కరోనాపై.. కేసీఆర్ కరెక్టా? కేటీఆర్ కరెక్టా?

74

తరిమేస్తామన్న కేసీఆర్
కలసి జీవించడం నేర్చుకోవాలన్న  కేటీఆర్
ఏపీలో జగన్ చెప్పిందీ అదే
ఎవరి మాట నిజం?
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా వైరస్ ప్రాణాంతకమేమీ కాదు. అసలది పెద్ద విషయమే కాదు. అది తెలంగాణకు రమ్మన్నా రాదు. పారాసిటమల్ వేసుకుంటే పోతుందని గతంలో శాసనసభలో తేలిగ్గా చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్…  తర్వాత, ఆ వైరస్ తీవ్రతేమిటో తెలుసుకుని, ముందు తాను మేల్కొని,  ప్రజలను మేల్కొలిపారు. అప్పటినుంచీ సీరియస్‌గానే నిరంతర సమీక్షలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే కఠినతరం చేస్తున్నారు. కేంద్రం కంటే ఎక్కువరోజులే లాక్‌డౌన్ పొడిగిస్తున్నారు. నిజానికి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎస్పీ నేత భట్టి అప్పుడే విమర్శలు కురిపించారు. కరోనాను తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదన్నారు. తర్వాత భట్టిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో నాటి క్లిప్పింగును కూడా కాంగ్రెస్  వైరల్ చేసింది.

కేసీఆర్ ఇలా..

ఇటీవలి కాలంలో సమీక్షలు, ప్రెస్‌కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్న కేసీఆర్.. కరోనాను తరిమికొట్టేవరూ విశ్రమించమని పదేపదే చెబుతున్నారు. బతికుంటే బలుసాకు తినవచ్చని, అందుకే ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొడదామని పిలుపునిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎవరూ ఆంధ్రాకు రావద్దని, మిగిలిన ప్రాంతాల నుంచి ఎవరూ హైదరాబాద్ రావద్దని కోరుతున్నారు. అంటే.. దీని ప్రకారం కరోనా వైరస్ తీవ్రత ఏమిటో, కేసీఆర్‌కు తెలుసన్నది స్పష్టమవుతోంది.

కేటీఆర్ ఇలా..

కానీ ఆయన తనయుడైన మంత్రి కేటీఆర్ మాత్రం,  కరోనా వైరస్ తీవ్రతపై అందుకు భిన్నంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయింది.  కరోనాపై వాక్సిన్‌ను కనుగొనేంత వరకూ, ప్రజలు వైరస్‌తో కలసి జీవించడం నేర్చుకోవాలని చేసిన వ్యాఖ్య, సోషల్‌మీడియాలో బాగా ట్రోల్  అవుతోంది. ఒకవైపు సీఎం కరోనా వైరస్‌ను పారదోలే వరకూ విశ్రమించమని చెబుతుంటే, ఆయన తనయుడు మాత్రం కలసి జీవించడం నేర్చుకోవాలని చెప్పడం వింతగా ఉందంటున్నారు. దీన్ని బట్టి కరోనాపై ప్రజలు ఎవరి మాటలు నమ్మాలి?  ఎవరిని అనుసరించాలి? ఇద్దరిలో ఎవరి మాట నిజం అన్న చర్చకు తెరలేచింది.

జగన్ బాటలోనే…

ఇంతకుముందు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా ఇలాగే.. కరోనాపై కంగారుపడాల్సిన పనిలేదని, అది సాధారణ జ్వరం మాదిరేనని వ్యాఖ్యానించారు. తర్వాత దానితో సహజీవనం చేయాల్సి ఉంటుందన్న వ్యాఖ్య విమర్శలకు గురయింది. ఇలాంటి ప్రకటనల వల్ల ప్రజల్లో,  జీవించాలన్న ఆశ చచ్చిపోతుందన్నది అన్నివర్గాల ఆందోళన. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా.. ‘సహజీవనం’ అనే పదం వాడటం తప్ప, మిగిలినదంతా జగన్‌నే అనుసరించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.