స్వరూపనందుల వారి శక్తి పోయిందా?

640

ఆయన చెప్పినా ఖాతరు చేయని కరోనా
మే5 కల్లా తగ్గుతుందని స్వామివారి జోస్యం
ఇంకా పెరుగుతున్న కేసులు, మరణాలు
మరి అయ్యోరి పవర్ తగ్గుతున్నట్లే కదా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ప్రస్తుతం కాలసర్ప దోషం ప్రపంచాన్ని వెన్నాడుతోంది.గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్  కావడం లేదు. ఏప్రిల్24 నుంచి దుష్టగ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మే5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుంది. జ్యోతిష శాస్త్రం పరిశీలిస్తే, వైరస్ ప్రభావం ఏళ్ల తరబడి ఉండదనిపిస్తోంది. విశాఖపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నాం. కరోనా నివారించేందుకు జపాలు, యజ్ఞాలు  నిర్వహిస్తున్నాం’’

– ఇది ఆదిశంకరుల వారి అంశలో పుట్టిన, సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు రూపంలో దర్శనమిచ్చే.. విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతీ భగవత్పాదులు ఏప్రిల్ 16న చేసిన ప్రకటన. అంటే ఇప్పటికి 21 రోజులయిందన్న మాట! సాములోరు చెబితే ఏదైనా జరిగి తీరాల్సిందే కదా? ఆయన కోరుకున్న నాయకుడిని ముఖ్యమంత్రినే చేశారు. ఈ కరోనా, గిరోనా  ఓ లెక్కా ? అని ఆయనపై నమ్మకం పెట్టుకున్న కోట్లాది భక్తులను.. ఈవిధంగా  బుడ్డముంచేశారేంటి చెప్మా అని,  పాపం పామరజనం నోరెళ్ల బెడుతోంది. మే 5 దాటి 6వ తేదీ వచ్చినా కరోనా కల్లోలం తగ్గకపోగా, మరింత పెరగడం బట్టి.. సాములోరి దివ్యశక్తి బ్యాటరీ వీకయిందా? లేక కఠోర తపశ్శక్తితో సంపాదించిన దివ్య శక్తులకు సాధారణ ఔషధాల మాదిరిగానే.. ‘ఎక్సపయిరీ డేట్’ అయిపోయిందా అన్న కొత్త అనుమానం భక్తశిఖామణుల్లో మొదలయింది. ఇది కూడా చదవండి.. దేవుడే దిక్కయితే.. ఇక తమరేమీ చేయలేరన్నట్టే కదా స్వామీ?!

సాములోరికి అవమానంపై భక్తుల ఆవేదన

కోట్లాదిమంది ఇలవేల్పు, రాజకీయ నాయకుల గుండెల్లో గుడికట్టుకున్న కలియుగ దైవం.. శ్రీశ్రీశ్రీ విశాఖ స్వరూపానందుల వారి జోస్యం తల్లకిందులు కావడం జీర్ణించుకోలేక ఆయననే నమ్ముకుని జీవిస్తున్న.. కోట్లాదిమంది గుండెలు తల్లడిల్లుతున్నాయి. ఏప్రిల్ 24 నుంచి దుష్టగ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందని,  మే5 వ తేదీ కల్లా కరోనా పరిస్థితి అదుపులోకి వస్తుందని సెలవిచ్చిన స్వామి వారి దివ్యదృష్టి నుంచి.. కరోనా తప్పించుకుని, జనంపై ఇంకా బుసులు కొడుతోంది. ఆయన చెప్పిన 24 వతేదీ నుంచి కేసులు ఇంకా పెరుగుతున్నాయే కానీ తగ్గలేదు. మరి అన్ని దివ్యశక్తులున్న స్వామి వారు.. దాని నివారణ కోసం చేసిన పూజలు, యాగాలు, అసలు ఆయనకున్న అతీంద్రియ శక్తులన్నీ ఎక్కడకు వెళ్లాయో అర్ధం కాక, భక్తకోటి తలబద్దలు కొట్టుకుంటోంది.  ఇది తమకు జరిగిన అవమానంగానే భావిస్తోంది. చెప్పింది జరగకపోవడంతో.. స్వాములోరు కాకుండా, తామే అభాసుపాలయ్యామని కన్దీరుమున్నీరవుతోంది. ఆ కన్నీరు హుద్‌హుద్ తుపానునూ వెక్కిరిస్తోంది.

స్వరూపనందుల పవర్ పోయిందా?

అసలు..  ఆయనకు బోలెడు మహత్యాలు ఉన్నాయనే కదా.. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సాములోరికి, సాగిలబడి నమస్కరిస్తున్నారు? ఆయన తపోశ్శక్తి ధారపోయడం వల్లనే కదా.. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్న నమ్మకంతో, పొలిటీషియన్లు చినముషిడివాడలోని ఆయన ఆశ్రమానికి క్యూలు కడుతున్నారు? ఆయనచ్చిన సలహాతోనే కదా.. జగనన్న రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తోంది? మరిప్పుడు ఆఫ్టరాల్ కరోనానే దారికి తీసుకురాలేని, అది కూడా సాములోరు ఇచ్చిన గడువు దాటినా..  కరోనా పారిపోకుండా, గురువు గారు చెప్పినా లెక్కచేయకుండా ఎదురు తిరుగుతుందంటే, ఇక సాములోరిని ఎవరు లెక్కబెడతారు? ఎవరు మాత్రం సాష్టాంగపడతారు? ఆయనేకేమీ శక్తులు లేవని తెలిస్తే, అసలు పీఠం పరువు, పవరేం కాను? ఇదీ.. ఆయననే నమ్ముకుని, జీవితం వెళ్లదీస్తున్న రాజకీయ భక్తుల బెంగ! ఇది కూడా చదవండి.. ‘పోప్.. బాబా..ముల్లాలు కరోనా నుంచి కాపాడరేం?’

సాములోరు చెప్పినదానికి ఫుల్ రివర్స్..

అవును. నిజంగానే అసలు ఎందుకిలా జరిగింది? స్వామివారు చెప్పినట్లు జరగకపోగా, అందుకు పూర్తి భిన్నంగా ఎందుకు జరగడం లేదన్న చర్చ.. అటు మామూలు జనంలోనూ వినిపిస్తోంది. స్వామివారు..  మే 5వ తేదీ నాటికి కరోనా అదుపులోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఏప్రిల్ 24 నుంచీ దుష్టగ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందని కూడా సెలవిచ్చారు. కానీ విచిత్రంగా ఏప్రిల్ 24 నుంచీ కేసులు పెరిగాయి. ఎలాగ ంటే.. ఆరోజు ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1752 కేసులు నమోదవగా, 37 మంది మృతి చెందారు. అప్పటికి 23,452 కేసులు దేశవ్యాప్తంగా న మోదగా, అప్పటికి మొత్తం 723 మంది మృతి చెందారు. ఏపీలోనే.. ఆరోజు కరోనా కేసులు 955కు చేరగా, ఒక్క గుంటూరులోనే 200, కృష్ణా జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, కర్నూలులో ఇద్దరు చనిపోగా, ఆ ఒక్కరోజే 62 కేసులు నమోదయ్యాయి.

స్వరూపుల వారు చెప్పిన తేదీల్లో జరిగింది ఇదీ..

స్వామివారు చెప్పిన మే 5వ నాటికి..  కరోనా కేసులు ఇంకా పెరగడం మరో వింత. ఆ రోజు ఒక్కరోజే ఏపీలో 67 కేసులు నమోదయి, 1717కు కరోనా కేసులు చేరాయి. కర్నూలులో కేసులు 500 చేరాయి. విజయవాడలో మహిళ మృతి చెందింది. అటు దేశంలో అదే రోజు 194 మంది మృతి చెందగా, కొత్తగా 3,875 కేసులు నమోదయ్యాయి. భద్రతాదళాల్లో పనిచేసే 300 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక స్వామివారు కరోనా తగ్గుతుందని చెప్పిన తర్వాత ఏపీలోనే.. రాజ్‌భవన్ సిబ్బందికి, మంత్రి గారి అటెండర్‌కు కరోనా సోకడం ఆశ్చర్యం.

ఇంతకూ.. స్వాముల వారి అనుగ్రహభాషణం

అసలు భక్తకోటికి  సరిగ్గా అర్ధమయిందో లేదోనని సందేహంగా ఉంది. స్వరూపానంద  చెప్పిన ఏప్రిల్ 24 నుంచి  మే5 వ తేదీలోగా కరోనా అదుపులోకి వస్తుందని జోస్యం చెప్పినా… అది ఏ సంవత్సరం అని మాత్రం చెప్పినట్లు లేదు. ఎందుకంటే.. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెల వస్తూనే ఉంటుంది. ప్రతి నెల 24, 5 వ తేదీలు వస్తూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు స్వామి వారిది తప్పెలా అవుతుందన్నది బుద్ధిజీవుల ప్రశ్న!

సాములోరు చెప్పినా..  జరిగిన పరిణామాలివీ!

మే 5 తర్వాత అంతా బాగుంటుందని స్వామి వారు సెలవిచ్చారు. అయినా కరోనా తగ్గకపోగా, మరింత పెరిగింది. ఇంకో విచిత్రమేమిటంటే.. స్వరూపానందుల వారు చెప్పిన త ర్వాత.. జగనన్న సర్కారుకు వ్యతిరేక పరిస్థితులు పెరగడం, కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలడం, జగనన్న అభిమానులకు స్వామివారిపై కోపానికి తెరలేపింది. ఇదో కొత్త పరిణామం.
అది ఎలాగంటే.. మే 5న  భవనాలకు రంగుల విషయంలో జగనన్న సర్కారు ఇచ్చిన జీవో 623ను కోర్టు కొట్టేసింది. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వారికి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ కేసులో చుక్కెదురవగా, మద్యం అమ్మకాలు ప్రారంభించడంపై మహిళలు శివమెత్తారు. మద్యం షాపుల వద్ద టీచర్లను కాపలా ఉంచడంపై ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి వ్యక్తం చేయగా, వారిని విధుల నుంచి తప్పించి, కొత్తగా ఆర్టీసీ ఉద్యోగులను పెట్టడంపై నిరసన వ్యక్తమయింది.