ఈ పాపం ఎవరిది?

188

కరోనా విలయంలో విశాఖ ఆర్ ఆర్ వెంకటాపురం విషవాయువు విషాదం నుంచి మానవ సమాజం, వ్యవస్థలు, ప్రభుత్వాలు ఏమైనా గుణపాఠం నేర్చుకుంటాయా…కొన్ని రోజుల తరువాత కాలగర్భంలో కలిసిపోయే ఓ దుర్ఘటన గా మరిచిపోయి…కాలానికి వదిలేసి యాంత్రికంగా బతికేస్తారా…మానవ సమాజం ఎటుపోతోంది…
భోపాల్ గాస్ లీక్, పాసర్లపూడి బ్లోఔట్ లకు తాజాగా విశాఖ విషవాయువు ఒక కొనసాగింపు మాత్రమే. రేపు సూర్యోదయం కాగానే మరో సంఘటన…సూర్యాస్తమయం లో మరో దుర్ఘటన…మరో విషాదం…ఏ అర్ధరాత్రో విస్ఫోటనం వినిపిస్తుంది. మరెక్కడో గాస్ లీక్ అవుతుంది…ఫైర్ ఇంజెన్స్, పోలీస్ సైరన్ల మోత, యంత్రాంగం హడావుడి, వైద్య సేవలతో ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సుల హైరానా…బంధువుల రోదనలు, ఏడుపులు, పెడబొబ్బలు, ఈ దృశ్యాల్ని చూపించడంలో మేమే ముందు ఇంగ్లీషులో ఎక్సక్లూజివ్ అంటూ పదే పదే ఊదరగొట్టే మీడియా కథనాలు, అక్కడి నుంచి బుల్లితెర వేదికగా మేధావులు, విమర్శకులు, అన్ని రంగుల చొక్కాల నేతల అరుపులు కేకలు నీదే తప్పు కాదు నీదే తప్పు, ఈ పాపమంతా ఆ ప్రభుత్వానిదే…కాదు కాదు ఈ ఘోరం మీ వైఫల్యం వల్లే…ఇంతలో చనిపోయిన వారికి కోటి, క్షతగాత్రులకు అరకోటి, మంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ల జాబితా ప్రతిపక్ష గొంతుల నుంచి వినిపిస్తాయి…ఆ వెంటనే కొన్ని మీడియా వేదికలు అవే గొంతులను వినిపించేందుకు పోటీపడతాయి…దుర్ఘటన స్థాయిని బట్టి ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి పరమర్శలు, మంత్రులు, ఆ వెనుక తెల్ల చుక్క నేతలు ప్రతిపక్షంపై కౌంటర్లు…ఇదీ విశాఖ వంటి దుర్ఘటనలు జరిగినప్పుడు బుల్లితెర సెరియల్స్ ను మరిపించే కళ్ళ ముందు కనిపించే సహజమైన దృశ్యాలు..సూర్యోదయం అవుతుంది ఏ పత్రిక చూసినా పొలికేక కథనాలు, పేజీలకు పేజీల ఫోటోలు, వార్తలు….కథ కంచికి మనం ఇంటికి…ఇంతకు మించి ఈ ఆవు కథకు మించి… సమాజ శ్రేయస్సు, ప్రజల ప్రాణాలకు రక్షణ శాశ్వత చర్యలు శిక్షలు ఏమైనా చూసామా విన్నామా….భోపాల్ గాస్ దుర్ఘటనకు లక్షల మంది బలైపోతే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏమిచేసిందో అంతకు ముందు ఆ తరువాత చాలా దుర్ఘటనలు విషాదాలు కాలగర్భంలో కలిసిపోయి చరిత్రకు సాక్షీభూతంగా జీవం లేని దృశ్యాలుగా మౌనంగా రోధిస్తున్నాయి… హిరోషిమా, నాగసాకి దుర్ఘటనలు గుర్తున్నాయా…అణుబాంబు విస్ఫోటనం నుంచి జపాన్ నేర్చుకున్న గుణపాఠం మన ప్రజాస్వామ్య దేశంలో ఊహించగలమా? బాధిత ప్రజల గుండెకోత కొనసాగింపుతప్పా? ముగింపులేని ఈ పాపం ఎవరిది? ఎవరిది?
వై.శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, 8247678927, 8790230395