బాబుగారు.. మోదీ-కేసీఆర్‌ను వదిలేశారేం?

474

మద్యం బార్లాపై జగన్‌పైనే విమర్శలు
కేసీఆర్ కూడా లాకులెత్తేస్తే మాట్లాడరేం? 
మరి అనుమతి ఇచ్చిన మోదీ మంచోరేనా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

లాక్‌డౌన్ సమయంలో ఏపీలో మద్యం షాపులకు లాకులు ఎత్తేయడంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై శివమెత్తుతున్నారు. యావత్ పార్టీ నేతలు కూడా ఆయనను అనుసరించి, శరపరంపరగా జగన్మోహన్‌రెడ్డి ‘మందు’చూపును తూర్పారపడుతున్నారు. అసలు మందుషాపులు తెరవడానికి ఇదా సమయం అని విరుచుకుపడుతున్నారు.రోడ్డెక్కితే జనాలను కొడుతున్న అదే పోలీసులను.. వైన్‌షాపుల వద్ద ఉంచి, మందు అమ్మిస్తున్నారని కన్నెర చేస్తున్నారు. మద్యనిషేధం పేరుతో, పేదల జేబులు గుల్లచేస్తోందని మండిపడుతున్నారు.ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. సిగ్గు పడదాం రండి!

నిజమే. జగన్మోహన్‌రెడ్డి సర్కారు జనం అవసరాలను సొమ్ము చేసుకునే పనిలో పడింది. మందుకు లాకులెత్తేసింది. రెండు చేతులా సంపాదనకు అర్రులు చాస్తోంది. అందుకు అనుమతి ఇచ్చింది ఎవరు? కేంద్రప్రభుత్వమే కదా? అంటే ప్రధాని మోదీనే కదా? మోదీ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే దేశంలోని అన్ని రాష్ట్రాలు మద్యం షాపులు తెరిచాయి. మరి తప్పు మోదీదా? ముఖ్యమంత్రులదా? కేంద్రం మందుషాపులు మూసేయమని చెప్పినందుకే కదా, 42 రోజులు వాటిని మూసేసింది? ఇప్పుడు మళ్లీ తెరవమని చెప్పినందుకే కదా వాటిని తెరిచింది? ఆ ప్రకారంగా,  తప్పు.. అనుమతించిన వారిదా? అనుమతి తీసుకున్న వారిదా? అంటే తప్పు మోదీదా? ఆయన ఆదేశాలు పాటిస్తున్న జగన్-కేసీఆర్‌దా? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న!

కానీ చంద్రబాబునాయుడు, తెలుగుతమ్ముళ్లు మాత్రం ఈ విషయంలో తప్పంతా ఒక్క జగన్మోహన్‌రెడ్డిదే అయినట్లు, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మద్యం అమ్మకాలకు తాపత్రయ పడుతున్నట్లు  విమర్శించడంపై, వివిధ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మోదీ ఇచ్చిన అదే వెసులుబాటు ప్రకారం.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏవిధంగా వైన్‌షాపులు తెరిచిందో, పక్కనే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం,  ఆ పక్కనే ఉన్న  బీజేపీ  అధికారంలో ఉన్న కర్నాటక ప్రభుత్వం కూడా వైన్‌షాపులు అనుమతించింది. మరి వైన్‌షాపులను అనుమతించిన మోదీని విమర్శించకుండా, ఆయన ఆదేశాలతో షాపులు తెరిచిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పల్లెత్తుమాట అనకుండా.. కేవలం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శించడం అర్ధరహితం.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబునాయుడు.. ఒక్క ఏపీ విషయంలోనే స్పందించి, తెలంగాణలో పార్టీ ఉన్నప్పటికీ, అక్కడి ప్రభుత్వం తీసుకున్న అదే నిర్ణయాన్ని తప్పుపట్టకపోవడం బట్టి.. బాబు ఈ విషయంలో మోదీ-కేసీఆర్‌ను చూసి, భయపడుతున్నారన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతున్నాయి. ఈ విధానం అటు తమ్ముళ్లకూ రుచించడం లేదు.  మోదీ సొంత గుజరాత్, సీఎంగా ఉన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నా.. చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు గానీ వాటిపై పల్లెత్తు మాట అనకపోవడం విస్మయం కలిగిస్తోంది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంధించిన ప్రశ్నలకు టీడీపీ ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు.

పోనీ..  బీజేపీ పాలిత రాష్ట్రాలేమీ షాపులు తెరకుండా మడి కట్టుకునేమీ కూర్చోలేదు. అవికూడా వైన్‌షాపులు తెరిచాయి. కర్నాటకలో అయితే,  ఒంటెను కూడా క్యూలో నిలబెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తెలంగాణలో కరోనా వైరస్ నివారణ వైఫల్యంపై బీజేపీ నేతలే విరుచుకుపడుతుంటే, తెలంగాణ తమ్ముళ్లు మాత్రం మాట్లాడకుండా నోటికి మాస్కులు కట్టుకున్నారు. అయితే  ఏపీ తమ్ముళ్లు మాత్రం, కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడం మరో వింత. కరోనాతో సహజీవనం చేయాలన్న జగన్మోహన్‌రెడ్డిని ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్, అంతకుముందు కేటీఆర్ అదేమాట చెప్పినా.. వారిద్దరిపై నోరు తెరిచేందుకే భయపడుతున్నట్లు వారి మౌనం స్పష్టం చేస్తోంది. ఈ అంశంలో చంద్రబాబు నాయుడు మౌనాన్ని గ్రహించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. వైన్‌షాపులు  అనుమతించిన కేసీఆర్ ప్రభుత్వ విధానంపై మాట్లాడిన తర్వాతనే, బాబు ఏపీకి రావాలని మెలికపెట్టడం ప్రస్తావనార్హం.

ఏపీ రాజ్‌భవన్ ఉద్యోగులకు కరోనా సోకితే నానా యాగీ చేసిన టీడీపీ నేతలు, అదే రాష్ట్రపతి భవన్‌లో ఉద్యోగికి, ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ జవానుకు కరోనా  సోకితే, ప్రధాన కార్యాలయాన్నే మూసివేసినా.. జాతీయ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పల్లెత్తుమాట  అనకపోవడం, దానిని వైఫల్యంగా ఎత్తిచూపకపోవడం ఆశ్చర్యం. మోదీ ఆదేశాలను విమర్శించకుండా, ఆయన మార్గదర్శకాలు ప్రకారం వైన్‌షాపులు తెరచిన జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడం, తెలంగాణలో అదే పనిచేసిన, కేసీఆర్ సర్కారును పల్లెత్తుమాట అనకపోవడం వల్ల.. తెలుగుదేశం నాయకత్వం మోదీ-కేసీఆర్‌ను చూసి భయపడుతోందన్న భావన స్థిరపడే ప్రమాదం లేకపోలేదని టీడీపీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. సిగ్గు పడదాం రండి!