ఎల్జీకి జగన్ వెయ్యి కోట్లు మిగిల్చారా?

78

కంపెనీ ఆ బీమా చేయించలేదా?
40 రోజులు పాసులు తీసుకుని ఏం చేశారు?
నిజంగా నిర్వహణ చేసి ఉంటే లీక్ సాధ్యమా?
నిర్వహణ లోపం వాదనను నమ్మని కేంద్రబృందం?
కంపెనీవన్నీ ఉత్తి ‘గ్యాసే’నా?
ఎల్జీపై కమ్ముకుంటున్న ఆరోపణ మేఘాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

విషాద విశాఖలో ఆయువు తీసిన వాయువు వ్యవహారంలో రోజుకో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఎల్జీ కంపెనీ ఏ అంశాల్లోనూ,  నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా బీమా వ్యవహారంలోనూ కళ్లకు గంతలు కట్టి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పరిహారం నుంచి తప్పించుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్జీ ఘటనపై విచారణకు విశాఖకు వచ్చిన కేంద్రబృందం కూడా, కంపెనీ నిర్వాకంపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.

ఆ బీమా చేసుంటే వెయ్యికోట్ల పరిహారం..

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ..   స్ట్రిక్ట్ లయబిలిటీ ఇన్య్సూరెన్స్ యాక్ట్ ప్రకారం,  బీమా చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నిబంధన ప్రకారం చేసి ఉన్నట్టయితే, ఎల్జీ కంపెనీ బాధితులకు  వెయ్యి కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు సీఎం జగన్ కోటి రూపాయలు ప్రకటించడం ద్వారా, ఒకరకంగా  ఆ కంపెనీకి 970 కోట్లు మిగిలించారని బీమా నిపుణులు చెబుతున్నారు. భోపాల్ గ్యాస్ లీకయిన సందర్భంలో అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ సంస్థ 750 కోట్ల రూపాయల పరిహారం ఇదే పద్ధతిలో చెల్లించిందని పలువురు గుర్తు చేస్తున్నారు.

ఇదీ బీమా  లెక్క..

నిజానికి ఎల్జీ కంపెనీ తమ సంస్థలో పనిచేసే 567 మంది ఉద్యోగులకు,  ఎనీ టైం యాక్సిడెంట్ (ఏఓఏ) కింద 5 కోట్లు, ఇతర టాపప్ కింద మరో 5 కోట్లు.. మొత్తం 10 కోట్లు మాత్రమే బీమా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం 25 వేలు మాత్రమే బీమా వస్తుందంటున్నారు. అది కూడా పాక్షికంగా దెబ్బతగిలిన వారికి, మూడునెలల వరకూ మాత్ర మే వెయ్యి రూపాయలు చొప్పున, ప్రైవేటు ఆస్తులు దెబ్బతిన్నందుకు 6 వేలు, ఇలా నష్టపరిహారం కింద అందుతుందని బీమా నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి 76 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఫ్యూచర్ జనరాలి, మాగ్మా హెచ్‌డిఐ కంపెనీలకు 8 శాతం చొప్పున బీమా చేసినట్లు సమాచారం.

మరి కార్మికులను తీసుకుని ఏం చేసినట్లు?

మార్చి 23,24వతేదీల్లో కంపెనీ ప్రతినిధి..  తమ పరిశ్రమలో పాక్షిక నిర్వహణ కోసం, 45 మందిని మూడు షిఫ్టుల్లో ఒక షిఫ్టునకు 15 మంది చొప్పున, కార్మికులు అవసరం ఉంది కాబట్టి..  లాక్‌డౌన్ ఉన్నందున, వారికి  పాసులు జారీ చేయాలని  విశాఖ జిల్లా కలెక్టర్‌కు, ఎల్జీ సంస్థ ప్రతినిధి దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు కలెక్టర్ అనుమతి జారీ చేశారు. ఆ ప్రకారంగా కంపెనీలో యంత్రాలకు ఓవర్ హాలింగ్, ఇతర తుప్పుపట్టే అవకాశం ఉన్న యంత్రాలు, పైప్‌లు, బాయిలర్లు, నట్-బోల్ట్‌లను క్రమబద్దీకరించుకోవలసి ఉంటుంది.

అడుగడుగునా.. అనుమానాలే

మరి అదే నిజమైతే, కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్న దాని ప్రకారం, కంపెనీలో  చిన్నపాటి లోపం కూడా దొర్లకూడదు. అంతమంది కార్మికులకు పాసులు తీసుకుని, వారితో మూడు షిఫ్టులలో పనిచేయించినా, దారుణ ప్రమాదం జరిగిందంటే.. దానికి నిర్వహణ వైఫల్యం కాకుండా, మరో కారణం ఏమైనా ఉంటుందా? అన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి. తాజాగా విశాఖకు వచ్చిన కేంద్రబృందంకూడా..   40 రోజుల పాటు కేవలం పాక్షిక నిర్వహణ కోసం అనుమతి, కార్మికులకు పాసులు  తీసుకున్నప్పుడు,  నిర్వహణలోపం వల్లనే ప్రమాదం జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించడంతో అక్కడున్న కంపెనీ ప్రతినిధి బృందం తెల్లమొఖం వేసినట్లు తెలిసింది. ఈ 40 రోజుల్లో కార్మికులు ఏం పనిచేశారన్న వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.

ఈ ప్రశ్నకు బదులేదీ?

మరి ఆ ప్రకారంగా.. ఈ 40 రోజుల్లో పాక్షిక నిర్వహణ చేస్తున్న సందర్భంలో, అక్కడికి ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? పరిశ్రమలు-కార్మిక శాఖ అధికారులు ఏమయ్యారు? పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు-ఎన్విరాన్‌మెంటల్ విభాగం  అధికారుల దృష్టికి ఒకవేళ వచ్చింటే, లోపం సరిదిద్దేవారుకదా? అన్న ప్రశ్నలకు ఎవరి వద్దా జవాబు లేదు.  నిజానికి ఈ సంస్థకు ఇచ్చిన అనుమతి, 2021 డిసెంబర్ 19వరకు మాత్రమే ఉందంటున్నారు.

ఆ 256 ఎకరాల స్థలంపై కన్నేశారా?

ఇదిలాఉండగా..  ఎల్జీ కంపెనీ, దాని పరిసర ప్రాంతాల్లోని   256 ఎకరాలపై కొంతమంది పెద్దలు కన్నేసినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఖరీదైన ఈ స్థలాన్ని హక్కుభుక్తం చేసుకునే క్రమంలో, ప్రభుత్వ స్థాయిలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కంపెనీ వారి నుంచి పరోక్షంగా ఆ స్ధలం బదలాయించే భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.