమక్షాలు వ్యతిరేకిస్తు, గళాన్ని పెంచుతున్న క్రమంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ నష్టనివారణకు రంగంలోకి దిగడంతో, పరిస్థితి ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏకపక్షమే కాకుండా, విభజన చట్టానికి విరుద్ధమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అభ్యంతరకరం. తెలంగాణను సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదం. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధం. మేం ఎక్కడా రాజీపడం. దీనిపై కోర్టుకు వెళతాం’’ అని హెచ్చరించారు. ఆయన మరో అడుగు ముందుకేసి, ఈ వ్యవహారాన్ని, కృష్ణా నీటి యాజమాన్య నిర్వహణ బోర్డులో ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.
బాబుపై వ్యతిరేకతతో.. కేసీఆర్-జగన్ దోస్తీ
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండేది కాదు. దానికితోడు ఓటుకునోటు వంటి కేసులు కూడా, ఇరు రాష్ట్రాల మధ్య దూరం పెంచాయి. గత ఎన్నికల్లో టీడీపీ ప్రత్యర్ధి వైసీపీ విజయానికి, కేసీఆర్ ప్రత్యక్షంగా-పరోక్షంగా చేసిన వివిధ రకాల సహాయాలతో జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుంచీ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. జగన్ కోరినట్లు స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి వంటి అధికారులను ఏపీకి పంపించేందుకు కేసీఆర్ అంగీకరించగా, టీటీడీ జెఈవోగా చేసిన శ్రీనివాసరాజును తెలంగాణకు తీసుకున్నారు.
నిజానికి కేసీఆరే జలవివాదాల అంశంలో చొరవ తీసుకుని, ఇరు రాష్ట్రాల రైతాంగ ప్రయోజనాల లక్ష్యంగా కృష్ణా నీటిని వినియోగించుకుందామని ప్రతిపాదించారు. ఆ మేరకు స్వయంగా ఆయన, జగన్‌తో కొన్ని గంటలపాటు చర్చించారు. ఆ సమయంలో ఏపీలోని విపక్షాలన్నీ.. పూర్తిగా ఆంధ్రా సర్కారు సొమ్ముతో, కృష్ణానీటిని తెలంగాణకు ధారపోసి, రాయలసీమను ఎడారి చేస్తున్నారని జగన్‌పై విరుచుకుపడ్డాయి.
కేసీఆర్‌ను జగన్ చిక్కుల్లో నెట్టారా?
ఆరకంగా రెండు రాష్ట్రాలు-ఇద్దరు సీఎంల మధ్య ఇలాంటి సుహృద్భావ వాతావరణం కొనసాగుతోంది. ఈ సమయంలో, ఈ జలవివాదం తెరపైకి రావడం, రాజకీయంగా కేసీఆర్‌ను చిక్కుల్లో నెట్టినట్టయింది. ఎందుకంటే.. తెలంగాణలో ప్రస్తుతం కరోనా, రైతుపంటకు మార్కెటింగ్ అంశాలు తప్ప, మిగిలిన వివాదాలేమీ లేవు. ఉత్తర తెలంగాణతో పోలిస్తే.. కాంగ్రెస్-బీజేపీ దక్షిణ తెలంగాణలోనే బలంగా ఉన్నాయి. అయినప్పటికీ, వారికి సరైన అంశాలు లభించడం లేదు. ఈ సమయంలో జగన్ చేసిన సాహసం, కేసీఆర్‌ను విపక్షాలకు లక్ష్యంగా చేసినట్టయింది. సున్నితం, భావోద్వేగాలకు సంబంధించిన జల వివాదం తేనెతుట్టెను కదిపిన జగన్.. విపక్షాలు అనే తేనెతుట్టెను, కేసీఆర్‌పై కావాలనే వదిలినట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణ విపక్షాలకు అస్త్రాలిచ్చిన జగన్
ఎందుకంటే.. ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి మెలసి ఉంటున్నారన్న విషయం ఎప్పుడో స్పష్టమయింది. అసలు రాజకీయంగా, కేసీఆర్ సలహాల ప్రకారమే జగన్ నడుచుకుంటున్నారన్న విమర్శ, వ్యాఖ్యలు కూడా రహస్యమేమీ కాదు. ఆక్రమంలో.. కేసీఆర్‌కు తెలియకుండానే, ఆయన ఆమోదం తీసుకోకుండానే, ఆయనతో చర్చించకుండానే.. నీటి విషయంలో జగన్ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారన్నది, ఇప్పుడు తెలంగాణ విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న. ఇలాంటి వాదన సహజంగానే ప్రజలను నమ్మిస్తుంది.
పైగా జగన్ నిర్ణయంతో.. రంగారెడ్డి, నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు తాగు-సాగునీటి సమస్య ఏర్పడుతుంది. ఈ వేసవిలో అలాంటి సమస్య వస్తే, కేసీఆర్‌కు రాజకీయపరంగా కూడా ఇబ్బందులు తలెత్తడం ఖాయం. ఇప్పటికే ఆ ప్రాంత సమస్యలపై కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, బీజేపీ నేతలు డికె అరుణ, సంకినేని వెంకటేశ్వరరావు, టీడీపీ నేత పిన్నమనేని సాయిబాబా, కోదండరాం తదితరులు సర్కారుపై విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ సమస్య తెరపైకి రావడం, వారికి కేసీఆర్ సర్కారుపై యుద్ధానికి కొత్త అస్త్రాలిచ్చినట్టయింది.
అఖిలపక్ష యుద్ధం ఆరంభం
కాగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై జగన్ సర్కారు ఇచ్చిన జీఓను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ అఖిలపక్షం గళం విప్పింది. ఇది కేసీఆర్ సర్కారుపై జమిలి యుద్ధం గానే భావించక తప్పదు. జగన్ సర్కారు దీనిపై ఉత్తర్వులిచ్చినా, కేసీఆర్ మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంలో కేసీఆర్-జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం ఎత్తపోతల పథకాల సామర్థ్యం పెంచుకుంటూ పోతుంటే, తెలంగాణ సర్కారు మాత్రం తగ్గించడంద్వారా, జగన్‌తో కేసీఆర్ లాలూచీ పడినట్లు స్పష్టమవుతోందని బీజేపీ మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ ఇంజనీర్లతో కలసి ఉద్యమిస్తామని అఖిలపక్షం హెచ్చరించడం చూస్తే.. జగన్ కదిపిన జలవివాద తేనెతుట్టె , తెలంగాణలో తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది.
జూన్ 2న చలో పోతిరెడ్డిపాడు..
దీనిపై యువతెలంగాణ పార్టీ ఒక అడుగు ముందుకేసి, జూన్2న చలో పోతిరెడ్డిపాడు ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. కేసీఆర్‌కు జగన్ పెంపుడు కొడుకని, అందుకే పోతిరెడ్డిపాడు విస్తరణను బహుమతిగా ఇచ్చారని జిట్టా ధ్వజమెత్తారు.
ఎవరి వాటాలు వారికున్నాయన్న ఏపి మంత్రి అనిల్
రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదంపై, ఏపి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ నిర్మొహమాటంగా స్పందించారు. కృష్ణా జలాల్లో ఎవరి వాటాలు వారికున్నాయని స్పష్టం చేశారు. తక్కువ రోజుల్లోనే ఎక్కువ వరదనీటిని తీసుకువెళ్లేందుకు, 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల వరకూ డ్రా చేసి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. తెలంగాణకు ఆంధ్రా ఏదో నష్టం చేస్తోందన్నట్లు మాట్లాడటం సరైంది కాదని, నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు.
3 Responses
[…] కలసి మెలసి ఉంటున్న రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలం తర్వాత తలెత్తిన జలవివాదం ముదురుపాకాన పడుతోంది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని విపక్షాలు ఎవరి రాష్ట్రాలకు అనుకూలంగా వారు గళం విప్పుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు, వారి వారి రాష్ట్రాల్లో సొంత మీడియా సంస్ధలున్నాయి. మరి అలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు.. తమ రాష్ట్రాల ఘనత, పోరాటం, అన్యాయాలపై విస్తృత కథనాలు, వ్యాసాలు, సంపాదకీయాలు, పాత పోరాట గాథలు ప్రతి పేజీల్లోనూ వెల్లువెత్తాలి. మరో రాష్ట్రం తీరుపై కలం ఝళిపించి, అన్యాయంపై అక్షర సమరం చేయాలి. అలనాటి పోరాటకాలంలో చేసిన ఘనకార్యాలను.. వారి మీడియాలో వెల్లడించి, దాని వివరాలు, తమ హక్కులు, అడ్డుకుంటున్న పక్క రాష్ట్రం చేసే వాదన లోపాలను తమ సొంత మీడియాలో ఎండగట్టాలి. కానీ.. విచిత్రం.. ఆ పని ఏపీ పాలక పార్టీకి చె ందిన మీడియా చేయలేదు. ఏపీ చేసిన పని అన్యాయం, ఏకపక్షమని స్వయంగా తెలంగాణ పాలకులే ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తెలంగాణ పాలక పక్షానికి చెందిన మీడియాలో.. ఏపీ పాలకుల దుర్నీతిని ఎండగడుతూ ఎక్కడా ఒక్క వ్యతిరేక వ్యాసం గానీ, సంపాదకీయం కానీ భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడమే హాశ్చర్యం.ఇది కూడా చదవండి: ఆంధ్రా-తెలంగాణ మధ్య ‘పానీ’పట్టు యుద్… […]
[…] ఆ తర్వాత రంగంలోకి దిగిన తెరాస సర్కారు.. ఏపీ సర్కారుపై కృష్ణా-గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. దానికి ప్రతిగా.. ఏపీ సర్కారు కూడా తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులన్నీ అక్రమమేనని, వాటికి ఎలాంటి అనుమతులూ లేవని ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా.. తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులు సక్రమమయితే, తాము కడుతున్నవీ సక్రమ ప్రాజెక్టులేనని, తమ హక్కును మాత్రమే వినియోగించుకుంటున్నామని స్పష్టం చేసింది. అక్కడి నుంచి ఆంధ్రా-తెలంగాణ ప్రభుత్వ అధికారులు, నిరంతరం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, బోర్డు కూడా ఇరు రాష్ట్రాల నీటి వినియోగానికి సంబంధించి ఆదేశాలివ్వడంతో, రెండు రాష్ట్రాల నడుమ జలజగడం, పతాక స్థాయికి చేరిందన్న భావన ఏర్పడింది. ఆ క్రమంలో గత నెల 4,5వ తేదీల్లో కృష్ణా-గోదావరీ నీటి యాజమాన్య బోర్డు సమావేశాలు నిర్వహించాయి. అందులో ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు డాక్యుమెంట్ల ద్వారా వినిపించిన వాదనలన్నీ, రెండు బోర్డులూ కేంద్రమంత్రిత్వశాఖకు పంపించాయి. ఆ ప్రకారంగా.. కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షన ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్, రెండు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరిస్తారని అంతా భావించారు.ఇది కూడా చదవండి: ఆంధ్రా-తెలంగాణ మధ్య ‘పానీ’పట్టు యుద్… […]
[…] ఆ తర్వాత రంగంలోకి దిగిన తెరాస సర్కారు.. ఏపీ సర్కారుపై కృష్ణా-గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. దానికి ప్రతిగా.. ఏపీ సర్కారు కూడా తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులన్నీ అక్రమమేనని, వాటికి ఎలాంటి అనుమతులూ లేవని ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా.. తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులు సక్రమమయితే, తాము కడుతున్నవీ సక్రమ ప్రాజెక్టులేనని, తమ హక్కును మాత్రమే వినియోగించుకుంటున్నామని స్పష్టం చేసింది. అక్కడి నుంచి ఆంధ్రా-తెలంగాణ ప్రభుత్వ అధికారులు, నిరంతరం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, బోర్డు కూడా ఇరు రాష్ట్రాల నీటి వినియోగానికి సంబంధించి ఆదేశాలివ్వడంతో, రెండు రాష్ట్రాల నడుమ జలజగడం, పతాక స్థాయికి చేరిందన్న భావన ఏర్పడింది. ఆ క్రమంలో గత నెల 4,5వ తేదీల్లో కృష్ణా-గోదావరీ నీటి యాజమాన్య బోర్డు సమావేశాలు నిర్వహించాయి. అందులో ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు డాక్యుమెంట్ల ద్వారా వినిపించిన వాదనలన్నీ, రెండు బోర్డులూ కేంద్రమంత్రిత్వశాఖకు పంపించాయి. ఆ ప్రకారంగా.. కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షన ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్, రెండు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరిస్తారని అంతా భావించారు.ఇది కూడా చదవండి: ఆంధ్రా-తెలంగాణ మధ్య ‘పానీ’పట్టు యుద్… […]