రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కారు విఫలం: చాడ

378

కరోనా టెస్టులలో రాష్ట్రం వైఫల్యం
సికింద్రాబాద్‌లో మేకల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత, మాజీ ఎంపి చాడ సురేష్‌రెడ్డి, హైదరాబాద్ నగర నేత మేకల సారంగపాణి ఆరోపించారు. రైతులు పండించిన పంటలు, పండ్లు, ఆకుకూరలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమయిందని, చివరకు గోనె సంచులు కూడా సరఫరా చేయడం లేదని విమర్శించారు. కరోనా సాయం కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కచెప్పాలని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో, బీజేపీ నేత మేకల సారంగపాణి ఆధ్వర్యంలో పేద కార్యకర్తలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చాడ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, కరోనా టెస్టులు చేయకుండా, లెక్క దాచాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో కరోనా టెస్టులు ఎక్కువ చేస్తుండగా, తెలంగాణలో ఆపని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. కేంద్రబృందాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవపట్టించిందని, అందుకే తమ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మళ్లీ కేంద్రబృందాన్ని పంపాలని లేఖ రాశారని చెప్పారు.  ఐకెపి సెంటర్లలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని, మహిళా రైతులు కనీసం మరుగుదొడ్లు లేక అవస్ధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు చేయాలని రైతులు చివరకు అధికారుల కాళ్లు పట్టుకోవలసిన దుస్థితి దాపురించిందన్నారు. అకాలవర్షంవల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, కరోనా టెస్టులు ర్యాండమ్‌గా చేయాలని డిమాండ్ చేశారు.
నగర నేత సారంగపాణి మాట్లాడుతూ, హైదరాబాద్ కొత్త నగరంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తున్న ప్రభుత్వం, పాతబస్తీలో మజ్లిస్‌ను చూసి భయపడి లాక్‌డౌన్‌ను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. చివరకు మజ్లిస్ ప్రజాప్రతినిధులు పోలీసులపై దాడులకు దిగే దౌర్జన్యకర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. నగరంలో చిక్కుకున్న వలస ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమలయిందని, వారికి భోజన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో చిక్కుకుపోయిన వలస కూలీలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సెల్ ద్వారా సహాయం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రం- పార్టీపరంగా బీజేపీనే వారిని ఆదుకుంటున్నాయని స్పష్టం చేశారు.
మోదీకిట్ల ద్వారా కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా చేస్తున్న కార్యక్రమాలు, జాతీయ అధ్యక్షుడు నద్దా పిలుపు మేరకు తాము కూడా సికింద్రాబాద్ నియోజకవర్గంలో, పేదలకు తమ స్ధాయిలో సాయం చేస్తున్నామని వెల్లడించారు. కరోనా లాక్‌డౌన్‌లో పోలీసులు కష్టపడి పనిచేస్తున్నారని, వారి సేవలు ప్రజలు ఎప్పటికీ మరవరని అభినందించారు. పాతబస్తీ మినహా నగరంలో ప్రజలంతా పోలీసులకు సహకరిస్తున్నారని మేకల చె ప్పారు.