టీచర్లూ…బాబంటే చులకన.. జగనంటే జంకా?

732

మందుషాపుల ముందు డ్యూటీలేసినా మౌనమేనా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

పిల్లి-ఎలుకకు సంబంధించి అదేదో ముతక సామెత ఒకటి ఉంది. దాన్నలా పక్కకుపెడితే, రౌతు మెత్తనయితే గుర్రం మూడుకాళ్లతో నడుస్తుందన్నది ఇంకో సామెత. ఏపీలో ఉపాధ్యాయ సంఘాల తీరు ఇలాగే కనిపిస్తోంది. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు జనభూమి, మీకోసం కార్యక్రమాలకు టీచర్ల సేవలను వినియోగించుకున్నారు. అంతకుముందు తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడయితే, టీచర్లు, ఇతర ఉద్యోగులతో  బాగా పనిచేయించారు. ఆకస్మిక తనిఖీలతో విధులకు రాని ఉద్యోగుల పనిపట్టారు. టీచర్లనయితే స్కూలుకు సమయానికి రావాలని, ఫలితాల శాతం పెంచాలని ఒత్తిడి చేసేవారు. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని వినియోగించుకునేవారు. దానికి ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహించాయి. పిడికిలి బిగించాయి. తమను అవమానిస్తున్నారని ఊగిపోయారు. అందుకు ప్రతీకారంగా నాటి ఎన్నికల్లో వారే బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరక్షరాస్యులతో ఓట్లు వేయించారు. టీడీపీకి వ్యతిరేకంగా మౌత్‌క్యాంపెయిన్ నడిపించారు. సరే.. వారితో పనిచేయించిన పాపానికి బాబు కూడా గద్దె దిగి ఫలితం అనుభవించారు. అంటే ఉద్యోగులకు పనిచేయండని చెప్పకూడదన్న గుణపాఠం రాజకీయపార్టీలకు అప్పుడే బోధపడింది.

బాబు మారినా అదే గుణపాఠం

టీచర్లు కొట్టిన నాటి దెబ్బలను గుర్తు చేసుకున్న చంద్రబాబు.. ఇకపై మిమ్మల్ని ఇబ్బందిపెట్టనని, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వారిని బ్రతిమిలాడుకున్నారు. అప్పటికి కరుణించిన ఉపాధ్యాయులు, బాబును నమ్మి ఓట్లేశారు. బాబు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి, ఒక ఉపాధ్యాయులకే కాదు, మొత్తం ఉద్యోగులకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చేశారు. ఉద్యోగులు ఏ సమయానికి వచ్చినా ఎవరూ అడగలేదు. పైగా తెలంగాణ రాష్ట్రం కంటే వేతనాలు పెంచారు. సచివాలయ ఉద్యోగులకయితే, వారానికి ఐదురోజులే పని కల్పించారు. వారి కోసం అమరావతి-హైదరాబాద్‌కు ప్రతిరోజూ ప్రత్యేక రైళ్లు వేయించారు. అందుకు వాళ్లతో సన్మానం కూడా చేయించుకున్నారు. అయినా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో, బాబు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కౌంటింగ్‌లో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లన్నీ, టీడీపీకి వ్యతిరేకంగానే పోలయ్యాయి. అది తర్వాత విషయం.

ఇప్పుడు కిం కర్తవ్యం…?

పోనీ, బాబు స్థానంలో వచ్చిన వైసీపీ అధినేత, సీఎం  జగన్మోహన్‌రెడ్డి పాలనలోనయినా.. ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా అంటే లేదు. అది లేదు, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలన్న డిమాండ్ల చిట్టా విప్పుతూనే ఉన్నారు. ఎన్నికల ముందు జగనన్న ఇచ్చిన హామీలు గుర్తు చేస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉన్నందున, ఆ ప్రాంతంలో చాలామంది ఉద్యోగులు స్ధలాలు, ఇళ్లు కొనుక్కున్నారు. కానీ, రాజధానిని విశాఖకు తరలిస్తే, ఇంటి కోసం ఖర్చు చేసిన డబ్బు ఏం కావాలన్న  వారి ఆవేదన, ఆత్రుత, హడావిడిని పట్టించుకునే దిక్కులేదు. సచివాలయ ఉద్యోగ సంఘం నాయకుడేమో, వారికి తెలియకుండానే ప్రభుత్వ నిర్ణయం శిరోధార్యమని పాలకులకు హామీలిచ్చేస్తున్నారు. పోనీ, ఇవన్నీ గత సీఎం చంద్రబాబు మాదిరిగా, ఎప్పుడంటే అప్పుడు ఆయన వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుందామంటే… ముఖ్యమంత్రి గారు మంత్రులనే కలవరు. మిమ్మల్నేం కలుస్తారన్న సమాధానం! ఇదీ ఇప్పుడు ఏపీలో ఉద్యోగుల పరిస్థితి.

మందుషాపుల దగ్గర గురువుల కాపలా


సరే.. వారి ఈతిబాధలు పక్కకుపెడితే, జన్మభూమికి డ్యూటీలు వేస్తేనే ఆకాశమంత ఎత్తు లేచిన ఉపాధ్యాయులు.. ఇప్పుడు జగన్ పాలనలో, మద్యం షాపుల వద్ద డ్యూటీలు చేయాల్సిన దుస్థితిలో ఉండటమే ఆశ్చర్యం. విశాఖ జిల్లాలో ఓ టీచరును మద్యం షాపుల వద్ద నిలబెట్టి, మందుబాబులను లైన్లలో ఉంచే బాధ్యతను అప్పగించింది. ఆ దుస్థితిని ఓ ఉపాధ్యాయుడు, వీడియో సాక్షిగా వెల్లడించారు కూడా. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అయినా వారి రోమాలు నిక్కబొడుచుకోకపోవడమే వింత!

నాటి చైతన్యం చచ్చుబడిందా..?

ఆ లైన్లలో నిలబడిన తమ శిష్యపరమాణువులను చూసి, సదరు గురువులు సిగ్గుతో తలదించుకుంటే.. గురువులను మందుషాపుల వద్ద నిలబెట్టామని శిష్యబృందాలు, సంతోషపడుతున్న అపురూప దృశ్యం ఇప్పుడు ఆంధ్రాలో ఆవిష్కృతమవుతోంది. దానికి మంత్రులు చెప్పే జవాబేమిమంటే.. ఏదో ఒకటి రెండు చోట్ల, స్థానిక అవసరాల మేరకు టీచర్లకు మందుషాపుల వద్ద,  డ్యూటీలు వేసి ఉండవచ్చని సెలవిస్తున్నారు. ఉపాధ్యాయులు నిస్సహాయత చూస్తుంటే వారి సేవలను రాష్ట్రంలోని అన్ని మందుషాపుల వద్ద వినియోగించుకున్నా, చేతిలో బెత్తం పట్టుకుని మరీ సమర్ధవంతంగా నిర్వహిస్తారు. చైతన్యం ఎలాగూ చచ్చుబడిపోయింది కాబట్టి, ప్రతిఘటించే ఆలోచన కూడా ఉండదు. మంత్రులు ఆ దిశగా ఆలోచిస్తే మంచిది.

బాబు జమానాలో జన్మభూమి వంటి ప్రజాప్రయోజనకర కార్యక్రమాల్లో పాల్గొనమని చెబితే, కన్నెర్ర చేసి కారాలు మిరియాలు నూరి, పిడికిలి బిగించిన ఉపాధ్యాయ సంఘాలు.. ఇప్పుడు ఏకంగా వారిని, మందుషాపుల వద్ద కాపలా కాసే డ్యూటీలు వేస్తే, నవరంధ్రాలు కప్పేసుకుని తలవంచుకుని పనిచేయడమే ఇక్కడ వింత. అంటే గ్రామీణ ప్రాంతాల్లో చెప్పినట్లు.. అదేదో దానికి పుర్రచేయి లోకువ అన్నమాట. మరి బాబు జమానా నాటి ఉపాధ్యాయ సంఘాల ఆవేశం, ఆక్రోశం, ఆత్మగౌరవం వగైరాలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? ఏ జమ్మిచెట్టు ఎక్కాయన్నది బుద్ధిజీవీల ప్రశ్న.

ఉద్యోగులకు .. జగనన్నే రైటు!

ఏదేమైనా.. ప్రతిదానికీ ప్రభుత్వాలను బెదిరించే ఉద్యోగులను క్రమశిక్షణలో పెట్టడానికి, జగనన్న లాంటి నాయకుడు కావల్సిందే! నాయకుడంటే శాసించేవాడు కాదు. ఆదేశించేవాడు.  పనిచేయించేవాడు.  ఆ పని ఇప్పుడు జగన్ చేసి చూపిస్తున్నాడు. అందుకే ఉద్యోగులు ఉద్యమం కాదు కదా.. కనీసం నిరసన తెలిపేందుకే బెదిరిపోతున్నారు. నాయకుడంటే అలా ఉండాలి! బాబులా భయపడేవాడు నాయకుడు కాలేడు. అందుకే ఆయన మాజీగా మిగిలిపోయారు.

 బాబుకయినా.. ఉద్యోగులకయినా.. చేసుకున్న వారికి చేసుకున్నంత!