పదండి ‘మందు’కు.. పదండి ముందుకు.. పదండి తోసుకు!

మద్యం షాపులకు లాకులెత్తేసిన పాలకులు
కాషాయ పాలనలోనూ కురుస్తున్న కనక వర్షం
అందరికీ అదనపు ఆదాయమే ఆశ
తెలంగాణలో రెడ్జోన్లలోనూ మద్యం అమ్మకాలు
మర్కజ్ సరే.. వలసకార్మికులతో కరోనా రాదా?
(మార్తి సుబ్రహ్మణ్యం)
నిన్నటి వరకూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతికిన భారతదేశంలో.. ఇప్పుడు ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమవుతోంది. 42 రోజుల పాటు.. పోతున్న ఆదాయాన్ని పళ్ల బిగువున భరించిన పాలకులు, కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో.. సీళ్లు వేసిన వైన్‌షాపులను పూజలు చేసి మరీ తెరిపించిన దృశ్యాలు, పాలకులు-పాలితులను ఆనందభరితులను చేస్తున్నాయి. రోగి-వైద్యుడు అదే కోరుకున్న చందంగా.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు లిక్కరుతో పోతున్న అదనపు ఆదాయాన్ని, ఎన్నిరోజుల్లో పూడ్చుకోవాలో తెలియక తలలుపట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు.. మోదీ భయ్యా ఇచ్చిన వెసులుబాటు, ఖజానాకు సంజీవని వంటిదే. నారుపోసిన వాడే నీరు పోయాలన్నట్లు.. మందు షాపులకు అనుమతించిన ప్రభువులు.. అదే నోటితో, పక్కనే పాన్‌షాపులు, ఆ పక్కనే సీకులకూ అనుమతిస్తే, వారి రుణాన్ని మందుబాబులు ఏదో ఒక రూపంలో తీర్చుకుంటారు కదా?ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. సిగ్గు పడదాం రండి!
కేసీఆర్ రూటే వేరు..
లిక్కరు షాపులు తెరచుకోవడంతో, పాలకుల ఖజానా నిండటం మొదలయింది. కేంద్ర మార్గదర్శకాల్లో రెడ్‌జోన్‌లో మద్యం అమ్మకాలు చేపట్టకూడదని ఉన్నప్పటికీ, తెలంగాణ సర్కారు మాత్రం రెడ్‌జోన్‌లో ఉన్న మనుషులు మందు తాగకూడదా? అన్న గొప్పమనసుతో, అక్కడ కూడా లిక్కరుషాపులకు లాకులెత్తేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-వికారాబా
అతనికంటే ఘనుడు జగనన్న..
అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు.. అటు కేసీఆర్ రాజకీయ శిష్యుడైన ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి గురువుకంటే నాలుగాకులు ఎక్కువే చదివారు. ఆయన తన గురువుగారి రాష్ట్రం కంటే, రెండురోజుల ముందే తన రాష్ట్రంలో లిక్కరుకు లంగరెత్తేశారు. కేసీఆర్ మద్యంపై 16 శాతం పెంచితే, జగనన్న ఏకంగా 75 శాతం పెంచేశారు. అదేమిటని అడిగితే, మద్యనిషేధంలో భాగమంటున్నారు. రేట్లు పెంచడం ద్వారా, తాగేవారిని నిరుత్సాహ పరుస్తామని అంబటి రాంబాబు గత అసెంబ్లీలోనే అసలు రహస్యం బయటపెట్టారు. అయినా సరే.. మందుబాబులు నిర్భయంగా గంటలకొద్దీ ఒకరిపై ఒకరు నిలబడి, తోసుకుని పదండి ‘మందు’కు.. పదండి తోసుకు అంటూ షాపుల్లో ఉన్న మందు ఊడ్చేశారు.
లిక్కరుపై బీజేపీ-కాంగ్రెస్ భలే.. భలే!
రెండు రాష్ట్రాల్లో గురుశిష్యులు లిక్కరుకు షట్టర్లు ఎత్తేసిన విధానాన్ని విపక్షాలు వేలెత్తిచూపుతున్నాయి. ధాన్యంపై లేని ప్రేమ మందుషాపులపై చూపిస్తున్నారని వెక్కిరిస్తున్నాయి. అందులో జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, భాజపా ఒకటి. ఈ రెండు పార్టీలూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్నాయి. సరే ఇక తెలుగుదేశం పేరుకు జాతీయ పార్టీ అయినా, అది నడుస్తున్నది ఒక్క ఏపీలోనే. తెలంగాణలో ఉన్నా, లేనట్లే లెక్క. అందుకే ఆ పార్టీ దృష్టి ఎంతసేపటికీ, సహజంగా ఏపీలో జగన్మోహన్రెడ్డి సర్కారుపైనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు జాతీయ పార్టీలు, రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు.. లిక్కరు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తూర్పారపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇది కూడా చదవండి: బాబుగారు.. మోదీ-కేసీఆర్‌ను వదిలేశారేం?
ఎందుకంటే.. అదే భాజపా-కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమైనా, అవి లిక్కరు షాపులు ఓపెన్ చేయకుండా మడికట్టుకుంటే, ఇతరులను విమర్శించే నైతిక హక్కు ఉంటుంది. కానీ, అవి కూడా ఆ తానుముక్కలుగా మారి, చేతనయింత బాదుతూనే ఉన్నప్పుడు, మిగిలిన వారిపై నిందలు వేయడం అనైతికమే కదా?
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పదండి ‘మందు’కే..
భాజపాకు ఆయువు, ఆదర్శమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 25600 మద్యం షాపులున్నాయి. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ కరుడుకట్టిన హిందూ- సంస్కర ణవాది. ఆయన రాష్ట్రంలో లిక్కరు షాపులు తెరచినందువల్ల, తొలిరోజు వచ్చిన ఆదాయం అక్షరాలా వందకోట్లు. అక్కడ గతేడాది మద్యం అమ్మకాల వల్ల వచ్చిన ఆదాయం 25,100 కోట్ల రూపాయలట. ఇక మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకలో కూడా, లిక్కరుకు లంగరెత్తేశారు. అక్కడ ఏప్రతి ఏటా 19,750 కోట్ల రూపాయల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే వస్తోంది. ఇప్పుడు దేశంలో అధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీనే. ఆ తర్వాత వరసలో కాంగ్రెస్ నిలబడి ఉంది. ఈ రెండు జాతీయ పార్టీలు… తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరవకుండా, ఆదర్శంగా నిలిస్తే బాగుండేది. కానీ అవి లిక్కురుకు లంగరెత్తి, అదేపనిచేసిన ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాలపై బురదచల్లడం ఆక్షేపణీయం. దీనివల్ల అభాసుపాలయ్యేది ఆ పార్టీనే!
మందుబాబుల వల్ల వైరస్ అంటదా మరి?
సరే.. కరోనా కల్లోలానికి మర్కజ్ యాత్రికులే కారణమని, భౌతిక దూరం పాటించకుండా, వారంతా కలసి ఉన్నందుకే వైరస్ విస్తరించిందన్నది ఇప్పటివరకూ ప్రభుత్వాలు, పార్టీలు చేస్తున్న విమర్శ. మరి అదే నిజమైతే… తాజా కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెరచుకున్న లిక్కర్ షాపుల వద్ద, చెరిగిపోయిన భౌతిక దూరం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదా? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న. అనేక రాష్ట్రాల్లో షాపులు తెరచిన మరుక్షణమే వందలమంది, తుపానులో ఆహారపొట్లాలకు కొట్లాడుకున్నట్లు.. మందుకోసం షాపులపైకి ఎగబడటం వల్ల, ఇప్పటివరకూ దూరంగా ఉన్న వైరస్ అంటుకోదా అన్న ప్రశ్నకు పాలకుల వద్ద జవాబు లేదు. భౌతికదూరం పాటించాలన్న ముక్క చెప్పి, కేంద్రం తన బాధ్యతను వదిలించుకుంది. మాస్కులు, భౌతికదూరం పాటించకపోతే షాపు లైసెన్సులు రద్దు చేస్తామని రాష్ట్రాలు హెచ్చరించి, మిగిలిన విషయాలను పోలీసులపైకి నెట్టేశాయి. కానీ, సోషల్‌మీడియాలో చూస్తున్న వీడియోలు, పత్రికల్లో మందు కోసం తోసుకుంటున్న ఫొటోలు చూస్తే.. పాలకులకు కరోనా కంటే కాసులే ముఖ్యమన్నది తేలిపోయింది.ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. సిగ్గు పడదాం రండి!
వలసజీవులతో వైరస్ రాదన్న నమ్మకమా?
మోదీ సర్కారు ఇచ్చిన మార్గదర్శకాల్లో ఒకటయిన వలస కూలీల అంశం కూడా, కరోనా వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 42 రోజుల పాటు, తినో-తినకో ఉన్నచోటనే ఉండి ప్రాణాలు నిలబెట్టుకున్న వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చే, సాహసోపేత నిర్ణయం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ. రైళ్లు, బస్సుల్లో భౌతిక దూరం పాటిస్తూ, వారిని గమ్యస్థానాలకు చేర్చాలంటే.. దేశంలో ఉన్న 12 కోట్ల మంది వలస కూలీలకు, ఎన్ని వేల రైళ్లు,- ఎన్ని లక్షల బస్సులు కావాలన్నది ప్రశ్న. వారిని తరలించే ప్రయత్నంలో వైరస్ వ్యాప్తి అవుతుందన్న ఆలోచన పాలకులకు రాకపోవడం, వలసజీవుల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఇప్పటికే చత్తీస్‌ఘఢ్‌కు వచ్చిన వలసజీవుల్లో 14 మందికి, కరోనా సోకిన వార్తలు అక్కడి ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి.
వలస జీవులను ఆదుకుంటే ఎందుకు వెళతారు?
అదీకాక.. లాక్డౌన్లో చిక్కుకున్న వలస కార్మికులకు మేం అని వేల కోట్లు ఇస్తున్నాం, ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం. భోజనసౌకర్యం కల్పిస్తున్నామని రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయినా వలస జీవులు వెళ్లిపోతున్నారంటే, అవన్నీ వారికి సక్రమంగా అందడం లేదనే కదా అర్ధం? నిజంగా భోజన సౌకర్యాలు అమర్చితే, కూలీలకు వెళ్లిపోవాలన్న ఆలోచన ఎలా వస్తుంది? అదీగాక.. మళ్లీ వలసజీవులను నగరాలకు తీసుకురావడం సాధ్యమవుతుందా? వారు తిరిగి రాకపోతే, మధ్యలోనే ఆగిన ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రైవేటు భవన నిర్మాణాల సంగతేమిటి? వాటివల్ల ఆదాయం ఆశిస్తున్న సర్కారు ఖజానా మాటేమిటి? మొత్తంగా దెబ్బతినే ఆర్ధికవ్యవస్థ గోడేమిటి? అన్నవాటిపై ముందుచూపు లేకుండా, తీసుకున్న నిర్ణయాలు.. భవిష్యత్తులో ప్రమాదఘంటికలు మోగించక తప్పదు! మళ్లీ.. అప్పుడు కూడా నష్టపోయేది ప్రజలేనన్నది మనం మనుషులం అన్నంత నిజం!!!
1 Response
[…] […]