విశాఖలో ప్రజల  ప్రాణాలు కెమి‘కిల్’

570

విశాఖలో ప్రజల  ప్రాణాలు కెమి‘కిల్’
కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీనా?
పర్యావరణ, కాలుష్య అనుమతులున్నాయా?
ఈఐఏ అనుమతి తీసుకున్నారా?
నిర్వహణా లోపమే ప్రాణం తీసిందా?
కార్మికుడు ప్రమాదాన్ని కనిపెడితే మరి సేఫ్టీ ఆఫీసర్లు ఏరీ?
అసలు అనుమతికి సిఫార్సు చేసిన నాయకుడెవరు?
మందుబాటిళ్ల కోసమే తెరిపించారన్న పుకార్లు
విశాఖ విషాదం వె నుక ప్రశ్నలెన్నో?
(మార్తి సుబ్రహ్మణ్యం)

విశాఖ విషాదంలో  11 మంది అమాయకులు, మూగజీవులు విగతజీవులుగా మారడానికి కారకులెవరు? పైకి చెబుతున్నట్లు నిర్వహణ లోపమా? లేక అదనపు ఉత్పత్తి కోసం చేసిన అత్యాశనా? అసలు అత్యవ సరం కాని ప్లాస్టిక్‌కు ఆగమేఘాలపై అనుమతి ఇప్పించిన ఘనులెవరు? తెరచిన కంపెనీకి పర్యావరణ-కాలుష్యమండలి అనుమతులున్నాయా? మందు బాటిళ్ల కోసమే కంపెనీని తెరిచారా? ఇవీ.. విశాఖలో ఆయువు తీసిన వాయువు వెనుక దాగున్న భేతాళ ప్రశ్నలు.

సేఫ్టీ ఆఫీసర్లు లేరా?

విశాఖ ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జీ పాలిమర్స్‌లో లీకయిన కెమికల్.. 11 మంది సాధారణ పౌరులు, వందలాది మూగజీవాలను పొట్టనపెట్టుకున్న ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమ నిలిచిపోయినందువల్ల, చాలారోజుల వ్యవధి తర్వాత పరిశ్రమ తెరచుకోవడంతో, నిర్వహణ సక్రమంగా చేయలేదన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట. అయితే, కంపెనీలో ఉండాల్సిన సేప్టీ ఆఫీసర్లు ఏమయ్యారు? వారు కంపెనీ తిరిగి ప్రారంభించేముందు, ఎందుకు తనిఖీ చేయలేదు? ప్రమాదం ముందు మోగాల్సిన అలారం ఎందుకు మూగబోయింది? అన్నవి ప్రశ్నలు. పైగా ప్రమాదాన్ని ఒక షిప్టు కార్మికుడు గుర్తించాడని కంపెనీ ప్రతినిధి ప్రకటించారంటే, కంపెనీ మనుషుల ప్రాణాలతో ఏవిధంగా ఆడకుంటుందో స్పష్టమవుతోంది. అంటే కంపెనీకి సేప్టీ ఆఫీసర్లు లేరనే అర్ధం చేసుకోవలసి ఉంటుంది.

తెరవెనుక ఏం జరుగుతోంది?

తెల్లవారుఝామున ఈ ఘటన జరిగినప్పటికీ, పోలీసులు, జిల్లా యంత్రాంగం మేల్కొని పరిసర ప్రాంతాల వారిని తరలించి, పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పించారన్నది ప్రభుత్వ భజన మీడియా వినిపిస్తున్న మరో కథనం. కొమ్మినేని శ్రీనివాసరావు అనే కొమ్ములు తిరిగిన ఓ జర్నలిస్టు అయితే.. అసలు విశాఖలో జరిగిన ఘటన పెద్ద ప్రమాదమైనదేమీ కాదని, ఉదయమే వైసీపీ అధికార మీడియా సాక్షి చానెల్‌లో సెలవిచ్చారు. అయితే తెరవెనుక ఏం జరిగిందన్న దానిపై జరుగుతున్న చర్చ, వినిపిస్తున్న కథనాలు, సోషల్‌మీడియాలో డాక్యుమెంట్ల సహితంగా వస్తున్న వార్తలు, చర్చలు  అందుకు భిన్నంగా ఉన్నాయి.

 

విశాఖ విషాదానికి కారణమయిన ఈ కంపెనీకి ప్రస్తుతం సూరుకుంటి రవీంద్రరెడ్డి అనే ఒక్క వ్యక్తి మాత్రమే బాధ్యులుగా ఉన్నట్లు ఆర్వోసీ డాక్యుమెంట్ ఒకటి సోషల్‌మీడియాలో దర్శనమిస్తోంది.  పైగా ఇప్పటి పరిస్థితిలో ప్లాస్టిక్ అత్యవసరం కానప్పుడు, అత్యవసరం అనే జాబితాలో కంపెనీ పేరు చేర్చిన అధికారపార్టీ ప్రముఖుడు ఎవరన్నది వెలుగులోకి రావలసి ఉంది. ‘విశాఖ అంతా నాదే’ అని చెప్పుకునే వైసీపీ ప్రముఖుడే, ఆ కంపెనీకి అనుమతి ఇప్పించారన్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపణలో, నిజమెంతో సాయినాధుడికెరుక?

కంపెనీ వారితో భేటీనా?

ప్రధాని నుంచి ప్రతిపక్ష నేతల వరకూ స్పందింపచేసిన ఈ ఘటన, దేశవ్యాప్తంగా సంచలనంతోపాటు విషాదం నింపింది. అయితే, తాడేపల్లి నుంచి విశాఖకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఈ ఘటనకు బాధ్యుడయిన పాలిమర్స్ యజమాన్య ప్రతినిధులను కలిశారంటూ వచ్చిన వార్త  దిగ్భ్రమ కలిగించింది. ఓ వైపు 11 మంది అమాయకుల ప్రాణాలు, వందలాది మూగజీవుల మరణాలకు కారణమయిన అదే కంపెనీ యజమాన్య బృందంతో స్వయంగా ముఖ్యమంత్రే  భేటీ అయితే, ఇక సదరు కంపెనీపై జరిగే దర్యాప్తు చూసి నత్తలు కూడా నవ్వుకోవా?మీరూ మీరూ మాట్లాడుకుంటారా?

ఈ సమయంలో కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి నుంచి పూర్తి స్థాయిలో నష్టపరిహారం రాబడతామని చె ప్పాల్సిన ముఖ్యమంత్రి… ‘‘నష్టపరిహారం ఏ మేరకు రాబడతాం. గవర్నమెంటుగా  కిందా మీదా పడతాం.  వాళ్లు ఇస్తారా? మేం ఇస్తామా అన్నది పక్కుపెడితే.. కంపెనీ నుంచి ఏమేరకు వస్తుందో వస్తుంది. మిగిలినది మేం ఇస్తాం. కంపెనీతో ఏం మాట్లాడుకోవాలో ప్రభుత్వం మాట్లాడుకుంటుంది.  మృతుల కుటుంబాలను ఆదుకుంటాం’’ అనడం అందరినీ విస్మయపరిచింది. దేశాన్ని దిగ్భ్రమ పరచిన ఒక దుర్ఘటనకు కారకులైన వారిని ముందుగా సస్పెండ్ చేస్తారని, కంపెనీ స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాల్సిన, లేబర్-ఫ్యాక్టరీస్ అధికారుల నిర్లక్ష్యంపై వేటు వేస్తారని భావించిన వారికి సీఎం ప్రకటన సహజంగానే విస్మయపరిచింది.
వీటికి మించి.. ‘కంపెనీతో ఏం మాట్లాడుకోవాలో ప్రభుత్వం మాట్లాడుకుంటుంద’న్న వ్యాఖ్య, పలు రకాల అర్ధాలకు దారితీస్తోంది.

ఏ కంపెనీ అయితే ప్రాణాలు పోగొట్టుకుందో అదే కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామనడంపైనా, ఆక్షేపణ వ్యక్తమవుతోంది.  పైగా.. విడ్మిట్ చేయకుండానే పాలిమరైజేషన్ జరిగిందని,  ముఖ్యమంత్రికి అధికారులు సమాచారం ఇవ్వడంపై కెమికల్ ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అను‘మతి’లేని విధానం!

 సరే.. ఇంతకూ సదరు కంపెనీకి కాలుష్య-పర్యావరణ సర్టిఫికెట్లు ఉన్నాయా అన్న సందేహాలు, ఇప్పుడు సోషల్ మీడియాలో చ ర్చనీయాంశమవుతోంది. సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్న డాక్యుమెంట్ల ప్రకారం.. కంపెనీ 2018 ఏల్ 12న విస్తరణ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ మేరకు అధికారులు, స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ నుంచి అనుమతి తెచ్చుకోవాలని సూచించారు. అయితే కంపెనీ మాత్రం.. మే 10న ఎస్‌ఐఐఐఏ పేరుతో నాలుగున్నర లక్షల రూపాయలతోపాటు ఒక అఫిడవిట్ సమర్పించింది. తమకు ఎస్‌ఐఐఐ అనుమతి ఇవ్వకపోయినా, ఏపీ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఇచ్చిన అనుమతి పత్రం ఉందని డిడికి జతపరిచింది. మరి పొల్యూషన్-ఎన్విరాన్‌మెంట్ సర్టిఫికెట్ తర్వాతయినా తీసుకున్నారా? లేదా? ఆ మేరకు ఆ అనుమతితోనే కంపెనీ నడిపిస్తున్నారా?లేక ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నారా? అన్న ప్రశ్నలకు జవాబు రావలసి ఉంది. టీడీపీ నేత పట్టాభి వాదన ప్రకారం.. 2019 జూన్ 9న విజయవాడలో జరిగిన  స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ సమావేశంలో కంపెనీకి అనుమతి ఇచ్చినట్లు అర్ధమవుతుంది.

పెద్దల పాలిమర్స్ కంపెనీల కోసమేనా?

ఇదిలాఉండగా..ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెందిన పాలిమర్ కంపెనీలకు,.  ఎల్‌జీ పాలిమర్స్ సూపర్ సప్లయిర్ అని, అందుకే ఈ వ్యవహారంలో సర్కారు పెద్దల చర్యలు, వేగంగా లేవన్న కొత్త ప్రచారానికి సోషల్ మీడియాలో తెరలేచింది. నంద్యాలకు చెందిన ఓ వైసీపీ నేత, ప్రభుత్వంలో ఓ ముఖ్య నేతకు చె ందిన మరో పాలిమర్ కంపెనీలు.. బాటిళ్లు, పాలిమర్ బ్యాగులు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలే రాష్ట్రంలో మద్యం తయారుచేసే కంపెనీలకు బాటిళ్లు తయారు చేస్తాయి. ఈ రెండూ నంద్యాల కంపెనీకి చెందిన యజమానివేనన్న కొత్త ప్రచారానికి తెరలేచింది. మద్యానికి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. బాటిళ్ల కొరతను అధిగమించేందుకే, ఎల్.జీ కంపెనీని తెరిపించారన్న గుసగుసలు, సోషల్‌మీడియాలో కోడైకూస్తున్నాయి. నిజం ఆ జగన్నాధుడికెరుక?

పెద్దగా ప్రమాదం లేదన్న పెద్ద జర్నలిస్టు..

ఉదయం నుంచీ దేశాన్ని కుదిపేసిన విశాఖ వాయువు లీకయిన వ్యవహారంపై.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి స్పందించారు. అయితే ప్రభుత్వ అనుకూల మీడియాలో పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావు అనే పెద్ద జర్నలిస్టు మాత్రం.. ఉదయం తన చర్చలో, ఇది మరీ ప్రాణాపాయంచేసేంత ప్రమాదం కాదని, స్పృహ కోల్పోతారని ఎవరో ఆఫీసర్ చెప్పారని వ్యాఖ్యానించడం బట్టి.. ఈ సమస్యను తక్కువచేసి చూపించేందుకు,  నానా కష్టాలు పడుతున్నారని స్పష్టమవుతోంది. కొమ్మినేని వారు సెలవిచ్చినట్లు.. నిజంగా విశాఖ ఘటన అంత ప్రమాదం కాకపోతే, స్వయంగా ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించడంతోపాటు, సీఎస్, మంత్రులను అక్కడే ఉండి సమీక్షించమని ఆదేశించాల్సినంత అవసరం ఏముందన్న వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో వినిపిస్తున్నాయి.

భూసేకరణకు నోటీసులిచ్చారా?

ఇదిలాఉండగా.. ఘటన జరిగిన వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం, భూసేకరణ కోసం అక్కడి ప్రజలకు నోటీసులిచ్చిందన్న కొత్త ప్రచారానికి తెరలేచింది. అయితే, అక్కడ భూములు ఇచ్చేందుకు స్థానికులు సుముఖంగా లేరని, వారు భూసేకరణను వ్యతిరేకిస్తున్న సమయంలోనే.. ఇలాంటి ఘటన జరగడంపై కొత్త చర్చకు తెరలేచింది.

లాక్‌డౌన్ తర్వాత సమీక్ష ఏదీ?

కాగా, లాక్‌డౌన్ తర్వాత మళ్లీ కంపెనీలు తెరచుకుంటున్న నేపథ్యంలో, వాటికి సంబంధించి మార్గదర్శకాలు ఇవ్వాల్సిన పరిశ్రమల శాఖ, కాలుష్యమండలి… వాటిని విస్మరించడం కూడా, ఈ దుర్ఘటనకు ఒక కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 42 రోజుల లాక్‌డౌన్ తర్వాత కంపెనీలు మళ్లీ తెరచుకోనున్నందున.. అక్కడి భద్రతాప్రమాణాలు ఎలా ఉండాలన్న అంశంపై పరిశ్రమల శాఖ విధివిధానాలు ప్రకటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయా కంపెనీల సేప్టీ ఆఫీసర్లు ఇచ్చిన నివేదికలను.. స్థానిక పరిశ్రమల శాఖ, కాలుష్యమండలికి సమర్పించి, దానిపై అధికారుల ఆమోదముద్ర పొందిన తర్వాతనే పరిశ్రమలు పునరుద్ధరించాల్సి ఉందని, కార్మిక నాయకులు చెబుతున్నారు. కానీ ఎల్.జీ.పాలిమర్స్ విషయంలో, ఇమేమీ పాటించినట్లు కనిపించడం లేదని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

1 COMMENT