విజయసాయి జగన్ కారు ఎందుకు దిగిపోయారు?

488

సీఎం ఇంట్లో వీడియో లీక్ చేసిందెవరు?
పార్టీలో విజయసాయి వ్యతిరేకవర్గం పనేనా?
ఆయనపై కుట్ర జరుగుతోందా?
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ ప్రభుత్వం-వైసీపీలో నెంబర్‌టూగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిని.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అవమానించారంటూ, సోషల్‌మీడియాలో వస్తున్న వీడియో కథనాలు వైసీపీ-ప్రభుత్వ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. విశాఖ విషాద ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి విశాఖకు బయలుదే రారు. ఆ సందర్భంలో  జగన్మోహన్‌రెడ్డి వెనుకనే, విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. తర్వాత జగన్‌తో కలసి ఆయన కారులో వెనుక కూర్చుకున్నారు. అయితే మరుక్షణమే, విజయసాయిరెడ్డి కిందకు దిగడం, ఆరోగ్యశాఖమంత్రి అందులో కూర్చున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.

దీనిపై సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చ ఆసక్తి కలిగిస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీసులో ఏం జరిగినా, వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రభుత్వ అధికార ఫొటోగ్రాఫర్‌గానీ, సాక్షి ఫొటోగ్రాఫర్ గానీ తీస్తుంటారు. సీపీఆర్‌ఓ అనుమతి లేకుండా, మిగిలిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు. చివరకు ఇటీవలి కాలంలో జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్లలో కూడా, ఎంపిక చేసుకున్న మీడియా వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. మరి ఫొటోల విషయంలో నిబంధనలు అంత కఠినంగా ఉన్నప్పుడు, విజయసాయిరెడ్డి సీఎం కారు నుంచి కిందకు దిగిపోయిన వీడియో బయటకు ఎలా లీకయింది? అన్న ప్రశ్నలపై సోషల్ మీడియాలో అనేక ఆసక్తికర కథనాలు బయటకు వస్తున్నాయి.
అంత కీలకమైన అంశం  సీఎంకు తెలియకుండా, ఆయన ఆమోదం లేకుండానే, సంబంధిత వ్యక్తులు లీక్ చేసి ఉంటారా? అన్నది ఆ కథనాల సారాంశం. జగన్ తర్వాత ప్రభుత్వం-పార్టీలో నెంబర్‌టూగా ఉన్న విజయసాయిరెడ్డి ప్రాధాన్యం ఏమిటో తెలిసిన తర్వాత కూడా.. ఈ విధంగా ఆయన కారు నుంచి కిందకు దిగిన వీడియో బయటకు వచ్చిందంటే, విజయసాయిని వ్యతిరేకించే పార్టీలోని మరొకవర్గమే.. ఆ వీడియోను లీక్ చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


నిజానికి సీఎం జగన్ విశాఖకు వస్తే, 100-150 మంది మాత్రమే వస్తారని, అదే విజయసాయి వస్తే 300 మంది వరకూ పార్టీ నాయకులు వస్తుంటారని విశాఖ వైసీపీ నేతలు చెబుతుంటారు. అందుకే ఆయనను చాలామంది వైసీపీ సీనియర్లు విజయసాయిని, ‘ఉత్తరాంధ్ర సీఎం’ అని కూడా పిలుస్తుంటారు. అంత ప్రాధాన్యం ఉన్న విజయసాయి, సీఎం కారు నుంచి దిగిపోయిన వీడియో లీకయిందంటే.. ఇది ఉన్నత స్థాయిలో జరిగిన వ్యవహారంగానే భావించాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ విజయసాయి ఏదో మర్చిపోయి, దానిని సీఎంకు చెప్పేందుకే కారు ఎక్కారని సమర్థించుకున్నప్పటికీ… అప్పటివరకూ ఆయన లోపల జగన్‌తో ఉన్నారని గుర్తు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం.. సీఎం దగ్గర ఆయన పలుకుబడి తగ్గిందన్న సంకేతాలిచ్చేందుకే, విజయసాయి వ్యతిరేక వర్గం ఆ వీడియోను.. ఆవిధంగా ఉపయోగించిందని విశ్లేషిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, జగన్‌తోపాటు జైలుకు కూడా వెళ్లి.. డబ్బులు వచ్చే తన వృత్తిని కూడా త్యాగం చేసిన విజయసాయిపై, పార్టీలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన అభిమానులు అనుమానిస్తున్నారు. విజయసాయి ఏం చేసినా అది జగన్-పార్టీ కోసమే తప్ప, ఆయన ప్రయోజనం కోసం కాదని, అయినా కూడా విజయసాయిని అప్రతిష్ఠపాలు చేసేందుకు ఈ విధంగా, వీడియోలు లీక్ చేయడం మంచిదికాదంటున్నారు. జగన్- కేంద్రం మధ్య సయోధ్యకు విజయసాయి చేసిన ఎన్నికల ముందు నుంచీ చేసిన కృషి అంతా ఇంతా కాదని, ఆ క్రమంలో ఆయన ప్రత్యర్ధుల విమర్శలకు సైతం గురయ్యారని గుర్తు చేస్తున్నారు.


చివరకు ఒక సందర్భంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారని, ఇవన్నీ జగన్ ఉన్నతి కోసమే తప్ప, విజయసాయి స్వప్రయోజనాల కోసం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు.. జగన్-విజయసాయి మధ్య దూరం పెరిగిందన్న సంకేతాలతోపాటు, విజయసాయిని సీఎం దూరం పెట్టారన్న అనవసర ప్రచారానికి, అవకాశం ఇచ్చినట్టవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో లీక్‌తో ఇప్పటికే అలాంటి ప్రచారానికి తెరలేవడం దురదృష్టకరమని, పార్టీలో విజయసాయిని సమర్ధించే నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో గ్యాస్ లీకయిన ఎల్ .జి. పాలిమర్స్ కంపెనీకి,  ‘విశాఖ అంతా నాదే’నని చెప్పుకునే.. ఒక వైసీపీ నాయకుడే అనుమతి ఇప్పించారని, అంతకుముందు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించిన తర్వాతనే, ఈ వీడియో ఘటన జరిగిన విషయాన్ని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.  అయితే.. ఎప్పుడూ ట్విట్టర్‌లో బిజీగా ఉంటూ, ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేసే విజయసాయి, ఇప్పటివరకూ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం ప్రస్తావనార్హం.

1 COMMENT

  1. […] నిప్పులేకుండా పొగరాదు. కానీ మీడియా, అందునా సోషల్‌మీడియాలో అసలు నిప్పే లేకుండా పొగవస్తుంటుంది. పొగ లేకుండా నిప్పు కూడా రాజుకుంటుంది. అసలు సోషల్ మీడియా అంటేనే అమ్మా నాన్న లేని అనాధ. అందులో ఎవరు ఎవరిపైనయినా బురద చల్లవచ్చు. చాలా వీజీగా వ్యక్తిత్వ హననం చేయవచ్చు.  వైసీపీ సోషల్‌మీడియాను తన భుజస్కంధాలపై మోస్తున్న వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డికి ఈ రహస్యం తెలియనిది కాదు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీకి చెమటలు పట్టించి, టన్నుల కొద్దీ బురదపోసి బాబు అండ్ కోని భ్రష్టుపట్టించిన ఆ పార్టీ సోషల్‌మీడియాకు ఆయనే సారథి! మరి అంత సూక్ష్మం తెలిసిన  వేణుంబాక.. ‘నేను జీవితాంతం జగన్‌కు విధేయుడినే’నని ఇప్పుడు కొత్తగా ప్రకటించుకోవడమే, వైసీపేయులను విస్మయపరుస్తోంది.ఇది కూడా చదవండి: విజయసాయి జగన్ కారు ఎందుకు దిగిపోయారు… […]