ఎల్జీ కంపెనీ ఇన్సూరెన్స్.. పదికోట్లేనా?

609

అంటే వచ్చే నష్టపరిహారం 25వేల రూపాయలేనా?
ఇక కంపెనీ ఇచ్చే నష్టపరిహారం ఎంతో?
ఆ సొమ్ము సర్కారుకా? బాధితులకా?
మరి కోర్టు తీర్పులు పాటించరా?
గతంలో బోటు ఘటనల్లో ప్రైవేటు నుంచి పరిహారం రాబట్టని బాబు,జగన్
ఎల్జీ ఘటనలోనే తొలిసారి కోటి నష్టపరిహారంపై అనుమానాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

దేశాన్ని దిగ్భ్రమ గొలిపిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకైన ఘటనపై.. జాతీయ మానవ హక్కుల కమిషన్, గ్రీన్ ట్రిబ్యునల్‌తోపాటు, ఏపీ హైకోర్టు కూడా తమంతట తాము స్పందించాయి. గ్రీన్ ట్రిబ్యునల్ ఓ అడుగుముందుకేసి, ఎల్జీ కంపెనీని తక్షణమే 50 కోట్లు డిపాజిటు చేయాలని ఆదేశించింది.

బీమా చేస్తే.. ఇలా ధీమా..!

అయితే.. జగన్ సర్కారు మాత్రం ప్రాథమిక విచారణతో సంబంధం లేకుండానే, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటించడం, మొత్తం 30 కోట్లు విడదల చేయడం జరిగిపోయింది. నిజానికి  ఒక ఘటనకు నష్టపరిహారం అది చాలా ఎక్కువ. ఈ విషయంలో జగన్ సాహసం చేశారనే చెప్పాలి. కానీ, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్/ పబ్లిక్ లిమిటెడ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం, ఇలాంటి భారీ, రసాయనిక కంపెనీలు ఇన్సూరెన్స్ చేయాలి. అది భారీ స్ధాయిలోనే ఉంటుంది. ఆ ప్రకారంగా అయితే మృతుల కుటుంబాలకు, ఒక్కోరికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం అందుతుందని బీమా నిపుణులు చెబుతున్నారు. అప్పటివరకూ ఆగకుండా, ప్రభుత్వమే కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వడం మంచిదే. అయితే, అంతకంటే తీవ్రమైన బోటు ప్రమాదాల ఘటనలో 10 లక్షలు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం, ఎల్జీ విషయంలో మాత్రమే కోటి రూపాయలు ఇవ్వడంపై రాజకీయ పార్టీల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు లేని పెద్దమనసు ఇప్పుడెలా వచ్చింది? ఎవరికోసం వచ్చిందని టీడీపీ-వామపక్షాలు నిలదీస్తున్నాయి.

కానీ.. ఎల్జీ చేసిన బీమా అత్యల్పమేనా?

నిబంధనల ప్రకారం ఎల్జీ కంపెనీ వల్ల మృతి చెందిన వారికి ఒక్కోరికి 5 కోట్ల రూపాయలు రావలసి ఉంది. కానీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎల్జీ కంపెనీ చేసిన ఇన్సూరెన్స్ కేవలం పది కోట్ల రూపాయలేనని తెలుస్తోంది. అదే నిజమైతే అంత ప్రమాదకమైన రసాయనాలతో నడిచే భారీ కంపెనీ, కేవలం పది కోట్ల రూపాయలే ఎలా ఇన్సూరెన్స్ చేస్తుందన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ఆ ప్రకారంగా చూస్తే,  నష్టపరిహారం 25 వేల రూపాయలకు మించదని బీమా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎల్జీ కంపెనీ నుంచి నిష్టపరిహారానికి సంబంధించిన ప్రకటన రాలేదు. మరి ఆ కంపెనీ నుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సిన పరిహారాన్ని, ప్రజల డబ్బుతో ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందన్నది ప్రశ్న.

పరిహారానంతరం ప్రశ్నలెన్నో…?

ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కోరికి కోటి రూపాయలు ప్రకటించిన నేపథ్యంలో, కొన్ని ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారం కాకుండా, కంపెనీ కూడా నష్టపరిహారం చెల్లిస్తుందా? లేక కంపెనీ ఇస్తుంది కాబట్టి అప్పటివరకూ ఆగకుండా, ప్రభత్వమే నష్టపరిహారం చెల్లించిందా? అదీగాకుండా రెండూ వేర్వారా? ఒకటేనా? పోనీ..  తాను బాధితులకు ఇచ్చిన 30 కోట్ల రూపాయలను,  ఎల్జీ కంపెనీ నుంచి ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటుందా? అదే నిజమైతే ఇక ఆ కంపెనీ బాధితులకు ఇచ్చేది ఏమీ ఉండదా? అన్న ప్రశ్నలకు సమాధానం లభించవలసి ఉంది. మరి ఇవి కాకుండా, పర్యావరణాన్ని విధ్వంసం చేసినందుకు, మరికొంత నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో జరిగిన అనుభవాలు ఇవీ…

చంద్రబాబునాయుడు, అంతకుముందు పాలకుల హయాంలో జరిగిన వివిధ ఘటనలలో.. ముందు ప్రభుత్వం తక్షణ సాయంగా కొంత డబ్బును నష్టపరిహారంగా చెల్లించేవి. దేశంలో జరిగిన పలు ఘటనలో కూడా ప్రభుత్వాలు, ఇదే పద్ధతి అనుసరించాయి. తర్వాత ఆయా కంపెనీల నుంచి  నష్టపరిహారం వచ్చేది. భోపాల్‌లో జరిగిన గ్యాస్‌లీక్ ప్రమాదంలో 715 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని, అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కంపెనీ చెల్లించింది. ఇది 1984 నాటి మాట!

బాబు- పుష్కరాలు- బోటు మరణాలు..

బాబు ముఖ్యమంత్రి- జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగిన గోదావరి పుష్కరాలలో, నష్టపరిహారాన్ని చంద్రబాబు ప్రభుత్వమే పది లక్షల రూపాయల  చెల్లించింది.  ప్రభుత్వ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాబట్టి,  ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది. ఎందుకంటే, అందులో ప్రైవేటు భాగస్వామ్యం లేదు కాబట్టి!  హుద్‌హుద్ తుపానులో మృతి చెందిన వారి కుటుంబాలకు  5 లక్షల నష్టపరిహారం చెల్లించారు. అది ప్రకృతి వైపరీత్యం కాబట్టి, ప్రభుత్వమే దానికి బాధ్యత వహించింది.

ఇక కృష్ణా ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 21 మంది చనిపోగా, బాబు ప్రభుత్వం 10 లక్షల నష్టపరిహారం ఇచ్చింది. ఆ ప్రైవేటు కంపెనీ నుంచి మాత్రం డబ్బులు  రాబట్టలేకపోయింది. ఆ బోటు కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన నాటి టీడీపీ మంత్రులదన్న ఆరోపణలొచ్చాయి. బాబు హయాంలోనే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో, గ్యాస్‌పైప్‌లైన్ పేలి స్థానికులు మృతి చెందారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వగా, గెయిల్ కంపెనీ 20 లక్షలు ఇచ్చింది. గెయిల్ కంపెనీ నుంచి గ్యాస్ లీకయినప్పుడు, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడాన్ని, విపక్ష నేతగా జగన్ విమర్శించారు. ఆ కంపెనీ నుంచే పూర్తి నష్టపరిహారం చెల్లించాలని, ఆ కంపెనీపై మీకు ప్రేమ ఎందుకని నిండుసభలో నిలదీశారు.

జగన్- బోటు మరణాలు- గ్యాస్‌లీక్..

ఇప్పుడు అదే జగన్.. తాను ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా, విశాఖలో 11 మంది మరణాలకు కారణమైన ఎల్జీ నుంచి, నష్టపరిహారం రాబట్టకుండా, 3ం కోట్ల ప్రభుత్వ సొమ్ము ఇచ్చారు. పైగా.. మేమూ మేమూ చూసుకుంటామని చెప్పారు.  అదే  జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన, ఘోర  పడవ ప్రమాదంలో దాదాపు 56 మంది మృతి చెందారు. అది రాయల్ వశిష్ట బోట్ ప్రైవేటు కంపెనీకి చెందినది. పైగా విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రికి చెందినదన్న ఆరోపణలు వచ్చాయి. బోటు మునిగిన చాలారోజులకు మృతదేహాలు వెలికితీయగా, కొందరు  గల్లంతయ్యారు. ఆ ఘటనలో జగన్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు, 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ప్రైవేటు కంపెనీకి చెందిన బోటు యజమాని నుంచి మాత్రం నష్టపరిహారం రాబట్టలేకపోయింది.

ఇక్కడ విశేషమేమిటంటే.. బాబు హయంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన బోటు ప్రమాద బాధితులకు టీడీపీ ప్రభుత్వం 10 లక్షలు చెల్లిస్తే,  జగన్ సీఎంగా ఉండగా జరిగిన బోటు ప్రమాద బాధితులకూ అదే 10 లక్షలివ్వడం విశేషం. ఇద్దరూ ప్రైవేటు కంపెనీల నుంచి మాత్రం డబ్బులు, నష్టపరిహారం రాబట్టకపోవడం ప్రస్తావనార్హం.

ఎల్జీని కాపాడేందుకేనా ఆ నష్టపరిహారం?

మరి ఇప్పుడు కోటి రూపాయలివ్వడం ఎందుకన్న దానిపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఎల్జీ పాలిమర్స్‌లో ఉన్న రవీందర్‌రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు కాబట్టే లాక్‌డౌన్‌లో అత్యవసరం కాని పాలిమర్స్‌కు అనుమతి ఇచ్చారని టీడీపీ, వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గ్రీన్‌ట్రిబ్యునల్, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేస్తుండగా కోటి రూపాయలు ఇవ్వడం.. ఆ కంపెనీని కాపాడటమేనని విమర్శిస్తున్నారు. వీటికిమించి.. వైఎస్ భారతికి చెందిన భారతీ పాలిమర్స్,  నంద్యాలకు చెందిన నందినీ పాలిమర్స్‌కు  చెందిన కంపెనీలకు బాటిళ్ల సరఫరా కోసమే ఎల్జీ కంపెనీని తెరిపించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీడీపీ నేతల అయ్యన్నపాత్రుడు ఆరోపించడం ప్రస్తావనార్హం.

కోర్టు తీర్పులేం చెబుతున్నాయి?

కంపెనీల వల్ల జరిగే అన్ని రకాల నష్టాలకూ సదరు కంపెనీలే బాధ్యత వహించాలని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు గతంలోనే విస్పష్టంగా ప్రకటించింది. ఢిల్లీలో శ్రీరాం ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీలో ఒలియం గ్యాస్ లీగయిన సందర్భంలో.. నాటి సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తి పి.ఎన్.భగవతి బెంచ్, ఇలాంటి వ్యవహారాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. పనిచేసే కార్మికులతోపాటు, పరిసర ప్రాంతాల్లోని ప్రజలు, పర్యావరణానికి ఎలాంటి హాని జరిగినా అందుకు సదరు కంపెనీయే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఆ ప్రకారంగా… విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ కూడా,  జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

1 COMMENT