వెంకటేశా.. లోకేషుడు చెప్పిందే నిజమా స్వామీ?

214

లాక్‌డౌన్‌లో  అభిషేక దర్శనాలేమిటి దేవా?
సకుటుంబ సపరివార దర్శనాలతో తిరుమల పునీతం
మరి పోలీసులు స్పందించరా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి క్రేజు తెలిసిందే. ఓ లిప్తపాటు దర్శనంతోనే జన్మధన్యమవుతుందని భావించే భక్తుల సంఖ్యకు లెక్కే లేదు. స్వామి దర్శనం దూరమవుతున్న కొద్దీ వెనక్కి వెళుతూనే, ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని తనివితీరా చూసుకుని మురిసిపోయే, భక్తాగ్రేసరుల సంఖ్య అంతకంటే ఎక్కువ. మరి ఆవిధంగా  గంటలకొద్దీ స్వామి వారి సమక్షంలోనే నిలబడి స్వామిని దర్శించుకుని అభిషేకం చేసుకోవడం కలలోనే సాధ్యం. ఆ కలలో కూడా తోటి భక్తులు అడ్డురావడం, తోసుకోవడం కనిపిస్తుంటుంది. కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మరికొందరికి  మాత్రం అది కల కాదు. నిజం! అది కూడా సకుటుంబ సపరివార సమేత దర్శనం. ఇది ఎప్పుడో కాదు, ఈ లాక్‌డౌన్ సమయంలోనే!! నిజంగా ఇది నిఝం!!!

ఆయన సుబ్బారెడ్డి మరి!

అదేంటీ.. లాక్‌డౌన్ సమయంలో ఎవరినీ అనుమతించరు కదా? అసలు కొండకెళ్లే మార్గం మూసేసి, తిరుమల దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు కదా? మరి చైర్మన్ సుబ్బారెడ్డి అండ్ అదర్స్,  అన్ని గంటలసేపు ఎలా స్వామివారి సేవ చేసుకోగలిగారన్నది పిచ్చి భక్తుల ప్రశ్న. పాలకమండలి సభ్యులయినా,  వారిని స్వామివారి చెంతకు ఎలా అనుమతించారన్నది మరికొందరు అమాయకుల ఆశ్చర్యం. టీడీపీ యువనేత లోకేష్ కూడా అందరి అమాయకుల మాదిరిగా, ఇలాగే ఆశ్చర్యపోతూ ఓ ట్వీట్ చేశారు. కానీ, అక్కడ ఉన్నది ఏ సుధాకర్‌యాదవో, కనుమూరి బాపిరాజో, సుబ్బరామిరెడ్డో కాదు. హిందూధర్మ పరిరక్షకుడు, హిందూ ధర్మాన్ని ఇతర మతాల దాడులు-మతమార్పిళ్ల  నుంచి అడ్డుకుని రక్షిస్తున్న..  ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రతినిధి. పైగా..ఆయన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అని మర్చిపోతే ఎలా?  అందుకే తాను నెలకు రెండు రోజులు శుక్రవారాల్లో జరిగే అభిషేకానికి హాజరవుతానని, ఈ శుక్రవారం తన పుట్టిన రోజు కూడా అనుకోకుండా వచ్చిందని రెడ్డిగారు సెలవిచ్చారు. ఈ విషయాలేవీ తెలియకుండా, తనపై ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటానని వార్నింగు ఇచ్చారు. అదీ సంగతి!

లోకేష్ ఎప్పుడు తెలుసుకుంటాడో.. ఏమో?

యస్.. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మరికొందరు  సకుటుంబ సపరివార సమేతంగా లాక్‌డౌన్ నిబంధన ఉల్లంఘించి,  తిరుమలకు వచ్చి స్వామివారి ఆలయంలో అభిషేకం చేసుకున్నారు. అయితే ఏంటట? దానికే ధర్మం మంటకలసి పోతుందా? శాస్త్రం మైలపడుతుందా? లోపలున్న సాములోరు అంటరానివారవుతాడా ఏంటి? అవును… టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి జన్మదినం కూడా అదే రోజు కాబట్టి, అది కూడా అనుకోకుండా వచ్చింది కాబట్టి, స్వామివారికి  పూజలు చేసి జన్మదిన వేడుక నిర్వహించుకుని తరించారు. ఆయన కుటుంబసభ్యులు వెండి వాకిలి నుంచి, ధ్వజస్తంభం వరకూ వచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.  అందులో తప్పేమిటి? లోకేష్ ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా, చిన్న పిల్లాడిలా పాపం సుబ్బారెడ్డి గారి జన్మదినం మూడ్ మొత్తాన్ని ఖరాబు చేస్తే ఎలా? ఇలాంటివన్నీ లోకేష్ చూసీచూడనట్లు పోవాలి. ప్చ్.. ఈ లోకేష్ ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమిటో?!

ఆ స్వాతంత్య్రం కూడా సుబ్బారెడ్డికి లేదా?

ఇవన్నీ గ్రహించకుండా.. మిగిలిన  భక్తులను కూడా అదేమాదిరిగా ఎందుకు అనుమతించరు? అసలు ఆ ఫొటోలు ఎలా బయటకొచ్చాయి? ఇదంతా వైవి సుబ్బారెడ్డిని ఇబ్బందిపెట్టాలని ఎవరో అనుకూల శత్రువులే ఈ పనిచేశారని సుకుమార్ అనే అమాయకభక్తుడి వాదన.  ఇంతకూ సుకుమార్ అనే వెంకన్న భక్తుడు సుబ్బారెడ్డిని పొగిడారా? ఆయన ఫొటోలకు దొరికిపోయాడని విమర్శించారా? ఆయనపై కుట్ర జరుగుతోందని బాధపడుతున్నారో అర్ధం కావడం లేదు. అయినా ఏం.. టీటీడీ పాలకమండలి సభ్యులకు ఆపాటి స్వేచ్ఛ, స్వాతంత్య్రం కూడా లేదా? దానిని టీటీడీ ఈవో, జేఈఓ, అధికారులు ఎందుకు అడ్డుకోవాలి?  జగనన్న రాజ్యంలో ఆపాటి స్వేచ్ఛ కూడా లేకపోతే, అది జగనన్న రాజ్యంగా ఎలా గుర్తించబడుతుంది చెప్పండి? అందుకే సుబ్బారెడ్డి అండ్ అదర్స్ లాక్‌డౌన్‌లోనూ, తాము అనుకున్నది సాధించారు. ఏం.. తమిళనాడు నుంచి కనగరాజును విజయవాడకు తీసుకురాగా లేనది, మన సుబ్బారెడ్డిని తిరుమలకు అనుమతిస్తే తప్పేమిటంట? ఆ మాత్రం ప్రాంతీయాభిమానం లేక పోతే ఎలా?

మమ్మల్నీ ఎక్కిస్తే పుణ్యం పుచ్చిపోదుగా?

ఓకే.. ఓకే.. సుబ్బారెడ్డి అండ్ అదర్స్‌ను కొండ ఎక్కించినందుకు ఎవరికీ ఏ బాధ లేదు. అది ఇప్పుడు.. ఆయన కొండ, ఆయనిష్టం. అయితే.. అదే చేత్తో కోట్లాదిమంది వెంకన్న భక్తులను కూడా లాక్‌డౌన్ బాధల్లేకుండా కొండెక్కించి, స్వామి దర్శనం చేయిస్తే మీ పుణ్యమేమీ పుచ్చిపోదుగా అన్నది వెంకన్న భక్తుల ఆవేదన. ఎలాగూ తిరుమల ఖాళీగానే ఉంది. భక్తజనం లేక తిరుమలపైన, ఘాట్‌రోడ్లపై పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, జింకలు, పాములు హాయిగా తిరుగుతున్నాయని టీవీ చానెళ్లలో చూపిస్తున్నారు. అదేదో భక్తజనాలనే కొండెక్కిస్తే, వాటిని తరిమివేసే  బాధ  ఫారెస్ట్  అధికారులకు కూడా ఉండదు కదా? అన్నది మరికొందరి భక్తాగ్రేసరుల సలహా. భక్తుల పిచ్చి, ఛాదస్తం గానీ..వాళ్లేమైనా టీటీడీ బోర్డుమెంబర్లా ఏంటి?పోలీసులేం చేస్తారో మరి?

ఇంతకూ సుబ్బారెడ్డి అండ్ అదర్స్ లాక్‌డౌన్ ఉల్లంఘించి, కొండపై స్వామి సన్నిధిలో అభిషేకం చేసినందుకు,  విధి నిర్వహణలో ‘యమా స్ట్రిక్టు’గా వ్యవహరించే పోలీసులు.. మరి వారిపై కేసులు పెడతారా లేక సుబ్బా‘రెడ్డిగారు’ కదా అని వదిలేస్తారో చూడాలి.