కేంద్ర నిధులతోనే కేసీఆర్ పథకాలు

వేల కోట్లు తీసుకుంటూ నిధులివ్వడం లేదని నిందలా?
పాలన చేతకాకనే ప్రతిపక్షం, మీడియాపై విమర్శలు
హైకోర్టు అక్షింతలతో ఇకనైనా కళ్లు తెరవండి
కేసీఆర్‌పై పెద్దిరెడ్డి, రామచందర్‌రావు ఫైర్

హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ, కేంద్రం ఇస్తున్న నిధులతోనేనని బీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్న కేసీఆర్, రాష్ట్రానికి నయాపైసా ఇవ్వడం లేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ, హైదరాబాద్ నగర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు పాలించడం చేతకాక, ప్రతిపక్షాలు-మీడియాపై నిందలేస్తున్నారని విరుచుకుపడ్డారు.

సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నగర నాయకుడు మేకల సారంగపాణి, ఆయన తనయుడు, యువనేత హర్షకిరణ్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం,నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి  రామచందర్‌రావు, పెద్దిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనాను నియంత్రించేందుకు ఎక్కువ టెస్టులు చేయడంలో, కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందని తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నా, ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇప్పుడు హైకోర్టు కూడా అదే వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. హైకోర్టు అక్షింతలతోనయినా కళ్లు తెరవాలని హితవు పలికారు.

అఖిలపక్షం కోసం డిమాండ్ చేసిన ప్రతిపక్షాలను కించపరుస్తూ మాట్లాడటం, కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు ఆ పార్టీ కూడా, ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని విస్మరించకూడదని హితవు పలికారు. కరోనాలో కష్టంలో ఉన్న వారిని బీజేపీ అధ్యక్షుడు నద్దా, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదుకుంటున్న మేకల, ఆయన తనయుడు హర్షను వారు అభినందించారు.

నగర నాయకుడు మేకల సారంగపాణి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం కంటే, మోదీ ప్రభుత్వమే తెలంగాణ ప్రజలను ఆదుకుంటోందని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కచెప్పమంటే, ప్రభుత్వం పారిపోతోందన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు, సీఎం అయిన తర్వాత చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు సోషల్‌మీడియా ద్వారా గమనిస్తూనే ఉన్నారన్నారు.  నగరంలో పేదలు, పేద కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పంపిణీ చేస్తున్న మోదీ కిట్లతో, వేలాదిమంది లబ్థిపొందుతున్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే తాము సికింద్రాబాద్ నియోజకవర్గంలో, సొంతంగా  సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

సికింద్రాబాద్ బీజేపీ ఇన్చార్జి పి.రవిప్రసాద్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగడం కొత్తమీ కాదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డి అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో, బీజేపీ నేతలు కనకట్ల హరి, కన్నాభిరాన్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్‌నేత, వీరేశ్, శంకర్, రవిబాబు,రాజశేఖర్, ఉపేందర్ అరవింద్, శంకర్, నరసింహ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

You may also like...

1 Response

  1. July 21, 2020

    […] దానికి లక్ష్మణ్, రామచందర్‌రావు, గరికపాటి మోహన్‌రావు, చాడ సురేష్‌రెడ్డి వంటి అగ్రనేతలు హాజరయ్యారు. అయితే ఈ పంపిణీ కార్యక్రమం కూడా ఫలానా చోట పెడతామని బతిమిలాడుకుంటే.. కుదరదు, మేం చెప్పినచోటనే పెట్టాలని భీష్మించుకోవడంతో, కొన్ని చోట్ల వాయిదా పడిన ఘటనలున్నాయి. ఇది ఒక్క సికింద్రాబాద్‌కే పరిమితమయిన వ్యవహారం కాదు. ఇతర పార్టీల నుంచి చేరిన వారి పరిస్థితి ఇదే! కొత్త వారు వస్తే ఎక్కడ తమ ఉనికికి ప్రమాదమోనన్న భయంతో మొదట్లోనే వారి ఉత్సాహాన్ని నీరుగారుస్తున్న సంస్కృతికి కొత్త అధ్యక్షుడు సంజయ్ చెక్ పెట్టకపోతే, పార్టీ లిమిటెడ్ కంపెనీగానే మిగిలిపోతుందంటున్నారు. ఇక నగరంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని, కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చే దిక్కు కూడా లేకుండా పోయింది.ప్రస్తుత అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామచందర్‌రావుది ఒంటరి పోరాటంగానే కనిపిస్తోంది. ఇది కూడా చదవండి.. కేంద్ర నిధులతోనే కేసీఆర్ పథకాలు […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami