మృతుల కుటుంబాలకు కోటి నష్టపరిహారం
ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లోనే ఉత్తర్వులు
విశాఖ బాధితులకు మిగిలిన బకాయి ఎప్పుడు?
ఇంకా 50 కోట్లు రావలసిందే
ఎల్జీ కంపెనీ నుంచి డబ్బులెప్పుడు రాబడతారు?
ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం రావల్సింది 5 కోట్లా?
నష్టపరిహారం ఇచ్చినా టీడీపీ విమర్శలు సబబేనా?
మందుషాపుల సంఖ్య తగ్గిస్తూ నిర్ణయం
(మార్తి సుబ్రహ్మణ్యం)

జగనంటే జగనే. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది అమలయ్యేదాకా నిద్రపోరు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు.. ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారంతోపాటు, గాయపడి, ఆసుపత్రుల్లో ఉన్న వారికి భారీ ప్యాకేజీ ప్రకటించి.. దానికి వెంటనే ఉత్తర్వుల రూపం ఇవ్వడంలో, జగన్ చూపిన వేగం ప్రశంసలు అందుకుంటోంది. విపక్షాలు 25, 30 లక్షలు మాత్రమే నష్టపరిహారం డిమాండ్ చేయగా, దేశంలో ఎవరూ ఊహించని రీతిలో మృతుల కుటుంబాలకు.. కోటి రూపాయలు ప్రకటించిన జగనన్న నిర్ణయానికి శహభాష్ అనవలసిందే!

బీజేపీ-టీడీపీ రూటు వేరు..

నిజానికి,  విశాఖ విషాద బాధితులకు జగన్ ప్రకటించిన ప్యాకేజీని, ఇప్పటివరకూ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఆ విషయంలో ఆయన చూపిన మానవత్వంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే , బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం కోటి రూపాయల ప్రకటనను స్వాగతించారు. అయితే, ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలను అనేక వర్గాలు తప్పుపడుతున్నాయి. కోటి రూపాయల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా, టీడీపీ రాజకీయం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయం కన్నా, సహకరించడం ముఖ్యమన్న సూచన వ్యక్తమవుతోంది. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున, వెంటిలేటర్‌పై ఉన్న వారికి 10 లక్షలు, అస్వస్థతకు గురైన వారికి లక్ష, ప్రభావిత గ్రామవాసులకు 10 వేలు.. మొత్తం 30 కోట్ల రూపాయలు  ఇస్తున్నట్లు సీఎం జగన్ అదే రోజు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

చెల్లించాల్సినది.. 30 కాదు.. 80 కోట్లు!


ఆ  ప్రకారంగా.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, 30 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసిన జగన్.. ఈ విషాద సమయంలోనూ, అందరి అభినందనలు అందుకున్నారు. అయితే, జగన్ ఇచ్చిన హామీ ప్రకారం.. ప్రభుత్వం బాధితులకు ఇంకా 50 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందన్న లెక్కపై, ఇప్పుడు సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదెలాగంటే.. 11 మంది మృతుల కుటుంబాలకు 11 కోట్ల రూపాయలు, క్షతగాత్రులైన 300 మందికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున,  30 కోట్లు అవుతుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న 500 మందికి, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున 5 కోట్లు,  సుమారు 3 వేల మంది ఉన్న ఔట్ పేషెంట్లకు, ఒక్కొక్కరికి 25 వేల చొప్పున 7,50,00,000 రూపాయలు, మొత్తం 25 వేల కుటుంబాలకు ఒక్కొక్కరికి, 10 వేల రూపాయల చొప్పున 25 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంటే.. మృతుల కుటుంబాలకు 11 కోట్లు, వెంటిలేటర్‌పై ఉన్న వారికి 30 కోట్లు, ప్రభావితులయిన వారికి 5 కోట్లు, ఔట్ పేషెంట్లకు ఏడున్నర కోట్లు, చుట్టూ ఉన్న కుటుంబాలకు 25 కోట్లు… మొత్తం 78 కోట్ల 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక పశువులు చనిపోవడంతో జరిగిన ఆర్ధిక నష్టం, మరో రెండున్నర కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ ప్రకారంగా ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకూ జగన్ ప్రభుత్వం, ఇచ్చిన మాట ప్రకారం 30 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇవికాకుండా.. వెంటిలేటర్‌పై ఉన్న వారికి ఐదేళ్లపాటు నిరంతర ఖరీదైన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఆ లెక్కలు ప్రభుత్వ హామీలో లేవు. ఈ లెక్కలపైనా జగన్ సర్కారు స్పందించాల్సి ఉంది.

ఇంతకూ కంపెనీ ఎప్పుడిస్తుందో?

ఈ విషాదానికి కారణమైన ఎల్జీ కంపెనీ యాజమాన్యం ప్రతినిధులెవరినీ అరెస్టు చేయలేదు. కంపెనీ మూసివేస్తున్నట్లు ప్రకటించలేదు. వారిపై పెట్టిన కేసులన్నీ నామమాత్రమేనని సెక్షన్లు చెబుతున్నాయి. విపక్షాలు కూడా అదే ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ పక్కకుపెడితే… జగన్ ప్రకటించిన 30 కోట్లు ప్రభుత్వ ఖాతాలోనివే తప్ప, చావులకు కారణమయిన కంపెనీ ఇచ్చింది కాదు. మరి ఆ కంపెనీ నుంచి పూర్తి నష్ట పరిహారం ఎప్పుడు, ఎలా వసూలు చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కంపెనీపై హత్యానేరం కేసులు పెట్టకుండా పెట్టీ కేసులు పెట్టడమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

5 కోట్ల నష్టపరిహారం బదులు కోటి రూపాయలా?

కాగా మృతుల కుటుంబాలకు ఇచ్చిన కోటి రూపాయల నష్టపరిహారంపైనా కొత్తగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలయింది. ఎక్కడైనా చిన్న రోడ్డు ప్రమాదం జరిగితేనో, అందులో ఎవరైనా చనిపోతేనో పోలీసులు రకరకాల సెక్షన్లు పెడతారని గుర్తు చేస్తున్నారు. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్సు కూడా ఇప్పిస్తారన్న విషయం తెలియకుండా, ప్రభుత్వ అధికారులు, సలహాదారులు కేవలం కోటి రూపాయల నష్టపరిహారంతో, ఎలా సరిపెడతారన్న ప్రశ్నలు కొత్తగా వినిపిస్తున్నాయి. అదెలాగంటే.. పబ్లిక్ లిమిటెడ్ ఇన్సూరెన్స్ యాక్ట్ (పిఐఏ) ,పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఆక్ట్ ప్రకారం ఇలాంటి పెద్ద కంపెనీల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మృతుల కుటుంబాలకు 5 కోట్ల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రభుత్వం తొందరపడి, నష్టపరిహారాన్ని కేవలం కోటి రూపాయలకు పరిమితం చేసి, బాధిత కుటుంబాలకు ఒక్కోరికి నాలుగుకోట్లను దూరం చేయడంపై కొత్త విమర్శలకు తెరలేచింది.

జగనన్న మాట ప్రకారం కంపెనీ చెల్లించాల్సిందే

కాగా, నష్టపరిహారానికి సంబంధించిన వ్యవహారంలో మరో కొత్త వాదన తెరపైకొచ్చింది. గతంలో జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చేసిన వాదనను, సీఎంగా ఉంటూ ఎందుకు అమలుచేయరన్న ప్రశ్న విపక్షాల నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో, తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్‌కు సంబంధించిన గ్యాస్ పైప్‌లైన్ లీకయింది. ఆ వ్యవహారంలో నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించింది. దానిని విపక్ష నేతగా జగన్ ప్రశ్నించారు. నష్టపరిహారం మొత్తాన్ని కంపెనీ నుంచే రాబట్టాలని, ఆ కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని సభలో నిలదీశారు. దానికి సంబంధించి ఆర్‌ఓసీలో నమోదయిన పత్రాలను, ఆయన సభకు చూపించారు. మరి ఇప్పుడు జగన్ సిద్ధాంతం ప్రకారమే… విశాఖ ఎల్జీపాలిమర్స్ నుంచే, మొత్తం నష్టపరిహారం రాబట్టకుండా, ప్రభుత్వం 30 కోట్లు ఎలా చెల్లించిందన్న ప్రశ్న ఆసక్తికలిగిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని జగన్ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఇప్పటికే ఆరోపణల వర్షం ప్రారంభించింది.

లిక్కర్ షాపులపై భేషైన నిర్ణయం

కాగా, రాష్ట్రంలో లిక్కరు షాపులు కుదిస్తూ, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. క్రమేపీ మద్యనిషేధం అమలుచేస్తామన్న జగన్ హామీకి, ఇది అనుగుణంగానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 13 శాతం షాపులు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారంగా షాపుల సంఖ్యను 2,934కు తగ్గినట్టయింది.

One thought on “శహభాష్.. సీఎం జగన్!”

Leave a Reply

Close Bitnami banner