నారాయణ.. నారాయణ… ఎంతమాట?

156

సారాయి అమ్మడం కంటే  వ్యభిచారం చేయమని సలహా
సంక్షేమం ఇస్తుంటే అమ్మకాలు అడ్డుకోకూడదన్న ఏపీ మంత్రి నారాయణ
               (మార్తి సుబ్రహ్మణ్యం)

ఈ నారాయణ ఉన్నాడే.. అదేనండీ, సీపీఐ ఇడ్లీ చికెన్  నారాయణ. ఆయనకు అప్పుడప్పుడు వచ్చే కోపం భలేగా ఉంటుంది. ఆయన చేసే వ్యాఖ్యలు కూడా చిత్ర విచిత్రంగా ఉన్నా.. ‘అవి నిజమే కదా’ అని పామరలోకం కూడా భావించేలా ఉంటాయి. అంతటి కామ్రేడ్‌కు కరోనా కాలంలో మందు షాపులు తెరడంపై యమా కోపమొచ్చింది. దానితో.. దేశంలోని పాలకులను ఎంతమాట అనేశారో తెలుసా? పాలకుల డబ్బాశను ఎంత దారుణంగా తిట్టారో తెలుసా?.. ‘సారాయి అమ్ముకునే బదులు వ్యభిచారం చేసుకోమని’ నాలుగు తగిలించారు. అవునండీ.. మీరు చదివింది నిజమే. చేయి గిల్లుకోవాల్సిన పనిలేదు. అక్షరాలా మన కామ్రేడ్ నారాయణ వాక్కులే ఇవి.

నారాయణ కోపానికి కారణం లేకపోలేదు. కరోనా సమయంలో ప్రజలు సామాజికదూరం పాటించాలని చెబుతున్న కేంద్రమే, దానిని చెరిపేసేలా, మందుషాపులకు ఇచ్చిన అనుమతులే నారాయణన్న కోపానికి కారణం. మద్యం వ్యాపారాలతోనే ఆర్ధిక వ్యవస్థ చక్కబడుతుందన్న, రాష్ట్ర ప్రభుత్వాల దురాశ ఆయన కోపానికి ప్రధాన కారణం. అందుకే డబ్బుకోసం ఏపనయినా చేసే ప్రభుత్వాల విధానాలను, కామ్రేడ్ చెడామడా కడిగేశారు. ‘అలా గాలికి తిరిగేబదులు.. ఏదైనా పనిచేసుకుని బతక్కూడదూ’ అని, బలాదూరు తిరగేవాళ్లను పెద్దలు  హెచ్చరించినట్లు.. ‘మద్యం అమ్ముకునే బదులు, వ్యభిచారం చేసుకుని బతకమని’ నారాయణ సుద్దులు చెప్పడం చర్చనీయాంశమయింది. మరి ఇప్పుడు ప్రభుత్వాలు, పోలీసులు ఏమంటాయో చూడాలి. ఎందుకంటే, సోషల్‌మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చిన్న చిన్న వ్యతిరేక వ్యాఖ్యలు పెడితేనే, వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న కాలమిది. మరి నారాయణ చేసిన ఇంతపెద్ద వ్యాఖ్యపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

నిజమే.. కామ్రేడు కోపంలో అర్ధం లే కపోలేదు. 45 రోజుల లాక్‌డౌన్ కాలంలో మందుతాగకుండా జనం భరించగలిగారు. కానీ వారిని 45 రోజుల పాటు మందు తాగించకుండా ప్రభుత్వాలు మాత్రం ఉండలేకపోతున్నాయి మరి! లిక్కరు షాపులకు లాకులెత్తేసిన రెండురోజుల్లోనే, వందల కోట్ల రూపాయల ఆదాయం అందుకున్న పాలకులు.. మళ్లీ అదే నోటితో, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుంటే, ఇక మహిళలు మద్యం అమ్మకాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి ఎక్సైజ్‌శాఖ మంత్రి  నారాయణలాంటి వారు  సెలవిస్తున్న విచిత్ర పరిస్థితి.ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. సిగ్గు పడదాం రండి!

ఏపి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి, మద్యం అమ్మకాలపై ఇచ్చిన మరో భాష్యం విచిత్రంగా అనిపిస్తోంది. జగనన్న ప్రభుత్వం మహిళకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నా, ఇంకా వారు మద్యం అమ్మకాలను అడ్డుకోవడం ఏమిటని మహిళలపై చిర్రుబుర్రులాడారు. సంక్షేమ పథకాలన్నీ మహిళలకు అందుతున్నప్పడు, మద్యం షాపులు తెరిచారని మహిళలు ఎందుకు అడుగుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. పైగా.. మోదీ చె ప్పినందుకే మందుషాపులు ఓపెన్ చేశామని అసలు విషయం చెప్పారు. అంటే.. ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో డబ్బులిస్తే, ఇక అవి ఏం చేసినా సమర్థించాలన్నది మంత్రి గారి కవిహృదయమన్నమాట!  ఇంతకూ.. మద్యం అమ్ముకునే బదులు.. వ్యభిచారం చేసుకోమని సలహా ఇచ్చిన ఆ సీపీఐ నారాయణ, మద్యం అమ్ముతుంటే మహిళలు ఎందుకు అడ్డుకుంటున్నారన్న ఈ వైసీపీ మంత్రి నారాయణ స్వామి ..ఒకే జిల్లా వాసులు. అదీ విచిత్రం!

1 COMMENT