మరి.. హైకోర్టుపైనా ఎదురుదాడి చేస్తారా?

619

కరోనా లెక్కలపై తెలంగాణ హైకోర్టు కన్నెర్ర
ప్రజలను వెర్రివాళ్లను చేస్తారా అని వ్యాఖ్య
ఇదే వ్యాఖ్య చేసిన విపక్షాలపై తెరాస ఎదురుదాడి
హైకోర్టు వ్యాఖ్యలతో అధికార పార్టీ ఇరకాటం
మేము చెప్పిందే నిజమయిందన్న బీజేపీ చీఫ్ సంజయ్
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా కేసుల టెస్టులు, కేసుల నివారణలో దేశంలో తామే అగ్రస్థానంలో ఉన్నామని చెబుతున్న తెలంగాణ సర్కారును.. హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ఇరుకున పెట్టాయి. తెలంగాణలో కేసీఆర్ సర్కారు కరోనా టెస్టులు చేయకుండా, కేసుల సంఖ్యను తక్కువ చూపి, ఎక్కువ ప్రచారం చేసుకుంటోందని విపక్షాలు గత నెల రోజుల నుంచీ దాడిచేస్తున్నాయి.

ఆది నుంచీ బీజేపీది అదే ఆరోపణ…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో అడుగు ముందుకేసి, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కరోనా కిట్లను కూడా తెలంగాణ సర్కారు వాడుకోవడం లేదని, కరోనా నివారణ కోసం ఇచ్చిన నిధులను పక్కదారి మళ్లిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై కేంద్రానికి ఒక నివేదిక  పంపించారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్రబృందం వాస్తవ కోణంలో అధ్యయనం చేయలేదని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అంతకుముందు.. కరోనా కట్టడిలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బండి సంజయ్ నేతృత్వంలో ఒక బృందం గవ్నరర్ తమిళసైను కలసి వినతిపత్రం సమర్పించింది.

అదే దారిలో కాంగ్రెస్..


అటు కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపి రేవంత్‌రెడ్డి, వి.హన్మంతరావు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు జోత్స్న కూడా.. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కారు విఫలమయిందని విమర్శిస్తున్నారు. టెస్టులు చేయకపోవడం వల్లనే కేసులు తక్కువగా వస్తున్నాయని, దానిని చూపి కేసీఆర్ ప్రభుత్వం అతి ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. చిన్న రాష్ట్రాలు కూడా ఎక్కువ టెస్టులు చేస్తుంటే, తెలంగాణలో మాత్రం తక్కువ టెస్టులు చేయడాన్ని ప్రతిష్ఠగా భావిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని దుయ్యబడుతున్నారు.

కేంద్రం ఇచ్చిన లెక్కలేవన్న బీజేపీ..

కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు, రాష్ట్రం చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపి అర్వింద్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు, చాడ సురేష్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి వంటి అగ్రనేతలు డిమాండ్ చేశారు. కేంద్రం నయాపైసా నిధులివ్వడం లేదన్న సీఎం కేసీఆర్ ఆరోపణపై, బండి సంజయ్ అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఎంత ఇచ్చిందో ఆయన వెల్లడించి, రాష్ట్రం చేసిన ఖర్చు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నించిన వారిపై కేసీఆర్ ఎదురుదాడి

అయితే, కరోనా టెస్టులు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, కిట్ల కొరత వంటి అంశాలపైమాట్లాడిన విపక్షాలను, ప్రశ్నలడి గిన మీడియా ప్రతినిధులపైన స్వయంగా సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. రాధాకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఆంధ్రజ్యోతి’నుద్దేశించి, కరోనా రావాలని శాపం పెట్టారు. కరోనాపై తప్పుడు వార్తలు రాస్తున్నారని మీడియాపై మండిపడ్డారు.  కేసులు పెట్టేందుకూ వెనుకాడేది లేదని హెచ్చరించారు. కరోనా విషయంలో దేశంలో తెలంగాణ రాష్ట్రమే అత్యుత్తమంగా పనిచేస్తోందని చెప్పారు. కేసీఆర్ ప్రకటన తర్వాత.. మంత్రులు, తెరాస నేతలు కూడా ఆయన దారిలోనే పయనించి, బీజేపీ-కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేశారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూడా విపక్షాలను జోకర్లు-బఫూన్లని అభివర్ణించగా, దానిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనపై ఎదరుదాడి చేశారు.

బఫూన్లు-జోకర్లని ధ్వజం

ఇటీవల కేసీఆర్ విపక్షాలను బఫూన్లు, జోకర్లు, సిగ్గులేకుండా దీక్షలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ‘ఒకటి ఇంటి పార్టీ. ఒకటి పక్కపార్టీ. వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. అఖిలపక్షం పెట్టాలని అడుగుతున్నారు. ఇంత డర్టీగా, దరిద్రంగా మాట్లాడేవాళ్లకు టైం ఎందుకు ఇస్తార’ని ప్రశ్నించారు. దీనిపై విపక్షాల ఎదురుదాడి ఇంకా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో కరోనా టెస్టులపై, తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్య సర్కారును ఇరుకునపెట్టినట్టయింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, హైకోర్టు వ్యాఖ్యలు బలమిచ్చినట్టయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రజలను వెర్రివాళ్లను చేయడమేనన్న హైకోర్టు

‘రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలను పెద్ద సంఖ్యలో  ఎందుకు చేయడం లేదు? కరోనా లక్షణాలున్న వారికి మాత్రమే, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పత్రికల్లో చూశాం. అదే నిజమైతే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కచ్చితమైన గణాంకాలు వెలుగుచూసే అవకాశం ఉండదు. ఇది ప్రభుత్వం లెక్కలతో గారడీ చేసి ప్రజలను వెర్రివాళ్లను చేయడమే అవుతుంది. మీరు ప్రాధమిక అనుమానితులను మాత్రమే పరీక్షిస్తున్నారు. వారి కుటుంబసభ్యులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి క్వారంటైన్ చేయాల్సిందే. వాస్తవ లెక్కలు చూపకుండా, వాస్తవాలు గ్రహించకుండా మనల్ని మనం మోసం చేసుకుంటే ఫలితాలు వేరుగా ఉంటాయి’.. ఇవి ప్రొఫెసర్ పీ.ఎల్.విశ్వేశ్వరరావు, కోవిడ్ అంశంపై హైకోర్టులో వేసిన పిటిషన్‌ను విచారిస్తూ, న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు. అంతేకాకుండా..  కరోనాతో చనిపోయిన వ్యక్తి వద్ద రక్తనమూనాలు సేకరించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయడం లేదు? దీని వెనుక ఉన్న మతలబేమిటి? ఇది ప్రమాద సంకేతం కాదా?  అసలు పరీక్షలు చేయకుండా వైద్యాధికారులపై ఎందుకు ఆంక్షలు విధించారు? అని  ప్రశ్నించింది.

మేం చెబుతున్నదీ అదే: సంజయ్

దీనిపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ.. మేం ఇన్నాళ్లూ చెబుతున్నదే నిజమయిందన్నారు. కరోనా టెస్టులు, చనిపోయిన వారి రక్తనమూనా సేకరణలో, రహస్యం ఎందుకని తాము చాలారోజుల క్రితమే ప్రశ్నిస్తే, ప్రభుత్వం వద్ద తిట్లు తప్ప జవాబు లేదన్నారు. ఇప్పుడు హైకోర్టు కూడా అదే అడిగినందున, ఏం సమాధానం ఇస్తారో చూడాలని వ్యాఖ్యానించారు.

మరి హైకోర్టుపైనా ఎదురుదాడి చేస్తారా?: రామచందర్‌రావు

హైకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రతిపక్షంలో ఆత్మస్ధైర్యం నింపినట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్ కాలం నుంచీ తాము ఏ అంశాలపైనో ప్రభుత్వాన్ని వివరణ కోరుతున్నామో, హైకోర్టు కూడా అదే అంశాలపై ప్రభుత్వాన్ని లెక్కలు అడిగిందని ప్రముఖ న్యాయవాది అయిన బీజేపీ ఎమ్మెల్సీ, హైదరాబాద్ నగర అధ్యక్షుడు రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు సక్రమంగా జరగడం లేదని, తాము మొదటి నుంచీ చెబుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందన్నారు.తాము, మీడియా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే, కేసీఆర్ నుంచి మంత్రుల వరకూ ఎదురుదాడి చేసి, శాపాలు పెట్టారని ఆయన గుర్తు చేశారు.

హైకోర్టు అడిగింది కూడా అదే కదా?

‘మరి ఇప్పుడు అవే అంశాలపై హైకోర్టు ప్రభుత్వ తీరును తలంటింది. కరోనా లెక్కలు అడిగింది. కరోనా మృతుల రక్తనమూనాలు ఎందుకు సేకరించలేదని ప్రశ్నించింది. మేం చాలారోజుల నుంచి ఇదే అడుగుతుంటే, మాపై తిట్ల పురాణం అందుంటున్న కేసీఆర్, ఆయన మంత్రులు.. మరి ఇప్పుడు హైకోర్టు కూడా అదే అంశంపై నిలదీసింది. మరి మాపై చేసినట్లే, హైకోర్టుపైనా ఎదురుదాడి చేస్తారా? అంత సాహసం ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తారా? ప్రశ్నించిన వారిని బఫూన్లు, జోకర్లనడం కేసీఆర్‌కే చెల్లింద’ని రామచందర్‌రావు విరుచుకుపడ్డారు.