విశాఖ ఎల్‌జీ మహా ఉల్లం‘ఘనురాలేనా’?

637

నిజాలు దాచడం  ఎల్జీకి అలవాటేనా?
దక్షిణ కొరియా ప్రభుత్వమే బయటపెట్టిందా?
కేంద్ర అనుమతులు లేకుండా ఎలా తెరిచారు?
టీడీపీ తప్పు చేస్తే వైసీపీ ఎందుకు సరిదిద్దలేదు?
‘విషాద’పట్నం ఘటనలో అన్నీ ప్రశ్నలే
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఎల్‌జి పాలిమర్స్ కంపెనీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లు  చాలామంచి సంస్థ. మంచి పేరున్న కంపెనీ. అందుకే ఆ కంపెనీలో ఘటన జరిగిన అదేరోజు.. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోనే  ఆయన, సదరు కంపెనీ ప్రతినిధులతో ముచ్టటించారు. సహజంగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన అలాంటి ప్రమాద ఘటన జరిగిన తర్వాత,  యజమాని ఎవరైనా సరే ముందు పారిపోతారు. తర్వాత ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటారు. లేదా లొంగిపోతారు. అంతకుముందే ప్రభుత్వం.. సదరు యజమానిని అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగుతుంది. అంతకంటే ముందు ఆ పరిశ్రమను మూసివేస్తున్నట్లు ప్రకటిస్తుంది. పరిశ్రమ-కార్మిక శాఖ అధికారులు ఘటన కారణాలు అన్వేషిస్తారు. ప్రభుత్వం కూడా.. పనిలోపనిగా, ప్రభుత్వపరంగా తనిఖీలు చేయడంలో విఫలమయిన, సంబంధిత శాఖల అధికారులను సస్పెండ్ చేస్తుంది. మీడియా కోసమైనా ఆ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. కానీ.. ఏపీలో మాత్రం జరిగింది అందుకు పూర్తి భిన్నం. ఏ కంపెనీ అయితే ప్రజల ప్రాణాలను బలితీసుకుందో, అదే కంపెనీ ప్రతినిధి బృందం స్వయంగా ముఖ్యమంత్రిని నిర్భయంగా కలిసింది. సీఎం గారు కూడా వారిని సాదరంగా ఆహ్వానించి, చాలా నింపాదిగా  ముచ్చటించారు. అరెస్టులు, సస్పెండ్లు, కఠినంగా శిక్షిస్తామన్న హెచ్చరిక వగైరాలేవీ లేవు. ఎందుకంటే.. అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి! అక్కడ ఉన్నది ‘పాపులను పెద్దమనసుతో క్షమించే’ కరుణామయుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాబట్టి!!

చాలామంచి కంపెనీ అని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అభివర్ణించిన అదే.. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ 11 మందిని పొట్టనపెట్టుకుని, వందల మందిని మృత్యువు సమీపంలోకి తీసుకువెళ్లింది. అలాంటి విశాఖ ఎల్జీ కంపెనీకి ఉల్లంఘనలు సాధారణమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఆ కంపెనీ వైఫల్యాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వమే బయటపెట్టడం మరో విశేషం. అదెలాగంటే.. గతంలో  నిర్ణీతస్థాయి కంటే 15 రెట్లు ఎక్కువగా, అతి ప్రమాదకరమైన వినైల్ క్లోరైడ్‌ను గాలిలోకి వదిలింది.  దానిని కప్పిపెట్టడానికి అనేక వివరాలు కూడా దాచి ఉంచిందని, స్వయంగా దక్షిణ కొరియా ప్రభుత్వమే 2019 ఏప్రిల్‌లో బయటపెట్టింది.

అంతేనా? ప్రాధమిక స్థాయిలో పర్యావరణ నియమాలను పాటించలేదని అంగీకరిస్తూ, ఎల్జీ కంపెనీనే గతేడాది మేలో రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ ముందు, ప్రమాణపత్రం దాఖలు చేయడం బట్టి… ప్రభుత్వాల సహకారం, స్థానిక నేతల అండతో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ, మహా ఉల్లం ‘ఘనురాలే’నని స్పష్టమవుతోంది. తాజాగా మానవ హక్కుల వేదిక.. ఎల్జీ ఉల్లంఘనల బండారం బయటపెట్టింది.

కేంద్రం అనుమతి లేకుండా ఎలా తెరిచారు?

కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే, అందులోనూ ఎలాంటి లాక్‌డౌన్ సమయంలో అత్యవసరం కాని పాలిమర్స్‌ను, ఎలా తెరిచారన్న చర్చపై అనేక ఆరోపణలు, అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. 1997లో యుబి గ్రూప్ నుంచి టేకోవర్ చేసిన ఎల్‌జీ గ్రూప్,  ఇప్పుడు ఎలాంటి అనుమతి లేకుండానే కంపెనీ తెరవడం ఆశ్చర్యం. ఇలాంటి పనే ఏ అనామకుడో చేస్తే, అతడిపై చర్యల కొరడా ఝళిపించే పాలకులు, ఎల్జీని మాత్రం పువ్వుల్లోపెట్టి చూసుకోవడం సహజంగానే అనుమానాలకు కరుణించడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. నిజానికి ఈ కంపెనీకి, 1961 నుంచీ అన్ని ప్రభుత్వాలూ కాలుష్య నివారణ పత్రాలు ఇచ్చాయి. ఆ ప్రకారంగా 8-5-2007, 4-01-2009న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి; 13-4-2012, 6-5-2014న నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, 19-1-2017న నాటి సీఎం చంద్రబాబునాయుడు అప్పటి నిబంధనల ప్రకారం.. ఎల్జీ కంపెనీకి పొల్యూషన్ కంటల్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు.

కొత్త నిబంధనలతో అడ్డం తిరిగిన కథ

అంతవరకూ కథ బాగానే నడిచింది. కానీ, 2017 మార్చి నుంచే కథ అడ్డం తిరిగింది. అదెలాగంటే.. ఇలాంటి కంపెనీలకు నూతన విధివిధానాలు ఉండాలని కేంద్రప్రభుత్వం-సుప్రీంకోర్టు సంయుక్తంగా, కొత్త మార్గదర్శకాలు  రూపొందించాయి. ఆ ప్రకారంగా ఈ తరహా కంపెనీలన్నీ, నూతన మార్గదర్శకాల మేరకు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, 16-3-2018న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఎల్జీ కంపెనీ.. తమ సంస్ధ విస్తరణ కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ స్టేట్‌లెవల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ)కు 12-4-2018న దరఖాస్తు చేసుకుంది.

నిబంధనల ప్రకారం లేదన్న నాటి సర్కారు

దానికి స్పందించిన నాటి చంద్రబాబు సర్కారు.. ఎల్జీ దరఖాస్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని దానిని తిరస్కరించి, అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. అయితే, సదరు ఎల్జీ సంస్థ కూడా.. తాము సంస్ధను విస్తరించేందుకు, స్టరైన్ స్థాయి పెంచుకునేందుకు పర్యావరణ అనుమతులు లేవని, తాము 12-4-2018న పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉందని స్వయంగా వెల్లడించింది. మళ్లీ 10-6-2019న ఇదే సంస్థ.. పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులు పునరుద్ధరించాలని మరో ప్రతిపాదన పెట్టింది. ఇదీ.. ఎల్జీ కంపెనీ ప్రభుత్వంతో సంప్రదించిన కీలక అంశాలు.

జగన్ వచ్చాక పరుగులు తీసిన ఎల్జీ ఫైల్

కానీ, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కంపెనీకి సంబంధించి..  హోల్డ్‌లో ఉన్న దరఖాస్తు పంచకల్యాణీ గుర్రం కూడా ఈర్ష్యపడే స్థాయిలో,  పరుగులు తీయడమే ఇక్కడ అందరి అనుమానాలు, ఆరోపణలకు అవకాశం ఇచ్చినట్టయింది. అది ఎలాగంటే.. 2019 జూన్ 20న విజయవాడలో జరిగిన  స్టేట్ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఎస్‌ఈఏసీ) సమావేశంలో.. ఎల్జీ అంశాన్ని 128,48 ఐటెంగా చేర్చి, ఏపీఎస్‌ఈఐఏఏకు బదలాయించారు. ఆ మేరకు జులై 9న జరిగిన ఏపీఎస్‌ఈఐఏఏ సమావేశంలో, ఎల్జీ అంశాన్ని 120.48 ఐటెంగా చేర్చారు. ఆ సమావేశంలోనే ఎల్జీ దరఖాస్తును క్లియర్ చేసి, కేంద్రప్రభుత్వానికి పంపించారు. ఆ ప్రకారంగా.. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, హోల్డ్‌లో ఉన్న ఎల్జీ కంపెనీ దరఖాస్తు.. పంచకల్యాణీ గుర్రం కంటే వేగంగా కదిలి, ఏకంగా కేంద్రానికి సిఫారసు చేసే వరకూ పరుగులు తీసినట్లు స్పష్టమవుతోంది. అంటే కేవలం మూడు నెలలోనే ఎల్జీ ఫైల్‌కు రెక్కలొచ్చాయన్నమాట!

బ్యాంకు డీడీతోనే సరి…

సరే.. చేతిలో చెప్పినట్లు వినే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, ప్రైవేటు కంపెనీ లాబీ పనిచేసి, ఫైల్ కేంద్రం వరకయితే వెళ్లింది. మరి అక్కడి నుంచి అనుమతి వచ్చేవరకూ ఏ కంపెనీ అయినా వేచిచూడాలి కదా? కానీ, ఎల్జీకి మాత్రం అలాంటి ఉద్దేశం ఉన్నట్లు కనిపించలేదు. కేంద్రం-సుప్రీంకోర్టు సంయుక్తంగా  కొత్త మార్గదర్శకాలు విడుదల చేశాయని తెలిసినా పట్టించుకోకుండా.. కేవలం అఫిడవిట్, నాలుగున్నర లక్షల బ్యాంకు డీడీ  ఆధారంగా ఎల్జీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సహజంగానే ఆరోపణలు,అనుమానాలకు తావిస్తోంది.

రాజకీయ రొచ్చులో పేలుతున్న ‘గ్యాస్’

11 మంది మృతి చెంది, వందల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ వ్యవహారం, అందరూ అనుకున్నట్లుగా సహజంగానే రాజకీయమార్గం పట్టింది. 1998లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇదే కంపెనీలో అగ్నిప్రమాదం జరిగితే, అప్పుడు ఆ కంపెనీని ఎందుకు మూయించలేదని మంత్రి కొడాలినాని ప్రశ్నించారు. నిజమే. ఆనాడు బాబు ఆపని చేయకుండా తప్పు చేశారని అంగీకరిద్దాం.
మరి బాబు  ప్రభుత్వం చేసిన  తప్పును సరిదిద్దాల్సిన  జగన్ కూడా.. చంద్రబాబు చేసిన తప్పేచేస్తే, ఇక ఇద్దరికీ తేడా ఏముంది? ‘నేను బాబుకు భిన్నంగా ఉంటాను. నాకు-బాబుకూ తేడా ఉండాలి కదా’? అని ఫిరాయింపులపై అసెంబ్లీలో చెప్పిన జగన్.. మరి ఎల్జీ విషయంలో బాబుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించలేదు? తప్పులు చేశారు కాబట్టే మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారని,  టీడీపీకి చురకలేసిన  వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పినట్లు.. తప్పు చేసిన టీడీపీ దారిలోనే జగన్ పయనించడమే ఆశ్చర్యం. అధికారంలోకి వచ్చిన బాబు సర్కారు చేసిన అనేక తప్పులను సరిదిద్ది, సమీక్షించిన జగన్.. మరి ఎల్జీ విషయంలో బాబు  చేసిన తప్పును మాత్రం ఎందుకు సరిదిద్దరన్నది ప్రశ్న.

ఆంధ్రా అంతటా ఇవే ప్రమాదఘంటికలు

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన తర్వాత.. రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు సురక్షితం అన్న ప్రశ్నలు తెరపైకొచ్చాయి.  రాష్ట్రంలో మొత్తం 86 పరిశ్రమల్లో, ప్రమాదఘంటికలు మోగేందుకు సిద్ధంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఇదే విశాఖ జిల్లాలోనే 20 కంపెనీలుండగా, దానికి ఆనుకునే ఉన్న తూర్పు గోదావరిలో 21 కంపెనీలుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని, కనీసం ఆ పరిశ్రమల్లోనయినా.. ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్-పరిశ్రమల శాఖ సంయుక్తంగా తనిఖీ చేసి, ఎన్‌ఓసీ ఇచ్చిన తర్వాతనే పరిశ్రమలు ప్రారంభిస్తేనే..  కార్మికులు-ప్రజల ప్రాణాలకు కొంతయినా  గ్యారంటీ ఉంటుంది.