మోదీపై.. మరక మంచిదేనా?

671

మద్యం మినహాయింపుతో ప్రతిష్ఠ చెరిగిందా?
మోదీపై నెపం నెట్టేస్తున్న రాష్ట్రాలు
మోదీ చెబితేనే అమ్ముతున్నామన్న ఏపీ మంత్రులు
ఎదురుదాడిలో కమలదళాలు విఫలం
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా రక్కసిపై పోరాటంలో ప్రధాని ప్రదర్శించిన మనోనిబ్బరం.. ప్రజలకు ఆయన చేసిన దిశానిర్దేశం.. జాతిని ఒక్కతాటిపై నడిపించిన నాయకత్వ పటిమ.. ఆ మేరకు ప్రజలు కూడా ఆయన వెంట నడిచిన తీరును, ప్రపంచం వేనోళ్లా పొగిడింది. అమెరికా వంటి ప్రపంచ పెద్దన్నే మెడిసిన్ కోసం, మోదీ వద్ద చేయి చాపింది. మోదీ లాక్‌డౌన్‌ను అనేక దేశాలు అనుసరించాయి. దేశంలో ఆయనను తెగతిట్టిపోసే రాజకీయ ప్రత్యర్ధులు, విమర్శకులు కూడా, కరోనా కాలంలో నరేంద్రుడి నడక-నడతను తెగ మెచ్చుకున్నారు. మందుబాబులను కట్టడి చేసి, మందుమాన్పించేలా చేసినందుకు, కోట్లాదిమంది మహిళలు మోదీకి చేతులెత్తి మొక్కారు. గుండెలో గుడికట్టుకున్నారు.  కానీ.. ఏం లాభం?.. 43 రోజుల్లో ఈ ప్రశంసలూ, అభినందనలూ, మొక్కులతో పెంచుకున్న ప్రతిష్ఠపై.. పడిన కష్టం.. చేసిన శ్రమ అంతా.. ఒక్క  ‘మందు మినహాయింపు’ నిర్ణయంతో ఢామ్మని మరకలు పడ్డాయి. మరి ఈ మరకలు మోదీకి మంచిదేనా?.. ఆయన ఇమేజ్‌పైనే ఆధారపడిన కమలానికి ఇది కలసివచ్చేదేనా?.. ‘అంతా మీవల్లే’ ‘అంతా మీరే చేశార’ని,  మోదీవైపు చూపుడు వేలు చూపిస్తున్న రాష్ట్రాల ఆర్ధిక మొహమాటంలో మోదీ చిక్కుకున్నారా?..  అన్నది ఇప్పుడు చర్చ.  ఇదికూడా చదవండి.. పదండి ‘మందు’కు.. పదండి ముందుకు.. పదండి తోసుకు!

కరోనా వైరస్ విస్తరించకుండా, ప్రజలను ఇళ్లకే  పరిమితం చేస్తూ ప్రధాని మోదీ చేసిన లాక్‌డౌన్‌ను, జాతి యావత్తూ నిబద్ధతతో పాటించింది. లాక్‌డౌన్‌తో అష్టకష్టాలు పడుతున్నా, తిండికి లేక అవస్థలు పడుతున్నా వాటిని అయిష్టంగానే భరించింది.  తమ ప్రాణాలు నిలబెట్టేందుకే, మోడీ ఇన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారని సరిపెట్టుకుంది. అందుకే ఎన్నిసార్లు మోదీ టీవీ తెర ముందుకొచ్చి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించినా,  నిండుమనసుతో స్వాగతించింది. పార్టీల పరంగా, రాజకీయకోణంలో మోదీని వ్యతిరేకించే పార్టీలు, అవి పాలించే రాష్ట్రాలు కూడా.. మోదీని పిలుపును చిత్తశుద్ధితో పాటిస్తున్నాయి.

కానీ.. లాక్‌డౌన్ సడలింపులో భాగంగా ఇచ్చిన మద్యం అమ్మకాల మినహాయింపు అంశమే, మోదీ మెరుపులపై మరకలకు కారణమవుతోంది. మోదీ ప్రభుత్వం అనుమతించిందన్న సాకుతో, దాదాపు అన్ని రాష్ట్రాలూ లిక్కరుషాపులకు లంగరెత్తేశాయి. ఫలితంగా.. అన్నిరోజులూ లిక్కరు షాపులను మూసిన నష్టాన్ని,  భర్తీ చేసుకుంటున్నాయి. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా, లిక్కరుకు లంగరెత్తేశాయి. దానితో లిక్కరు అంశాన్ని అడ్డుపెట్టుకుని, మోదీపై దాడిచేస్తున్న విపక్షాలపై.. ఎదురుదాడిలో కమలదళం తేలిపోతోంది. ఏపీలో నారాయణస్వామి, కన్నబాబు వంటి మంత్రులంతా.. మోదీ చెప్పినందుకే లిక్కరు షాపులు బార్లా తెరిచామని నిర్భయంగా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితిని, బహుశా మోదీ కూడా ఊహించకపోవచ్చు. పైగా లిక్కరు షాపులు తెరిచినందుకు, జగన్మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్న చంద్రబాబు.. వాటిని అనుమతించిన మోదీని ఎందుకు విమర్శించడం లేదన్న లాజిక్కును, తెరపైకి తీసుకువస్తున్నారు. అంటే.. వైసీపీ నాయకత్వం, మోదీని కూడా అందరితో తిట్టించాలన్న వ్యూహంతో ఉందన్నమాట! ఇది కూడా చదవండి.. బాబుగారు.. మోదీ-కేసీఆర్‌ను వదిలేశారేం?

ఏ రాష్ట్రాలకయినా లిక్కరు అమ్మకాల ఆదాయమే శ్రీరామరక్ష. మద్యనిషేధంపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సర్కారు, మోదీ ఇచ్చిన వెసులుబాటుతో లిక్కరుషాపులు తెరిచి, 75 శాతం అదనపు అమ్మకాలు ప్రారంభించింది. అదేమంటే, ఇది కూడా మద్యనిషేధంలో భాగమేనని, అధిక ధరల ద్వారా మందుబాబులను నిరుత్సాహపరచడమే ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ నేతలు సూత్రీకరిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కూడా మోదీ చెబితేనే షాపులు తెరిచామన్నారు. ఇంకో అడుగు ముందుకేసి..  మహిళలకు సంక్షేమపథకాలు అందుతున్నప్పుడు, మద్యం అమ్మకాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అంటే పాలకులు సంక్షేమ ముసుగులో ఏం చేసినా, దానిని పాలకులు ప్రశ్నించకూడదన్న మాట! అసలు అడుసుతొక్కనేల? కాలుకడనేల?

45రోజుల పాటు మందు తాగకుండా ప్రజలు భరిస్తున్నప్పుడు, మోదీ ప్రభుత్వం దానికి మిన హాయింపులు ఇవ్వడం ఎందుకన్న ప్రశ్నకు, నేరుగా సమాధానం ఇచ్చే ధైర్యం బీజేపీ నేతలలో కనిపించలేదు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇటీవల ఈ అంశంలో, మోదీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖండించారు. అయితే, అందులో ఆయన వాదనలో  సరుకు లేకపోవడంతో అది తేలిపోయింది. ఆయన చేసిన వాదన హాస్యాస్పదంగా కనిపించింది. ‘మద్యం అమ్మకాలపై కేంద్రం నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తూ, నిబంధనలతో కూడిన సడలింపు మాత్రమే ఇచ్చింది. ఏపీలో మద్యం అమ్మకాలు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమే. 75 శాతం ధరలు పెంచడం కూడా,  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే. కేంద్రం అయిష్టంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు సడలింపులతో కూడిన నిర్ణయాధికారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 5 నుంచి 6 వేల కోట్ల ఆదాయం మద్యం ద్వారా పోతోంది కాబట్టి, మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం వల్లే కేంద్రం అయిష్టంతో సడలింపు ఇచ్చింది’’ అని జీవీఎల్ వాదించారు.

ఒకవేళ జీవీఎల్ వాదనే నిజమనుకుంటే… ఇన్నిరోజులు లాక్‌డౌన్ వల్ల రాష్ట్రాలకు పోయిన ఆదాయాన్ని, కేంద్రమే లిక్కర్ ద్వారా సంపాదించిపెట్టినట్లు స్పష్టమవుతోంది. మరి ప్రభుత్వాలు కోరిందే తడువుగా, లిక్కరుకు సడలింపు ఇచ్చిన కేంద్రం.. 130 కోట్ల ప్రజానీకం కూడా ఆర్ధికంగా దెబ్బతిన్నందున, వారికీ సంపాదించే వెసులుబాటు ఎందుకు కల్పించలేకపోయిందన్న ప్రశ్నకు జీవీఎల్ సమాధానం ఇవ్వగలరా? కరోనా పేరుతో పేదలను మాత్రమే ఆదుకున్న ప్రభుత్వం, మధ్య-సామాన్య తరగతి, ప్రైవేటు ఉద్యోగజీవులను ఎందుకు అందుకోలేదని అడుగుతున్న ఆ వర్గాల ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరా? నిజానికి మద్యం ద్వారా దేశంలోని రాష్ట్రాలకు 2.48 లక్షలకోట్ల ఆదాయం సమకూరుతోంది. అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలూ ఉన్నాయని విస్మరించకూడదు.

ఏదేమైనా, కారణాలు ఏవైనా… జాతి యావత్తూ అంకితభావంతో,  క్రమశిక్షణను కఠోరంగా పాటించేలా చేసిన అదే మోదీ ఇచ్చిన లిక్కరు సడలింపు,  ఆయన సాధించిన మెరపులపై మర కకు కారణమయింది. కేంద్రం ఇచ్చిన సడలింపులతో వందల కోట్లు సంపాదిస్తున్న రాష్ట్రాలు.. ఇప్పుడు ఖజానా నింపేసుకుని, తమపై స్థానికంగా వస్తున్న విమర్శలను మాత్రం, తెలివిగా మోదీపై నెట్టేస్తున్నాయి. ఫలితంగా.. మోదీపై అభిమానం పెంచుకున్న సామాన్యుల దృష్టిలో, ఆయన దోషిగా నిలబడాల్సి వస్తోందన్నది నిష్ఠుర నిజం! కమలదళాలు ఈ చేదు నిజాన్ని కాదనగలవా?