జగన్ చెప్పినప్పుడు…నవ్వేశారుగా!

640

‘సహ జీవనం’అనే మాటపై సెటైర్లు..
లవ్ అగర్వాల్ నుంచి…కే టీ ఆర్ దాకా అదే మాట….
భోగాది వేంకట రాయుడు
విజయవాడ:’కరోనా తో మనం సహజీవనం చేయాల్సిందే…ఇది ఇప్పట్లో పోయేది కాదు…’అంటూ ముఖ్యమంత్రి ఓ పది రోజుల క్రితం చెప్పినప్పుడు విమర్శకులు బుగ్గలు నొక్కుకున్నారు. జగన్ ను విమర్శించడానికి ఏ చిన్న అవకాశం లభిస్తున్న సూచన కనిపిస్తున్నప్పటికీ…తటాలున ఎగిరి దానిని అందిపుచ్చుకోడానికి ఫుల్ టైం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు అయితే మరీ వేళాకోళం ఆడారు. ‘కరోనా తో సహజీవనం చేయాల్సివుంటుందనే మనిషి గురించి ఇక మాట్లాడేది ఏముంటుంది…’అంటూ… ఈ సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నట్లయితే…కరోనాను చిటికెలో మటుమాయం చేసి ఉండేవాడిని అన్నట్టుగా మాట్లాడారు. ఈ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఎలాగో మన రాజ్యాంగానికి కూడా అర్ధం కాని విషయం గనుక;రాజ్యాంగానికి కూడా అర్ధం కాని విషయాలను అర్ధం చేసుకోడానికి మనం ప్రయత్నించడం కూడా వృథా శ్రమే కదా!

అయినప్పటికీ…కొందరు ‘తెలుగు తమ్ముళ్లు’ చంద్రబాబు కంటే రెండాకులు ఎక్కువే చదివామన్నట్టుగా….’ఓ నెల రోజులు చంద్రబాబుకు అధికారం అప్పగించండి….కరోనా ను ఎలా కట్టడి చేస్తారో చూద్దురు గానీ…’అంటూ సవాళ్ళకు కూడా దిగి, ఈ విషాద సమయం లో కూడా బోలెడంత వినోదం కలిగించారు. రాజ్యాంగం లోని ఏ అధికరణం కింద ఇటువంటి వెసులుబాటు ఉన్నదో…వర్ల రామయ్య, బోండా ఉమ లాటి సీనియర్ నాయకులు వివరించి ఉంటే…రాజకీయ పరిశీలనాభిమానులకు జనరల్ నాలెడ్జ్ ఎంతో కొంత పెరిగేది.

ఈ కరోనాతో మనం సహజీవనం చేయాల్సివుంటుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పగానే…టీవీ డిబేటీషియన్లు… రెచ్చిపోయారు. యూట్యూబ్ ఛానెలీశ్వరరావులు….. తమకు గల మేధాశక్తి తో చెలరేగిపోయారు. ప్రతిపక్షాల వారు అయితే….’దొరికాడ్రా జగన్ ‘అనుకుంటూ…మీడియా సమావేశాల్లో హోరెత్తించారు. జగన్ కు అనుభవం లేదన్నారు. టీవీ చానెళ్లు, యూ ట్యూబ్ లు, ప్రతి పక్ష స్వరాలు అన్నీ కలగలిసి జగన్ పై ఏకోన్ముఖ దాడికి దిగాయి.ఈ విధంగా కొంత ఆత్మానందం పొందాయి.

ఈ కామెడీని కాసేపు పక్కన పెడితే….ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్ధిక మంత్రిగా’ ప్రస్తుతం’ కాలక్షేపం చేస్తున్న హరీశ్ రావు , కే టీ ఆర్ కూడా …జగన్ చెప్పిన విషయాన్నే కరాఖండిగా చెప్పారు. అయినా…’తెలుగుదేశం’ ‘జాతీయ’ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీనిని ఖండించలేదు. తెలంగాణ లో ఉన్న తెలుగు దేశం పార్టీ కి కూడా ఆయనే జాతీయాధ్యక్షుడు కదా! కాదా?

ఇక, అసలు విషయానికి వస్తే…కరోనా వైరస్ అనే దానినుంచి విముక్తి పొందడానికి…ఒక వాక్సిన్ ను కనిపెట్టడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చునని;తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బతకడం తప్ప మరో మార్గం కనపడడం లేదని ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు కూడా పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని జగన్ చెప్పిన తరువాతనే ప్రపంచ శాస్త్రవేత్తలు… భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ కూడా ఇదే విషయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించారు.

ఈ అంశం మీద ఈనాడు దినపత్రిక సవివరమైన కథనం కూడా ప్రచురించింది. జగన్ చెప్పిన దానినే మరింతగా విపులీకరించింది.
గతం లో మానవాళిని చుట్టుముట్టిన అనేక వైరస్ లకు కూడా వాక్సిన్ లను కనిపెట్టలేక పోయారు. కనిపెట్టిన వాక్సిన్ లు ఆయా వైరస్ లను నూరుశాతం నివారించలేక పోయాయి. మాటవరుసకు…. ఎయిడ్స్ వ్యాధికి సంపూర్ణమైన వాక్సిన్ ను శాస్త్రవేత్తలు ఈ పూటకీ కనిపెట్టగలిగారా? అది మానవాళి పై దాడి ప్రారంభించి ఎన్ని దశాబ్దాలు అయింది? మనిషి దానితో సహజీవనం చేస్తున్నాడా?లేదా?
అలాగే… ఏదో ఒక వైరస్ ఇలా విరుచుకు పడగానే…అలా సూదిమందు ను కనిపెట్టేయలేరు.

అందువల్లనే…మనమీద ఏ వైరస్ దాడికి దిగినా…దానికో నమస్కారం పెట్టి, దానితో సహజీవనం చేయక తప్పని పరిస్థితుల్లో మనం ఉన్నాం. సహజీవనం చేయడం అంటే…దానిని పక్కలో వేసుకుని పడుకోవడం కాదు. దాని బారిని పడకుండా…తగిన జాగ్రత్తలతో మన బతుకు మనం బతకడం.ఇదే జగన్ చెప్పింది. దీనికే.. ఆయన రాజకీయ, సామాజిక విమర్శకులు పెడార్ధాలు తీసింది.
అయితే…జగన్ కూడా ఒక విషయాన్ని గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. తాను చెప్పే…లేదా..చెప్పదలుచుకున్న విషయం… సందేహాతీతంగా…సూటిగా జనం దృష్టికి వెళ్లాల్సిన అవసరాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనపడుతున్నది. పాదయాత్ర సందర్భంగా తన ప్రసంగాలలో పిడుగులు కురిపించిన జగన్…ముఖ్యమంత్రి హోదాలో పొడి..పొడిగా మాట్లాడడం వల్ల…ఆయన ప్రకటనల్లోని సంపూర్ణ భావం ప్రజలకు చేరవలసిన రీతిగా చేరడం లేదు.

ప్రభుత్వపరంగా కనపడుతున్న ఈ ‘గ్రే ఏరియా’పై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలి. ఏదైనా ఒక అంశం పై ముఖ్యమంత్రి జగన్ ప్రజల ముందుకు వచ్చి, తాను చెప్పదలుచుకున్నది చెప్పిన తరువాత….ప్రభుత్వం తరఫున ఒకరు మీడియా ముందుకు వచ్చి…జగన్ ప్రకటన కు సంబంధించిన పూర్వపరాలు…పర్యవసానాలు వివరించడం వల్ల…అటు ప్రజలకు, ప్రభుత్వానికి కూడా మంచిది. దీనివల్ల మీడియా కాలుష్యం కొంతవరకు తగ్గుతుంది.

-భోగాది వెంకట రాయుడు

1 COMMENT