ఛీ..ఛీ.. సిగ్గు పడదాం రండి!

700

వైన్‌షాపుల వద్ద పోటెత్తిన పేదలు
వారికి సబ్సిడీలు, నిత్యావసరాలా?
దాతల దానం వృధానేనా?
ఏపీలో ఒక్కరోజులోనే 40 కోట్ల మద్యం తాగేసిన నిరుపేదలు
సిగ్గుమాలిన సర్కారు సంక్షేమం
సోషల్ మీడియాలో పన్నుచెల్లించేవారి ఆగ్రహం
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ నేడు దేశంలో మద్యం షాపుల వద్ద జనంతో నిండిన  ఈ బారులు చూస్తుంటే, నాకు తెలిసి ఎవరూ ఈ 40 రోజుల లాక్‌డౌన్ కాలంలో సంపాదన లేకుండా బాధపడటం లేదనిపిస్తోంది. రోజువారీ కూలీలలకు, పేదలకు పనులు లేవు. తినడానికి తిండిలేదు. సంపాదన లేదని కొన్ని స్వచ్ఛందసంస్ధలు, కుల సంఘాలు చందాలు వేసుకుని మరీ, గడపగడపకు తిరిగి ప్రతి ఇంటికి కూరగాయలు, నిత్యావసర సరుకులు ఉచితంగా సరఫరా చేస్తే.. ఈరోజు వైన్‌షాపుల వద్ద చూస్తున్న బారుల దగ్గర పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ సంపన్నుడు ఎవరూ లేరు. ఉన్నది రోజువారీ కూలీలే. ఇప్పుడు వీళ్లను చూసి, ఈ 40 రోజుల లాక్‌డౌన్ కాలంలో సహాయం చేసిన సంస్ధలు సిగ్గుపడాలా? లేక సహాయం పొందిన ప్రజలు సిగ్గుపడాలో అర్ధం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి చూసిన తర్వాత, భవిషత్తులో ఇక సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్ధలు ముందుకురాగలవా? ఏ పేదవాని పరిస్థితి చూసైనా ఆపన్నహస్తం అందించగలవా?’
– సోషల్‌మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతున్న సందేశమిది. పన్నులు కడుతున్న వారి కడుపుమంటకు ఇదో నిలువెత్తు నిదర్శనం.
* * *

అపాత్రదానం అసలుకే మోసమన్న పెద్దల సూక్తి అక్షర సత్యమయింది. రాజకీయ పార్టీల ఓట్ల రాజకీయాల్లో వెదజల్లే, సంక్షేమ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. కష్టకాలంలో ఇస్తున్న నగదు సాయం వైన్‌షాపుల గల్లాపెట్టెల్లోకి వెళుతోంది. రాత్రింబవళ్లు కష్టపడి పన్నులు చెల్లించే ప్రజల జేబు చిల్లు పెట్టి, పేదల పేరిట ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ సంతర్పణలు పక్కదారిపట్టి,  నీరుగారిపోతున్నాయి. పన్నులు చెల్లించే వారిని కొట్టి, పేదలకు పెడుతున్న పాలకుల పద్ధతులన్నీ అపాత్రదానమేనని.. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమపథకాలందుకుంటున్న లబ్థిదారులు, మరోసారి నిరూపించారు. అందుకు కరోనా కాలం వేదికయింది. ప్రభుత్వాలు సంక్షేమం పేరిట చేస్తున్న దానాలు ఎలా పక్కదారిపడుతున్నాయో చూడండి!

40 కోట్లు తాగేశారు మరి!

లాక్‌డౌన్‌కాలంలో కష్టాల్లో ఉన్నారని భావించిన పేదల కోసం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్ల వరదానాలిచ్చాయి. దాతలు పెద్దమనసు చేసుకుని విరాళాలిచ్చాయి. కారణం వారి వద్ద, నయాపైసా డబ్బులేదన్న సానుభూతి. కానీ.. లాక్‌డౌన్‌లో వైన్‌షాపులకు లాకులెత్తేసిన నేపథ్యంలో, బారులుతీరిన అదే పేదలు, ఒక్కరోజే 40 కోట్ల మందు తాగేశారు. కాదు.. ఊదే శారు. అంటే.. అటు పన్నులు చెల్లిస్తున్న ప్రజల డబ్బులతో సాయం చేసిన సర్కారును, ఇటు దాతల ఔదార్యాన్నీ వైన్‌షాపులకు తాకట్టు పెట్టేస్తే, పన్నులు చెల్లించే వారికి ఒళ్లు మండదూ? కోపం కట్టలు తెగదూ? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, తమ జేబులు కొట్టి, పేదలకు పంచుతున్న ప్రభుత్వ పాలిసీలపై పిడికిలి బిగుసుకోవూ?.. ఆంధ్రాలో ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. జరుగుతోంది! రేపు తెలంగాణలో కూడా జరిగేది ఇదే!!

లాక్‌డౌన్‌లో లాకులెత్తేసిన తర్వాత..

లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఆ సాకుతో వైన్‌షాపు షట్టర్లు తెరిపించిన రాష్ట్ర ప్రభుత్వాలు.. పేదల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల డొల్లతనాన్ని, అవి ఏవిధంగా దుర్వినియోగం అవుతున్నాయో కరోనా కాలం ససాక్ష్యంగా నిరూపించింది. ఏపీలో వైన్‌షాపులు తెరచుకున్న నేపథ్యంలో.. సామాజికదూరం నిబంధనల చెరిగిపోయింది. తెల్లవారుఝాము నుంచే వైన్‌షాపుల ముందు, బారులు తీరిన  మందుబాబుల్లో 80 శాతం పేదలే. అంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారే. లాక్‌డౌన్ కారణంగా ఆర్ధికంగా చితికిపోయారన్న సానుభూతితో.. ప్రభుత్వాల నుంచి వెయ్యి, పదిహేను వందల రూపాయలు, 15 కిలోల బియ్యంతోపాటు, దాతల నుంచి కందిపప్పు, నూనె ప్యాకెట్లు అందుకుంటున్న వారే. అవును..వారే ఏపీలో వైన్‌షాపుల ఓపెనింగ్ రోజునే, అక్షరాలా 40 కోట్ల మద్యం తాగేయడం విభ్రమగొలిపింది.

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు..

అంటే ప్రభుత్వాలు..  పేదల వద్ద డబ్బులేదని భావించి, ఆర్ధిక సాయం, బియ్యం పంపిణీ చేసిందో.. అదే పేదల వద్ద 40 కోట్ల రూపాయలు ఉన్నట్లు తేలిపోయింది. మరి పాలకులు చేసింది దానమా? అపాత్రదానమా? అన్నది ప్రశ్న. క్రమం తప్పకుండా అనేకరకాల పన్నులు కడుతున్న వారి జేబులు చిల్లులు పెట్టి, అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. తాము చెల్లించే పన్నులతో, పేదలకు డబ్బులిస్తున్న ప్రభుత్వాల విధానం తప్పని రుజవయిందని, పన్ను చెల్లింపుదారులు పాలకులను నిగ్గదీస్తున్నారు. వారి ఆవేశం, ఆగ్రహంలో నిజం ఉంది. మరి.. వారి ప్రశ్నలకు జవాబు ఇచ్చే ధైర్యం పాలకులకు ఉందా?   సంతుష్ఠీకర విధానాలతో, మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆశతో పేదలను సోమరిపోతులను చేస్తున్న పాలకుల స్వార్థరాజకీయాలకు, నిర్ణయాలకు.. చివరకు బలవుతున్నది తామేనన్న పన్నులు చెల్లించేవారి ఆక్రోశం, ఆవేదనలో నిజం ఉంది.  కాదనే దమ్మెవరికి ఉంది?

అన్ని డబ్బులు పేదల వద్ద ఉన్నట్టే మరి!

వైన్‌షాపులు తెరచిన తొలిరోజే 40 కోట్ల రూపాయల మద్యం తాగేశారంటే, పేదల వద్ద డబ్బులు లేదనుకున్న ప్రభుత్వాల అంచనా తప్పని తేలిపోయింది. వైన్‌షాపులు తెరచిన ఏపీ సర్కారు, ఒక్కో బాటిల్‌పై 25 శాతం ధర పెంచింది. ఇప్పటికే వైన్‌షాపుల్లో దొరికే మద్యం ఫుల్‌బాటిల్ ధర 700 రూపాయల వరకూ ఉంది. నిజంగా అంత డబ్బులేకపోతే.. ఆ 25 శాతం  అద నపు ధర చెల్లించి కొనగలిగే స్తోమత పేదలకు ఉందా? అన్న ప్రశ్న, మెడపై తల ఉన్న ఎవరికైనా వస్తుంది. మరి పాలకులకు వస్తుందో రాదో తెలియదు. అంటే.. ప్రభుత్వాలు చేస్తున్న నగదు సాయంతోనే, పేదలు మద్యం బాటిళ్లు కొనుగోలు చేస్తునట్లు స్పష్టమవుతోంది.

ఇక దాతలు ముందుకొస్తారా?

ప్రభుత్వాలు డబ్బుతోపాటు బియ్యం కూడా ఇస్తున్నాయి. ఇక దాతలు, కంపెనీలు, ట్రస్టులు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు వాటికి అదనంగా.. బియ్యం, నూనె, కందిపప్పు, చింతపండు, చక్కెర, టీప్యాకెట్లు ఉచితంగా ఇస్తూనే ఉన్నాయి. కాబట్టి, వారికొచ్చిన కష్టం గానీ, నష్టం గానీ ఏమీ లేదు.ప్రైవేటు వ్యక్తులు- ప్రభుత్వాలు ఇచ్చిన వస్తువులను ఇంటి అవసరాలకు వాడుకుని, నగదును మద్యం కోసం వినియోగించినట్లు తెలివి ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఈరకంగా తాము చేసిన దానం వృధా అవుతోందని దాతలు, వదాన్యులు భావించి వాటిని చేతులు బిగిస్తే.. నష్టపోయేది  నిజమైన పేదలే.

3 COMMENTS

  1. […] లాక్‌డౌన్ సమయంలో ఏపీలో మద్యం షాపులకు లాకులు ఎత్తేయడంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై శివమెత్తుతున్నారు. యావత్ పార్టీ నేతలు కూడా ఆయనను అనుసరించి, శరపరంపరగా జగన్మోహన్‌రెడ్డి ‘మందు’చూపును తూర్పారపడుతున్నారు. అసలు మందుషాపులు తెరవడానికి ఇదా సమయం అని విరుచుకుపడుతున్నారు.రోడ్డెక్కితే జనాలను కొడుతున్న అదే పోలీసులను.. వైన్‌షాపుల వద్ద ఉంచి, మందు అమ్మిస్తున్నారని కన్నెర చేస్తున్నారు. మద్యనిషేధం పేరుతో, పేదల జేబులు గుల్లచేస్తోందని మండిపడుతున్నారు.ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. సిగ్గు పడదాం రండి! […]

  2. […] నిన్నటి వరకూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతికిన భారతదేశంలో.. ఇప్పుడు ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమవుతోంది. 42 రోజుల పాటు.. పోతున్న ఆదాయాన్ని పళ్ల బిగువున భరించిన పాలకులు, కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో.. సీళ్లు వేసిన వైన్‌షాపులను పూజలు చేసి మరీ  తెరిపించిన దృశ్యాలు, పాలకులు-పాలితులను  ఆనందభరితులను చేస్తున్నాయి. రోగి-వైద్యుడు అదే కోరుకున్న చందంగా.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు లిక్కరుతో పోతున్న అదనపు ఆదాయాన్ని, ఎన్నిరోజుల్లో  పూడ్చుకోవాలో తె లియక తలలుపట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు..  మోదీ భయ్యా ఇచ్చిన వెసులుబాటు, ఖజానాకు సంజీవని వంటిదే.  నారుపోసిన వాడే నీరు పోయాలన్నట్లు.. మందు షాపులకు అనుమతించిన ప్రభువులు.. అదే నోటితో, పక్కనే పాన్‌షాపులు, ఆ పక్కనే సీకులకూ అనుమతిస్తే, వారి రుణాన్ని మందుబాబులు ఏదో ఒక రూపంలో తీర్చుకుంటారు కదా?ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. సిగ్గు పడదాం రండి! […]

  3. […] నిజమే.. కామ్రేడు కోపంలో అర్ధం లే కపోలేదు. 45 రోజుల లాక్‌డౌన్ కాలంలో మందుతాగకుండా జనం భరించగలిగారు. కానీ వారిని 45 రోజుల పాటు మందు తాగించకుండా ప్రభుత్వాలు మాత్రం ఉండలేకపోతున్నాయి మరి! లిక్కరు షాపులకు లాకులెత్తేసిన రెండురోజుల్లోనే, వందల కోట్ల రూపాయల ఆదాయం అందుకున్న పాలకులు.. మళ్లీ అదే నోటితో, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుంటే, ఇక మహిళలు మద్యం అమ్మకాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి ఎక్సైజ్‌శాఖ మంత్రి  నారాయణలాంటి వారు  సెలవిస్తున్న విచిత్ర పరిస్థితి.ఇది కూడా చదవండి: ఛీ..ఛీ.. సిగ్గు పడదాం రండి! […]