వచ్చే వారం సుప్రీంకోర్టుకు రెండు ఘటనలు!?

485

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారం రెండు ముఖ్యమైన ఘటనలలో హై కోర్ట్ నుంచి వెలువడే తీర్పులు …. సుప్రీంకోర్టు గుమ్మం ఎక్కే సూచనలు బలంగానే కనపడుతున్నాయి. అయితే…ఆ కేసులు వేసేది ఎవరు అనే విషయంలో స్పష్టత ఇంకా రావలసి ఉంది.
మొదటిది-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కుదింపు వ్యవహారం. ఈ పదవీ కాలాన్ని 5 సంవత్సరాలనుంచి 3 సంవత్సరాలకు రాష్ట్రప్రభుత్వం కుదించింది. దీనితో…ఇప్పటికే 4 సంవత్సరాల పదవీ కాలం ముగించుకున్న ఎన్నికల కమిషనర్…తన పదవినుంచి వైదొలగినట్టయింది. ఆయనను నియమించిననాటి సర్వీస్ నిబంధనలమేరకు…ఆయనకు మరో సంవత్సర కాలం వ్యవధి ఉంది. దీనితో, ప్రభుత్వ నిర్ణయం చెల్లదని;రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మరి కొందరు ప్రతిపక్ష నేతలు, ఇతరులు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హై కోర్ట్ ధర్మాసనం….ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం….;ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయడం…;వాటికి పిటిషన్ దారులు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడం….;వాదనలు మొదలు కావడం కూడా జరిగిపోయాయి. ఈ వాదనల కొనసాగింపు సోమవారం హై కోర్ట్ లో తిరిగి ప్రారంభం కానుంది. ఇరుపక్షాలకూ అత్యంత ప్రతిష్టాత్మకం గా పలువురు భావించే ఈ కేస్ లో….1)సోమవారం సాయంత్రానికే వాదనలు ముగియవచ్చు. తీర్పు రిజర్వ్ కావచ్చు….2)వాదనలు ముగియక పోవచ్చు….3) ఒకటి, రెండు వాయిదాలు పడవచ్చు….

ఇలా ఏదైనా జరగవచ్చు. కోర్ట్ కూడా ఈ అంశానికి విశేష ప్రధాన్యతే ఇచ్చినట్టుగా కనపడుతోంది. వీడియో కాలింగ్ ద్వారా కేసులు విచారిస్తున్న న్యాయమూర్తులు…ఈ కేసులోని వాదోపవాదాలు వినడానికి స్వయంగా హై కోర్ట్ కు తరలి రావాలని భావించడమే ఇందుకు నిదర్శనం.
ఇందులో వెలువడనున్న తీర్పు ఎలావుండబోతున్నదనే ఉత్సుకతలో రాష్ట్రం మునిగి తేలుతోంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనపడుతోంది. హై కోర్ట్ లో తమ వాదనను నెగ్గించుకోలేనివారు ….ఖచ్చితంగా సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయిస్తారు. అది ఎవరు అనే విషయంలో స్పష్టత రావడానికి మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పదవి కోల్పోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదనలకు విజయం లభిస్తే…;ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు వెళ్లడం ఖాయం. ప్రభుత్వ వాదనకు హై కోర్ట్ లో విజయం లభిస్తే…నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా సుప్రీమ్ కోర్టు కు అప్పీల్ కు వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. నిమ్మగడ్డ పదవీ యోగానికీ….స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకూ లంకె పడిపోయి ఉండడం తో…ఈ అంశం అటు ప్రభుత్వానికీ…ఇటు రమేష్ కుమార్ కూ అత్యంత ప్రతిష్టాత్మకమై కూర్చుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఆయన తిరిగి కూర్చోవడం సంభవిస్తే….ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వడం తథ్యం అ చెప్పవచ్చు. కరోనా ముప్పు పూర్తిగా వైదొలగే దాకా ఆయన వాటి జోలికి వెళ్లక పోవచ్చు. ఒక వేళ ప్రభుత్వమే కోరితే,…’చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను, ఎస్పీలనూ మార్చమన్నానుగా…!వాటి సంగతేమిటి?’అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఎటుతిరిగీ వచ్చే ఏడాది మార్చ్ 31 తో ఆయన పదవీకాలం పూర్తి అవుతున్నది కనుక ఏప్రిల్ ఆ లాంఛనం పూర్తి చేద్దాములే అని ప్రభుత్వం భావించవచ్చు.
ఒక వేళ ప్రభుత్వం గెలిస్తే, స్థానిక సంస్థలు ఎన్నికలను వెంటనే జరిపించుకోవచ్చు. అందుకే…ఈ కేస్ కు ఇంతటి విశేష ప్రాధాన్యం ఏర్పడింది.

ఇక రెండో అంశం-డీజీపీ ర్యాంక్ గలిగిన ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ వ్యవహారం. తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ ఆయన హై కోర్ట్ ను ఆశ్రయించారు. అదికూడా వచ్చే వారమే…బెంచ్ ముందుకు రానుంది. ఈ కేస్ లో ప్రభుత్వ అఫిడవిట్ ఫైల్ కాగానే, విషయం ధర్మాసనం ముందుకు వస్తుందని భావిస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారం లాగా ఇది సంచలనమైనది కాదు. కానీ, ముఖ్యమైనదే. ఇందులో ప్రజా ప్రయోజనాలేమీ ఇమిడిలేవు కానీ, పోలీస్ శాఖలో ఒక అత్యున్నత అధికారికి….రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయతీ ఇది.
ఎవరి వాదన సబబు అని తేల్చడానికి… కోర్టు నిర్ణయం కీలకం కాబోతోంది.
ఈ కేస్ కూడా…అటు సస్పెండ్ అయిన డీజీపీ స్థాయి అధికారి -ఏబీ వెంకటేశ్వర రావు కు, ఇటు ప్రభుత్వానికీ ప్రతిష్టాత్మకమే అని అంటున్నారు. వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను కోర్టు రద్దు చేస్తే….ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు కు వెళ్లడం ఖాయమనే భావన పోలీస్ వర్గాలలో వినబడుతున్నది. ఒకవేళ ఆయన సస్పెన్షన్ ను హై కోర్ట్ సమర్ధించే పక్షం లో ఏబీ వెంకటేశ్వర రావు సుప్రీమ్ కోర్టు కు అప్పీల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ కరోనా వైరస్ సమయంలో బయటకు రావడం కుదరక…గోళ్లు గిల్లుకుంటూ ఇళ్ళకే పరిమితం కావాల్సి వచ్చిన బుద్ధి జీవులు
…ఈ రెండు కేసుల్లో జరిగే వాదోపవాదాలు…వాటికి సంబంధించి మీడియాలో వచ్చే కధనాలు…డిబేట్లు… తీర్పులు…వాటి పర్యవసానాలు…విశ్లేషణలతో పొద్దు పుచ్చవచ్చు.

-భోగాది వెంకట రాయుడు