మోదీ ముందుచూపే దేశాన్ని కాపాడింది

388

 రైళ్లలో కూలీల తరలింపు ఖర్చు కేంద్రానిదే
బడ్జెట్ కంటే బతుకులకే మోదీ ప్రాధాన్యం
పోలీసు, వైద్యులు, పారిశుధ్య కార్మికుల సేవలు అద్భుతం
బీజేపీ మాజీ ఎంపీ గరికపాటి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, చాడ 

హైదరాబాద్: ప్రధాని మోదీ ముందు చూపు మాత్రమే ఇప్పుడు దేశాన్ని సురక్షిత స్ధానంలో నిలిపిందని, ప్రపంచ దేశాలు మొత్తం ఈ విషయంలో మోదీ ముందుజాగ్రత్తను మెచ్చుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర నేత, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు, నగర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామచంద్‌రావు, మాజీ ఎంపి చాడ సురేష్‌రెడ్డి  అన్నారు. లాక్‌డౌన్ కారణంగా లక్షల కోట్ల రూపాయల ఆదాయం పోతున్నా, బడ్జెట్ కంటే ప్రజల బతుకులకే పెద్దపీట వేసిన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు అభినందించి తీరాలన్నారు. ఈ కష్టకాలంలో బీజేపీ కార్యకర్తలు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు, స్ఫూర్తి మేరకు.. బీజేపీ నగర నేత మేకల సారంగపాణి, ఆయన తనయుడు మేకల హర్ష ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, బీజేపీకి చెందిన పేద కార్యకర్తలు వందమందికి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు, చాడ సురేష్‌రెడ్డి, సికింద్రాబాద్ బీజేపీ ఇన్చార్జి పి.రవిప్రసాద్‌గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామచందర్‌రావు, గరికపాటి, సురేష్‌రెడ్డి మట్లాడుతూ.. కోవిడ్ నివారణలో ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌వైపు, మన సంప్రదాయాల వైపు చూస్తున్నాయంటే మోదీ గొప్పతమేమిటో అర్ధమవుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ముందుజాగ్రత్తల కారణంగానే, ప్రపంచంలో కంటే మన దేశంలో మరణాల శాతం గణనీయంగా తగ్గిందన్నారు. మోదీ ఇచ్చిన పిలుపును ఆబాలగోపాలం చిత్తశుద్ధితో పాటిస్తుందంటే, మోదీని దేశప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారో, ఏ స్థాయిలో విశ్వసిస్తున్నారో స్పష్టమవుతోందన్నారు. కోవిడ్ యుద్ధంలో ముందువరసలో నిలబడి పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఈ దేశం రుణపడి ఉందని చెప్పారు.

  లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన కోట్లాదిమంది వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్ధులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ విషయంలో వారికోసం కేంద్రం కోట్లాదిరూపాయలు ఖర్చు పెడుతోందన్నారు. దేశంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా, స్వస్థలాలకు చేరాలనుకున్న వారికి రైల్వే శాఖ కేవలం 50 రూపాయల బిల్లు మాత్రమే వేస్తోంద న్నారు. అందులో కేంద్రం 42 రూపాయల 50 పైసలు భరిస్తుండగా, రాష్ట్రాలు కేవలం ఏడున్నర రూపాయలే భరించాల్సి ఉందని, అది కూడా రాష్ట్రం కట్టిన వాటికి కేంద్రం గ్రాంటు రూపంలో తిరిగి చెల్లిస్తుందంటే, మొత్తం ఖర్చంతా కేంద్రమే భరిస్తున్నట్లు అర్ధమవుతుందన్నారు. వలస కార్మికుల కోసం గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని చర్యలు, మోదీ ప్రభుత్వం తొలిసారి తీసుకుంటోందని వివరించారు. ఈ కష్టకాలంలో ప్రజలంతా మోదీ ప్రభుత్వానికి నైతిక మద్దతునివ్వాలని కోరారు.

తెలంగాణలో రైతు పంటలకు మార్కెట్ సౌకర్యం లేకుండా పోయిందని, ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందన్నారు. రైతులకు కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. తాలు పేరుతో రైతుల వద్ద ఎక్కువ ధాన్యం సేకరిస్తున్న మోసానికి, ప్రభుత్వం తెరదించాలని కోరారు.  కూలిపోయిన కోహెడ మార్కెట్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని, నాసిరకం నిర్మాణమే దానికి కారణమన్న ఆరోపణలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసేందుకు,  కేంద్రం పరికరాలు పంపించినా రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శించారు.  మనకన్నా చిన్న రాష్ట్రాలు ఎక్కువ టెస్టులు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనవసర ప్రతిష్ఠకు పోతోందని విమర్శించారు. పేదలకు తాము నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుంటే అడుకుని పోలీసులు కేసులు పెడుతున్నారని, అదే మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తుంటే అడ్డుకోవడం లేదని రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నద్దా, కిషన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నేతలు పేదలు, పేద కార్యకర్తలకు సాయం చేయడం అభినందనీయమన్నారు. గతంతో ఎవరూ చేయనివిధంగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన సొంత ఖర్చుతో పార్లమెంటు నియోజవర్గ ప్రజలకు, మోదీ కిట్లు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారు మేకల సారంగపాణి-హర్షను అభినందించారు.

బీజేపీ నగర నాయకుడు మేకల సారంగపాణి మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా పిలుపు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్ఫూర్తితోనే, తాము గత కొద్దిరోజుల నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పారిశుధ్య కార్మికులు, పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న పేద కార్యకర్తలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి రవిప్రసాద్‌గౌడ్ మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు, బీజేపీ కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారనడానికి ఇదో నిదర్శనమని చెప్పారు. పేద కార్యకర్తలను ఆదుకునేందుకు ముందుకు రావడం కూడా అభినందనీయమన్నారు.

1 COMMENT